పైసా పెట్టుబడి లేకుండానే కోట్లు సంపాదిస్తున్నారు !!

Monday February 22, 2016,

4 min Read

టెక్నాలజీ… టెక్నాలజీ… టెక్నాలజీ. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ మాటే. సంప్రదాయ వ్యాపార రూపురేఖల్ని మార్చేసింది. కొత్త తరం వ్యాపారాలను సృష్టిస్తోంది. ఉదాహరణకు… ప్రపంచంలోనే అతిపెద్ద ట్యాక్సీ కంపెనీ ఉబర్ నే తీసుకోండి. సొంతంగా ఒక్క వాహనమైనా దానికుందా? అంతెందుకు ఫేస్ బుక్ జుకర్ బర్గ్ ఉన్నాడుగా.. ఎఫ్ బీలో ఒక్క సెంటెన్స్ కూడా రాయడు. అదేదో సంచనల ప్రకటన అయితే తప్ప. ఎంతో విలువైన రిటైలర్ కంపెనీ అలీబాబా దగ్గర అల్లావుద్దీన్ అద్భుత దీపం ఏమీ లేదు. ఏమీ సృష్టించనూ లేదు. ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీ ఎయిర్ బీఎన్ బీ అసలు రియల్ ఎస్టేట్ వ్యాపారమే చేయదు. ఒక్క బిల్డింగ్ కూడా కట్టదు. ఈ కంపెనీలన్నీ కేవలం టెక్నాలజీని ఉపయోగించుకుని వేలకోట్లు సంపాదిస్తున్నాయి. అలాంటివాటిలో ఒకటే ఈ ముంబై స్టార్టప్ ఆల్ట్ ఫ్లో. 

అన్ని రంగాల్లోనూ సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోంది . కొన్ని వ్యాపారాల్లో ఇది సమూల మార్పులు తెస్తోంది. సమయం, వ్యయం, శారీరక శ్రమను తగ్గిస్తోంది. వ్యాపారులకే కాదు… వినియోగదారులకు కూడా ఇది మేలు చేస్తోంది. ప్రత్యామ్నాయ పెట్టుబడులపైపు పారిశ్రామికవేత్తలను ఆకర్షిస్తోంది. ముంబైలో మొదలైన స్టార్టప్ ఆల్ట్ ఫ్లోకు ఎలాంటి పెట్టుబడులు, ఆస్తులు లేవు. అయితే ఇది ఆన్ లైన్లో ఒక ప్రత్యామ్నాయ పెట్టుబడుల వేదికను సృష్టించింది.

అసలేంటి ఈ ఆల్ ఫ్లో..?

ఇన్వెస్ట్ మెంట్ మేనేజ్మెంట్, ప్రత్యామ్నాయ సంపదకు ఆల్ట్ ఫ్లో చక్కని మార్కెట్ ప్లేస్. పెట్టుబడులను ఎలా పెట్టాలి, డీల్స్ కుదుర్చుకోవడం ఎప్పుడు,ఎవరిని సంప్రదించాలి… ఇలాంటి విషయాల్లో సలహాలు ఇస్తోంది ఆల్ట్ ఫ్లో. ఇది డిజిటల్ టెక్నాలజీ. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆన్ లైన్ కన్సల్టెన్సీ అన్నమాట. ప్రస్తుతం ఆల్ట్ ఇన్ఫో ఒక నెట్ వర్కింగ్, డీల్ ఓరియెంటేషన్, సాస్ ప్లాట్ ఫాం. ఔట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ తో పనిచేస్తోంది. మరో ఏడాదిలో అన్ని లైసెన్సులు తీసుకుని మర్చెంట్ బ్యాంకింగ్ లోకి కూడా ప్రవేశించనుంది.

ఇప్పటివరకు ఏం జరిగింది?

అభినందన్, ఆదిత్ దేవానంద్, శరవణ్ షణ్ముగం, వరుణ్ అగర్వాల్ కలిసి… ఆల్ట్ ఫ్లోను స్థాపించారు. 2015 డిసెంబర్ లో దీన్ని ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా ముంబైలో ఏర్పాటు చేశారు. చెఫ్ హోస్ట్ అనే ఆన్ లైన్ కంపెనీని గతంలో అభినందన్, శరవణ్ స్థాపించారు. శరవణ్ ప్రస్తుతం ఆల్ట్ ఫ్లో సీటీఓ. గతంలో ఈయన ఈబే, వాల్ మార్ట్ కంపెనీల్లో అమెరికా సిలికాన్ వ్యాలీలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఆదిత్ ఐఐటీ బెంగళూరులో చదుకున్నారు. సీఏ,సీఎఫ్ఏ పూర్తిచేసి బ్యాంకర్ గా పనిచేశారు. ఆల్ట్ ఫ్లో సీఎంఓ నల్సార్ లో చదువుకున్నా.. ఎస్ ఆర్ అసోసియేట్స్ సహా పలు విదేశీ కంపెనీల్లో పనిచేసిన అనుభవముంది. 

స్టాక్స్, బాండ్స్, క్యాష్ కాకుండా ఏ ఏసెట్ అయినా ప్రత్యామ్నాయ సంపద కిందే లెక్క. ప్రైవేట్ కంపెనీలు, వెంచర్ క్యాపిటల్, ప్రైవేట్ ఈక్విటీ, హెడ్జ్, రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రా, డెరివేటివ్స్, ఆర్ట్, వైన్ ఇవన్నీ ఆల్టర్నేట్ మనీ , పెట్టుబడుల కిందకే వస్తాయంటారు అభినందన్ బాలసుబ్రమణియన్.

ఆల్ట్ ఫ్లో పనేంటి?

ఆల్ట్ ఫ్లోలో రెండు ప్రధాన శాఖలున్నాయి. అవి మార్కెట్ ప్లేస్, సాస్ సెక్షన్. మార్కెట్ ప్లేస్ రెండు పనులు చేస్తుంది. ఒకటి డీల్ ఫ్లో రెండోది కన్సల్ట్ ఫ్లో. డీల్ ఫ్లో – డీల్స్ కుదుర్చుకోవడంలో సలహాలనిస్తుంది. దగ్గరుండి ఒప్పందాలను కుదురుస్తుంది. కన్సల్ట్ ఫ్లో – ఇది సలహాలనిస్తుంది. వినియోగదారులు… న్యాయవాదులు, అకౌంటెంట్స్, ఆర్థిక సలహాదారులను దగ్గర చేస్తుంది. వినియోగదారుల అవసరాలను బట్టి వారికి సలహాలనందిస్తుంది.

సాస్ సెక్షన్ లోనూ రెండు విభాగాలున్నాయి – కంట్రో ఫ్లో, డాటా ఫ్లో. కంట్రోఫ్లో – ఇదో అసెట్ మేనేజ్ మెంట్. వినియోగదారులు తమ ఆస్తులను ఎలా మేనేజ్ చేసుకోవాలి.సంపదను పెంచుకోవడంపై సలహాలనిస్తుంది. డాటా ఫ్లో – వినియోగదారులు తమ డాక్యుమెంట్లను, డాటాను దాచుకునే సదుపాయం కల్పిస్తుంది. ఆన్ లైన్లోనే తమ డాటాను అత్యంత భద్రంగా ఎలా దాచుకోవాలో చెబుతుంది.

ప్రైవేట్ కంపెనీ డైరెక్టర్లు, డీల్ మేకర్స్, పెట్టుబడిదారులు, సలహాదారులు, ఇతర వృత్తుల్లో స్థిరపడ్డవారినే లక్ష్యంగా పనిచేస్తోంది ఆల్ట్ ఫ్లో. ఆల్ట్ ఫ్లోలో ఒకసారి ఎంటరైతే ఆల్ట్ ఫ్లో టీం ఆ వ్యక్తి డాటాను పరిశీలిస్తుంది. ఆల్ట్ ఫ్లోలోకి సైన్ అప్ అయ్యి తమ అవసరాల మేర సమాచారాన్ని వినియోగించుకోవచ్చు. తమకేం కావాలో ఆన్ లైన్ లో చెప్తే… వారికి నిపుణులతో తగిన సలహాలు, సూచనలు ఇప్పిస్తుంది.

 "ఒక ప్రైవేట్ కంపెనీ డైరెక్టర్ గా ఫండ్స్ అవసరం రావచ్చు. తన ఆస్తులను ఎలా వినియోగించుకోవాలో… ఎక్కడ పెట్టుబడులు పెట్టాలో కొంతమందికి తెలియకపోవచ్చు. అలాంటివారు ఆల్ట్ ఫ్లో సేవలను వినియోగించుకోవచ్చు. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలనుకునేవారు మా సేవలను ఉపయోగించుకోవచ్చు."- అభినందన్

డీల్ ఫ్లో, కంట్రో ఫ్లో విభాగాల నుంచి ఇప్పుడు ఆల్ట్ ఫ్లో కంపెనీకి నిధులు వస్తున్నాయి. ఆల్ట్ ఫ్లో స్టార్టప్ ఫండ్స్ రైజ్ చేయడంలో ప్రైవేట్ కంపెనీలకు సాయం చేస్తున్నాయి. నాలుగు మిలియన్ డాలర్లు అంటే 27 కోట్ల రూపాయల ఫండ్స్ సేకరించేలా సాయం చేశారు.. వీరి వల్ల ఒక హెల్త్ కేర్ కంపెనీ 20 కోట్ల రూపాయలు సేకరించగలిగింది. ఒక ప్రొడక్షన్ హౌస్ 680 కోట్ల రూపాయలను సేకరించగలిగింది. స్పోర్ట్స్ కంపెనీ మిలియన్ డాలర్లు, వెంచర్ క్యాపిటల్ కంపెనీలు 20 నుంచి 50 మిలియన్ డాలర్లు సేకరించాయి.

అసలు ఈ రంగం ఎలా ఉంది?

ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్ మెంట్ మార్కెట్ విలువ లక్షల కోట్లలో ఉంది.అయితే పారదర్శకత లేమి, కొన్ని అక్రమాల వల్ల కాస్త దెబ్బతింది. మళ్లీ ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ప్రత్నామ్నాయ పెట్టుబబడులపైనే ఆధారపడి ఉంది. సంస్థలే కాదు వ్యక్తులు కూడా ఈ రంగంలో పెట్టుబడులు పెడుతున్నారు. ఏటా వంద బిలియన్ డాలర్ల పెట్టుబడులు వస్తున్నాయని అంచనా. ప్రపంచ వ్యాపప్తంగా ఎసెట్ మార్కెట్ విలువ 10 లక్షల కోట్ల డాలర్లు ఉందంటున్నారు అదిత్.

భవిష్యత్ ప్రణాళికలు

క్రౌడ్ ఫండింగ్ మోడల్ లో ప్రస్తుతం ఆల్ట్ ఫ్లో పనిచేయడం లేదు. భవిష్యత్ లో ఆ రంగంలోకి వెళ్లాలనుకుంటోంది. మరిన్ని స్టార్టప్ లకు ఊతమిచ్చేలా ప్రణాళిక రూపొందిస్తోంది. స్టార్టప్ లకు వెంచర్ క్యాపిటల్ అవసరం లేకుండా… ఇతర ప్రత్యామ్నాయాలు చూపాలనేది కంపెనీ ప్లాన్. 2016 క్యూ 2లో పదిమంది ఉద్యోగులను నియమించుకుంది.

నాలుగు అంశాలపైనే ప్రధానంగా దృష్టి

1. ప్రైవేట్ మార్కెట్ ను మరింత బలోపేతం చేయడం

2.ఆల్టర్నేటివ్ అసెట్స్ లోనే కొత్త విభాగాలు సృష్టించడం

3. పెట్టుబడులకోసం ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకులపై ఆధారపడకుండా… ప్రత్నామ్నాయాలు చూపడం

4. ప్రపంచ ప్రత్యామ్నాయ పెట్టుబడులకు అత్యుత్తమ వేదికను సృష్టించడం