పూజా ఘయ్- ఖరీదైన పెళ్లిళ్ల స్పెషలిస్ట్

Tuesday March 08, 2016,

3 min Read


ఆమె ఓ పాపులర్ టీవీ యాక్టర్. క్యూంకీ సాస్ భీ కబీ బహూ థీ, విరాసత్ వంటి టాప్ మోస్ట్ సీరియల్స్‌లో తన పాత్రతో మెప్పించారు. కూతురిగా, భార్యగా, ఓ మహారాణిగా ఆమె నటన ఎన్నో ప్రశంసలు అందుకుంది. 39 ఏళ్ల పూజా ఘయ్ ఇప్పుడో ఆంట్రప్రెన్యూర్ అవతారమెత్తారు. తన అనుభవంతో విలాసవంతమైన పెళ్లిళ్లు చేస్తూ.. టాప్ వెడ్డింగ్ ప్లానర్‌గా స్థిరపడ్డారు.

రీల్ లైఫ్ నుంచి రియల్ లైఫ్‌కు వచ్చిన ఆమె తన వ్యాపార బాధ్యతలనే కాదు కుటుంబానికి కూడా అంతే ప్రాధాన్యతనిస్తూ మల్టీటాస్కింగ్ మదర్‌ అనిపించుకుంటున్నారు. ట్రాంక్విల్ వెడ్డింగ్స్ ఫౌండర్/ ఎమ్ డీ పూజాకు 14 ఏళ్ల పిల్లాడున్నాడంటే మనం నమ్మలేం.

ఆంట్రప్రెన్యూర్షిప్ ఆలోచన ఎప్పటి నుంచో నా మైండ్‌లో ఉంది. అయితే నేను టివి పరిశ్రమలో చేరాక ఆ పనిని ప్రేమించడం వల్ల దీనిపై ధ్యాస కాస్త తగ్గింది. అయితే రాను రాను టీవీల్లో నాణ్యమైన కంటెంట్ తగ్గి, సాగతీత ధోరణి మొదలైందో అప్పుడు నాకు కూడా ఆసక్తి తగ్గిపోయింది. అందుకే ఆ పరిశ్రమకు గుడ్ బై చెప్పేశానంటారు పూజ.

undefined

undefined


2000 సంవత్సరంలో మోడలింగ్ కెరీర్‌లోకి అడుగుపెట్టిన పూజ కొంత కాలం వినోద పరిశ్రమలో తన సత్తా చాటి 2006లో ఆంట్రప్రెన్యూర్‌గా మారారు. అయితే మొదట్లో కార్పొరేట్ ఈవెంట్స్ చేసేవారు. అవన్నీ బోర్‌గా అనిపించేవి. దీంతో వెడ్డింగ్స్‌ వైపు ఆమె దృష్టి మళ్లింది. పెద్ద వెడ్డింగ్ క్లైంట్లకు సేవలు అందిస్తే ఆ ఆనందమే వేరు అనే విషయాన్ని ఆమె గ్రహించారు. ఇక తన కెరీర్ అందులోనే ఉంది అనే విషయాన్ని గ్రహించేందుకు పూజకు ఎక్కువ కాలమేమీ పట్టలేదు.

పెళ్లిళ్లే ఎందుకు ?

''పెళ్లిళ్లలో ఎక్కువ క్రియేటివిటీ చూపించవచ్చు. కొత్తగా ఏదైనా చేసేందుకు, మనల్ని మనం ప్రూవ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇన్విటేషన్ కార్డుల నుంచి పెళ్లి బట్టలు, పెళ్లి థీమ్, ఫుడ్, డెకొరేషన్.. ఇలా చాలా వాటిల్లో ఎంతో వైవిధ్యాన్ని చూపేందుకు ఆస్కారం ఉంటుంది. ప్రతీ దానిలోనూ మన మార్కు ఉండేలా చూడొచ్చు'' అంటారు పూజ

కుటుంబ సభ్యులతో ఒకరిగా కలిసిపోయి మాట్లాడడం, వాళ్ల ఇష్టాఇష్టాలు తెలుసుకోవడం, అమ్మాయి - అబ్బాయి ఏం కావాలనుకుంటున్నారో అర్థం చేసుకుంటే.. వాళ్లు జీవితాంతం గుర్తుపెట్టుకునే వేడుకను మరింత అందంగా తీర్చిదిద్దవచ్చు అనేది పూజ ఆలోచన.

'' పెళ్లిలో కొన్ని చిన్న విషయాలే అనిపించినా చాలావాటికి చాలా అధ్యయనం చేయాల్సి ఉంటుంది '' .- పూజ

దేనికదే స్పెషల్ 

ఏ రెండు పెళ్లిళ్లూ ఒకలా ఉండవు అంటారు పూజ. సామీప్యత ఉండకుండా ఉండేందుకే ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటామని చెబుతారు. డెస్టినేషన్ వెడ్డింగ్స్‌ ఆమె ఎక్కువ ఆసక్తి చూపడం, క్లైంట్లు కూడా వాళ్లే ఉండడంతో ఎక్కువ సార్లు టైమంతా ట్రెవెలింగ్, మీటింగ్స్‌కే సరిపోతుంది. బియానీలు, ధూత్‌లు, నేపాల్ బిలియనీర్ వినోద్ చౌదరి వంటి పెద్ద పెద్ద క్లైంట్లంతా ఈమె ఆధ్వర్యంలో పెళ్లిళ్లు జరిపించుకున్నవారే.

పూజా సాధారణంగా ఒక్కో పెళ్లి వేడుకకు 30-40 మందిని టీమ్‌గా ఎంపిక చేసుకుంటారు. ''మేం పూర్తిగా రిహార్సిల్ చేసుకుంటాం. పెళ్లి కూతురు నడక దగ్గరి నుంచి లైట్లు, సౌండ్ వంటి చిన్న చిన్న విషయాలను కూడా ప్రత్యేక శ్రద్ధతో చూసుకుంటాం. ఐదారేళ్ల నుంచి మేం కలిసి పనిచేస్తుండడం వల్ల మా ఉద్యోగులకు కూడా అన్ని విషయాలపై అవగాహన ఉంది. క్లైంట్ ఆనందమే మాకు పరమావధి. లేదు, మాతో కాదు అనే మాట వాళ్ల చెవిన పడకుండా జాగ్రత్త పడ్తాం. ఆఖరి నిమిషంలో హెలికాఫ్టర్ కావాలని అడిగినా... కుదరదనే సమాధానం మా దగ్గరి నుంచి రాలేదు'' అని కాన్ఫిడెంట్‌గా చెబుతారు పూజ.

నేలపై నడవడమే నిలిపింది !

కష్టపడే తత్వమే పూజను ఈ స్థాయికి చేర్చింది. మౌత్ పబ్లిసిటీ వల్లే క్లయింట్లూ పెరిగారు. కుటుంబంతో కలిసి మాట్లాడడం, వాళ్లతో కలిసి భోజనం చేయడం, వాళ్లలో ఒకరిగా మారిపోవడం వల్లే ఇది సాధ్యమైంది అంటారు పూజ. ఓ పాపులర్ టీవీ స్టార్ అనే ఆలోచనే ఎప్పుడూ లేకుండా చూసుకుంటూ, అందరితో కలవడం వల్లే వాళ్లకూ క్లోజ్ అవుతానని చెబుతారు.

ఇదో కొత్త జర్నీ !

యాక్షన్,కెమెరా, డైలాగ్ నుంచి ప్యాకప్ వరకూ అంతా ఎవరో చెప్పినట్టే వినాలి. చివరకు నవ్వడం, ఏడ్వడం కూడా ఒకరి ఆధీనంలో ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం పరిస్థితి వేరు. మనకు మనమే బాస్ కాబట్టి.. పనులన్నీ పక్కాగా ప్లాన్ చేసుకోవచ్చు అంటారు పూజ. ఇక్కడ ట్రావెలింగ్‌లో చాలా టైం పోతున్నా ఆమె మాత్రం దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. జూన్ నుంచి సెప్టెంబర్ వరకూ ఆఫ్ సీజన్ ఉన్న రోజుల్లో ఆమె కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. ఈ విజయంలో వాళ్ల అమ్మ పాత్ర కూడా ఎంతో ఉందనే విషయాన్ని పూజ వినమ్రంగా ఒప్పుకుంటారు.

undefined

undefined


ఐదేళ్ల తర్వాతేంటి ?

అత్యున్నత స్థాయికి చేరిపోవడం తన ఆలోచన కాదంటారు పూజ. జీవితంలో ఒక స్థిరత్వం, ఒక బ్యాలెన్స్ అవసరమని వివరిస్తారు. ఏదైనా కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే సక్సెస్ రేట్ ఎక్కువనే విషయాన్ని బాగా నమ్మే పూజ.. తన క్లయింట్ల ఆనందమే తన విజయానికి గుర్తింపుగా అభివర్ణిస్తారు.

ఐదేళ్లలో ఓ ఇంటర్నేషనల్ బ్రాండ్‌గా అభివృద్ధి చెంది వివిధ నగరాల్లో ఆఫీసులు ఉండడమే లక్ష్యంగా ఆమె నిర్దేశించుకున్నారు. లండన్, దుబాయ్, హాంగ్‌కాంగ్, న్యూజెర్సీ వంటి దేశాల్లో వెడ్డింగ్స్ ఎక్కువ చేయాలని కూడా అనుకుంటున్నారు. పెళ్లి అనే వేడుకను మరింత అందంగా, అద్భుతంగా, ఆనందంగా చేయడమే తన టార్గెట్ అంటూ ముగించారు పూజ.