సరుకు డెలివరీ చేసే సర్వీసులో మహిళలుంటే తప్పేంటి..?

సరుకు డెలివరీ చేసే సర్వీసులో మహిళలుంటే తప్పేంటి..?

Thursday May 11, 2017,

2 min Read

తినే తిండి దగ్గర్నుంచి గుండు పిన్ను దాకా ఈ-కామర్స్ తో ముడిపడివున్న ఈ రోజుల్లో డెలివరీ సర్వీసంతా మగవాళ్లే చూస్తున్నారు. వాళ్లను డెలివరీ బాయ్స్ అనో, డెలివరీ మెన్ అనో వ్యవహరిస్తున్నారు. అలాకాకుండా డెలివరీ బాధ్యత అమ్మాయిలకు అప్పగిస్తే, వారిని ఏమని పిలవాలి? డెలివరీ విమెన్ అనాలా? డెలివరీ గర్ల్ అనాలా? చిత్రమైన సందిగ్దం కదా!

image


మహిళల విషయంలో డెలివరీ అనే పదానికి- బిడ్డకు జన్మనివ్వడం అనే అర్ధం రావొచ్చుగాక.. అంతమాత్రం చేత వాళ్లు ఈ కామర్స్ రంగంలో సరుకు డెలివరీ చేసే ప్రొఫెషన్ ఎంచుకోవద్దా? కస్టమర్‌ ఇంటికి వెళ్లి ఐటెం డెలివరీ చేసే అమ్మాయిల్ని డెలివరీ గర్ల్‌ అంటే తప్పేంటి? అలా అన్నంత మాత్రాన వేరే అర్ధాన్ని ఆపాదించాల్సిన అవసరమేముంది? డెలివరీ సర్వీసులో ఎంతకాలం మగవాళ్ల ఆధిపత్యమా? ఆ పని లేడీస్ చేయలేరా? ఆ పేరు వినడానికి బాగాలేదన్న ఒకేఒక కారణంతో వాళ్లను ఆ సర్వీస్ రంగానికి దూరం చేయడం ఎందుకు?

ఢిల్లీకి చెందిన యోగేష్ కుమార్ సరిగ్గా ఇలాగే ఆలోచించాడు. చేసే పనిలో నిబద్ధత, సాధించాలన్న పట్టుదల ఉన్న అమ్మాయిలను కచ్చితంగా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతోనే వారికి ఒక వేదిక కల్పించాడు. ఫర్ విమెన్ బై విమెన్ క్యాబ్ అనే సర్వీసుని మొదలుపెట్టారు. కానీ అది కొన్ని కారణాల వల్ల వర్కవుట్ కాలేదు. ఢిల్లీ ఓపెన్ యువర్ ఐస్ సంస్థ ఫౌండర్లలో ఒకరైన యోగేష్‌- సమాజంలో ఆడమగ సమానమే అని చాటిచెప్పడానికి- ఆ తర్వాత ఈవెన్ కార్గో ఏర్పాటు చేశాడు. డెలివరీ సర్వీసులు మగవాళ్లు మాత్రమే ఎందుకు చేయాలి.. మహిళలకు చిన్నాపాటి ప్రోత్సాహం ఇస్తే ఆ రంగంలో రాణించలేరా అనేది యోగేష్ నమ్మిన సూత్రం. ఆ నమ్మకంతోనే ఈవెన్ కార్గోలో అమ్మాయిలకు ఉపాధి కల్పించాడు.

ఎంతైనా కీడెంచి మేలెంచాలి. మనల్ని ఎవరేం చేస్తారులే అనుకుంటే పొరపాటే. అందుకే ఉద్యోగం ఇవ్వడానికంటే ముందే మహిళలకు సెల్ఫ్ డిఫెన్స్ లో మెళకువలు నేర్పించాడు. ఊహించని సంఘటన ఎదురైతే ఎలా ఎదుర్కోవాలో ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేశాడు. డెలివరీ ఇచ్చే ప్లేస్ మరీ దూరమైతే తోడుగా ఒకరిని ఇచ్చి పంపుతాడు.

ఎంతకాలం ఇలా అభద్రతా భావంలో బతుకుతాం. ఏం జరగకముందే ఏమైనా అవుతుందో ఏమో అనే నెగెటివ్ థింకింగ్ ఎంతకాలం? దానికి ఫుల్ స్టాప్ పడాలి. అది జరగాలంటే జనం మైండ్ సెట్ మారాలి. ఆడవాళ్లను చూసే దృష్టికోణం మారాలి. వామ్మో.. వాయ్యో అంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉంటుంది. ఆ చట్రంలోంచి అర్జెంటుగా బయటకు రావాలంటాడు యోగేష్.

ఈవెన్ కార్గో ప్రారంభించి ఏడాది కావొస్తోంది. మొదట్లో డెలివరీ ఇవ్వడానికి అమ్మాయిలు వస్తే విచిత్రంగా చూసేవాళ్లు. మెల్లిగా ఢిల్లీ ప్రజల్లో అలాంటి భావన పోయింది. చాలామంది మహిళలు డెలివరీ విమెన్ గా పనిచేయడానికి ముందుకు వస్తున్నారు. యోగేష్ కలగంటున్న స్వప్నం ఇప్పుడిప్పుడే వాస్తవ రూపంలోకి వస్తోంది