ఆర్థికంగా వృద్ధి చెందాలంటే పనికొచ్చే పాలసీలు కావాలి!

ఆర్థికంగా వృద్ధి చెందాలంటే పనికొచ్చే పాలసీలు కావాలి!

Sunday January 24, 2016,

4 min Read

మార్కెట్ శక్తులు, ప్రభుత్వ అజమాయిషీ లేనటువంటి సరికొత్త ఆర్థిక వ్యవస్థ త్వరలోనే ఆవిర్భవిస్తుందని ప్రముఖ ఆర్థికవేత్త అనటోల్ కాలెట్ స్కీ 2010లో జోస్యం చెప్పారు. 2008లో ఏర్పడిన మాంద్యంలో చిక్కుకుని ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటున్న సమయంలో ఆయన ఈ మాటలు అన్నారు. ఆర్థిక అభివృద్ధి మూడు దశల్ని దాటుకుని నాల్గో దశలోకి అడుగుపెట్టబోతున్నదన్న విషయాన్ని కూడా ఆయన అప్పుడే చెప్పారు. కాలెట్ స్కీ వర్గీకరణ ప్రకారం 19వ శతాబ్దం ప్రారంభం నుంచి 1930 మధ్య కాలాన్ని ఆయన స్వేచ్ఛా మార్కెట్ ఆర్థికశకంగా అభివర్ణించారు. అప్పట్లో మార్కెట్ కార్యకలాపాల్లో ప్రభుత్వ జోక్యం ఉండేది కాదు. ఆ తర్వాత వచ్చిన మహా మాంద్యం, సోవియట్ యూనియన్ అనుసరించిన కమ్యూనిస్ట్ విధానం పాశ్చాత్య దేశాల ఆలోచనా విధానంలో మార్పు తెచ్చింది. మార్కెట్ ను గాలికొదిలేయడం సరికాదని ఈ విషయంలో ప్రభుత్వాలు కూడా కొంత బాధ్యత తీసుకోవాలని గ్రహించాయి. ఇది దేశ సంక్షేమానికి అవసరమని గుర్తించాయి.

image


రూజ్ వెల్డ్ అప్రోచ్ ఈ ఆలోచనల్లోంచి పుట్టుకొచ్చింది . ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కునేందుకు రూపొందించిన సరికొత్త సిద్ధాంతమిది. ఈ విధానంలో ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించింది. కానీ 70వ దశకంలో వచ్చిన చమురు సంక్షోభం, మేథావులు, ప్రజా ప్రతినిధులను మునుపటి మార్కెట్ లాజిక్ విధానం వైపు మొగ్గుచూపేలా చేసింది. రోనాల్డ్ రీగాన్, మార్గరెట్ థాచర్ మార్గదర్శకత్వంలో అమల్లోకి వచ్చిన ఈ కొత్త ఆర్థిక విధానంలో ప్రభుత్వం మార్కెట్ పై పెత్తనాన్ని కోల్పోయింది. సంప్రదాయవాదం కొత్త రూపాన్ని సంతరించుకుంది. ఆర్థికాభివృద్ధి రెండో దశలో ప్రభుత్వాలు మార్కెట్ల పతనానికి కారణమయ్యాయి. నియంత్రణ అనేది లేకుండా మార్కెట్ ను దాని ఖర్మకు దాన్ని వదిలేశారు. ఇదే సమయంలో రిస్క్ లేకుండా సమగ్ర ఆర్థికాభివృద్ధి జరగాలి అంటే ప్రభుత్వం, ఆర్థిక వ్యవస్థ మధ్యతేడాను గుర్తించాలన్న వాదన బలంగా వినిపించింది. కానీ 2008లో వచ్చిన ఆర్థిక మాంద్యం మేథావులు, రాజకీయ నాయకులు మళ్లీ ఆలోచనలో పడేసింది.

ప్రస్తుతం నెలకొన్న సంక్షోభం చాలా తీవ్రమైంది. కొత్త ఆలోచనలు కార్యరూపం దాల్చకపోవడంతో సమస్య మరింత జఠిలంగా మారింది. భారత్ కు ఇది మరింత సమస్యాత్మకంగా మారింది. ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిలో పట్టే విషయంలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందన్న ప్రపంచ దేశాల నమ్మకమే ఇందుకు కారణం. అయితే ప్రభుత్వం అనుసరిస్తున్న ఘర్షణాత్మక వైఖరి ఆర్థికవృద్ధికి ఆటంకంగా మారడం ఆందోళన కలిగించే అంశం. భారీ మెజార్టీతో అధికారం చేపట్టిన ప్రధాని నరేంద్రమోడీ వృద్ధి రేటును పరుగులు పెట్టిస్తారని.. మన్మోహన్ హయాంలో పతనమైన ఆర్థిక వ్యవస్థను మళ్లీ పట్టాలెక్కిస్తారని అంతా ఆశించారు. కానీ దురదృష్టం ఏంటంటే జనం ఊహించినదేమీ జరగలేదు.

దేశ ఆర్థిక పరిస్థితికి కొలమానంగా భావించే సెన్సెక్స్ భారీగా పతనమవుతోంది. ప్రధానిగా మోడీ ప్రమాణం చేసిన రోజున 27వేల మార్క్ వద్ద ఉన్న సెన్సెక్స్ ప్రస్తుతం 24 వేలకు పడిపోయింది. రూపాయి విలువ రోజురోజుకూ దిగజారుతోంది. డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ 70 దరిదాపుల్లోకి చేరింది. ది హిందూ పత్రిక కథనం ప్రకారం నవంబర్ నెలలో 8 కీలక రంగాల పరిస్థితి అధ్వానంగా మారింది. ఉత్పత్తి 1.3శాతం వరకు తగ్గింది. ఇలాంటి గడ్డుపరిస్థితి ఎదుర్కోవడం దశాబ్దంలో ఇదే మొదటిసారి. ఏడాది పాటు స్థిరంగా కొనసాగిన ఉత్పాదక రంగ వృద్ధి నవంబర్ లో 4.4శాతానికి పడిపోయింది. గతేడాది అక్టోబర్ లో 9.8శాతానికి చేరుకున్న పారిశ్రామిక ఉత్పత్తి నవంబర్ లో 3.2శాతానికి పరిమితం కావడం ఆందోళన కలిగిస్తోంది. 2011 తర్వాత ఇలాంటి అధ్వాన స్థితి రావడం ఇదే తొలిసారన్నది ది హిందూ అభిప్రాయం. ఎకనామిక్ టైమ్స్ కథనం ప్రకారం ఈ ఏడాది వృద్ధి రేటు 7 నుంచి 7.5 శాతంగా నమోదయ్యే అవకాశమున్నా కార్పొరేట్ రంగం మాత్రం భారీ అప్పుల్లో కూరుకుపోయింది. రెండేళ్లుగా సరైన వర్షాలు కురవకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ రంగం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది.

అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడాయిల్ ధరలు భారీగా పతనమవడం భారత్ కు కలిసొచ్చింది. మోడీ అధికారం చేపట్టే నాటికి బ్యారెల్ క్రూడాయిల్ ధర 133 డాలర్లు కాగా.. ప్రస్తుతం 30 డాలర్లకు తగ్గింది. ఇది ద్రవ్యోల్బణాన్ని నియంత్రణలో ఉంచడంతో పాటు విదేశీ మారక నిల్వలు తగ్గిపోకుండా కాపాడింది. గత 25 ఏళ్లలో ఎన్నడూ లేనంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న చైనా కారణంగా ప్రపంచ మార్కెట్లు ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. చైనా సంక్షోభం జనవరి నెలలో గత కొన్ని దశాబ్దాల్లో ఎన్నడూ ఊహించనంత భయాందోళనలు కలిగించింది . అమెరికన్ బ్యాంక్ మెరీ లించ్ అంచనా ప్రకారం జనవరి నెల తొలి మూడు వారాల్లో ప్రపంచ మార్కెట్లలో సుమారు 7.8 ట్రిలియన్ డాలర్ల సంపద ఆవిరైంది. ప్రస్తుత పరిస్థితులు గమనిస్తే ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది మాంద్యంలోకి వెళ్లే అవకాశం 15 నుంచి 20శాతానికి పెరిగిందన్నది అమెరికా ఆర్థికవేత్తల అభిప్రాయం. ఇది ప్రపంచ మార్కెట్లకు ప్రమాద ఘంటికలాంటిది.

పరిస్థితి ఇంత దారుణంగా మారినా భారత ప్రభుత్వం మాత్రం సంక్షోభం నుంచి బయటపడే ప్రయత్నాలు ఏ మాత్రం చేయడం లేదు. 1985 తర్వాత తొలిసారి సంపూర్ణ మెజార్టీ కలిగిన ప్రభుత్వం ఏర్పడినా.. మోడీ సర్కారు మాత్రం సంస్కరణలను పట్టాలెక్కించడంలో ఘోరంగా విఫలమైంది. లోక్ సభలో భారీ మెజార్టీ ఉన్నందున అంతా సాఫీగా సాగిపోతుందని ఊహించుకుంది. కానీ వాస్తవ పరిస్థితులు అలా లేవు. ప్రభుత్వం సమర్థవంతంగా, సామరస్యపూర్వకంగా వ్యవహరించి ఉంటే జీఎస్ టీ బిల్లుపై పార్లమెంటులో నెలకొన్న ప్రతిష్ఠంభనకు ఎప్పుడో తెరపడేది. జీఎస్ టీ బిల్లు చట్టరూపం దాల్చేది. ఢిల్లీ, బీహార్ ఎన్నికల్లో ఘోర పరాభవం ప్రధానిని బలహీనున్ని చేసింది. దీన్ని ఆసరాగా చేసుకున్న ప్రతిపక్షాలు మోడీ ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెట్టేందుకు సిద్ధమయ్యాయి.

మార్కెట్లు తమంతట తాము కోలుకోలేని పరిస్థితి ఉంటే అలాంటి సమయంలో ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలి. పారిశ్రామికవేత్తలు సాహసోపేత నిర్ణయాలు తీసుకునే వాతావరణం కల్పించారు. ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు మద్దతుగా నిలిచి వారి నమ్మకం కలిగించాలి. అప్పుడే పరిస్థితి చక్కబడుతుంది. కానీ ప్రభుత్వం ఈ వాస్తవాన్ని గ్రహించే స్థితిలో లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం, మార్కెట్ కలిసి పనిచేసే కొత్త వ్యవస్థ అవసరం. ప్రభుత్వం, ఆర్థిక వ్యవస్థ వేరు వేరు అనుకునే రోజులు ఎప్పుడో పోయాయి. పాశ్చాత్య దేశాల్లా భారత్ అభివృద్ధి చెందిన దేశం కాదు అభివృద్ధి చెందుతున్న దేశం అన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని నడుచుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో లక్ష్యానికి చేరుకోవడం కష్టం అనిపిస్తుంది. అయినా వృద్ధి రేటును పరుగులు పెట్టించేందుకు ప్రభుత్వం అన్ని వర్గాలను కలుపుకుని ముందుకెళ్తూ మరింత చిత్తశుద్ధితో పనిచేయాలి. ఇదే సమయంలో ఆర్థిక వ్యవస్థ గాడిలో పెట్టాల్సిన అవసరాన్ని ప్రతిపక్షాలు గుర్తించేలా చేయాలి. కానీ ఈ విషయంలో మోడీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది.

భారత ప్రజా ప్రతినిధులకు కాలెట్‌ స్కీ రాసిన క్యాపిటలిజం 4.0లోని ఒక కొటేషన్ ను గుర్తుచేయాలనుకుంటున్నాను. అవినీతిపరులైన రాజకీయ నాయకులు, బ్యాంకర్ల అత్యాశ, పారిశ్రామికవేత్తల అసమర్థత, ఓటర్ల తెలివి తక్కువతనంతో పాటు చట్టాల రూపకల్పనలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు అనుసరిస్తున్న ఊహకందని, సంక్లిష్ట విధానాలు ప్రభుత్వాలు, మార్కెట్లు తప్పులు చేసేందుకు కారణమవుతున్నాయి. ప్రధాని మోడీ ఇప్పటికైనా ఈ వాస్తవ పరిస్థితులను గుర్తించాలి. ఆధునిక ప్రపంచంతో పాత విధానాలు పనికిరావన్న విషయాన్ని గుర్తెరిగి నడుచుకోవాలి.

రచయిత: అశుతోష్, మాజీ జర్నలిస్టు, ఆమ్ ఆద్మీ పార్టీ నేత