ఇంత మంచి మనసున్న మనిషికి దేవుడు అన్యాయం చేశాడు..

దివ్యాంగుల జీవితాల్లో వెలుగు నింపుతున్న ప్రీతి శ్రీనివాసన్

ఇంత మంచి మనసున్న మనిషికి దేవుడు అన్యాయం చేశాడు..

Thursday January 05, 2017,

3 min Read

అది 2016, డిసెంబర్ 12. చెన్నైలో వర్దా తుఫాన్ వచ్చిన రోజు. మేమంతా సిటీకి 180 కిలోమీటర్ల దూరంలోని పుణ్యస్థలం తిరువన్నామలైలో ఉన్నాం. సైక్లోన్ ప్రభావం అక్కడ కూడా ఉంది. భీకరమైన ఈదురు గాలులు. ఒకటే వర్షం. అక్కడ ఆరోజు కార్తీక దీపోత్సవంలో భాగంగా అరుణాచలేశ్వరాలయంలో మహాదీపం అనే కార్యక్రమం జరుగుతోంది. వేల అడుగుల ఎత్తున్న కొండపైకి ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది తరలివచ్చారు. ఆ రోజు మా ఫ్రెండ్ ఒక విశిష్ట వ్యక్తిని పరిచయం చేసింది. ఆమె మరెవరో కాదు.. ప్రీతి శ్రీనివాసన్.

పక్కనే ఉన్న యోగిరామ్ సూరత్ కుమార్ ఆశ్రమం నుంచి వీల్ ఛైర్ లో వచ్చింది ప్రీతి. ఆమె మొహంలో ప్రశాంతమైన చిరునవ్వు. మేమంతా వలయాకారంగా కూచుని ఉన్నాం. బయట జోరువాన. ఆమెను చూస్తూ కాసేపు నిశ్శబ్దంగా ఉన్నాం. ఎందుకింత మౌనంగా ఉన్నారు అని అడిగింది. తర్వాత కాసేపటికి తన కథ చెప్పడం మొదలుపెట్టింది.

image


దాదాపు 17 ఏళ్ల కిందటి సంగతి. ఎప్పటిలాగే ఆరోజు కూడా ఎంతో హుషారుగా ఉంది ప్రీతి. పాండిచ్చేరిలో ఉన్నారు. వారంలో కాలేజీ రీ ఓపెన్ చేస్తారనగా సరదాగా స్నేహితులతో కలిసి బీచ్ కి వెళ్లింది. అలలతో అంతులేని ఆటలు. ఇసుకలో కేరింతలు. ఇంతలో ఒక పెద్ద కెరటం వచ్చి ప్రీతి మొహానికి భళ్లున తాకింది. కుప్పకూలిపోయింది. అల తాకిడికి పడిపోయిందేమో అనుకున్నారు. కానీ అలా పడిపోయిన ప్రీతి ఎంత ప్రయత్నించినా లేవలేకపోయింది. హుటాహుటిన పాండిచ్చేరిలోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు ఏమీ చెప్పలేదు. నాలుగు గంటల తర్వాత చెన్నయ్ కి పట్టుకెళ్లారు. అక్కడ టెస్టుల అనంతరం పెరాలిసిస్ అన్నారు. మెరుపు వేగంతో వచ్చిన అల ప్రీతి వెన్నుపూసను పుటుక్కున తుంచేసింది.

ప్రీతి జీవితాన్ని ఒక కెరటం ఛిద్రం చేసింది. శూన్యం ఆవహించింది. కలలన్నీ చెల్లాచెదరయ్యాయి. అప్పటికే ప్రీతి తమిళనాడు అండర్ 19 విమెన్ క్రికెట్ టీం కెప్టెన్. స్విమ్మింగ్ లో ఛాంపియన్. అటు చదువులో ఇటు ఆటలో అన్నింటా టాప్ గా నిలిచిన ప్రీతి.. అచేనతంగా హాస్పిటల్ బెడ్ మీద పడిపోయింది.

క్రమంగా ఒక్కో ఫ్రెండ్ దూరమైంది. శారీరక వికలాంగుల జాబితాలో స్పైనల్ కార్డ్ ఇంజూరిస్ డిసేబులిటీస్ లేకపోవడం వల్ల చదువు కొనసాగించలేకపోయింది. వెన్నెముక దెబ్బతిన్నవాళ్లను ప్రభుత్వం దివ్యాంగుల కేటగిరీలో పెట్టకపోవడం శోచనీయం అని ప్రీతి కంటనీరు పెట్టింది.

image


మరో రెండు సందర్భాల్లో ప్రీతి శ్రీనివాస్ చావు ముఖంలోకి వెళ్లి వచ్చింది. అమ్మ పూజల ఫలమో, శ్రేయోభిలాషుల ఆశీర్వాదమో, తెగిపోయిన ఊపిరి మళ్లీ అతికింది. ఇలా అయితే లాభం లేదు.. జీవితంలో నిస్సత్తువ ఆవహించి మంచానికే పరిమితమై పోతాను అనుకుంది. తనలాంటి నిస్సహాయులకు ఏదో ఒకటి చేయాలన్న తపన మనసులో కలిగింది. అమ్మ మద్దతు దొరికింది. అలా సోల్ ఫ్రీ అనే సంస్థను ఏర్పాటు చేసింది.

సోల్ ఫ్రీ అనేది పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్. దివ్యాంగులు మళ్లీ ఆత్మగౌరవంతో బతకడానికి చేయూతనిచ్చే కార్యక్రమం. ప్రత్యేకంగా మహిళలకు చేతనైన సాయం చేయడం సంస్థ ఉద్దేశం. చదువు చెప్పించడమో, ఉపాధి కల్పించడమో, లేదంటే కుటుంబానికి ఆర్ధిక సాయం చేయడమో.. వెన్నెముక దెబ్బతిని చితికిపోయిన కుటుంబాలకు ఆర్ధిక స్వాంతన చేకూర్చడమే సంస్థ లక్ష్యం. స్పైనల్ కార్డ్ తీవ్రంగా దెబ్బతిని ఏ ఆసరా లేని ఫ్యామిలీకి అవసరమైతే నెలకు వెయ్యి రూపాలయల జీతం ఏడాదిపాటు అందిస్తారు. వీల్ ఛైర్లు పంపిణి చేస్తారు. ఎయిడ్స్ పేషెంట్లకు ఫండ్స్ కలెక్ట్ చేస్తారు. అవేర్నెస్ క్యాంపెయిన్ చేపడతారు. ఇటీవలే టాలెంటెడ్ అథ్లెట్లకు పారా ఒలింపిక్ వీల్ ఛైర్లు కూడా అందించారు. దాని ఖరీదు మూడున్నర లక్షలు. అయినా సరే భారం అనుకోకుండా వాళ్లలో మరింత స్ఫూర్తి రగిలించేలా డొనేట్ చేశాం అని ప్రీతి గర్వంగా చెప్పుకుంది.

విరాళాలు పోగేసి కొందరికి కుట్టుమిషన్లు అందజేసి వారిని ఆర్ధికంగా నిలుదొక్కుకునేలా చేసింది సోల్ ఫ్రీ సంస్థ. దివ్యాంగులు మా దగ్గరికి వచ్చి ఏం కోరుకుంటే అది అందివ్వాలనేనే మా ఉద్దేశం అంటారు ప్రీతి శ్రీనివాసన్. సొంతకాళ్ల మీద నిలబడతామని ముందుకొచ్చిన వాళ్లకు.. లాప్ టాప్, పాప్ కార్న్ మిషన్, పిండిగిర్ని.. అందించారు. వ్యవసాయం చేస్తామన్నా సరే.. సీడ్ ఫండింగ్ చేసి ఆర్ధికంగా చేయూతనిస్తారు.

భవిష్యత్తులో దివ్యాంగుల కోసం ఒక రిహాబిలిటేషన్ సెంటర్ ఓపెన్ చేయాలన్నది ప్రీతి శ్రీనివాసన్ డ్రీం. వాళ్లలో ఆత్మస్థయిర్యాన్ని నింపి, జీవితానికి సార్ధకత చేకూర్చాలని సోల్ ఫ్రీ సంస్థ తపన పడుతోంది. దానికి సంబంధించిన కొంత భూమి ఒక ఎన్జీవో నుంచి వచ్చింది. కానీ ఏవో కొన్ని కారణాల వల్ల ఇంకా ప్రభుత్వం నుంచి అప్రూవల్ రాలేదు. అది వచ్చినా రాకున్నా.. మాతో కలిసి వచ్చే వారి సాయంతో వీలైనంత మంది జీవితాల్లో వెలుగులు నింపుతాం.. అంతవరకు మా జర్నీ ఆగదు అని నవ్వుతూ చెప్పి ముగించారు ప్రీతి శ్రీనివాసన్.