పూర్వవైభవాన్ని సంతరించుకున్న డెక్కన్ పార్క్

0

ఎటు చూసినా పచ్చిక బయళ్లు. అంతఃపుర కొలనుల్ని మరపించే స్విమ్మింగ్ పూల్స్. రాజప్రాసాదాన్ని తలదన్నే కాన్ఫరెన్స్ హాల్. కులీకుతుబ్ షాహీ టూంబ్స్ లోని డెక్కన్ పార్క్ వైభవమిది. అందంగా ఆధునీకరించిన ఈ పార్కును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.

కులీకుతుబ్ షాహీ టూంబ్స్ లో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన డెక్కన్ పార్కు పూర్వవైభవాన్ని సంతరించుకుంది. మొత్తం 31 ఎకరాల్లో విస్తరించిన ఈ పార్కులో 21 ఎకరాల మేర పచ్చదనం పరుచుకుని ఉంది. దాని మెయింటెనెన్స్ చూసుకోవడానికి 76 మంది వర్కర్లు ఉన్నారు. మ్యూజికల్ ఫౌంటెయిన్, స్విమ్మింగ్ పూల్, చౌకీ డిన్నర్ షెడ్, కాన్ఫరెన్స్ హాల్, బోటింగ్ పాండ్, కిడ్డీపూల్, లేజీపూల్, టాయ్ ట్రెయిన్, వ్యూ పాయింట్ ఏరియా, స్టేజ్ ఈవెంట్ తోపాటు క్యాంటీన్ బిల్డింగ్ కూడా ఉంది.

కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ 1982లో ప్రభుత్వం నుంచి భూమి తీసుకుని డెక్కన్ పార్కును 2 కోట్ల 70 లక్షలతో అభివృద్ధి చేసింది. 2002 నుంచి 2006 వరకు పార్కులో వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు. అయితే కోర్టు కేసుల కారణంగా పార్క్ ప్రారంభానికి నోచుకోలేదు. 2011లో కేసులన్నీ పరిష్కారమైనప్పటికీ పేరు మార్పు కారణంగా మరింత ఆలస్యమైంది. సినిమా షూటింగులు, సామాజిక కార్యక్రమాల నిర్వహణ ద్వారా పార్కుకు ఏడాదికి 10 నుంచి 12 లక్షల ఆదాయం వస్తోంది.

టూంబ్స్ తోపాటు డెక్కన్ పార్కును కూడా పరిరక్షించి, వారసత్వ సంపదగా అభివృద్ధి చేయడానికి ఆగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్, ఆగాఖాన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ముందుకొచ్చాయి. ఈమేరకు 2013లో ఒక ఎంఓయూ కుదిరింది. డెక్కన్ పార్కులో ల్యాండ్ స్కేపింగ్, అర్బన్ ఎన్విరాన్మెంటల్ రిహాబిలిటేషన్ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి.

పార్కులో వాకింగ్ ట్రాక్ కూడా ఉంది. ఎర్లీ బర్డ్ కాన్సెప్టులో వాకర్లకు నెలవారీ పాసులు ఇవ్వాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. ఆగస్టు నుంచి మినిమం రేటు పెడతామంటున్నారు. హైదరాబాదులో ఉన్న మంచి పార్కుల్లో ఒకటైన డెక్కన్ పార్కుని వాకర్లు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు. ఉదయం ఆరు నుంచి సాయంత్ర ఏడువరకు పార్క్ తెరుస్తారు.

Related Stories

Stories by team ys telugu