చిరు వ్యాపారుల ఆన్‌లైన్ వేదిక ' గ్రీన్ క‌ర్రీ '

ఒక సైంటిస్ట్, ఒక డాక్ట‌ర్, మ‌రొక టెకీ, ఇంకొక ఆంట్రప్రెన్యూర్. ఈ న‌లుగురూ క‌లిసి ఏర్పాటుచేసిన ఆన్‌లైన్ స్టోర్ ..ఇప్పుడు కేర‌ళ‌లో క‌మ్మ‌ని రుచుల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా మారింది.

చిరు వ్యాపారుల ఆన్‌లైన్ వేదిక ' గ్రీన్ క‌ర్రీ '

Monday September 07, 2015,

4 min Read

మార్కెట్లో వున్న దాదాపు అన్ని బ్రాండ్లు, సంస్థ‌లూ ఆన్‌లైన్ షాపింగ్, ఈ కామ‌ర్స్ నెట్వ‌ర్క్ కింద‌కి వ‌చ్చేశాయి. కానీ, బ్రాండ్ లేని ఉత్ప‌త్తులు, కుటీర ప‌రిశ్ర‌మ‌లు మాత్రం ఇంకా ఈ కామ‌ర్స్ ప్రయోజనాన్ని పొందకుండా అలా మిగిలిపోతున్నాయి. ఇలాంటి ప‌రిశ్ర‌మ‌ల‌ను, ఉత్ప‌త్తుల‌ను ఆన్‌లైన్ ప‌రిథిలోకి తేవాల‌న్న‌దే గ్రీన్ క‌ర్రీ ఉద్దేశం. ఆర్గానిక్ ఉత్ప‌త్తులైతే చాలు.. అవి బ్రాండెడ్ అయినా, అన్ బ్రాండెడ్ అయినా ఈ వెబ్ సైట్‌లో దొరుకుతాయి.

త‌గినంత టెక్నిక‌ల్ నాలెడ్జి లేని చిన్న త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల‌కు త‌క్కువ ఖ‌ర్చుతో ఆన్ లైన్ మార్కెట్ అవ‌కాశాల‌ను క‌ల్పించాల‌న్న‌దే గ్రీన్ క‌ర్రీ ఉద్దేశం. అలాగే క‌స్ట‌మ‌ర్ల‌కు కూడా సంప్ర‌దాయ దుకాణాల్లో దొర‌క‌ని స‌హ‌జ‌సిద్ధ‌మైన‌, నాణ్య‌మైన ఉత్ప‌త్తుల‌ను అందించేందుకు గ్రీన్ క‌ర్రీ కృషి చేస్తుంది. క‌ల్తీ, ప్రిజ‌ర్వేటివ్స్ లేని స్వ‌చ్ఛ‌మైన ఉత్ప‌త్తులు వినియోగ‌దారుల‌కు గ్రీన్ క‌ర్రీ ద్వారా అందుబాటులో వుంటాయి.

'' చిన్న త‌ర‌హా, కుటీర ప‌రిశ్ర‌మ‌ల‌ను, మ‌హిళ‌ల‌ను ఈ కామ‌ర్స్ ప‌రిథిలోకి తేవ‌డ‌మే మా ఉద్దేశం. ఆన్ లైన్ మ‌ల్టీ స్టోర్ అనే పదానికి గ్రీన్ క‌ర్రీ అస‌లైన అర్థం. ఇక్క‌డ ప్ర‌తి స్టోర్‌కి ఉనికి వుంటుంది " అని గ్రీన్ క‌ర్రీ ఆప‌రేష‌న్స్ హెడ్ అజయ్ జోస్ వివ‌రించారు.

greenkurry.com

greenkurry.com


తొలి అడుగులు

ఇస్రోలో సైంటిస్ట్ గా ప‌నిచేసిన బాబూ మోహ‌న‌న్, నోకియా నుంచి బ‌య‌టికొచ్చిన షాజీ థామ‌స్, మైహోడో కు CEOగా చేసిన డాక్ట‌ర్ ష‌బీర్‌లు ఒక స్టార్ట‌ప్ మీట్‌లో క‌లుసుకున్నారు. మాటలు క‌లిసాక‌, స‌మాజానికి ఉపయోగప‌డే సంస్థ‌ను ఒక‌ దాన్ని నెల‌కొల్పాల‌ని ఈ ముగ్గురూ అనుకున్నారు. మొద‌ట్లో ఆహారం వృధాని నివారించే విధంగా సప్లయి చైన్‌ను ఆటోమేట్ చేయాల‌నుకున్నారు. అయితే, రోజులు గ‌డిచే కొద్దీ చ‌ర్చ‌లు జ‌రిగే కొద్దీ, చివ‌రికి గ్రీన్ క‌ర్రీ ఆన్‌లైన్ మార్కెట్ ప్లేస్ పెట్టాల‌ని నిర్ణ‌యించుకున్నారు. రెడీ టు కుక్ వెజిటెబ‌ల్స్‌ను అమ్మే స్థానిక ఆన్‌లైన్ స్టోర్... ఫ్రెష్ కేవ్ వ్య‌వ‌స్థాప‌కుల్లో ఒక‌రైన అజ‌య్ జోస్ కూడా గ్రీన్ కర్రీ టీంతో చేతులు క‌లిపి ఆప‌రేష‌న్స్ హెడ్‌గా జాయిన్ అయ్యారు. పదిల‌క్ష‌ల ప్రాథ‌మిక పెట్టుబ‌డితో మొద‌లైన గ్రీన్ క‌ర్రీ ప్ర‌స్తుతం తిరువనంత‌పురం నుంచి న‌డుస్తోంది.

స‌మ‌స్య‌లు

మొద‌ట్లో గ్రీన్ క‌ర్రీని దేశ వ్యాప్త సంస్థ‌గా మొద‌లుపెట్టారు. అయితే, కొద్ది రోజుల‌కే అందులో ఇబ్బందులు అర్థ‌మై స్థానిక అవ‌స‌రాల‌కే ప‌రిమితం చేసారు. జాతీయ‌స్థాయిలో ఆన్ లైన్ ఆప‌రేష‌న్స్ నిర్వ‌హించాలంటే డెలివ‌రీ ప్ర‌ధాన స‌మ‌స్య అవుతుంది. అదే స్థానికంగా అయితే, క‌స్ట‌మ‌ర్, వెండ‌ర్‌ల అనుసంధానం సుల‌భ‌మ‌వుతుంది.

గ్రీన్ కర్రీ మొద‌లుపెట్టి నాలుగు నెల‌లైంది. ప్ర‌స్తుతం ఈ పోర్ట‌ల్ కు 200 మంది రెగ్యుల‌ర్ క‌స్ట‌మ‌ర్లున్నారు. వీళ్ళ‌లో స‌గం మంది బి2బి క‌స్ట‌మ‌ర్లే. అందుకే మొత్తం మీద క‌స్ట‌మ‌ర్ల సంఖ్య త‌క్కువ‌గా క‌నిపిస్తున్నా.. మ‌ళ్ళీ మ‌ళ్లీ వ‌చ్చే క‌స్ట‌మ‌ర్ల సంఖ్య ఎక్కువ‌గా వుంటంది. వీరిలో కూడా ఇండియాలో వుండే త‌మ బంధుమిత్రుల కోసం ఆర్డ‌ర్ చేసే ఎన్‌ఆర్ ఐ క‌స్ట‌మ‌ర్ల సంఖ్య కూడా ఎక్కువే.

మార్కెట్ స్థిత‌గ‌తులు

గ్రీన్ క‌ర్రీలో ఉత్ప‌త్తుల‌ను అమ్మే వెండ‌ర్ల‌కు సెల‌క్టివ్ విజిబిలిటీ ఆప్ష‌న్ వుంటుంది. అంటే, ఏ ప్రాంతం వ‌ర‌కు కావాలంటే, ఆ ప్రాంతం వ‌ర‌కే త‌మ ఉత్ప‌త్తుల‌ను అందుబాటులో వుంచొచ్చు. దీని వ‌ల్ల వంట మీద అభిరుచితో వండే మామూలు గృహిణులు కూడా ఈ వెబ్ సైట్ లో త‌మ ఉత్ప‌త్తుల‌ను అమ్మ‌కానికి వుంచొచ్చు. అందుకే ఈ వెబ్ సైట్ లో ఒక కాల‌నీ స్థాయిలో అమ్మే సంస్థ ల ద‌గ్గ‌ర నుంచి జాతీయ స్థాయిలో మార్కెట్ చేయాల‌నుకునే సంస్థ‌లు కూడా వున్నాయంటారు అజ‌య్.

దీంతో పాటు, ప్ర‌తి స్టోర్ దాని ప్ర‌త్యేక‌త‌ను నిలుపుకునే అవ‌కాశాన్ని ఈ పోర్టల్ అందిస్తుంది. ఒక స్టోర్ కు సంబంధించిన పేజిలో ఆ స్టోర్‌కి సంబంధించిన పూర్తిస‌మాచారం, చిరునామా, ఫోన్ నంబ‌ర్లు, ఆ బ్రాండ్ ప్ర‌త్యేక‌త‌లూ అన్నీ వుంటాయి. ఒక ర‌కంగా ఈ పోర్ట‌ల్ ఆ స్టోర్ ప‌ర్స‌న‌ల్ వెబ్ సైట్ లాగానే ప‌నిచేస్తుంది.

దీంతో పాటు, హైబ్రిడ్ సిస్టమ్ ఈ పోర్ట‌ల్ లో మ‌రో ప్ర‌త్యేక‌త‌. క‌స్ట‌మ‌ర్లు త‌మ అడ్ర‌స్ బ‌య‌ట‌పెట్ట‌డం ఇష్టం లేక‌పోయినా... డెలివరీ బాయ్ వ‌చ్చే వ‌ర‌కు ఎదురు చూసేంత టైమ్ లేక‌పోయినా, స్థానిక హ‌బ్ ద‌గ్గ‌ర‌కెళ్ళి త‌మ ఆర్డ‌ర్‌ను తీసేసుకోవ‌చ్చు. అంటే, ఆన్ లైన్ షాపింగ్ తో పాటు, డెలివ‌రీ పాయింట్లుగా ప‌ని చేసే స్థానిక హ‌బ్ ల‌ను కూడా ఆ పోర్ట‌ల్ అందుబాటులో వుంచుతోంది.

image


గ్రీన్ క‌ర్రీలో ఎవ‌రైనా ఉచితంగా స్టోర్ ఓపెన్ చేసుకోవ‌చ్చు. కేవ‌లం సేల్స్ క‌మిష‌న్ నుంచి మాత్ర‌మే ఆదాయాన్ని ఆశిస్తున్నారు. దీని వల్ల వీలైనంత మంది ఆంట్రప్రెన్యూర్స్‌ను ప్రోత్స‌హించ‌డ‌మే మా ల‌క్ష్యం. క‌మిష‌న్ కూడా అన్ని స్టోర్ల‌కు ఒకేలా వుండ‌దు. కొంద‌రు పదిశాతం కూడా క‌మిష‌న్‌గా ఇవ్వ‌లేరు. మ‌రికొంద‌రు 50 శాతం ఇచ్చ‌యినా పెట్టుకోవాల‌నుకుంటారు. అందుకే స్టోర్‌ని బ‌ట్టి క‌మిష‌న్ నిర్ణ‌యిస్తామ‌ని చెప్పారు అజయ్.

లాభాల బాట‌లో..

ప్ర‌స్తుతానికి బి2బి మోడ‌ల్‌లోనే బిజినెస్ చేయాల‌నుకుంటోంది గ్రీన్ క‌ర్రీ టీమ్. అన్ బ్రాండెడ్ సెగ్మెంట్లో టాప్ ఆన్‌లైన్ ప్లేయ‌ర్ కావాల‌న్న‌దే వీళ్ల ల‌క్ష్య‌ం.

ఇక ఈ టీమ్ ఎదుర్కొంటున్న స‌వాళ్ల విష‌యానికొస్తే,.. ఇటు జ‌నం దగ్గ‌ర‌కు పోర్ట‌ల్‌ను తీసుకెళ్ళ‌డ‌మే ప్ర‌ధాన స‌మ‌స్య‌. ఇటు స్టోర్ ఓన‌ర్ల‌ను, అటు క‌స్ట‌మ‌ర్ల‌ను ఆక‌ర్షించ‌డం అంత తేలికేం కాదు. మార్కెటింగ్ కూడా మ‌రో స‌వాలే. అత్యున్న‌త స్థాయి నాణ్య‌త ఉన్న ఉత్ప‌త్తుల‌ను మాత్ర‌మే వెబ్ సైట్లో వుంచాల‌ని నిర్ణ‌యించుకోవ‌డంతో ఆ స్థాయి ఉత్ప‌త్తుల‌ను అందించే వెండ‌ర్ల‌ను సంపాదించ‌డం చాలా క‌ష్ట‌మ‌వుతోంది. స‌ర‌ైన స‌ప్ల‌యిర్ల‌ను సంపాదించి, వారి నుంచి టైమ్‌కి డెలివ‌రీ అయ్యేలా చూసేస‌రికి చుక్క‌లు క‌నిపిస్తున్నాయి.

అందుకే హైబ్రిడ్ మోడ‌ల్ నెట్వ‌ర్క్ ను మ‌రింత విస్తృత ప‌ర‌చాల‌ని గ్రీన్ క‌ర్రీ టీమ్ ఆలోచిస్తోంది. మ‌రిన్ని హబ్స్ ఏర్పాటు చేసి డెలివ‌రీ మెకానిజ‌ంను మెరుగు ప‌ర‌చాల‌ని అనుకుంటున్నారు. కార్పొరేట్ ప్రాంతాల్లో, కాల‌నీలు ఎక్కువ‌గా వుండే ప్రాంతాల్లో వ్యూహాత్మ‌క హ‌బ్స్ ఏర్పాటు చేసుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు. ఒక వంద చద‌ర‌పు అడుగుల గ్రీన్ క‌ర్రీ హ‌బ్ వుంటే, 5000 ఉత్ప‌త్తుల‌ను డెలివ‌రీ చేయొచ్చు. డిమాండ్‌ను బ‌ట్టి ఈ ఉత్ప‌త్తుల‌ను హ‌బ్‌కు చేరుస్తారు. దీంతో ప్ర‌తి హ‌బ్ ఒక మాల్ గా మారిపోతుంది.

image


భ‌విష్య‌త్తు..

ఈ కామ‌ర్స్ రోజు రోజుకూ పెరుగుతోంది. ఒక‌ర‌కంగా చెప్పాలంటే, భ‌విష్య‌త్తు బిజినెస్ అంతా దీనిపైనే ఆధార‌ప‌డివుంది. మొత్తం ఈ కామ‌ర్స్ అమ్మ‌కాల్లో అన్ బ్రాండెడ్ వ‌స్తువుల వాటానే 80 శాతంగా వుంటోంది. అందుకే తమకు తిరుగు ఉండకపోవచ్చనేది వీళ్ల ధీమా.

website