ఏదైనా అడగండి చిటికెలో చేసేస్తాం !

సాయం ఏదైనా ‘ఆస్క్ ఫర్ హెల్ప్’ అంటున్న స్టార్టప్

0

స్టార్టప్ ట్రెండ్‌లో నేనుకూడా ఉన్నానంటోంది హైదరాబాద్‌కు చెందిన 'ఆస్క్ ఫర్ హెల్ప్'(askforhelp.in). ఢిల్లీ నుంచి గల్లీ దాకా సర్వీస్ సెక్టార్‌కు ఉన్న డిమాండ్ ఇంతా అంతా కాదు. ఇదే వ్యాపార లక్ష్యంతో ప్రారంభమైంది ఈ సంస్థ. ప్రస్తుతానికి భాగ్యనగర వాసులకు అనేక సర్వీసులను ఈ స్టార్టప్ అందిస్తోంది. మీడియా కార్ప్ అనే ఓ అడ్వర్టైజింగ్ కంపెనీ ఫౌండర్ అయిన కళ్యాణ్ 2015లో ఆస్క్ ఫర్ హెల్ప్‌ని మొదలు పెట్టారు.

వీళ్లు అందించే హెల్ప్ ఎలాంటిది?

ఎలక్ట్రీషియన్ దగ్గర నుంచి డొమెస్టిక్ సర్వీస్ దాకా, క్యాటరింగ్ టు హోం ట్యూటర్స్, వాస్తు, జోతిష్యం, ప్యాకర్స్ అండ్ మూవర్స్ లాంటి ఎన్నో సేవలను ఒక గొడుకు కిందకు తీసుకురావడమే ఆస్క్ ఫర్ హెల్ప్ లక్ష్యం. అటు అపార్ట్‌మెంట్ దగ్గరి నుంచి ఇటు కార్పొరేట్ ఆఫీసుల దాకా రోజువారీ, నెలవారీ ఆఫీస్ బాయ్ కావాలన్నా ఆస్క్ ఫర్ హెల్ప్‌ను సంప్రదిస్తే చాలంటారు కళ్యాణ్. సాధారణంగా ఇలాంటి సర్వీసుల కోసం ప్రతీ అపార్ట్‌మెంటులో మెయింటెనెన్స్ వారు ఉంటారు. కానీ అవసరానికి మాత్రం వారు ఉపయోగపడరు. ప్రతి ఇంట్లో ఇలాంటి చిన్నాచితకా సమస్యలు ఎప్పుడో ఒకసారి ఇబ్బంది పెట్టేవే ! ఇలాంటి సేవలకు ఓ కన్సల్టింగ్‌గా వ్యవహరిస్తోంది ఆస్క్ ఫర్ హెల్ప్. 

ఎవరికైనా ప్లంబర్, మెకానికో.. అవసరం వస్తే.. మనకు తెలిసిన వారు ఇటీవల ఎవరైనా ఆ పనులు చేయించుకుంటే వారి దగ్గర నుంచి రెఫరెల్ తీసుకుని ఫోన్ చేస్తాం. లేకపోతే చుట్టుపక్కల ఉన్న షాపులకు వెళ్లి... ఆరా తీస్తాం. కాస్త తెలిసిన వాళ్లైతే.. జస్ట్ డయిల్‌పై ఆధారపడతారు. జస్ట్ డయిల్.. ప్లంబర్ల నంబర్లు ఇస్తుందే కానీ మన పనికి వారు సరిపోతారో లేదో చెప్పరు. మనమే చెక్ చేసుకోవాలి. వీటికి తోడు ఇతర సెక్యూరిటీ సమస్యలు కూడా ఉంటాయి. కానీ ఇలాంటి సమస్యలన్నింటికీ పరిష్కారం అంటోంది ఆస్క్ ఫర్ హెల్ప్ పరిష్కారం అంటున్నారు వ్యవస్థాపకులు కళ్యాణ్.

సేవలు సేఫేనా ?

నూటికి నూరుశాతం సెక్యూరిటీ పరంగా ఆస్క్ ఫర్ హెల్ప్ సేఫంటున్నారు కళ్యాణ్. ఈ సంస్థ కోసం పనిచేసే వారు ఎవరైనా.. పూర్తిస్థాయి ధృవీకరణ చేసుకున్న తర్వాతే నియమించుకుంటామని చెబ్తున్నారు. ఓటర్ ఐడి కార్డ్, ఆధార్‌తో పాటు రెండు రిఫరెన్సులు తీసుకుంటున్నారు. లైవ్ ఫోటోని తీసుకుంటారు. దీంతో నాణ్యమైన సేవలతోపాటు సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా భరోసా ఉంటుందని వివరిస్తున్నారు. చిన్నాచితకా పనులు చేసే వారిలో సగం మందికి పెద్ద క్వాలిఫికేషన్లు ఉండవు. మాట తీరు కూడా సరిగ్గా ఉండకపోవచ్చు. ఆ విషయంలో కూడా సరైన ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తామంటున్నారు.

ఆస్క్ ఫర్ హెల్ప్ ఫౌండర్ కళ్యాణ్
ఆస్క్ ఫర్ హెల్ప్ ఫౌండర్ కళ్యాణ్

లా చదివి.. సేవల రంగంలోకి..

అడ్వర్టైజింగ్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన కళ్యాణ్ చదువుకున్నది మాత్రం బ్యాచిలర్ ఆఫ్ లా. హైకోర్టు బార్ కౌన్సిల్ మెంబర్ అయిన ఆయన ప్రాక్టీస్‌కు దూరంగా అడ్వర్టైజింగ్ వైపు అడుగులేశారు. తమ మొదటి సంస్థ మీడియా కార్ప్ ద్వారా.. టెలీ ఫిలిమ్స్, సీరియల్స్ కంటెంట్ సేలింగ్‌తోపాటు ప్రమోషన్ లాంటివి చేసేవారు. తన రెండో వెంచర్‌గా ఈ యుటిలిటీ స్టార్టప్ ప్రారంభమైంది. ఆన్ రోల్‌, ఆఫ్ రోల్ కలిపి దాదాపు 30మంది దాకా ఉద్యోగులు ఆస్క్ ఫర్ హెల్ప్ కోసం పనిచేస్తున్నారు.

భవిష్యత్ ప్రణాళికలు

ఆస్క్ ఫర్ హెల్ప్ సైట్ బీటా వెర్షన్ నుంచి సాస్‌కు అప్ గ్రేడ్ అయింది. ప్రస్తుతానికి కాల్ సెంటర్ నుంచే కస్టమర్ల వివరాలను తెలుసుకొని సేవలందిస్తున్నారు. భవిష్యత్ లో యాప్‌ లాంచ్ చేయాలని చూస్తున్నారు. ప్రస్తుతానికి సొంత సీడ్ ఫండింగ్‌తో నడుస్తోన్న సంస్థ ఇన్వెస్టర్ వస్తే ఇతర ప్రాంతాలకూ.. విస్తరించాలని చూస్తున్నారు.

ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంటుంది. దాన్ని వినే ,చెప్పే అర్హత ఉంది. నాకు చెప్పండి! ashok@yourstory.com

Related Stories

Stories by ashok patnaik