రోటీ బ్యాంక్ పెట్టి పేదోడి ఆకలి తీరుస్తున్న మనసున్న జర్నలిస్ట్..!!

రోటీ బ్యాంక్ పెట్టి పేదోడి ఆకలి తీరుస్తున్న మనసున్న జర్నలిస్ట్..!!

Tuesday October 25, 2016,

2 min Read

అన్నార్తులు అనాధలుండని నవయుగం ఇంకెంత దూరం? మన మహాకవి దాశరథి రాసిన గేయం! సుమారు 65ఏళ్ల క్రితం రాసిన పాట! అప్పటికీ ఇప్పటికీ ఏమీ మారలేదు! పేగుల్లో ఆకలి అగ్నిధారలా కురుస్తునే ఉంది! అలాంటి అభాగ్యుల ఆకలి మంటలు తీర్చడమంటే జీవితాన్ని త్యాగం చేయాలి! 

ఆకలి! కడుపులో అదొక నిత్య కదనరంగం! బతికున్న శవాలపై కరాళ నృత్యం! పక్కటెముకల్లో భగ్గున మంటపుచ్చుకున్నట్టు- పేగు అంచుల మీదనుంచి యాసిడ్ జరజరా జారినట్టు- కాలిపోయి, మండిపోయి,రోడ్డుపక్కన కూలిపోయిన దేహం! 

మనతల్లి అన్నపూర్ణ! మన అన్న దానకర్ణ! ఏంలాభం? ఎలుగెత్తి చాటడం కాదు. పుణ్యభూమిలో పుట్టినందుకు ఏడవాలి! ఏడ్చీ ఏడ్చీ ఎర్రబారిన కళ్లలో ఆకలి భాషను ఎవరైనా అర్ధం చేసుకోవాలి! అంత గొప్ప మనసు ఎంతమందికి ఉంటుంది?! 

తారా పట్కార్ అలాంటి గొప్ప మనసున్నవాడే. ఉన్నత భావాలు కలిగిన జర్నలిస్టు. చేపట్టిన వృత్తి ఎందుకు సంతోషాన్నివ్వలేదు అని అడిగితే.. ఆయన చెప్పేదొక్కటే.. పేదోడి ఆకలి. అంతలా కదిలించింది ఆ అంశం. 2014లో ఉద్యోగం వదిలేశాడు. పేదవారి ఆకలి తీర్చడమే లక్ష్యంగా రోటీ బ్యాంక్ ఏర్పాటు చేశాడు. ఎక్కడ గరీబోడు ఆకలితో అలమటిస్తాడో అక్కడ నాలుగు రొట్టెలతో ప్రత్యక్షమవుతాడు. 

బుందేల్ ఖండ్ మహోబా అనే జిల్లాలో తీవ్ర దుర్భిక్షంతో అలమటిస్తున్న మారుమూల గ్రామాన్ని ఎంచుకున్నాడు. ఎవరైతే పస్తులతో కాలం వెళ్లదీస్తున్నారో వారి ఆకలి తీర్చడమే పరమావధిగా పెట్టుకున్నాడు. రొట్టెల చేతబట్టుకుని ఇల్లిల్లూ తిరుగుతాడు. కొందరు వాలంటీర్లు అతనికి అండగా నిలిచారు. వారి సాయంతో రోటీ, కూరగాయలు సేకరిస్తాడు. దాదాపు గ్రామంలోని సుమారు వెయ్యి మంది కడుపు నింపుతాడు.

తను బతికున్నంత వరకు బుందేలీ సమాజ్ లో పేదోడు ఖాళీ కడుపుతో పడుకోవద్దు. ఇదే తారా పట్కార్ నమ్మిన సిద్ధాంతం. తన ఆశయాన్ని గౌరవించి మొదట్లో పదుల సంఖ్యలో వాలంటీర్లు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. ఇప్పుడు వారి సంఖ్య వెయ్యికి పెరిగింది. ప్రస్తుతం రోటీ బ్యాంక్ కార్యకలాపాలను చిఖారా, ముల్లాఖోడా అనే గ్రామాలకు కూడా విస్తరించారు.

image


పూర్తిగా చారిటీ పైనే రోటీ బ్యాంక్ నడుస్తోంది. కొన్ని కుటుంబాలు కూడా తమవంతు సాయంగా ఫుడ్ కాంట్రిబ్యూట్ చేయడానికి ముందుకొచ్చాయి. ఎవరికీ పైసా ఇవ్వడు. అలా అని ఎవరి దగ్గరనుంచీ ఆశించడు. మొదట్లో రోటీ, సబ్జీ ఇచ్చేవాడు. క్రమంగా వారి ఆకలితో పాటు ఆరోగ్య బాధ్యతలనూ భుజాన వేసుకున్నాడు. డాక్టర్లను బతిమాలి, వారికి వీలున్నప్పుడల్లా గ్రామాల్లో మెడికల్ క్యాంప్ పెట్టిస్తాడు. రోగాలు నొప్పులతో అల్లాడుతున్న వారికి సూదిమందులు ఇప్పిస్తాడు. వైద్యులు కూడా ఇతని మంచి పనికి కాదు అని చెప్పడం లేదు. మేము సైతం అంటూ తోడవుతున్నారు.

రెండు మూడు గ్రామాలే కాకుండా రోటీ బ్యాంక్ సేవలను తన స్నేహితుల ద్వారా బుందేల్ ఖండ్ లోని 13 జిల్లాలకు విస్తరించాలని చూస్తున్నాడు. దాంతోపాటు ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా బ్యాంక్ ఏర్పాటు చేయాలనేది తారా పట్కార్ ప్లాన్.

ప్రస్తుతం బుందేల్ ఖండ్ ప్రాంత ప్రజలు దుర్భరమైన పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఆకలి నుంచి వారిని విముక్తుల్ని చేయాలనేది తారా పట్కార్ లక్ష్యం. దీంతోపాటు మరొక డిమాండ్ కూడా గట్టిగానే వినిపిస్తున్నాడు. మహోబా జిల్లాలో రెండు లక్షలకు పైచిలుకు క్వారీలో పనిచేసే కూలీలున్నారు. వాళ్లంతా సిలికాసిస్ అనే భయంకరమైన ఊపిరితిత్తుల వ్యాధి బారిన పడ్డారు. క్వారీలో చెలరేగే దుమ్ము పీల్చీపీల్చీ వారి లంగ్స్ పూర్తిగా పాడయ్యాయి. క్వారీలన్నీ మరుభూములను తలపిస్తున్నాయి. ఒక్క మహోబా జిల్లా అనే కాదు.. చుట్టుపక్కల జిల్లాలన్నీ అంతే. యాజమాన్యాలు ఎలాగూ కూలీలను పట్టించుకోవు. జానెడు కడుపు నింపుకోవడం కోసం వారు తమ ప్రాణాలనే ఫణంగా పెడుతున్నారు. ఇదంతా చూసి తారా పట్కార్ గుండె తరుక్కుపోయింది. వాళ్లకు మెరుగైన వైద్యం అందించాలని ఎయిమ్స్ ఆసుపత్రిని డిమాండ్ చేస్తున్నాడు. ప్రభుత్వం స్పందించకుంటే ఆమరణ నిరాహార దీక్షకు దిగాలని నిర్ణయించుకున్నాడు.  

ఎక్కడైనా మనిషికి ఆకలి ఒక్కటే ప్రధాన శత్రువు. ఆ శత్రువుతో పోరాడి గెలిచిన తారా పట్కార్.. ప్రభుత్వంతో గెలవలేడా..? గెలుస్తాడు.. గెలిచితీరుతాడు. పేదవారి పాలిట పెన్నిధి అవుతాడు. జయహో తారా పట్కార్.. జయహో...