వాళ్ల జీవితమే ఈ సినిమాలకు స్ఫూర్తి

వాళ్ల జీవితమే ఈ సినిమాలకు స్ఫూర్తి

Saturday March 12, 2016,

4 min Read


బాలీవుడ్‌లో ఎన్నో సినిమాలు చూసి ఉంటాం. కమర్షియల్‌ హిట్స్‌ అయిన ప్రేమ కథా చిత్రాలు, మాస్‌ మసాలా మూవీస్‌ ఇలా ఎన్నో వస్తుంటాయి. కానీ యదార్థ జీవిత సంఘటనలే కథాంశాలుగా తెరకెక్కిన చిత్రాలు చాలా అరుదుగా వస్తాయి. ఆ చిత్రంలోని పాత్రలు కదిలిస్తాయి. ముఖ్యంగా వార్తల్లోకెక్కిన, సంచలనం సృష్టించిన మహిళల జీవితాలను యదార్థగాథలుగా తీసి విజయం సాధించిన కొన్ని చిత్రాలు బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త చరిత్రను లిఖించాయి.

image


1. మేరీకోమ్‌

ప్రఖ్యాత మహిళా బాక్సర్‌ మేరికోమ్‌ జీవితాన్నే ఇతివృత్తంగా తీసిన చిత్రం మేరికోమ్‌. ఈ సినిమాలో మెయిన్ రోల్ అయిన మేరీకోం పాత్రను బాలీవుడ్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా అద్భుతంగా పోషించింది. ఒలింపిక్‌ మెడల్‌తో పాటు, ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన మేరో కోం జీవితంలో ఎన్నో మలుపులు, ఆటుపోట్లు, విజయాలు ఉన్నాయి. ఈ చిత్రానికి ఒమంగ్‌ కుమార్‌ దర్శకత్వం వహించాడు. సంజయ్‌ లీలా భన్సాలీ ప్రొడ్యూసర్‌. 

2. నో వన్‌ కిల్డ్‌ జెస్సికా

సంచలనం సృష్టించిన జెస్సికాలాల్ హత్యకేసు ఇతివృత్తంగా తీసిన నోవన్‌ కిల్‌ జెస్సికా చిత్రం.. బాలీవుడ్‌లో సంచలనం సృష్టించింది. 1999లో మోడల్‌ జెస్సికా లాల్‌ ఢిల్లీలోని ఓ బార్ లో హత్యకు గురయ్యారు. ఈ హత్య వెనుక ఓ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ కుమారుడు మనుశర్మ హస్తముందనే ఆరోపణలు వచ్చాయి. అయితే ఆ ఎంపీ కుమారుడు కేసుల గండాలన్నీ తప్పించుకొని బయటకు వచ్చేశాడు అది వేరే విషయం. అయితే మీడియా మాత్రం ఊరుకోలేదు. జెస్సికాకు న్యాయం దక్కేందుకు పెద్ద ఎత్తున వార్తలను ప్రసారం చేసింది. ఇదే ఇతివృత్తాన్ని సినిమాగా మలిచారు. నోవన్‌ కిల్డ్‌ జెస్సికాలో జర్నలిస్టు పాత్రలో రాణి ముఖర్జీ నటించారు. జెస్సికా సోదరి పాత్రలో విద్యాబాలన్‌ యాక్ట్ చేశారు.

3. గులాబ్‌ గాంగ్‌

ఉత్తర్‌ ప్రదేశ్‌లో ఖాప్‌ పంచాయితీలు మహిళల పట్ల అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా కొందరు మహిళలు గులాబ్‌ గ్యాంగ్‌గా ఏర్పడ్డారు. భ్రూణ హత్యలు, వరకట్న వేధింపులు, అత్యాచారాలకు వ్యతిరేకంగా గులాబీ రంగు చీరలు కట్టుకొని ఒక మిలిటెంట్‌ గ్రూపుగా ఏర్పడ్డారు. బుందేల్‌ ఖండ్‌లో దతా సత్‌బోధ్ సైనిన్‌ ఆధ్వర్యంలో 2006 లో ఏర్పడిన గులాబ్‌ గ్యాంగ్‌.. మహిళల సంరక్షణకు కట్టుబడింది. 2014లో గులాబీ గ్యాంగ్‌ ను స్ఫూర్తిగా తీసుకొని మాధురీ దీక్షిత్ ప్రధాన పాత్రగా సినిమా నిర్మించారు. ఈ సినిమా ద్వారానే గులాబ్‌ గ్యాంగ్‌ దేశవ్యాప్తంగా పేరు పొందింది.

4. జాగో

అత్యాచార సంఘటనలను ఇతివృత్తంగా తీసిన మరో చిత్రం జాగో. ఈ చిత్రం సంచలనాలకు మారుపేరుగా నిలిచింది. పదేళ్ల మానసిక వికలాంగురాలైన బాలికను రైల్లో అత్యాచారం చేసి కిరాతకంగా చంపిన ఘటన.. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు కారణమైన ముగ్గురు ఉన్మాదులకు శిక్ష పడిన క్రమాన్ని కథనంగా ఎంచుకున్నారు దర్శక నిర్మాతలు. ఈ సినిమా బండరాళ్ల చేత కన్నీళ్లు పెట్టించింది. 

5. బాండిట్‌ క్వీన్‌

బందిపోటు దొంగల రాణి పూలన్ దేవీ జీవితం చాలా సాహోసోపేతమైనది. ఓ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమాను మించిన సంఘటనలు ఫూలన్‌ దేవి నిజ జీవితంలో జరిగాయి. ఆ ఘటనలే మూవీ మేకర్లను ఆకర్షించాయి. అభం శుభం తెలియని చిన్న వయస్సులో పెళ్లి చేసుకొని, అత్యాచారానికి గురైన ఓ బాలిక, సమాజాన్ని ఎదిరించి ఓ బందిపోటు దొంగల ముఠాకు నాయకురాలిగా మారింది. రాబిన్‌ హుడ్‌ జీవితాన్ని తలపించేలా ఉన్న ఫూలన్‌ జీవితాన్ని అంతర్జాతీయస్థాయిలో బాండిట్‌ క్వీన్‌గా తెరకెక్కించారు. సీమా బిశ్వాస్‌ టైటిల్‌ రోల్‌ పోషించింది. సీమా బిశ్వాస్‌ నటనకు నేషనల్‌ అవార్డు వరించింది.

6. నీర్జా

ఇటీవల బాలివుడ్‌లో విడుదలై విజయవంతమైన నీర్జా చిత్రాన్ని కూడా ఓ యదార్థ సంఘటన ఆధారంగానే నిర్మించారు. 23 ఏళ్ల ఎయిర్‌ హోస్టెస్‌ నీర్జా బానోత్‌.. హైజాకర్ల నుంచి ప్రయాణికులు ప్రాణాలు రక్షించేందుకు తన ప్రాణాలను పణంగా పెట్టింది. ఇదే సంఘటనను స్ఫూర్తిగా తీసుకొని సోనమ్‌ కపూర్‌ టైటిల్‌ పాత్ర పోషిస్తూ నీర్జా చిత్రాన్ని నిర్మించారు. లిబియన్ ఉగ్రవాదుల చేతుల్లో హైజాక్‌ కు గురైన విమానంలో నీర్జా ఎయిర్‌ హోస్టెస్‌గా పనిచేసేది. ప్రయాణికులను కాపాడే క్రమంలో నీర్జా తన ప్రాణాలను కోల్పోయింది. నీర్జా త్యాగం సెల్యూలాయిడ్‌ స్క్రీన్‌పై కన్నీళ్లు పెట్టించింది.

7. బవందర్‌

సంచలనం సృష్టించిన భన్వరీ దేవి జీవితం సైతం బవందర్‌గా తెరకెక్కి ప్రపంచ వ్యాప్తంగా మన్ననలు అందుకుంది. రాజస్థాన్‌కు చెందిన భన్వరీ దేవీ 90వ దశకంలో ఓ సామాజిక కార్యకర్తగా జీవితం ప్రారంభించింది. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా నిలబడింది. అత్యాచార బాధితుల పక్షాన నిలబడింది. దీంతో అగ్రకుల పెద్దలు భన్వరీ దేవిపై కక్ష గట్టారు. కొందరు భన్వరీ దేవీని సామూహికంగా, అతి పాశవికంగా అత్యాచారం చేశారు. తీవ్రంగా గాయపరిచారు. అయినప్పటికీ భన్వరీ దేవీ ధైర్యంగా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు ఇచ్చి న్యాయ పోరాటానికి దిగింది. అయినా ఈ సమాజంలో భన్వరీ దేవికి న్యాయం దక్కలేదు. అయినప్పటికీ ఆమె సాహసం అంతర్జాతీయంగా కదిలించింది. 2002లో జగ్ ముంద్రా అనే దర్శకుడు బవందర్‌ పేరుతో భన్వరీ నిజజీవితాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో టైటిల్‌ పాత్రలో జాతీయఅవార్డు గ్రహీత నందితా దాస్‌ నటించారు.

8. డర్టీ పిక్చర్‌

నిషా కళ్ల నటి సిల్క్‌స్మిత జీవితం ఆధారంగా తెరకెక్కింది డర్టీ పిక్చర్‌. తెలుగు, తమిళ చిత్రాల్లో ఐటెం సాంగ్స్‌ చేయడం ద్వారా పేరు సంపాదించిన స్మిత.. తన అందంతో, అభినయంతో విపరీతమైన క్రేజ్‌ సంపాదించుకుంది. అయితే సినీ పరిశ్రమలోని రాజకీయాలు, నయవంచకుల చేతుల్లో మోసపోయి కష్టాలపాలై చివరకు 36వ ఏట ఆత్మహత్య చేసుకుంది. సిల్క్‌ జీవితంలోని అన్ని కోణాలను ఆవిష్కరిస్తూ డర్టీ పిక్చర్‌ అనే చిత్రం తెరకెక్కించారు. ఈ చిత్రంలో విద్యాబాలన్‌ టైటిల్ రోల్ పోషించారు. తిరుగులేని ఆమె నటనకు జాతీయ అవార్డు వరించింది.

9. ప్రోవోక్డ్‌

ఓ శాడిస్టు భర్తను కడతేర్చి జైలు పాలైన లండన్‌ ఎన్‌ఆర్‌ఐ కిరణ్ జిత్‌ అహ్లువాలియా జీవితాన్ని ప్రోవోక్డ్‌ పేరుతో నిర్మించారు. పెళ్లైన భర్త ప్రతిరోజు చిత్రహింసలకు గురిచేస్తూ పదేళ్లపాటు కిరణ్‌జిత్‌కు నరకం చూపించాడు. భరించీ భరించీ ఓపిక నశించిన కిరణ్‌ జిత్‌ చివరికి తన భర్తను కడతేర్చింది. ఈ సంఘటనలకు చిత్రరూపం ఇస్తూ జగ్‌ మంద్ర ప్రోవోక్డ్‌ గా తెరకెక్కించారు. ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్‌ టైటిల్‌ రోల్ పోషించారు.