చిల్లరో రామచంద్రా..!!

ఏటీఎంలు కుయ్యో మొర్రో..!!

0

శని, ఆదివారాలు బ్యాంకులు పనిచేసినా చిన్న నోట్లకు తిప్పలు తప్పలేదు. నాలుగు రోజుల నుంచి జనజీవనం స్తంభించిపోయింది. ఇంటిల్లిపాదీ బ్యాంకులు, ఏటీఎంల దగ్గరే ఉన్నా రద్దీకి తగ్గ డబ్బు లేకపోవడంతో ఉసూరుమంటూ వెనుదిరిగారు. చాలాచోట్ల ఏటీఎంలు మొరాయించాయి. కొన్ని ఎప్పుడు చూసినా నో క్యాష్ బోర్డు వేలాడుతోంది. లేదంటే ఔటాఫ్ సర్వీస్ అంటోంది. క్యాష్ నింపిన కాసేపటికే మెషీన్ ఖాళీ అవుతోంది.

పింక్ నోటు చూపించగానే షాపువాడు గుడ్లు తేలేస్తున్నాడు. ఆటోవాలా ముందే చిల్లరుందా అని అడుగుతున్నాడు. డబ్బుల్లేక కూరగాయల బండి ఖాళీగా కనిపిస్తోంది. సినిమా టాకీసులు వెలవెల బోతున్నాయి. షాపింగ్ మాల్స్ లో సందడి తగ్గింది. బంకుల్లో 500 రౌండ్ ఫిగర్ అయితేనే పెట్రోల్ కొడుతున్నాడు. నిత్యావసరాలు నిండుకున్నాయి. కిరాణా స్టోర్ లో స్టాక్ లేదు. ఉప్పు కేజీ 250 అంటున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో పాతనోట్లకు వైద్యం చేయమని తెగేసి చెప్తున్నారు. గ్రామాల్లో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. చిల్లర కోసం వీధి పోరాటాలు జరుగుతున్నాయి. సందట్లో సడేమియాలా కొన్ని చోట్ల ఐదువందల చిల్లరకు వంద కమిషన్ నడుస్తోంది. వెయ్యికి 800 ఇస్తామంటూ ఏజెంట్లు బయలుదేరారు.

ఈ తిప్పలు మరో మూడు వారాలు తప్పేట్టు లేదు. శని, ఆదివారం బ్యాంకులు పనిచేసినా ఫాయిదా లేదు. ఆదివారం రాత్రి వరకు బ్యాంకుల ముందు జనం క్యూలో ఉన్నారు. దానికి తోడు గురునానక్‌ జయంతి సందర్భంగా సోమవారం దేశ వ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ప్రకటించారు. దీంతో జనం ఏం చేయాలో తెలియక గందరగోళంలో పడ్డారు.

ఇదిలా వుంటే కొత్త 500 నోట్లు అందుబాటులోకి వచ్చి నెత్తిన పాలుపోశాయి. రద్దు చేసిన 500 నోట్ల స్థానంలో కొత్త కరెన్సీ ఇప్పుడిప్పుడే జనం చేతికి వస్తున్నాయి. ఆదివారం కొన్ని ప్రాంతాల్లో బ్యాంకులు రూ.500 నోట్లు జారీ చేశాయి. ఇప్పటి వరకు రూ.2000,100 నోట్లు మాత్రమే బ్యాంకుల ద్వారా వస్తున్నాయి. ఇప్పడు రూ.500 నోట్లు కూడా అందుబాటులోకి రావడంతో ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. కొత్త రూ.500 నోట్లు తక్కువ మొత్తంలో విడుదల చేయడంతో ఇంకా అన్ని ప్రాంతాల్లో చలామణిలోకి రాలేదు.

చిల్లర సమస్యను గుర్తించిన కేంద్రం ఇంకాస్త వెసులుబాటు కల్పించింది. వారానికి రూ.20వేల క్యాష్ విత్ డ్రాయల్ లిమిట్ ని రూ.24 వేలకు పెంచింది. రోజుకు రూ.10వేలు మాత్రమే తీసుకోవాలనే నిబంధన సడలించారు. ఏటీఎంల్లో రోజుకు రూ.2వేలు విత్‌డ్రా పరిమితిని రూ.2,500 కు పెంచారు. బ్యాంకుల్లో నోట్ల మార్పిడి లిమిట్ ని 4వేల నుంచి 4,500కు పెంచారు. నగదు సమస్యలు ఉన్న ప్రాంతాలను గుర్తించాలని సీఎస్‌లను కోరింది. చెక్కులు, డీడీలు, ఆన్‌లైన్‌ చెల్లింపులను నిరాకరించే సంస్థలపై ఫిర్యాదు చేయవచ్చని ఆర్థికశాఖ తెలిపింది. రోగుల కోసం మొబైల్‌ బ్యాంకింగ్‌ వ్యాన్‌లను ఏర్పాటు చేయాలని సూచించింది.

Related Stories

Stories by team ys telugu