కాగితాలతో కుర్చీలు, మంచాలు ! వండర్ ఫర్నిచర్ క్రియేట్ చేసిన స్పృహ

కాగితాలతో కుర్చీలు, మంచాలు ! వండర్ ఫర్నిచర్ క్రియేట్ చేసిన స్పృహ

Tuesday January 05, 2016,

4 min Read

దునియా మే కోయీ చీజ్‌ బేఖార్ నహీ హై! ప్రపంచంలో పనికిరాని వస్తువంటూ ఏదీ ఉండదు. వాడి పారేసిన సైలెన్సర్‌ గొట్టమైనా, చింపి పడేసిన కాయితం ముక్కయినా! బుర్రలో ఆలోచన, మునివేళ్లలో సృజనాత్మకత ఉండాలేగానీ పనికిరావన్న వాటినే అపురూప కళాఖండాలుగా మార్చొచ్చు! అలాంటిదే ఈ కథ! కాయితాలతో ఖతర్నాక్ ఫర్నిచర్. పేపరేంటీ? దాంతో ఫర్నిచర్ ఏంటనేగా మీ సందేహం?! అయితే లేటెందుకు..? చదివేయండి ఈ కథ!

కుర్చీలు, టేబుళ్లు అనగానే మీకు ఏ మెటీరియల్ గుర్తొస్తుంది? ఐరన్, చెక్క, లేదా ప్లాస్టిక్. ఈ మూడింటితో చేసిన ఫర్నిచరే మోస్ట్ లీ మనకు తెలిసింది. కానీ పేపర్ తో కూడా వాటిని మాంచి దృఢంగా చేయొచ్చని ఊహించగలరా? ఎలా వీలవుతుంది? పేపర్ అంతంత బరువెలా మోస్తుంది అనే డౌట్ రావడం సహజమే. రెగ్యులర్ గా కాకుండా, కొంచెం ఆర్టిస్టిక్ గా, టెక్నిక్ గా ఆలోచిస్తే సాధ్యమే అంటున్నారు స్పృహ ఛొఖాని. కళాకారులు అంతే. విన్నూత్నంగా ఊహిస్తారు. ఆ ఊహలను వాస్తవరూపంలోకి తీసుకు వస్తారు. అందుకోసం అహరహరం శ్రమిస్తారు. ఆ శ్రమలోంచి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే సరికొత్త ఆవిష్కరణలు ఆవిష్కృతమవుతాయి. ఇదంతా అర్ధం కావాలంటే పల్ప్ ఫ్యాక్టరీని ఓసారి చూడాలి.

image


అస్సాంలో ఉంది పల్ప్ ఫ్యాక్టరీ. స్పృహ ఛొఖాని దానికి హోల్ అండ్ సోల్. చుట్టూ కనిపించే అనేక పదార్ధాల నుంచి, వస్తువులనుంచి ఏదైనా విన్నూత్నంగా తయారు చేయొచ్చా ? ఈ ఆలోచనతోనే స్పృహ చొఖాని అద్భుతాలు చేశారు. ఇప్పటికీ ఆమె స్టూడియో అచ్చం సైన్స్ ల్యాబ్ లాగే ఉంటుంది.

పల్ప్ కథ ఇలా మొదలైంది..!!

పల్ప్ ఫ్యాక్టరీలోకి ఒకసారి అడుగు పెడితే కళ్లు తిప్పుకోలేరు. ఆశ్చర్యపడకుండా ఉండలేరు.. ఏమిటీ డిజైన్...? దేనితో చేశారు..? ఎలా సాధ్యం? ఇలాంటి ప్రశ్నలు వెంటవెంటనే వస్తాయి. అవన్నీ కేవలం దేనికీ పనికిరాదని పారేసే వేస్ట్ పేపర్ తో చేసినవి అంటే నమ్మలేం మరి. వాటిపై ఎలా కూర్చుంటాం? నా బరువుని మోయగలవా? ఇవి సాధారణంగా స్పృహ ఎదుర్కొనే ప్రశ్నలు.. కానీ వీటికి సమాధానాలు, రుజువులు దృఢమైన కుర్చీల రూపంలో సిద్ధంగా ఉంటాయి. ఆమె స్టూడియోను చూడగానే సందర్శకుల కళ్లలో కనిపించే ఆశ్చర్యం ఆమెను మరింత ఉత్సాహపరుస్తుంది. ఇవి 200 కిలోల కంటే ఎక్కువ బరువుని అలవోకగా మోస్తాయని నవ్వుతూ సమాధానమిస్తారు..

ఇది ఒక్కరోజులో చేసిన క్రియేటివిటీ కాదు.. నాలుగేళ్ల శ్రమ దాగుంది. మొదట్లో ఎన్నో సందేహాలు. వస్తువులు ఊహించినంత గట్టిగా ఉంటాయా? ఈ సందేహం ఆమెను చాలా కాలం వెంటాడింది. కానీ, తన కళ్ల ముందు ఏళ్లుగా ఉపయోగిస్తున్న అనేక వస్తువులు ఆ సందేహాలను పోగొట్టాయని ఆమె ఆత్మవిశ్వాసంతో చెప్తారు.

నిజానికి ఇలా పేపర్ గుజ్జుతో వస్తువులను చేయాలనే ఆలోచన ఆమెకు 2010 లో కాలేజీ రోజుల్లోనే వచ్చింది. కానీ, దాన్ని రియలైజ్ చేయటం మాత్రం పెద్ద ప్రహసనమనే చెప్పాలి. సృష్టి స్కూల్ ఆఫ్ ఆర్ట్, డిజైన్ అండ్ టెక్నాలజీ నుండి డిగ్రీ తీసుకుని బయటికొచ్చిన స్పృహ మదిలో- చాలా సందేహాలు. పేపర్ గుజ్జుతో ఏదైనా ప్రయోగం చేయాలనున్నా ఎలా? ఎక్కడ?అని చాలా ప్రశ్నలు వేధించేవి. ఇలా అనేక ప్రయోగాల తర్వాత పేపర్ గుజ్జుతో ఏం చేయొచ్చు అనే అంశంపై ఓ అవగాహనకు వచ్చారు. ఆ క్రమంలో ఆమె చేసిన పేపర్ ప్రొడక్టులను 2013 నుంచి ప్రదర్శనకు పెట్టారు.

image


వన్ ఉమన్ ఆర్మీ...

పల్ప్ ఫ్యాక్టరీని వన్ ఉమన్ ఆర్మీతో పోల్చుతారు స్పృహ చొఖాని. ఎందుకంటే రా మెటీరియల్ సమకూర్చుకోవటం నుంచి దాన్ని ప్రాసెస్ చేయటం, అంతిమంగా వస్తువులను తయారుచేయటం వరకు సింగిల్ హ్యాండ్ తో చేస్తారామె. కేవలం ఆర్డర్ పై మాత్రమే ఒక్కో వస్తువు 10 పీస్ లు మాత్రమే చేస్తారు. వస్తువులన్నీ యునిక్ గా ఉండటాన్ని ఆమె ఇష్టపడతారు. వాతావరణాన్నిబట్టి, ఆయా వస్తువులను బట్టి తయారీకి నెల, నెలన్నర సమయం పడుతుంది. అలాగని తన వ్యాపారాన్ని విస్తరించే ఆలోచన లేదని కాదు. భవిష్యత్తులో ఇతర ప్రాంతాల ఆర్టిస్టులు, కళాకారులను కలుపుకుని తన బిజినెస్ కి మరింత ఆక్సిజన్ ఇవ్వాలనుకుంటున్నారు. కశ్మీర్ లాంటి ప్రాంతాల్లో ఈ హస్తకళలు- మరీ ముఖ్యంగా పేపర్ తో చేసే వస్తువులు తరతరాలుగా వస్తూ ఉన్నాయి. అలాంటి వారితో కలిసి పనిచేస్తే నా కల నెరవేరినట్టే అంటారామె..

కలప, ఇనుము, ప్లాస్టిక్ ఉండగా పేపర్ ఎందుకు?

ఆప్టరాల్ పేపర్.. ఈ మాట నిజమే కావచ్చు .. కానీ, దానికో చరిత్ర ఉంది. దానికో ఉపయోగముంది. గతంలో ఎన్నో వస్తువులు పేపర్ గుజ్జుతో తయారు చేశారు. ఆఖరికి ఆభరణాలు కూడా పేపర్ తో తయారవుతున్నాయి. మెటీరియల్ కోసం వెతకాల్సిన పని లేదు. కొరత అన్నమాటే ఉండదు. అదే సమయంలో కస్టమర్ల మైండ్ సెట్ కూడా మారుతోంది. ప్రయోగాలను ఆదరించటానికి సిద్ధమౌతున్నారు. ఇది తనలాంటివారికి ప్రోత్సాహకరంగా మారుతోందని స్పృహ అంటారు. అంతేకాదు సమాజంలో స్థిరపడ్డ కొన్ని నమ్మకాలని కళాకారులు కూకటి వేళ్లతో సహా పెకిలించవచ్చు అని కూడా నమ్ముతారు. అయితే, స్పృహ తయారు చేసిన వస్తువులకు మార్కెటింగ్ పెద్ద సమస్యగా మారింది. ఇప్పటికయితే కేవలం ప్రదర్శనలు, మౌత్ పబ్లిసిటీ ద్వారా మాత్రమే క్లయింట్స్ వస్తున్నారు. ఆదాయం తక్కువగానే వస్తున్నా, నిరుత్సాహపడకుండా, పల్ప్ ఫ్యాక్టరీ తీర్చిదిద్దుతున్నారు.

డిఫరెంట్ మెటీరియల్...డిఫరెంట్ మోడల్..!!

డిఫరెంట్ మెటీరియల్...డిఫరెంట్ మోడల్..!!


ఇంత శ్రమకోర్చి పేపర్ ఉత్పత్తులను తయారు చేస్తున్న స్పృహ చొఖానీకి ఆది నుంచి ఎదురవుతున్న సమస్య- కస్టమర్లను కన్విన్స్ చేయటమే. పేపర్ ని కొన్ని దశాబ్దాలుగా చూస్తున్నప్పటికీ, దానితో చేసిన వస్తువులను మాత్రం నూటికి తొంభై మంది శల్య పరీక్ష చేస్తూనే ఉంటారు. అందుకే పేపర్ గుజ్జుతో చేసిన వస్తువులు కూడా చాలా దృఢంగా ఉంటాయని ప్రపంచానికి చెప్పడమే తన లక్ష్యమంటారు స్పృహ.

మరోపక్క కొనుగోలుదారుల్లో కూడా , చీప్ గా వచ్చే పేపర్ వస్తువులే కదా అనే అభిప్రాయమూ ఉంది. వస్తువుల తయారీకిపడ్డ కష్టాన్ని అర్ధం చేసుకోకుండా అడ్డగోలుగా బేరసారాలకి దిగుతుంటారు. ఇలాంటివన్నీ ఆమెను నిరుత్సాహ పరుస్తుంటాయి. చెమట ధారపోసి కళాఖండాలను సృష్టిస్తే – తీరా కొనేటప్పడు బేరాలాడుతున్నారేంటని బాధ పడేది. అయినా సరే, స్పృహ ఆశావహ దృక్పథం వదల్లేదు.

ప్రపంచం మారుతోంది. మనుషుల ఆలోచనలు, అభిరుచులు క్రమంగా మారుతున్నాయి. ప్రకృతి సిద్ధమైన ఆహారమా లేక కృత్రిమ రంగుల సమాహారమా, వాతావరణానికి మేలు చేసే సైక్లింగా.. లేక కాలుష్యాన్ని వెదజల్లే కార్లా? మిల్లు బట్టా- లేక చేత్తో నేసినవా? ఇలా అనేక రకాలుగా ఆలోచిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య సహజత్వానికి దగ్గరగా ఉండే ఉత్పత్తులకు మంచి రోజులొస్తున్నాయనే చెప్పాలి. ఒక పని నచ్చితే దానికోసం ఎంతవరకైనా వెళ్లాలి.. ఇదే స్పృహ చెప్పే మాట- దీన్నిబట్టి పల్ప్ స్టార్టప్ మీద ఆమెకున్న విశ్వాసాన్ని అర్ధం చేసుకోవచ్చు.