బంకమట్టి నుంచి బంగారాన్ని తీస్తున్న మాణికవాసగమ్

మట్టిబొమ్మలకూ మార్కెట్ రంగులద్దిన క్లే స్టేషన్...కూతురి ఆలోచనతో మెరిసిన బిజినెస్ ఐడియా...

బంకమట్టి నుంచి బంగారాన్ని తీస్తున్న మాణికవాసగమ్

Friday October 14, 2016,

4 min Read


ఈ రోజుల్లో ఆలోచన రావడమే ఆలస్యం... ఆవిష్కరణకు పెద్దగా కష్టపడక్కర్లేదు. ఇది నేటి యువతరం దృక్పథం. ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అరచేతుల్లోకి అందొస్తుంటే... అద్భుతాలు సృష్టించడం ఎంతసేపు ? ఆహా... సూపర్... ఎక్సెలెంట్... బిజినెస్ సమ్మిట్స్, కార్పొరేట్ మీటింగ్స్‌లో ఇలాంటి మాటలు అనిపించుకోవడానికి ఎన్ని వేల డాలర్లైనా వెచ్చించడానికి ఎంట్రప్రెన్యూర్లెందరో తహతహలాడుతుంటారు. కానీ గణేష్ మాణికవాసగమ్ పైసా ఖర్చు లేకుండా, ఇంటి దగ్గరే కూర్చుని అందరితో శభాష్ అనిపించుకున్నాడు. ఎలాగో తెలుసుకోవాలనుకుంటున్నారా! మరింకెందుకు ఆలస్యం. చదవండి !

గణేష్ అమెరికాలోని టెక్నాట్స్ అనే కంపెనీలో పనిచేసి 2003లో భారత్ తిరిగి వచ్చారు. దాదాపు మూడేళ్లపాటు ఈఎంసీ అనే ఓ డేటా స్టోరేజ్ కంపెనీలో పనిచేశారు. ఆ సమయంలోనే ఆయనకి ఓ ఆలోచన వచ్చింది. వెంటనే బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో తనతో పాటు చదివిన మరో ఐదుగురు స్నేహితులతో చర్చించారు. అందరూ కలసి ఓ టెక్నాలజీ కంపెనీ ప్రారంభించాలని నిర్ణయించారు. మొదట్లో గణేష్ కి నాన్-టెక్ కంపెనీ ప్రారంభించాలని ఉన్నా... స్నేహితులంతా టెక్ కంపెనీవైపే మొగ్గుచూపారు. “నిజానికి మేమంతా కలసి ఓ అమెరికన్ కంపెనీతో ఇన్వెస్ట్‌మెంట్ కోసం అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంది. అయితే 2006లో ఆర్థిక మాంద్యం కారణంగా అది కార్యరూపం దాల్చలేదు. అగ్రిమెంట్ చేసుకోకపోవడం అప్పట్లో తీవ్ర నిరాశ కలిగించింది. కొన్ని సంఘటనలు మన మంచికే జరుగుతాయని పెద్దలు చెబుతుంటారు. ఇదీ అలాంటిదే అనుకుంటాను నేను”... అంటారు గణేష్. తర్వాత చాలాకాలం పాటు గణేష్ ఏమీ చేయలేదు. ఖాళీగానే గడిపారు.

గణేష్ మాణికవాసగమ్

గణేష్ మాణికవాసగమ్


క్లే స్టేషన్ ఆలోచన ఎలా వచ్చింది?

ఓసారి గణేష్ ముందు తన కుమార్తె కావ్య ఓ ఆలోచన ఉంచింది... “మనం నివసిస్తున్న అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో ఈ సంవత్సరం జరిగే ‘మేళా’లో ఓ స్టాల్ ఏర్పాటుచేద్దాం” అని. అయితే ఆ మేళాలో ఏ వస్తువులతో స్టాల్ ఏర్పాటు చేయాలి? అని మళ్లీ ఓ ప్రశ్న తలెత్తింది. దానికి కూడా గణేష్‌కి వెంటనే సమాధానం దొరికింది. “మట్టితో చేసిన వస్తువులన్నా, మట్టితో వస్తువులు తయారుచేయడమన్నా, పాటరీ ఆర్ట్స్ అన్నా మా అందరికీ చాలా ఇష్టం. అందువల్ల వాటితోనే ఓ స్టాల్ ఏర్పాటుచేయాలనుకున్నాం. అంతేకాదు... వచ్చిన సందర్శకులు తమ సృజనాత్మకతను ప్రదర్శించడానికి కొంత మట్టిని కూడా అందుబాటులో ఉంచాలనుకున్నాం”... అని తన స్టాల్ అనుభవాలు చెప్తారు గణేష్. ఈ ఆలోచనను ఆచరణలో పెట్టారు గణేష్, అతని కుమార్తె కావ్య.

ఆశ్చర్యమేంటంటే... ఎన్నో రకాల స్టాళ్లు, సందర్శకులతో ఆ ప్రదర్శన అద్భుతంగా జరిగింది. అయితే ఎవరినోట విన్నా గణేష్ కుటుంబం ఏర్పాటు చేసిన స్టూడియో... క్లే స్టేషన్ గురించే. వీళ్ల స్టాల్ ముందు ఎప్పుడూ జనం కిటకిటలాడుతూ కనిపించారు. అనూహ్యమైన స్పందన వచ్చింది క్లే స్టేషన్ కి. మేళా ముగిసింది. అయినా ఈ వస్తువులు, బొమ్మలు, స్టూడియో వర్క్స్ కోసం గణేష్‌కి చాలా ఫోన్లు వస్తూనే ఉండేవి. అది గమనించిన ఆయనకి మరో ఆలోచన మదిలో మెదిలింది. మట్టి వస్తువులకు మార్కెట్లో, ప్రజల్లో ఉన్న క్రేజ్‌ని ప్రత్యక్షంగా చూసిన గణేష్‌కి... తన ఖాళీ సమయానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన తరుణం ఆసన్నమైందని అర్థమైంది.

గణేష్ కూతురు కావ్య

గణేష్ కూతురు కావ్య


వెంటనే ఓ ఫ్లాట్ అద్దెకు తీసుకుని, ఇద్దరు ఆర్టిస్టులతో పని మొదలెట్టారు. అలా మొదలైన ఆ సంస్థ... 2008లో “క్లే స్టేషన్ ఆర్ట్స్ స్టూడియో ప్రైవేట్ లిమిటెడ్” గా అధికారికంగా ప్రారంభమైంది. కొద్దికాలంలోనే స్టూడియో వర్క్స్, మట్టితో చేసిన వస్తువులు, బొమ్మలు, సంబంధిత సామగ్రి కొనుగోలు చేసేవారికి వన్ స్టాప్ షాప్ గా మారింది. ఎంతోమందికి ఈ క్రియేటివ్ ఆర్ట్ (పాటరీ వర్క్స్)లో శిక్షణ కూడా ఇచ్చారు. కుదుటపడుతోందనుకుంటున్న తరుణంలో మళ్లీ ఓ చిన్న కుదుపు. ఫ్లాట్ ఖాళీ చేయమని యజమాని నుంచి సందేశం. ఎంతో కష్టపడి ఆకర్షణీయంగా డెకరేట్ చేసుకున్న ఆ స్టూడియోని వదిలి వెళ్లడమంటే ఇబ్బందిగా అనిపించింది. కానీ తప్పలేదు.


క్లే స్టేషన్ ఉత్పత్తులు

క్లే స్టేషన్ ఉత్పత్తులు


ఏ పనైనా, సంస్థైనా విజయం సాధించింది అని చెప్పాలి అంటే... అది ఎంతమంది జీవితాలతో పెనవేసుకుపోయిందో చూడాలి. ప్రారంభమైన సంవత్సరంలోనే క్లే స్టేషన్ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మేమున్నామంటూ చేయందించడానికి వారితో పాటు క్లే స్టేషన్‌లో శిక్షణ పొందిన వారు సిద్ధంగా ఉండేవారు. ప్రస్తుతం ఉన్న క్లే స్టేషన్ కూడా అలా నిర్వహిస్తున్నదే. ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్ గా పనిచేస్తున్న అనుపమ... ఒకప్పుడు క్లే స్టేషన్ స్టూడియో విద్యార్థి. అలాగే... డిగ్రీ పూర్తైన తర్వాత ఖాళీగా ఉండటమెందుకు అని పాటరీ వర్క్ నేర్చుకున్న కరిష్మా రోడ్రిగ్స్... శిక్షణ పూర్తైన తర్వాత ఇక్కడే అసిస్టెంట్ ఇన్‌స్ట్రక్టర్ గా చేరిపోయారు. గణేష్ వాళ్ల అత్త గాంధీమతి కూడా ఇక్కడి విద్యార్థే. ఆమె బేసిక్ కోర్సులకు ట్రైనర్ గా కొనసాగుతున్నారు.

కరిష్మ,గణేష్,అనుపమ,గాంధిమతి

కరిష్మ,గణేష్,అనుపమ,గాంధిమతి


ఎంతోమంది పెట్టుబడులు పెడతామని ముందుకొచ్చినా... మొదటి మూడు సంవత్సరాలు గణేష్ తన సొంత పెట్టుబడితోనే క్లే స్టేషన్ నడిపారు. ఏడాదిన్నర క్రితం బాలకృష్ణన్ అందించిన ఆర్థిక తోడ్పాటుతో తన బిజినెస్ ను మరింత విస్తరించే పనిలో ఉన్నారు గణేష్. సింగపూర్ లో నివసిస్తున్న బాలకృష్ణన్ ప్రస్తుతం క్లే స్టేషన్ బోర్డులో డైరెక్టర్‌గా ఉన్నారు.

ఈ క్లే స్టేషన్ వ్యవహారం మొత్తం చూస్తే భలే గమ్మత్తుగా ఉంటుంది. ఆర్టిస్టుగా ఎలాంటి అనుభవం లేని ఓ వ్యక్తి... పాటరీ వర్క్ కమ్యూనిటీ ద్వారా ఎంతోమందికి అవకాశాలు కల్పించారు. ఒక్క బెంగళూరు నగరంలోనే కాదు దేశవ్యాప్తంగా ఉన్న పాటర్ కమ్యూనిటీలను దీనిలో భాగస్వాములను చేశారు.

క్రమంగా గణేష్ కూడా యూట్యూబ్ వంటి సైట్ల ద్వారా కొన్ని మెళకువలు, టెక్నిక్స్ నేర్చుకున్నారు. ఈ అనుభవం, పరిజ్ఞానం... ఆర్టిస్టులతో, కొనుగోలుదారులతో మాట్లాడేందుకు బాగా ఉపయోగపడేది. ఎక్కువ సమయం మార్కెట్ కండిషన్స్, అవకాశాలను పరిశోధించడానికే గణేష్ వెచ్చించేవారు. ఓసారి జపాన్ కంపెనీ షింపో సిరామిక్స్‌కి తమ ఉత్పత్తులను ఎగుమతి చేసే అవకాశాన్ని ఇవ్వాలని కోరుతూ ఓ లేఖ రాశారు. దానికి సమాధానం వస్తుందనే ఆశ ఏమాత్రం లేదు. ఏదో ఓ రాయి వేసి చూద్దాం అన్నట్లుగా చేశారు. కానీ గణేష్ ఆశ్చర్యపోయేలా... ఆ సిరామిక్స్ కంపెనీ వాళ్లు మరింత సమాచారం కోరుతూ లేఖ రాశారు. అలా క్లే స్టేషన్... షింపో సిరామిక్స్‌కి డీలర్ గా మారింది.

క్లే స్టేషన్

క్లే స్టేషన్


“నన్నెవరైనా “క్లే స్టేషన్ వ్యవస్థాపకుడు” అంటుంటే అక్కడ నా కూతురు ఉందేమో అని చెక్ చేసుకుంటాను. ఎందుకంటే ఆ పేరు పెట్టింది నేను కాదు, నా కూతురు కాబట్టి. ఐదున్నరేళ్ల క్రితం ఈ కంపెనీ ప్రారంభించాం. ఆ క్రెడిట్ తనకే (నా కూతురుకే) దక్కుతుంది. నా ఫిలాసఫీ ఏంటంటే... పని చేయడం ఆనందంగా ఉండాలి. పనిలో ఆనందాన్ని వెతుక్కోవాలి. ఆఫీసుకి ఎప్పుడెప్పుడు వద్దామా అని ఉద్యోగులు అనుకునేలా అక్కడ వాతావరణం ఉండాలి. ప్రయోగాలు చేయడం అంటే నాకు చాలా ఇష్టం... అది ఓ సంస్థను నడపడంలో కావచ్చు, పాటరీ ప్రొడక్ట్స్ తయారీలో కావచ్చు, జీవితమైనా కావచ్చు”... అనే గణేష్ మరెంతో మందికి ఉపాధి కల్పించాలని, ఎన్నో కొత్త ఉత్పత్తులు తయారు చేయాలని ఆశిద్దాం.


వెబ్ సైట్ - క్లే స్టేషన్