చిరు వ్యాపారులకు బడ్జెట్ వరమా..కాదా..?

Tuesday March 01, 2016,

3 min Read


ఈ ఏడాది వచ్చే ఏడాది ప్రథమార్థంలో … పెద్ద రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలున్నాయి. ఆ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తేనే… రాజ్యసభలో బలం పెరుగుతుంది. కీలక బిల్లులు ఆమోదం పొందాలంటే తప్పనిసరిగా వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో గెలవాలి. త్వరలో తమిళనాడు, బెంగాల్, యూపీలో ఎన్నికలు జరగనున్నాయి. అందుకే బడ్జెట్ లో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై దృష్టిపెట్టారు. గ్రామీణాభివృద్ధికి, జలవనరులకు నిధుల వరద పారించారు. చిరు వ్యాపారులు, స్టార్టప్ కంపెనీలను బడ్జెట్ నిరుత్సాహ పరిచిందా అంటే… లేదని చెప్పాలి. ఎందుకంటే ఈ రంగాల అభివృద్ధికి దోహదంచేసే పలు ప్రత్యక్ష పన్నుల పద్ధతులను ప్రకటించారు. పన్నుల భారం తగ్గేలా సంస్కరణలు తీసుకొస్తామన్నారు. ప్రైవేట్ రంగం భాగస్వామ్యం పెంచే పీపీపీ పద్ధతికి పెద్దపీట వేయనున్నారు.

ఈ కామర్స్ పన్ను చెల్లింపపులు, మార్కెట్ ప్లేస్ లపై కేంద్రం స్పష్టతనివ్వకపోవడం కొంత నిరాశపరిచే అంశమేనంటున్నారు గణేశ్ ప్రసాద్. అంటే ఈ కామర్స్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలతో ఘర్షణ అలాగే కొనసాగుతుందన్నమాట. ఆన్ లైన్ కంపెనీలపై పరోక్ష పన్నులు పడుతునే ఉంటాయి. దీనికి ఈ బడ్జెట్ ముగింపు నివ్వలేకపోయింది.
 “ ఓవరాల్ గా చూస్తే ఇది మంచి బడ్జెట్టే. ఈ బడ్జెట్ లో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలపై కొంత దృష్టిపెట్టారు. అయితే వ్యవసాయం, సామాజిక అభివృద్ధికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు”-ఖైతాన్ అండ్ కంపెనీ సీఈఓ గణేశ్ ప్రసాద్. 

ప్రత్యక్ష పన్నుల విధానం చిరు వ్యాపారాలకు ఎలా లాభం..? 

• ఈ ఆర్థిక సంవత్సరం నుంచి రిజిస్ట్రేషన్ చేయించుకునే స్టార్టప్ లు మూడేళ్లపాటు ఎలాంటి పన్నులు కట్టాల్సిన పనిలేదు. అయితే పదేళ్లపాటు ట్యాక్స్ హాలీడే ఇస్తేనే స్టార్టప్ లకు మేలు జరుగుతుందంటున్నారు విశ్లేషకులు.

• స్టార్టప్ లకు పదివేల కోట్లతో ప్రత్యేక నిధి

• స్మాల్ అండ్ మీడియం బిజినెస్ సంస్థలకు (SMB) పెద్ద ఊరటే దక్కింది. కోటి వరకు వార్షిక అమ్మకాలున్నవారు ఎలాంటి అకౌంట్ బుక్స్ నిర్వహించక్కర్లేదు. ఇప్పుడు ఈ పరిమితిని రెండు కోట్ల రూపాయలకు పెంచారు.

• రూ. 50 లక్షలలోపు ఆదాయం ఉన్నవారికి కూడా ఇది వర్తిస్తుంది. రెండు కోట్లలోపు ఆదాయమున్న కంపెనీలు 8 శాతం పన్ను చెల్లిస్తే చాలు.

• ఈ నిర్ణయం వల్ల ప్రతి స్టార్టప్ లబ్ధి పొందుతుందని… చిన్న వ్యాపారులు సొంతకాళ్లపై నిలబడేలా చేస్తోందంటున్నారు క్లియర్ ట్యాక్స్ చీఫ్ ఎడిటర్ ప్రీతి ఖురానా.

• కొత్తగా స్థాపించబోయే తయారీ కంపెనీలు 25 శాతం ట్యాక్స్, సర్ చార్జ్ చెల్లిస్తే చాలు.అయితే అలాంటి కంపెనీలు మేకిన్ ఇండియా క్యాంపైన్ లో భాగస్వామ్యం కావాలనే నిబంధన పెట్టారు.

• ఐదు కోట్ల రూపాయలకన్నా తక్కువ ఆదాయమున్న కంపెనీకి ఒకశాతం పన్ను తగ్గింపు. కార్పొరేట్ ట్యాక్స్ 29 శాతంపై ఈ మినహాయింపు లభించనుంది. 2 కోట్ల నుంచి 5 కోట్ల మధ్యనున్న వ్యాపారానికి ఇది వర్తిస్తుంది.

• విదేశీ వెబ్ సైట్లలో భారతీయ కంపెనీలు యాడ్స్ ఇస్తే ఆరు శాతం పన్ను చెల్లించాలల్సి ఉంటుంది. అయితే ఇది బిజినెస్ టూ బిజినెస్ లావాదేవీలకు మాత్రమే వర్తిస్తుంది. వి సెర్వ్, విజ్యూరి, నియర్ లాంటి సంస్థలు ఈ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈరంగంపై మరింత స్పష్టతనివ్వాల్సిన అవసరం ఉంది.

“ స్టార్టప్ ఇండియా యాక్షన్ ప్లాన్ లో భాగంగా మూడేళ్లపాటు పన్ను మినహాయింపులివ్వడం చాలా సంతోషం. పారిశ్రామిక రంగం దీన్ని ప్రోత్సహిస్తోంది. అయితే ఇప్పటికే ఉన్న స్టార్టప్ లకు అలాంటి మినహాయింపులు లేవు. స్టార్టర్ లకు ఆదిలోనే కష్టాలుంటాయి. నిలదొక్కుకుంటే ఆ సమస్యలుండవు. భవిష్యత్ లో వచ్చే లాభాలపైకూడా పన్ను మినహాయింపులుంటే బాగుంటుంది”- రామస్వామి, మెర్జర్ అండ్ ఎక్విజిషన్ పార్ట్ నర్ 

చిన్న సంస్థలకు స్పష్టమైన ట్యాక్స్ బెనిఫిట్స్ ఇచ్చిన తొలి బడ్జెట్ ఇది. వచ్చే బడ్జెట్ నాటికి జీఎస్టీ బిల్లు ఆమోదం పొంది, ఈ కామర్స్ రంగాన్ని స్పష్టంగా నిర్వచిస్తే మంచిదంటున్నారు విశ్లేషకులు. ఈ ఆర్ధిక సంవత్సరంలో చిన్న కంపెనీలకు లక్షా 80వేల కోట్లు రుణాలివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముద్రా బ్యాంక్ ద్వారా ఈ రుణాలు అందివ్వనున్నారు. అసంఘటిత రంగానికి చెందిన చిరు వ్యాపారులకు నిజంగా ఈ బడ్జెట్ వరం. చిన్న, మధ్య తరహా కంపెనీలే దేశ పారిశ్రామిక రంగానికి వెన్నెముక. ఈ వెన్నెముక బలంగా ఉంటేనే… బాడీ స్టిఫ్ గా ఉంటుంది.