కాలేజీ డ్రాపవుట్..ఇప్పుడొక హాలీవుడ్ డైరెక్టర్

రచనలను ఆపలేకపోయిన ఇంజనీరింగ్ చదువుఫిల్మ్ మేకర్ గా రాణింపుగతేడాది బెస్ట్ సెల్లర్‌గా నిలిచిన పుస్తకాన్ని రాసిన రైటర్స్క్రిప్ట్ రైటర్, క్రియేటివ్ డైరెక్టర్ నిఖిల్ స్టోరీ

0

భారతదేశంలో చాలామంది కురాళ్ళలాగానే నిఖిల్ చాంద్వాణీ కూడా సంప్రదాయ పద్ధతిలో ఇంజనీరింగ్ చదివేశాడు. కానీ ఆ తరువాత కొన్నేళ్ళపాటు జరిగింది మాత్రం పూర్తిగా సంప్రదాయ విరుద్ధమైనది. నిఖిల్ ఇప్పుడొక రచయిత, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్, అంతర్జాతీయంగా పేరొందిన ఫొటోగ్రాఫర్ కూడా. ఈ మధ్యే అతని నవల ‘Coded Conspiracy’ కి అమెరికన్ లిటరరీ ఫోరమ్ సొసైటీ వారి అవార్డు కూడా వచ్చింది. అతని కవితా సంకలనం నిరుడు భారతదేశంలో అత్యధికంగా అమ్ముడు పోయిన పుస్తకం.

సమస్యలు అధిగమిస్తూ

నిఖిల్‌కి కాలేజీ చదువులో అన్నీ కష్టాలే. చాలా సబ్జెక్టులలో ఫెయిలయ్యాడు. అతని భవిష్యత్తుమీద తల్లిదండ్రులు బాగా బెంగపడ్దారు. తనకేమో రాయటమంటే పిచ్చి. కాలేజిలో ఉండగానే ఒక పుస్తకం రాసే పనిలో పడ్డాడు. ఒక దశలో బాగా నిస్పృహలో మునిగిన తల్లిదండ్రులు ఊరట చెందాలని దొంగ మార్కుల జాబితాను ఫొటో షాప్ సాయంతో తయారు చేసే దాకా వెళ్ళాడు నిఖిల్. కానీ రాను రాను పరిస్థితులు కాస్త స్థిమిత పడుతూ వచ్చాయి. అతని తొలి నవల ‘I Wrote Your Name in the Sky and yours and Yours Too’ ప్రచురితమైంది. అప్పుడు సెకండియర్ లో ఉన్నాడు. ఆ తరువాత కవితా సంకలనమూ వెలువడింది.

నిఖిల్ చాంద్వాణీ
నిఖిల్ చాంద్వాణీ

అతని నవల గురించి ఒక పత్రికలో వార్త వచ్చేదాకా అతని తల్లిదండ్రులకు ఆ విషయం తెలియదు. కానీ అదే అతని పూర్తికాలపు కెరీర్‌గా మారుతుందనే నమ్మకం కలగలేదు వాళ్లకు. ఆయితే నిఖిల్ రాయటం కొనసాగిస్తూ ఉండటం, రాయల్టీ చెక్కులు క్రమంగా వస్తూ ఉండటం వాళ్ళను కాస్త మార్చింది. ఏదో రకంగా వాళ్ళకొడుకు తన మనసుకు నచ్చింది చేస్తూ సంపాదిస్తున్నాడని ఆనందించారు. చెప్పుకోకుండా ఉండిపోయిన విషయాలన్నిటి మీదా ఈ రచయితకు చాలా బలమైన ఆసక్తి ఉండేది. అతను రాసిన తొలి పుస్తకాల్లో ఒకటి ‘Unsung Words’. గొంతువిప్పి చెప్పని టీనేజ్ భావాలు, రొమాన్స్, గుండెల్ని కరిగించే విడిపోయినవారి కథలతో 55 కవితలున్నాయి అందులో.

హాలీవుడ్ నుంచి పిలుపు

స్క్రిప్ట్ రైటర్‌గా, క్రియేటివ్ డైరెక్టర్‌గా నిఖిల్ అనేక మంది హాలీవుడ్ నటులతో కలిసి పనిచేశాడు. కొన్ని హాలీవుడ్ చిత్రాలతోబాటు ఒక అంతర్జాతీయ ట్రావెల్ చానెల్ కోసం ఆఫ్రికన్ వైల్డ్ లైఫ్ సఫారీ మీద నైరోబీలో చిత్రించిన ‘Into Kenya Safari’ అనే టీవీ కార్యక్రమం కూడా ఒకటి. పొలిటికల్ కాలమ్స్, టీవీ షోస్‌కి స్క్రిప్ట్‌లు, అనేక నిర్మాణ సంస్థలకు ఫిక్షన్ సహా నిఖిల్ చాలా ఎక్కువగా రాస్తాడు. జాతీయ స్థాయి న్యూస్ పేపర్లకు, పత్రికలకూ రాయటం సరే సరి. దాదాపు 4 కోట్ల డాలర్ల బడ్జెట్‌తో తీయబోయే ఒక హాలీవుడ్ చిత్రానికి స్క్రిప్ట్ అందించటంతోబాటు కో డైరెక్టర్ గా పనిచేసే క్రమంలో ఉన్నాడు.

డాక్యుమెంటరీలు చిత్రీకరిస్తూ

ఆఫ్రికాలోనూ, భారతదేశంలోనూ అడవుల్లో గడపటమంటే నిఖిల్ కి చాలా ఇష్టం. అడవిలో ఉన్నా ఇంట్లోనే ఉన్నట్టు ఉంటుందతనికి. పదహారేళ్ళపాటు పూర్తి శాకాహారిగా గడిపినా, అడవి జీవితం అతడి ఆహారపు అలవాట్లలో సాహసం చేయమని ప్రోత్సహించింది. మాంసాహారి అయ్యాడు. ఒకసారి షూటింగ్ చేస్తుండగా పాము కాటేసిన విషయం ఇప్పటికీ గుర్తుచేసుకుంటాడు. అది కాటేశాక అతను, అతని బృందం కలిసి ఆ పామును పట్టుకొని వండుకు తినేయటంతో తన ప్రతీకారం తీరిందంటాడు. అతని డాక్యుమెంటరీ ‘Escape to Kenya’కి అమెరికాలో కూడా అవార్డు వచ్చింది. వచ్చే ఏడాది అకాడెమీ అవార్డులకూ ఎంపికవుతుందని నిఖిల్ ఆశాభావంతో ఉన్నాడు. అతిపిన్న వయసులో సాహిత్య రంగంలో పాపులర్ అయిన ఆల్‌రౌండర్‌గా వాల్ స్ట్రీట్ ఎనిలిస్టులు కితాబునిచ్చారు.

అభినందనలు, అవార్డులు

అమెరికా అధ్యక్షుడు ఒబామా సమక్షంలో అక్కడి అమెరికన్ సొసైటీ నిఖిల్‌కి ఈ మధ్యనే 'ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్' పురస్కారం అందించింది. దీంతో, ప్రతిష్ఠాత్మకమైన అమెరికన్ సొసైటీ నుంచి ఈ గౌరవం దక్కించుకున్న తొలి ఏషియన్‌గా మరింత ఖ్యాతి పొందాడు. రాబోయే హాలీవుడ్ చిత్రం ‘Saffron Skies’ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేస్తున్నాడిప్పుడు. యు కె రైటర్స్ అవార్డ్, భారత ప్రభుత్వం అందించే జాతీయ పురస్కారం ’ ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్ ’ కూడా అందుకోవటం నిఖిల్ సాధించిన మరికొన్ని ఘనతలు.

భవిష్యత్ ప్రణాళికలు

అతను బాలీవుడ్ లో అతి పిన్న వయస్కుడైన నిర్మాత కూడా కాబోతున్నాడు. షి - ద మూవీ పేరుతో రాబోయే చిత్రానికి ఈ మధ్యనే మ్యూజిక్ రికార్డింగ్ కూడా పూర్తి చేశాడు. పశ్చిమబెంగాల్‌లో షూటింగ్ జరుగుతోంది. లంచ్ బాక్స్, పాన్ సింగ్‌ తోమార్ ఫేమ్ రవి భూషణ్ భార్తియా ఇందులో నటిస్తుండగా, విప్లవ్ మజుందార్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ గాయని, సరిగమ ఫేమ్ స్నితి మిశ్రా పాటలు, పండిట్ రోను మజుందార్ సంగీత దర్శకత్వం అదనపు ఆకర్షణలు అవుతాయి.

నికొలాస్ కేజ్ నటించేలా మరో చిత్రానికి రూపకల్పన జరుగుతున్నట్టు కూడా వార్తలొస్తున్నాయి. ఈ చిత్రం కథ మొత్తం కాన్సర్ ని జయించిన వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. ఆ వ్యక్తి ఒక రాయల్ ఎన్ ఫీల్డ్ బులెట్ మీద భారతదేశమంతటా తిరుగుతూ హృదయ పరివర్తన చెందటం దాని కథాంశం. మిస్టిక్ వాండర్ ఇన్నొవేటివ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండర్ సుమీత్ కుమార్ దీన్ని నిర్మించబోతున్నాడు. ఇన్వెస్ట్ మెంట్స్, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన మరో కంపెనీకి అతను సీఈవో, ఫౌండర్ కూడా. ఆ కంపెనీ అనేక ప్రచురణ సంస్థలకు, మాగజైన్లకు ఫైనాన్షియల్ కంట్రోల్ బాధ్యతలు కూడా చూస్తుంది.

అమ్మ,నాన్నలతో నిఖిల్
అమ్మ,నాన్నలతో నిఖిల్

స్ఫూర్తి

నిఖిల్ అభిమాన చిత్రాల్లో ఒకటి ‘Shawshank Redemption’. ట్రావెల్, వైల్డ్ లైఫ్ కి సంబంధించిన డాక్యుమెంటరీలు చూడటమంటే అతనికెంతో ఇష్టం. అనురాగ్ కశ్యప్‌కీ, అతడి సినిమాలకీ వీరాభిమాని కూడా. అతనికి అతిపెద్ద స్ఫూర్తి ప్రదాత మాత్రం E.C.W. ఫౌండర్, ప్రస్తుతం WWE మేనేజర్ అయిన పౌల్ హేమన్. రచయితలు కావాలనుకుంటున్నవాళ్లకు అతనిచ్చే సలహా ఒక్కటే. 

“ ఏది కమర్షియల్‌గా లాభదాయకం అనేది ఆలోచించకుండా ఇష్టమొచ్చినది రాస్తూ ఉండటమే. ఆన్ లైన్ లోనూ ఆఫ్ లైన్ లోనూ ఎప్పుడూ ఉనికిని చాటుకుంటూనే ఉండాలి “ అంటాడు.
This is a YourStory community post, written by one of our readers.The images and content in this post belong to their respective owners. If you feel that any content posted here is a violation of your copyright, please write to us at saira@yourstory.com and we will take it down.
ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంటుంది. దాన్ని వినే ,చెప్పే అర్హత ఉంది. నాకు చెప్పండి! ashok@yourstory.com

Related Stories

Stories by ashok patnaik