బడ్డింగ్ ఆంట్రప్రెన్యూర్లకు స్ఫూర్తినిచ్చే ఐదు సినిమాలు

వ్యాపారానికి మార్గదర్శకంగా నిలిచే చిత్రాలు

బడ్డింగ్ ఆంట్రప్రెన్యూర్లకు స్ఫూర్తినిచ్చే ఐదు సినిమాలు

Wednesday January 11, 2017,

3 min Read

సినిమా అంటే కేవలం వినోదం కోసమో, ఎమోషన్ కోసమో కాదు. సినిమా అంటే స్ఫూర్తి రగిలించేది. దిశానిర్దేశం చేసేది. చిన్న సందేశంతో గాడితప్పిన జీవితాన్ని సరిదిద్దేది. సినిమాలన్నీ నిజజీవితాలు కాదు అనుకోవచ్చు. కానీ నిజజీవితాలెన్నో సినిమాలుగా తెరకెక్కాయి. పదిమందికీ మార్గదర్శకంగా నిలిచాయి.

ఎన్నో ప్రతికూల పరిస్థితులను తట్టుకుని, అనుకున్నది సాధించాలన్న కసితో, మార్కెట్ యుద్ధరంగంలోకి దిగిన ఔత్సాహిక ఆంట్రప్రెన్యూర్లను మోటివేట్ చేసి, పాజిటివ్ ఎనర్జీని నింపే ఓ ఐదు సినిమాల గురించి మనమిప్పుడు మాట్లాడుకుందాం..

ద షాషాంక్ రిడింప్షన్

నిరాశా కమ్మేసి, శూన్యం ఆవహించి, దారీతెన్నూ తెలియక విపత్కర పరిస్థితుల్లో ఉన్నవారెవరైనా సరే, షాషాంక్ రిడింప్షన్ సినిమా చూస్తే చాలు. ఎండ్ కార్డ్ పడిన తర్వాత గుండెల నిండా గాలి పీల్చి.. నేను రెడీ అని చప్పట్లు కొట్టి సవాళ్లకు సవాల్ విసురుతారు. అంతలా ఇన్ స్పైర్ చేస్తుందా మూవీ. ఆల్ టైం గ్రేటెస్ట్ మూవీల్లో అదొకటి.

image


కథ ఏంటంటే.. ఆండీ అనే బ్యాంక్ ఉద్యోగి చేయని నేరానికి జైలుకుపోతాడు. తన భార్యను ఆమె ప్రియుడిని చంపాడన్న అభియోగంపై జీవితకాలం శిక్ష ఖరారవుతుంది. అయితే అండీ బ్యాంక్ ఉద్యోగి కావడంతో, అతడి ఫైనాన్సియల్ స్కిల్స్ ను వాడుకుంటాడు జైలు వార్డెన్. జైలు అధికారి అక్రమ సంపాదననంతా బ్యాంక్ ఎంప్లాయ్ లెక్కకు దొరక్కుండా చేస్తుంటాడు. అతడిని అడ్డం పెట్టుకుని వార్డెన్ అడ్డగోలుగా సంపాదిస్తుంటాడు. ఈలోగా అండీ నిర్దోషి అని, అందుకుతగ్గ ఆధారాలు తన దగ్గర ఉన్నాయని మరో ఖైదీ వార్డెన్ తో చెప్తాడు. అయితే అండీ ఎక్కడ విడుదలవుతాడో, ఎక్కడ తన సంపాదన ఆగిపోతుందో అన్న భయంతో ఆధారాలున్నాయని చెప్పిన ఖైదీని చంపేస్తాడు. 

బయటపడటానికి అండీ ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమవుతాడు. చివరికి సొరంగం తవ్వుకుని జైలు నుంచి మెక్సికో చేరుతాడు. ఒకరోజు కాదు రెండ్రోజులు కాదు.. పాతికేళ్లపాటు సొరంగాన్ని తవ్వుతాడు. ఎలాగైనా జైలునుంచి బయటపడాలన్న తపన, ఎదురైన సవాళ్లను అధిగమించడం.. ఇవన్నీ చూస్తుంటే అతను ఆత్మవిశ్వాసం అనే పదానికి ప్రతీకగా అనిపిస్తాడు. టార్గెట్ ఛేదించే క్రమంలో ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా తట్టుకోవాలి అనే పాయింట్ ఆంట్రప్రెన్యూర్లకు వర్తిస్తుంది. ఆశావాదాన్ని ఎలా పెంపొందించుకోవాలో ఈ సినిమాలో హీరోని చూసి నేర్చుకోవచ్చు.

రిమెంబర్ ద టైటాన్స్

మంచి రిలేషన్ షిప్, మ్యాన్ మేనేజ్మెంట్- సక్సెస్ ఫుల్ ఆంట్రప్రెన్యూర్లుగా నిలదొక్కుకోడానికి ఈ రెండు మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రెండు అంశాలు టీమ్ లీడ్ చేయడానికి ఎంతో దోహదపడతాయి. ఒక్కసారి రిమెంబర్ ద టైటాన్స్ గుర్తు చేసుకుంటే చాలు.. మిమ్మల్ని మీరు మార్చుకోవచ్చు.

జాతివివక్ష రాజ్యమేలుతున్న ఆ సమయంలో హెర్మన్ బూనే అనే కోచ్ వాషింగ్టన్ లోని అలెగ్జాండ్రియా అనే స్కూల్ కి వస్తాడు. అప్పుడు విద్యార్ధుల మనసులో ఉన్న మాలిన్యాన్ని కడిగి అద్భుతమైన ఫుట్ బాల్ టీంగా తీర్చిదిద్దుతాడు. జాతికోసం పోరాడాలని అతడు ఇచ్చిన ఉపన్యాసాలు పిల్లల్లో ఎంతో స్ఫూర్తి రగిలిస్తాయి. అలా.. ప్రపంచ వ్యాప్తంగా ఎదురులేని ఫుట్ బాల్ జట్టుగా నిలబెడతాడు. అదే సమయంలో ఇతర కోచ్ లు తన మీద చేసే కుట్రలను తిప్పికొడతాడు. టీంని ఎలా నడిపించాలో కోచ్ పాత్ర ద్వారా చెప్పించిన సినిమా ఎంతోమంది క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచింది. ఆంట్రప్రెన్యూర్లకు కూడా ఈ మూవీ ఒక బ్రిలియంట్ ఎగ్జాంపుల్.

టకర్: ద మ్యాన్ అండ్ హిజ్ డ్రీమ్స్

ప్రిస్టన్ టకర్ ఒక అమెరికన్ బిజినెస్ మ్యాన్. ప్రపంచ యుద్ధం తర్వాత తను తయారు చేసిన వార్ వెహికిల్స్ మార్కెట్లోకి ప్రవేశ పెట్టాలని భావిస్తాడు. కానీ కొందరు కుట్రదారులు అతని వ్యాపారానికి అడ్డుతగులుతారు. బడాబడా బాబులంతా కలిసి అతడు తయారు చేసిన వాహనం మార్కెట్లోకి రాకుండా అడ్డుపడతారు. ఫ్రాడ్ ఇన్వెస్టర్ల ద్వారా అతడిని పాతాళానికి తొక్కే ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత కోర్టులో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటాడు.

అంటే బిజినెస్ చేసే క్రమంలో మన నెత్తిమీద ఎన్ని కుట్రపాదాలు ఉంటాయో చూసుకోవాలి. వాటన్నిటినీ తప్పించుకుంటూ వ్యాపారం చేయాలనేది సినిమా లాస్ట్ పాయింట్. ఆంట్రప్రెన్యూర్లు ఇలాంటి కుతంత్రాలను ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండాలి.

ద పర్స్యూట్ ఆఫ్ హాపీనెస్

ఈ సినిమాను క్రిస్ గార్డ్ నర్ అమెరికన్ నిజజీవితం ఆధారంగా తెరకెక్కించారు. కనీసం ఉండటానికి ఇల్లు కూడా లేని వ్యక్తి సేల్స్ మ్యాన్ గా జీవితాన్ని మొదలుపెట్టి.. ఎన్నో అవరోధాలను అధిగమించి ఒక స్టాక్ బ్రోకర్ కంపెనీకి అధిపతిగా ఎలా ఎదిగాడన్నది సినిమా కాన్సెప్ట్. చివర్లో కంటతడి పెట్టించే ఈ చిత్రం.. ఒక చిన్న నమ్మకం అనే పదం చుట్టూ తిరుగుతుంది. కుటుంబ సభ్యులకు తన ఇబ్బందులు ఏమాత్రం తెలియకుండా, అడుగడుగునా దురదృష్టం వెంటాడుతున్నా, ఆత్మవిశ్వాసాన్ని వదలకుండా లక్ష్యం దిశగా సాగే ప్రయాణమే ఈ సినిమా కథ. ఆంట్రప్రెన్యూర్లకు ఈ మూవీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.

రిస్క్ టేకర్స్

సౌతాఫ్రికాలో పుట్టి కెనడియన్-అమెరికన్ బిజినెస్ మ్యాన్ గా ఎదిగిన ఇలోన్ మస్క్ అద్భుతమైన విజనరీ. టెల్సా కారు ఆవిష్కర్త. స్పేస్ ఎక్స్ అనే ఎయిరో స్పేస్ మానుఫాక్చర్ కంపెనీ ఫౌండర్. సోలార్ సిటీ ఛైర్మన్. ఇలా ఒకటేమిటి అతడు చేయని వ్యాపారం లేదు. అతడు ఆవిష్కరించని ప్రాడక్ట్ లేదు. ఏం చేసినా ఒక విప్లవాత్మక ధోరణితో ముందడుగు వేస్తాడు. అందుకే అతడి మీద పదుల సంఖ్యలో డాక్యుమెంటరీలు వచ్చాయి. ఔటాఫ్ ద బాక్స్ ఆలోచించి అతను ఎలా విజయపథంలో నిలిచాడో చెప్పడానికి రిస్క్ టేకర్స అనే వీడియో చాలు. దాన్నుంచి ఆంట్రప్రెన్యూర్లు చూసి నేర్చుకునే విషయాలు ఎన్నో ఉంటాయి.