స్టార్టప్స్‌లో బీ టౌన్‌ హంగామా

బ్రాండ్ భజాయిస్తున్న బాలీవుడ్ స్టార్స్

స్టార్టప్స్‌లో బీ టౌన్‌ హంగామా

Thursday July 23, 2015,

4 min Read

వ్యాపారం చేయాలంటే పెట్టుబడి కావాలి. అదొక్కటే సరిపోదు - ప్రచారం కూడా కావాలి. అది కావాలంటే బ్రాండ్ అంబాసిడర్ కావాలి. మరి పెట్టుబడులతో పాటు ప్రచారం కూడా ఒకేసారి దొరికితే.. ? ఈ బంపరాఫరేదో బాగుంది కదూ. కొన్ని స్టార్టప్‌లకు ఇలాంటి అదృష్టమే తలుపుతట్టింది. ఎలా అంటే... బాలీవుడ్ సెలబ్రిటీలు కొందరు స్టార్టప్‌లను ఎండార్స్ చేయడంతో పాటు ఇన్వెస్ట్‌మెంట్లూ చేశారు. అలా ఇండియాలో పలు స్టార్టప్‌లకు బీ-టౌన్ స్టార్స్ సపోర్ట్‌గా నిలుస్తున్నారు. ఇంతకీ ఎవరా సెలబ్రిటీలు ? వాళ్లు చేస్తున్న వ్యాపారాలేంటి ?

image


స్టార్ ఉంటే సూపర్ హిట్టే !

2010 చివర్లో జస్ట్ డయల్ బ్రాండ్ అంబాసిడర్‌గా అమితాబ్ బచ్చన్‌ను ఎంచుకున్నప్పుడు బిగ్-బీకి ఒక్కో షేర్ పది రూపాయల చొప్పున 62 వేల షేర్లు ఇచ్చారు. ఆ తర్వాత వరుసగా మూడేళ్ల పాటు అమితాబ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. కంపెనీ లిస్టింగ్ రోజున ఆ షేర్ల విలువ ఏకంగా మూడు కోట్ల 83 లక్షలైంది. అలా బీ-టౌన్ సెలబ్రిటీలకు ఆదర్శంగా నిలిచారు అమితాబ్. ఆయన స్ఫూర్తితో మరికొందరు నటీనటులు ఇదే బాటపట్టారు. తమ డబ్బులను స్టార్టప్స్‌లో పెడుతున్నారు. సల్మాన్ ఖాన్, ఏఆర్ రెహ్మాన్, కరిష్మా కపూర్, హృతిక్ రోషన్, సన్నీ లియోన్ లాంటి వాళ్లంతా ఇన్వెస్టర్లుగా మారారు. పెట్టుబడులకు పరిమితం కాకుండా .. ఆ సంస్థను ప్రమోట్ కూడా చేస్తున్నారు. ఓ వైపు పెట్టుబడులు, మరోవైపు సెలబ్రిటీల ప్రచారంతో ఆ స్టార్టప్స్ దూసుకెళ్తున్నాయి.

image


1. సల్మాన్ ఖాన్... Yatra.com

Yatra.com మొదట్లో స్టార్టప్ కాదు. ఏడేళ్ల పాటు ట్రావెల్ ఆపరేటర్‌గా జనానికి దగ్గరైంది. నార్వెస్ట్ వెంచర్ పార్ట్‌నర్స్‌తో పాటు ఇంటెల్ క్యాపిటల్ ఇందులో పెట్టుబడులు పెట్టాయి. Yatra.comలో సల్మాన్ ఖాన్ ఐదు శాతం వాటం తీసుకున్నాడు. అంతేకాదు బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు. ఈ కంపెనీ మార్కెటింగ్ క్యాంపెయిన్‌లో సల్మాన్ మెరిసిపోతున్నాడు. దీంతో పాటు ‘Being Human’ ఆన్ లైన్ షాపింగ్ సంస్థ కూడా సల్మాన్ దే.

image


2. కరిష్మా కపూర్... Babyoye.com

బేబీ ప్రొడక్ట్స్ అమ్మే ఈ-కామర్స్ స్టోర్ Babyoye.com. నెస్లే చైల్డ్ కేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన ఈ సంస్థలో కరిష్మా కపూర్ అతిపెద్ద షేర్ హోల్డర్. ఇందులో ఆమెకు 26 శాతం వాటా ఉంది. ఆమెతో పాటు యాక్సెల్ పార్టనర్స్, టైగర్ గ్లోబల్ లాంటి మిగతా ఇన్వెస్టర్లు కూడా పెట్టుబడులు పెట్టారు. కానీ సంస్థ వ్యవస్థాపకులు అరుణిమా సింగ్డియో, సంజయ్ నద్కర్నిలే మెజార్టీ వాటా.

image


3. అజయ్ దేవ్ గన్... Ticketplease.com

సినిమా టికెట్ల దగ్గర్నుంచి మ్యూజిక్ షోలు, స్పోర్ట్స్ ఈవెంట్లలాంటి కార్యక్రమాల టికెట్లను అమ్మే వన్ స్టాప్ పోర్టల్ Ticketplease.com. యమ్లా పగ్లా దీవానా సినిమా ప్రమోషన్ సమయంలో వ్యవస్థాపకుడు, సీఈఓ అయిన జిమ్మి మిస్త్రి ఆధ్వర్యంలో ఈ వెబ్ సైట్ ని బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్ గన్ ప్రారంభించారు.

"ఈ ఐడియా నాకు బాగా నచ్చింది. అందుకే సపోర్ట్ చేశాను" అని తన వెబ్ సైట్ గురించి చెబుతాడు అజయ్ దేవ్ గన్.

image


4. శేఖర్ కపూర్, ఏఆర్ రెహ్మాన్ - Qyuki

సినిమా ఇండస్ట్రీకి చెందిన శేఖర్ కపూర్, ఏఆర్ రెహ్మాన్లకు సోషల్ మీడియా ప్లాట్‌ఫాం అయిన Qyuki Digital Media Pvt. Ltd లో భాగస్వామ్యం ఉంది. కొత్త మీడియా కంటెంట్ కోసం రూపొందించిన వెబ్ సైట్‌ని 2012లో ప్రారంభించారు. ఈ స్టార్టప్‌లో మొదట్లో సిస్కో పెట్టుబడులు పెట్టింది. Qyuki వరల్డ్ వైడ్ వీడియో వెబ్ లాంటిది. వికిపీడియాని వీడియో రూపంలో ఊహిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందీ వెబ్ సైట్.

image


5. సుజేన్, మలైకా, బిపాషాThe Label Corp

ప్రీతా సుఖ్తాంకర్ స్థాపించిన The Label Corp కు ముగ్గురు బ్రాండ్ అంబాసిడర్లున్నారు. ముగ్గురూ బాలీవుడ్ స్టార్సే. మొదటి ఎడిటోరియల్ ఇ-కామర్స్ బ్రాండ్ గా పేరుంది. ఈ కంపెనీ మూడు విభాగాల్లో సేవలందిస్తోంది. The Home Labelకి సుజేన్ ఖాన్, The Closet Labelకి మలైకా అరోరా ఖాన్ , The Trunk Labelకి బిపాషా బసు బ్రాండ్ అంబాసిడర్లు.

6. హృతిక్ రోషన్

అందరు బాలీవుడ్ స్టార్స్ లాగా బీ-టౌన్ హీరో హృతిక్ రోషన్ కూడా రెండు స్టార్టప్స్ లల్లో పెట్టుబడులు పెట్టారన్నది ఇండస్ట్రీ వర్గాల టాక్. కానీ వాటి పేర్లు మాత్రం బయటకు రాలేదు. వీటిలో ఒకటి ఆన్ లైన్ రిటైలర్ కంపెనీ కాగా, మరొకటి స్పోర్ట్స్ స్టేడియంలు నిర్మించే కంపెనీ అని చెప్పుకుంటారు.

image


7.మాధురీ దీక్షిత్| Dance with Madhuri

డ్యాన్స్ నేర్పిస్తా రండి అంటూ పిలుస్తున్నారు బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్. ఆన్ లైన్ డ్యాన్స్ అకాడమీకి శ్రీకారం చుట్టారామె. డ్యాన్స్ విత్ మాధురీ పేరుతో ఇంటర్నెట్ ద్వారా డ్యాన్స్ నేర్చుకునే అవకాశం కల్పిస్తున్నారు. కేవలం డ్యాన్స్ మాత్రమే కాదు... ఎక్సర్‌సైజ్ కూడా నేర్చుకోవచ్చు. డ్యాన్సులు ఎక్సర్ సైజ్ ల కోసం యూట్యూబ్ వీడియోలు చూసేవారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటోందీ వెబ్ సైట్.

image


8.సన్నీ లియోన్| IMBesharam.com

బాలీవుడ్ హాట్ స్టార్ సన్నీ లియోన్ కూడా ఓ స్టార్టప్‌కి బ్రాండ్ అంబాసిడర్. సెప్టెంబర్ 2012లో ప్రారంభించిన ఆన్ లైన్ అడల్ట్ స్టోర్ IMBesharam.com బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది సన్నీ లియోన్. అడల్ట్ టాయ్స్, లోదుస్తులు, సెక్సీ వేర్, సెక్సీ కాస్ట్యూమ్స్, స్విమ్ వేర్, పార్టీవేర్, లైఫ్ స్టైల్ యాక్ససరీస్ లాంటివన్నీ ఈ వెబ్ సైట్ ద్వారా అమ్ముతుంటారు.

9. డినో మోరియా| Coolmaal.net

సినిమా ప్రమోషన్ల కోసం రకరకాల టెక్నిక్స్ వాడుతుంటారు నిర్మాతలు. వాటిలో మర్కండైస్ కూడా ఒకటి. సినిమాలు, సెలబ్రిటీలకు సంబంధించిన ప్రచార వస్తువులను అమ్మే ఈ-కామర్స్ వెబ్ సైట్ coolmaal.net. బాలీవుడ్ నటుడు డినో మోరియాకు చెందిన వెబ్ సైట్ ఇది. బాడీగార్డ్, జిందగీ న మిలేగి దొబారా సినిమాల మర్కండైస్‌తో ప్రారంభించారు.

image


10. శిల్పా శెట్టి| Grouphomebuyers.com

లాంగ్ లెగ్‌డ్‌ బ్యూటీ శిల్పా శెట్టి తన భర్త రాజ్ కుంద్రాతో కలిసి ప్రాపర్టీ వెబ్ సైట్‌ని స్థాపించారు. అదే Grouphomebuyers.com. ఇప్పటికే ఈ వెబ్ సైట్ సహకారంతో 200 మంది తక్కువ ధరకే ప్రాపర్టీలను సొంతం చేసుకున్నారు. ఇండియాలోని ప్రధాన నగరాల్లోని రెసిడెన్షియల్ ప్రాజెక్టుల వివరాలు ఈ వెబ్ సైట్ లో ఉంటాయి. విశేషమేంటంటే... ఒకే చోట ప్రాపర్టీ కావాలనుకునేవారంతా ఓ గ్రూప్ లో చేరి డిస్కౌంట్ పొందుతుంటారు.


ఇలా మన బాలీవుడ్ స్టార్స్ కూడా స్టార్టప్స్ లో బ్రాండ్‌ భజాయిస్తున్నారు. మరి వీరిని ఆదర్శంగా తీసుకొని ఇంకెంతమంది ఆ బాటపడతారో చూడాలి.