చిన్నాచితకా పనులను ఇంటికే వచ్చి చేసిపెట్టే 'జెప్పర్'

కొన్నిసార్లు చిన్న స‌మ‌స్య‌లే పెద్ద ఇబ్బందుల‌ను సృష్టిస్తాయి. ఐదు నిమిషాల ప‌ని అయినా స‌రైన టెక్నిషియ‌న్ దొర‌క్క నెల‌ల త‌ర‌బ‌డి వెయిట్ చేయాల్సి ఉంటుంది. లీక‌వుతున్న ఇంటి స్లాబ్‌ను మ‌ర‌మ్మ‌తు చేయ‌డం, పాడైన స‌ర్క్యూట్ స్థానంలో మ‌రో దాన్ని అమ‌ర్చ‌డం, చీడ‌ల‌ను తొల‌గించ‌డం వంటి వాటికి ప‌నితెలిసిన మంచి టెక్నిషియ‌న్ అవ‌స‌రం. ఇలాంటి ఇంటి ప‌నుల కోసం టెక్నిషియ‌న్లు చుట్టూ తిరగాల్సి వ‌స్తుంది. ఇలాంటి సమ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకొచ్చిందో సంస్థ‌. ఇళ్లల్లోని అన్ని అవ‌స‌రాల‌ను తీరుస్తూ బెంగ‌ళూరులో క‌స్ట‌మ‌ర్ల న‌మ్మ‌కాన్ని చూర‌గొంటున్న‌ది జెప్ప‌ర్‌.

0

ప్ర‌స్తుతం అంద‌రిదీ ఉరుకుల ప‌రుగుల జీవితం. ఇలాంటి స‌మ‌యాల్లో ఇంట్లో ఏదైనా పాడైతే దాన్ని రిపేర్ చేయించ‌డం చాలా క‌ష్టం. ఇక ఊరికి కొత్త‌వారైతే టెక్నిషియ‌న్లు ఎక్క‌డ దొరుకుతారో తెలియ‌క ఇబ్బందుల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. టెక్నిషియ‌న్లు అందుబాటులో ఉన్నా, వారెలెంటావారో తెలియ‌క ఆందోళ‌న చెందాల్సిన ప‌రిస్థితి.. బెంగ‌ళూరులో ఇప్పుడు ఇలాంటి స‌మ‌స్య‌లు చాలా చిన్న‌వైపోయాయి. అందుకు కార‌ణం జెప్ప‌ర్ సంస్థ‌. ఇంటి అవ‌స‌రాల‌ను ఒక్క కాల్‌తో అతి త‌క్కువ ఖ‌ర్చుతో తీరుస్తున్న‌ది.

ఇంటి ప‌నుల‌ను వేగంగా, సుల‌భంగా చేయాల‌న్న‌దే జెప్ప‌ర్ ల‌క్ష్యం. ఎల‌క్ట్రీషియ‌న్‌, ప్లంబ‌ర్‌, పెస్ట్ కంట్రోల‌ర్ వంటి నిపుణులు కావాల‌నుకుంటే వినియోగ‌దారులు ముందుగా వారి అపాయింట్‌మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. అదీ జెప్ప‌ర్ వెబ్‌సైట్‌లో.. లేదంటే జెప్ప‌ర్ మొబైల్ యాప్‌లో. ప్ర‌తి ఇంట్లో ఉండే సాధార‌ణ‌, చిన్న స‌మ‌స్య‌ల‌కు చెక్‌పెట్టేందుకు డానిష్ ఆరిఫ్‌, ఆకాశ్ గోయ‌ల్‌, జియా ఆరిఫ్‌లు ఈ సంస్థ‌ను ప్రారంభించారు. గ‌తంలో గోల్డ్‌మ‌న్ సాక్స్‌లో డానిష్ బిజినెస్ అన‌లిస్ట్. గుర్గావ్ ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్‌లో ఎంబీఏ పూర్తి చేసిన డానిష్... జెప్ప‌ర్ బిజినెస్ వ్య‌వ‌హారాల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ఫ్లిప్‌కార్ట్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా వ్య‌వ‌హ‌రించిన ఆకాష్ ప్ర‌స్తుతం ఈ కంపెనీ టెక్నాల‌జీ బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు. జెప్ప‌ర్ రోజువారీ వ్య‌వ‌హారాలు చూసే జియా ఇంట‌ర్నేష‌న‌ల్ యంగ్ మ్యాథ‌మెటిషియ‌న్ ఒలింపియాడ్‌లో గ‌తంలో గోల్డ్‌మెడ‌ల్ సాధించాడు. అలాగే ఎన్నో ఎన్జీవో సంస్థ‌ల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఆకాష్‌, జియా ఇద్ద‌రు బిట్స్ పిలానీలో బ్యాచ్‌మెట్స్‌. డానిష్‌, జియా ఇద్ద‌రు చెడ్డీ ఫ్రెండ్స్‌..

2014 బ్రెజిల్‌లో ఫిఫా ఫుట్‌బాల్ వ‌రల్డ్‌క‌ప్ చూసేందుకు సావోపాలో వెళ్లిన సంద‌ర్భంగా డానిష్‌కు ఈ హౌజ్‌హోల్డ్ సంస్థ స్థాపించాల‌న్న‌ ఐడియా వ‌చ్చింది. సావోపాలోలో ఇళ్ల‌లో క్లీనింగ్ స‌ర్వీసులు నిర్వ‌హించేందుకు స్థానికంగా ఎన్నో ఇంట్రానెట్ బుకింగ్ స‌ర్వీస్‌లు ఉన్నాయి. పార్టీలు ముగిసిన త‌ర్వాత ఇంటిని క్లీన్ చేసేందుకు ఇంట్రానెట్‌లో క్లీనింగ్ స‌ర్వీసుల కోసం స్థానికులు వెత‌క‌డం డానిష్ గుర్తించారు. అలాగే చార్జ్ కూడా స్థానిక ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండ‌టంతో బేర‌మాడ‌క‌పోవ‌డం, రేట్ల విష‌యంలో గొడ‌వ‌ప‌డ‌టం కానీ ఉండ‌క‌పోవ‌డం ఆయ‌న‌ను ఆశ్చ‌ర్య ప‌రిచింది. ఇలాంటి సేవ‌ల‌ను ఇండియాలో కూడా ఉంటే బాగుండేద‌ని అప్పుడే ఓ నిర్ణ‌యానికి వ‌చ్చారు.

వెబ్‌సైట్ ఆధారంగా సేవ‌లు..

ఈ ఇంటి సేల‌ను ఉప‌యోగించుకోవాల‌నుకునే వారు ముందుగా జెప్ప‌ర్ వెబ్‌సైట్‌ను సంద‌ర్శించి వారికి కావాల్సిన సేవ‌ల వివ‌రాల‌ను పొందుప‌ర్చాలి. అలాగే కాంటాక్ట్ డీటైల్స్‌, స‌మ‌స్య గురించి కాస్త వివ‌ర‌ణ‌, ఏ స‌మ‌యంలో టెక్నిషియ‌న్ కావాలో టైమ్‌, డేట్ వివ‌రాల‌ను ఇవ్వాలి. ఆ త‌ర్వాత జెప్ప‌ర్ అపాయింట్‌మెంట్‌ను ఫిక్స్ చేస్తుంది. డ‌బ్బుల‌ను కార్డ్ ద్వారా కానీ, క్యాష్ ద్వారా కానీ చెల్లించొచ్చు. ఈ స‌ర్వీస్‌ల‌ను బుక్ చేసుకునేందుకు వెబ్‌సైట్ ద్వారా అయితే ఒక నిమిషం, మొబైల్ యాప్ ద్వారా 20 సెక‌న్లు ప‌డుతుంది. ఈ స్టార్ట‌ప్ కంపెనీకి 150కి పైగా టెక్నిష‌న్లు ఉన్నారు. క‌స్ట‌మ‌ర్ల‌కు మంచి సేవ‌లు అందించ‌డ‌మే ఈ కంపెనీ ఉద్దేశం.

బిజినెస్ మోడ‌ల్‌..

ప్ర‌తి ఇంట్లో అవ‌స‌ర‌మ‌య్యే సేవ‌ల‌ను అందించ‌డ‌మే ఈ జెప్ప‌ర్ ఉద్దేశం. ప్ర‌తి ప‌నికి కొంత క‌మిష‌న్ తీసుకుంటూ టెక్నిష‌న్ల‌ను స‌మ‌కూరుస్తున్న‌ది. ప్ర‌తి ప‌నికి వేర్వేరుగా చార్జ్‌ను వ‌సూలు చేస్తూ క‌స్ట‌మ‌ర్ల న‌మ్మ‌కాన్ని చూర‌గొంటున్న‌ది. ప్ర‌స్తుతం కొద్ది పెట్టుబ‌డితోనే వ్యాపారాన్ని ఆరంభించిన‌ప్ప‌టికీ, దీన్ని మ‌రింత విస్త‌రించాల‌ని జెప్ప‌ర్ నిర్వాహ‌కులు భావిస్తున్నారు. స్థిర‌మైన ధ‌ర‌ల‌కు మంచి నాణ్య‌మైన సేవ‌ల‌ను అందించ‌డ‌మే వీరి ల‌క్ష్యం. క‌స్ట‌మ‌ర్ల న‌మ్మ‌కాన్ని చూర‌గొనేందుకు ఎలాంటి నేర‌చ‌రిత్ర లేని టెక్నిషియ‌న్ల‌నే నియ‌మించుకుంటున్న‌ది. జెప్ప‌ర్ సంస్థ‌లో ప‌నిచేసే కార్మికులంద‌రికీ పోలీస్ వెరిఫికేష‌న్ ఉంటుంది. అలాగే తాము చేసిన స‌ర్వీసుల‌కు బీమా సౌక‌ర్యాన్ని కూడా వీరు క‌ల్పిస్తున్నారు. ఇలా చేయ‌డం వ‌ల్ల త‌మ క‌స్ట‌మ‌ర్లు నేరుగా టెక్నిష‌న్ల‌తో సంబంధాలు పెట్టుకోకుండా త‌మ సేవ‌లే ఉప‌యోగించుకుంటార‌ని డానిష్ చెప్తున్నారు.

సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం..

పెద్ద సంఖ్య‌లో క‌స్ట‌మ‌ర్ల‌ను చేరుకునేందుకు వీరు విస్తృతంగా ప్ర‌చారం చేస్తున్నారు. అటు ఆన్‌లైన్‌తోపాటు ఇటు ఆఫ్‌లైన్‌లోనూ త‌మ సేవ‌ల గురించి క‌స్ట‌మ‌ర్ల‌కు తెలియ‌జేస్తున్నారు. వీరి ఫేస్‌బుక్ అకౌంట్‌కైతే లెక్క‌లేన‌ని హిట్స్ వ‌స్తున్నాయి. దీంతో సోష‌ల్ మీడియా మార్కెటింగ్‌పైనే దృష్టిసారించాలని ఈ కంపెనీ నిర్వాహ‌కులు భావిస్తున్నారు. ఐతే ఈ రంగంలో పోటీ తీవ్రంగా ఉండ‌టంతో మ‌రింత ప‌క్కాగా వెబ్‌సైట్‌ను నిర్వ‌హించాల‌నుకుంటున్నారు.

కొద్దికాలం క్రితమే ట్రాక్‌పైకి..

ఈ సేవ‌ల‌ను అందించేందుకు జెప్ప‌ర్ ఎంతో కాలంగా కృషిచేస్తున్న‌ప్ప‌టికీ కొద్దికాలం క్రిత‌మే ప్రారంభ‌మ‌య్యాయి. ఇప్ప‌టివ‌ర‌కైతే కొద్ది మొత్తంలోనే ఆదాయం వ‌చ్చిన‌ప్ప‌టికీ భ‌విష్య‌త్‌లో మ‌రింత విజ‌య‌వంత‌మ‌వుతుంద‌ని భావిస్తున్నారు. ముఖ్యంగా హోమ్ క్లీనింగ్‌, ఏసీ రిపేర్‌, పెస్ట్ కంట్రోల్ వంటి సేవ‌ల‌కే అధికంగా చార్జ్ చేస్తున్నారు. అదీ కూడా వెయ్యిలోపే. దీంతో ఆదాయం ఆరంభంలో కొద్దిగానే ఉంది. అన్ని స్టార్ట‌ప్ కంపెనీల లాగే జెప్ప‌ర్ కూడా ఆరంభంలో చాలా స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొన్న‌ది. ప్ర‌స్తుతం ఉన్న మార్కెట్‌ను స‌వ్యంగా మార్చాల‌న్న‌దే వీరి ల‌క్ష్యం. ప్ర‌స్తుత‌మున్న మార్కెట్ అస్త‌వ్య‌స్తంగా, అవాస్త‌వికంగా ఉన్న‌ద‌ని నిర్వాహ‌కులు భావిస్తున్నారు. ఈ ప‌రిస్థితుల‌ను త‌మ వ‌ద్ద ఉన్న 150 మంది నైపుణ్యంగ‌ల అసంఘ‌టిత రంగ కార్మికులు బెంగ‌ళూరులో ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దుతార‌ని అంటున్నారు. ఎలాంటి స‌మ‌యంలోనైనా, ఎలాంటి సేవ‌ల‌నైనా అందించేందుకు సిద్ధంగా ఉన్న త‌మ టీమ్ అద్భుతాలు సృష్టించ‌డం ఖాయ‌మ‌న్న ధీమాతో ఉన్నారు.

ఆకాశ్ గోయల్ , డానిష్ ఆరిఫ్, జియా ఆరిఫ్ - జెప్పర్ బృందం ఇదే
ఆకాశ్ గోయల్ , డానిష్ ఆరిఫ్, జియా ఆరిఫ్ - జెప్పర్ బృందం ఇదే

న‌మ్మ‌కం క‌లిగించ‌డ‌మే ముఖ్యం..

వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవాలంటే క‌స్ట‌మ‌ర్ల న‌మ్మ‌కాన్ని పొంద‌డ‌మే ముఖ్యం. ఇది ఏ వ్యాపారానికైనా వ‌ర్తిస్తుంది. అందుకే న‌మ్మ‌కం క‌లిగిన టెక్నిషియ‌న్లను నియ‌మించుకుంటున్న‌ది జెప్ప‌ర్. టెక్నిషియ‌న్ల బ్యాక్‌గ్రౌండ్ చూసి, పూర్తిగా ప‌రిశీలించిన త‌ర్వాత, పోలీస్ విభాగం నుంచి క్లియ‌రెన్స్ వ‌చ్చిన త‌ర్వాతే త‌మ నెట్‌వ‌ర్క్‌లో భాగ‌స్వామ్యులుగా చేస్తున్నారు. స‌రైన టైమ్‌కు రాక‌పోవ‌డం వంటి అవ‌ల‌క్ష‌ణాలు టెక్నిషియ‌న్ల సొంతం. ఒక‌టైమ్‌కు వ‌స్తామ‌ని చెప్పి మ‌రో టైమ్‌కు వెళ్ల‌డంలాంటివి చేస్తుంటారు. ఉద్యోగాలు చేసే క‌స్ట‌మ‌ర్ల‌కు ఇది చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటి ప‌రిస్థితులే న‌మ్మ‌కాన్ని స‌డ‌లించేలా చేస్తాయి. కాని జెప్ప‌ర్ టెక్నిషియ‌న్స్ మాత్రం బెంగ‌ళూరులో క‌స్ట‌మ‌ర్ల మాత్రం చెప్పిన టైమ్‌కే వెళ్తూ న‌మ్మ‌కం పొందుతున్నారు. క‌స్ట‌మ‌ర్ల అవ‌స‌రాల‌ను తీర్చేందుకు జెప్ప‌ర్ ఎప్పుడూ ఇద్ద‌రు టెక్నిషియ‌న్ల‌ను స్టాండ్ బైగా ఉంచుకుంటుంది. అర్జెంట్‌గా ఎవ‌రికి అవ‌కాశ‌మొంచ్చినా వెంట‌నే పంపిస్తుంది.

"మంచి అబ్బాయిలా ఉండ‌టం ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. మేం సంస్థ‌ను స్థాపించిన‌ప్పుడు కూడా అంద‌రి ఆలోచ‌న‌లు ఒకేలా ఉన్న‌వారిని తీసుకోవాల‌నుకున్నాం. ఇలా ఉండ‌టం వ‌ల్ల టెక్నిషియ‌న్ల‌తో బంధాన్ని కొన‌సాగించ‌డానికి, కో ఆర్డినేట్ చేయ‌డానికి స‌హ‌క‌రిస్తుంద‌న్న‌ది మా ఆలోచ‌న‌. మ‌నం న‌మ్మ‌కాన్ని చూర‌గొంటే ప్ర‌తిరోజు ఎవ‌రో ఒక‌రు మ‌న‌తో క‌లిసే అవ‌కాశ‌ముంటుంది. అని చెప్పారు" డానిష్‌.

ఎవ‌రినీ నొప్పించ‌నంత వ‌ర‌కు రూల్స్‌ను బ్రేక్ చేయొచ్చ‌న్న‌ది ఈ జెప్ప‌ర్ ఫిలాస‌పీ. అందుకే స్థానికంగా, గేటెడ్ క‌మ్యునిటీలో అడ్వ‌ర్ట‌యిజింగ్ చేస్తున్న‌ది. స్థిర‌మైన ప్రైజ్‌కు అన్ని సేవ‌లూ ఒకే ద‌గ్గ‌ర ల‌భించేలా చేయాల‌న్న‌దే జెప్ప‌ర్ ఉద్దేశం. అతి త‌క్కువ ధ‌ర‌ల‌కే క‌స్ట‌మ‌ర్ల‌ను వారి గ‌మ్యానికి చేరుస్తున్న ట్రావెల్ ఏజెన్సీ 'ఓలా' మాదిరిగా, ఇంటి సేవ‌లు 'ఓలా' అనిపించుకోవాల‌న్న‌ది. అమెరికాలో ఇలాంటి సేవ‌ల‌నే హౌజ్‌కాల్ అందిస్తున్న‌ది. అతి పెద్ద మార్కెట్ అయిన భార‌త్‌లో ఇలాంటి సేవ‌ల కోస‌మే హోం ట్ర‌యాంగిల్ అనే సంస్థ‌ను స్థాపించారు ర‌మేశ్ చించోలి, ధీరేంద్ర ప్ర‌తాప్‌.

భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌..

ప్ర‌స్తుతం బెంగ‌ళూరుకే ప‌రిమిత‌మైన ఈ సంస్థ ఏడాదిలోపే దేశంలో మ‌రో మూడు పెద్ద న‌గ‌రాల‌కు విస్త‌రించాల‌నుకుంటున్న‌ది. ప్ర‌స్తుతం ఈమెయిల్ ద్వారా క‌స్ట‌మ‌ర్ల‌కు రిసిప్ట్‌లు పంపుతున్న జెప్ప‌ర్‌, త్వ‌ర‌లో హార్డ్ కాపీల‌ను కూడా అంద‌జేయ‌నుంది. ఆండ్రాయిడ్‌లోనే ఉన్న జెప్ప‌ర్ యాప్‌ను త్వ‌ర‌లోనే ఐఓఎస్ వ‌ర్ష‌న్‌లో కూడా విడుద‌ల చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ది.