లక్షల జీతం వదిలి సాహితీసేవ చేస్తున్న యువ ఇంజినీర్

లక్షల జీతం వదిలి సాహితీసేవ చేస్తున్న యువ ఇంజినీర్

Friday April 29, 2016,

2 min Read


రంజిత్ 30 ఏళ్ల యువకుడు. సొంతూరు ఉత్తర్ ప్రదేశ్ లోని రాయబరేలి. మంచి ఉద్యోగం, ఆరంకెల జీతం. లైఫ్ లో ఇంతకన్నా కావాల్సిందేమంది. అయినా అతని జీవితంలో ఏదో తెలియని వెలితి. కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగంతో సంతృప్తి చెందలేదు. సమాజంపై తనదంటూ ఒక ముద్ర వేయాలనుకున్నాడు. దీంతో ఉద్యోగం మానేసి దేశాలు తిరగడం మొదలుపెట్టాడు. దేశమంతా చుట్టేశాడు. చివరికి నానాటికీ నిరాదరణకు గురవుతున్న భారతీయ భాషలకు, సాహిత్యానికి సేవ చేయాలని డిసైడయ్యాడు. మాతృభాషమాత్రమే తెలిసినవారు ఈ దేశంలో కోట్లమంది ఉన్నారు. అలాంటివారందరికీ ఉపయోగపడే ఒక వేదిక ఏర్పాటు చేయాలనుకున్నాడు. అందులోనుంచి పుట్టిందే ప్రతిలిపి.

ప్రతిలిపి

భారతీయ భాషల్లో ఎవరికి వారు పుస్తకాలు, రచనలను పబ్లిష్ చేసుకునే వేదిక ప్రతిలిపి. రచయితలు తమ రచనలను ఇందులో అప్ లోడ్ చేసుకోవచ్చు. జస్ట్ లాగిన్ అయ్యి వివరాలు ఇస్తే చాలు. ప్రతిలిపిలో ప్రస్తుతం 2వేల7 వందల మంది రచయితలు, కవులు అటాచ్ అయ్యారు. ఆరు భారతీయ భాషల్లో ప్రచురణలకు వేదికయ్యింది. హిందీ, బెంగాలీ, గుజరాతి, మలయాళం, మరాఠీ, తమిళ భాషల్లో సేవలందిస్తోంది. ఈ వెబ్ సైట్లో చాలామంది సాహిత్య అకాడెమీ, జ్ఞానపీఠ్, పద్మ అవార్డు గ్రహీతలు ఉన్నారు. 2014 సెప్టెంబర్ లో ఈ స్టార్టప్ ప్రారంభమయినా 2015 మార్చి నుంచి అది పాపులరయ్యింది. తొలి ఏడాది ఈ వెబ్ సైట్లో ఉంచిన పది లక్షల రచనలను రీడర్స్ చదివారు. 

విజయం – దాన్ని నిలుపుకోవడం

రంజిత్ దృష్టిలో విజయం అంటే డబ్బు సంపాదించడం మాత్రమే కాదు. లాభం గురించి ఎవరైనా అడిగితే … ఇంకా తను డబ్బు సంపాదించడమే మొదలుపెట్టలేదంటాడు. రంజిత్ సొంతంగా కొంత పెట్టుబడి పెట్టారు. ఇంకొంత ఫ్రెండ్స్ సర్దారు. కొంతమంది రచయితలు సైతం తమకు తోచినంత ఆర్థిక సాయం చేస్తున్నారు. ఇంకా ఎక్కువ రావడానికి ఇదేమీ టెక్నాలజీ ఆధారిత కంపెనీ కాదంటున్నారు రంజిత్.

రైటర్స్ – రీడర్స్ మధ్య ఉన్న గ్యాప్ ను ప్రతిలిపి తగ్గిస్తోంది. అమెజాన్ లాంటి సంస్థలు సైతం డైరెక్టుగా పబ్లిష్ చేస్తున్నాయి. చైనాలో అయితే మొబైల్ కంపెనీలే పబ్లిష్ చేస్తూ లాభాలను ఆర్జిస్తున్నాయి. నిజంగా అది చాలా మంచి విధానమంటున్నారు రంజీత్. కొంతమంది స్నేహితుల సహకారం, తన దగ్గరున్న కొంత డబ్బుతో రంజీత్ ప్రతిలిపిని ప్రారంభించారు. పనిచేసే ఉద్యోగులు సైతం కొంత పెట్టుబడి పెట్టారు. పెద్దగా పెట్టుబడులు అవసరం లేదు. అందుకే తమ కంపెనీ చాలా నెమ్మదిగా… స్టడీగా ముందుకెళ్తోందని చెబుతున్నారు.

image


స్టేటస్ సింబల్ గా ఇంగ్లిష్

ఇవాళ రేపు ఇంగ్లిష్ ఒక గ్లోబల్ కరెన్సీలా చెలామణి అవుతోంది. ఆంగ్లం మాట్లాడటం ఒక స్టేటస్ సింబల్ కూడా. దీనివల్ల హిందీ సహా ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యత తగ్గుతోంది. అందుకే ప్రాంతీయ భాషలకు పూర్వవైభవం తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు రంజీత్. ప్రాంతీయ భాషలను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నామే తప్ప.. ఇంగ్లిష్ కు ఏమాత్రం వ్యతిరేకం కాదంటున్నారు. ఈ ఏడాది మార్చి 11న యువర్ స్టోరీ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన ఇండియన్ లాంగ్వేజ్ డిజిటల్ ఫెస్టివల్ లో ప్రతిలిపి వెబ్ సైట్ ను ప్రదర్శించారు. ప్రాంతీయ భాషలకు చేస్తున్న సేవను పలువురు కొనియాడారు. ప్రతిలిపికి కేంద్ర ప్రభుత్వం, సాంస్కృతిక శాఖ సాయం చేస్తున్నాయి. ఇంగ్లిష్ తోపాటు ప్రాంతీయ భాషలకు సమాన గౌరవం దక్కాలని రంజీత్ కోరుకుంటున్నారు.

image


లక్ష్యాలు

రంజీత్ ఆలోచనలు నచ్చి చాలా మందే సాయం చేశారు. 50 కోట్ల మంది భారతీయులకు చేరువకావాలన్న లక్ష్యంతో రంజిత్ టీమ్ పనిచేస్తోంది. భాష, ప్రాంతం, టెక్నాలజీతో సంబంధం లేకుండా అందరికీ సాహిత్యం, పుస్తకాలు చేరువకావాలని ప్రతిలిపి కోరుకుంటోంది. ప్రస్తుతానికి ఆరు భాషల్లో సేవలందిస్తున్న ప్రతిలిపి… త్వరలో తెలుగు భాషలోకి రానుంది.