మమ్ముట్టి సరసన హీరోయిన్ గా ఒక హిజ్రా  

0

హిజ్రా అంటే సమాజంలో ఎంత చిన్నచూపు ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సామాజికంగా, ఆర్ధికంగా ఎదుర్కొనే సమస్యలు, హక్కుల కోసం, అస్థిత్వం కోసం ఎడతెగని పోరాటాలు.. ఎల్జీబీటీ కమ్యూనిటీలో ఇవన్నీ నిత్యకృత్యం. కొన్ని ఎన్జీవో సంస్థలు హిజ్రాల తరుపున నిలబడి ఎంతోకొంత ఆర్ధికంగా చేయూతనందిస్తున్నాయి. అలాంటి కోవలోకే వస్తుంది మలయాళ సినీ ఇండస్ట్రీ.

మలయాళీ బిగ్ హీరో మమ్ముట్టి హీరోగా తెరకెక్కిస్తున్న పెర్నాబు చిత్రంలో తొలిసారిగా ట్రాన్స్ జెండర్ అంజలి అమీర్.. స్టార్ హీరో సరసన నటిస్తోంది. ఎవరూ ఊహించని ప్రయోగం చేసిన మలయాళ ఇండస్ట్రీ, ఒక ఎల్జీబీటీ కమ్యూనిటీకి చెందిన మోడల్ ను హీరోయిన్ గా పరిచయం చేస్తున్నామని సగర్వంగా ప్రకటించుకుంది.

21 ఏళ్ల అంజలీ అమీర్ రెండేళ్ల క్రితం సర్జరీ చేసుకుని కోయంబత్తూరులో మోడల్ గా రాణించింది.అయినా సరైన అవకాశాల్లేక ఎంతో మానసిక సంఘర్షణ అనుభవించింది. ముఖ్యంగా జెండర్ సమస్య ఆమెను విపరీతమైన క్షోభకు గురిచేసింది.

ఎట్టకేలకు ఒక అవకాశం వచ్చింది. మోడల్ నుంచి సినిమాల్లోకి అడుగుపెట్టింది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి పక్కన హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది. ఆమె ఆనందానికి అవధుల్లేవు.

సీను రామసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కొద్ది రోజుల్లో విడుదల కాబోతోంది. ఆమెను హీరోయిన్ గా తీసుకుందామని దర్శకుడు చేసిన ప్రపోజల్ ను మమ్ముట్టి తిరస్కరించలేదు సరికదా.. మంచి నిర్ణయం తీసుకున్నావని అభినందించాడు. అది ఆయన గొప్ప వ్యక్తిత్వం అని సంతోషంగా చెప్తోంది అంజలి అమీర్.  

Related Stories