టైలర్ కుటుంబం నుంచి కలెక్టర్ దాకా.. మధ్యప్రదేశ్ ప్రజల గుండెల్లో కొలువైన కరీంనగర్ ముద్దుబిడ్డ..!  

7


ఐఏఎస్ అంటే ఏంటి..?

అదేదో సినిమాలో చెప్పినట్టు అయ్యా.. ఎస్సేనా..!?

ఐఏఎస్ అంటే రాజకీయనాయకుల ఆదేశాలు మాత్రమే అమలు చేయాలా?

ఐఏఎస్ అంటే టెన్ టు ఫైవ్ సర్కారీ కొలువేనా..?

ఐఏఎస్ అంటే అంతేనా.. ఇంకేం లేదా..?

ఐఏఎస్ గురించి చెప్పాలంటే చాలా ఉంది!

ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అంటే ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధి!

ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అంటే అణగారిన వర్గాలకు ఆశాజ్యోతి!

ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అంటే ప్రజాసేవే పరమావధి!

అలాంటి ఐఏఎస్ లు దేశం మొత్తమ్మీద ఎంతమంది ఉంటారు! లెక్కిస్తే చేతివేళ్లు సరిపోతాయేమో! అలాంటి వారిలో ముందువరుసలో ఉంటారాయన. సాధారణ మధ్యతరగతి టైలర్ కుటుంబంలో పుట్టి, జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుని, గ్వాలియర్ కలెక్టర్ గా అక్కడి ప్రజల ఆదరాభిమానాలు చూరగొని.. స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రత్యేకంగా ప్రశంసించిన ఇండోర్ జిల్లా కలెక్టర్ మరెవరో కాదు.. తెలంగాణ ముద్దుబిడ్డ పరికిపండ్ల నరహరి.   

చదివిన ఇంజినీరింగ్‌ పట్ల నరహరికి ఎందుకనో ప్రేమ లేదు. ప్రజలకు సేవ చేయాలని మనసు పదేపదే లాగింది. ఆ ఆశయానికి ఇంజినీరింగ్ సరైన మార్గం కాదని తేలిపోయింది. అందుకే సివిల్స్ వైపు మొగ్గు చూపాడు. ఇంటి నుంచి నెలనెలా పంపే డబ్బు సరిపోయేది కాదు. ట్యూషన్లు చెప్పేవాడు. అలా వచ్చిన డబ్బుతో మెటీరియల్ కొనుక్కున్నాడు. రేయింబవళ్లు కష్టపడి ఐఏఎస్ కొట్టాడు. ట్రైనింగ్ పీరియడ్‌ లోనే ఎన్నో అవార్డులు గెలుచుకున్నాడు. 2001 బ్యాచ్ కు చెందిన నరహరి ప్రస్తుతం మధ్యప్రదేశ్ ఇండోర్ కలెక్టర్ గా పనిచేస్తున్నాడు. 

సొంతూరు కరీంనగర్ జిల్లా రామగుండం మండలం బసంత్ నగర్. తండ్రి సత్యనారాయణ. తల్లి సరోజన. సామాన్య మధ్యతరగతి టైలర్ కుటుంబం. IMSS స్కూల్లో పదోతరగతి వరకు చదివిని నరహరి.. కృష్ణా జిల్లా నిమ్మకూరులో ఇంటర్ ఎంపీసీ పూర్తి చేశారు. హైదరాబాదులో ఇంజినీరింగ్. 1998లో అడ్వాన్డ్స్ రీసెర్చ్ విభాగంలో సైంటిస్టుగా పని చేస్తూ 1999 లో సివిల్స్ రాశారు. మొదటి ప్రయత్నం ఫలించలేదు. అయినా నిరాశ చెందలేదు. 2001లో సెకండ్ అటెంప్ట్‌. 78వ ర్యాంక్ వచ్చింది. మధ్యప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారిగా ఎంపికయ్యారు. ముస్సోరిలో శిక్షణ పూర్తి చేసుకొని 2002లో చింద్వారా అసిస్టెంట్ కలెక్టరుగా బాధ్యతలు స్వీకరించారు. 2003-04లో గ్వాలియర్ అసిస్టెంట్ కలెక్టరుగా చేశారు. 2004-05లో ఇండోర్ SDOగా పనిచేశారు. 2006లో ఇండోర్ మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. తర్వాత ఐసీడీఎస్ రాష్ట్ర కమిషనర్ గా 2007 వరకు పనిచేశారు. తర్వాత సియోని కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. 2009 నుంచి 2011వరకు సింగ్రాలి కలెక్టర్ గా పని చేశారు. 2011 నుంచి 2015 వరకు గ్వాలియర్ కలెక్టర్‌గా పనిచేసి.. తాజాగా స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఇండోర్ జిల్లాకు కలెక్టర్ గా వెళ్లారు. 

కలెక్టర్ అనగానే – చెమట పట్టకుండా ఏసీ రూంలో కూర్చుని, సర్కారు ఇచ్చిన ఆదేశాలు పాస్ చేయడం- ఆరింటికల్లా బంగళాకు వెళ్లిపోవడం కాదు. క్షేత్రస్థాయిలో పర్యటించాలి. అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించాలి. గ్వాలియర్లో బాధ్యతలు చేపట్టిన తర్వాత నరహరి చేసిందదే. అక్కడి సామాజిక, ఆర్ధిక విషయాలపై 3 నెలలపాటు ఎన్జీవోలతో, ప్రజలతో అనేక చర్చలు జరిపాడు. ముందుగా ఏ అంశాలపై పనిచేయాలనే దానిపై ఓ అవగాహనకు వచ్చాడు. గ్వాలియర్‌లో అన్నికంటే కలవరపెట్టేది భ్రూణహత్యలు. ఆడపిల్ల పుడితే పాపం అన్నట్టు ఉండేది అక్కడి పరిస్థితి. ఇంత దారుణమైన పరిస్థితులపై చాలా అధ్యయనం చేశాడు. ఏం చేస్తే ప్రజల్లో పరివర్తన వస్తుందో మేథోమథనం చేశాడు.

ఆడపిల్ల పుడితే గుండెలపై కుంపటిలా భావిస్తున్న నేటిలోకం.. ఆడపిల్లలపై వివక్ష చూపుతున్న నేటి సమాజం.. ఇవన్నీ చూసి చలించి నరహరి చలించిపోయారు. ఒక ఆడబిడ్డ పెళ్లి చేసేందుకు నిరుపేద తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పడతారో ప్రత్యక్షంగా చూశారు. ప్రభుత్వ పరంగా అమ్మాయిల పెళ్లికి ఎంతోకొంత సాయపడాలని తపన పడ్డారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారి జీవనస్థితిగతులను అధ్యయనం చేసి ఒక పథకం రూపకల్పన చేశారు. దానిపేరే లాడ్లీ లక్ష్మీ యోజన పథకం. ఏడాది పాటు మహిళా సంఘాలతో చర్చించి సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేశారు. నరహరి రూపొందించిన ఈ పథకాన్ని మధ్యప్రదేశ్ ప్రభుత్వం యథాతథంగా ఆమోదించి అమలు చేసింది. ఈ పథకం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ సహా పది రాష్ట్రాల్లోనూ అమలు కావడం విశేషం. ప్రస్తుతం కేంద్రం ప్రవేశపెట్టిన బేటీ బచావో బేటీ పడావో అనే పథకం కూడా నరహరి ఆలోచనల్లోంచి పుట్టుకొచ్చిందే అని చాలా కొద్దిమందికి తెలుసు.

పేదింటి ఆడపిల్లల సంక్షేమమే కాదు.. లింగవివక్షను అరికట్టేందుకు కూడా నరహరి తనవంతు ప్రయత్నం చేశారు. ఇక్కడ తను చదివిన ఇంజినీరింగ్‌ విద్య పనికొచ్చింది. యాక్టివ్ ట్రాకింగ్ సిస్టంని రూపొందించి ఆసుపత్రులపై నిఘాపెట్టి అబార్షన్ల సంఖ్యను గణనీయంగా తగ్గించారు. ట్రాకర్స్ సాయంతో అన్ని ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో గర్భనిర్ధారణ చేసే ప్రతీ పరీక్షను రికార్డు చేసేలా చర్యలు తీసుకున్నారు. ప్రతీ గర్భిణి యోగక్షేమాల్ని మానిటరింగ్‌ చేసేందుకు ఆశ, అంగన్‌వాడీ వర్కర్ల సాయం తీసుకున్నారు. కాసులకు కక్కుర్తిపడి కడుపులో పిండాన్ని కడుపులోనే చిదిమేసే డాక్టర్లపై చర్యలు తీసకున్నాడు. ప్రతీ చౌరస్తాలో బేటీ బచావో విగ్రహాలు పెట్టించాడు. అతి తక్కువ టైంలోనే దానిపై ప్రజల్లోంచి సునామీలాంటి రెస్పాన్స్ వచ్చింది.

వికలాంగుల్ని చూసి ప్రతీవాళ్లూ అయ్యో అని జాలిపడతారే తప్ప.. వాళ్లకోసం ఆలోచించే వారు ఎంతమంది ఉంటారు? ఒక ఐఏఎస్ అధికారిగా- ఫిజికల్లీ చాలెంజ్డ్‌ పర్సన్స్ కోసం ఏదో చేయాలని నరహరి తపన పడ్డారు. వారు వేసే ప్రతీ అడుగుకు ఊతమిచ్చేలా చొరవ తీసుకున్నారు. ప్రతీ ప్రభుత్వ కార్యాలయంలో, ఆసుపత్రుల్లో, బడి, గుడి, చివరికి పర్యాటక ప్రాంతాల్లో కూడా ర్యాంప్ వేలను నిర్మించాడు. దేశవ్యాప్తంగా వికలాంగుల కోసం తెచ్చిన సంస్కరణలు కాయితాలకే పరిమితమైతే, నరహరి వాటిని గ్వాలియర్ లో నూటికి నూరుశాతం అమలు చేసి చూపించాడు. వికలాంగుల ఉన్నతి కోసం పాటుపడిన ఐఏఎస్ అధికారిగా 2013లో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.

ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజల మనసులు గెలుచుకున్న ఐఏఎస్ అధికారులు చాలా అరుదుగా ఉంటారు. అందులో నరహరి ముందువరుసలో ఉంటారు ఐఏఎస్ అంటే అతని దృష్టిలో కేవలం ఉద్యోగం కాదు. టెన్ టు ఫైవ్ జాబ్ కాదు. ఐఏఎస్ అంటే ఆయన దృష్టిలో ప్రజాసేవ. అదొక సామాజిక బాధ్యత. గ్వాలియర్ చారిత్రక నగరమే. అయినప్పటికీ అక్షరాస్యత మొదలుకొని, కాలుష్యం వరకు అన్నీ సమస్యలే. అందుకే సిటీలో పచ్చదనం పెంచేందుకు హరియాలీ అనే కార్యక్రమాన్ని చేపట్టారు. రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటించాడు. ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలు, చివరికి కొండలు గుట్టలు కూడా వదలకుండా ఆకుపచ్చ హారాన్ని గ్వాలియర్ మెడలో వేశాడు. ఒకేరోజు 35 వేల మొక్కలు నాటి ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించాడు.

నరహరి వచ్చింది కరీంనగర్ జిల్లాలోని ఓ సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి. ఆకలి బాధలేంటో అతనికి తెలుసు. ఆర్ధిక సమస్యలేంటో కూడా తెలుసు. తాను పనిచేస్తున్న గ్వాలియర్ కూడా ఇంచుమించు అలాంటిదే. అడుగడుగునా పేదరికం తాండవిస్తుంది. చదువుకోవాలని ఉన్నా కొందరు పిల్లలు డబ్బులేక మధ్యలో చదువు ఆపేశారు. అలాంటివారిని నరహరి చేరదీసి చదివిస్తున్నాడు. మధ్యాహ్నం పిల్లలకు చపాతీ, సబ్జీ పెట్టేలా ఆదేశాలు జారీచేశాడు. నరహరి చొరవతో పేద పిల్లలు స్కూళ్లలో కడుపునిండా తింటున్నారు.

ఐఏఎస్ అంటే అయ్యా ఎస్ కాదని, కలెక్టర్ అంటే కూటికి గతిలేని పేదల పక్షాన నిలవడం అని నిరూపించారు నరహరి. అతని అంకితభావానికి, చిత్తశుద్ధిని చూసి లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ను ఎంతగానో అబ్బురపడ్డారు. గ్వాలియర్ నగర ప్రజల్లో నరహరి తెచ్చిన మార్పుని స్పీకర్ నిశితంగా పరిశీలించారు. అతని సేవలు తాను ప్రాతినిధ్యం వహించే ఇండోర్ కు అవసరమని భావించి పట్టుబట్టి మరీ.. అక్కడికి పిలిపించారు. ప్రస్తుతం నరహరి ఇండోర్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.  

ఫ్యామిలీతో కలెక్టర్ పరికిపండ్ల నరహరి
ఫ్యామిలీతో కలెక్టర్ పరికిపండ్ల నరహరి

ప్రతీ మగాడి విజయం వెనుక మహిళ ఉన్నట్టే- నరహరి సక్సెస్ వెనుక సతీమణి భగవద్గీత పాత్ర కూడా ఎంతో ఉంది. ఆమెది విశాఖపట్టణం. ఓయూ నుంచి సైకాలజీలో పీజీ చేసింది. ప్రస్తుతం గ్వాలియర్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తోంది.

ఎక్కడో మధ్యప్రదేశ్ లో ఇంత సేవ చేస్తున్నప్పుడు, సొంతగడ్డ తెలంగాణకు ఎందుకు చేయలేనంటాడు నరహరి. ఆ లైన్ ఒక్కటి చాలు.. అతనిలోని కమిట్మెంట్ ఏంటో చెప్పడానికి. కలెక్టర్ గా ఒకవైపు ప్రజలతో మమేకమవుతూనే, మరోవైపు సాహిత్యం మీద ఆసక్తి చూపిస్తున్నారు. లాడ్లీ లక్ష్మీయోజన పథకంపై రాసిన ముప్పై పేజీల డాక్యుమెంటరీ ఆయనలోని సాహిత్యకారుడి కోణాన్ని చూపిస్తుంది. సమర్థుడి జీవయాత్ర పేరుతో తన ఆత్మకథను ఆవిష్కరిస్తున్నారు. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన నరహరి- కలెక్టర్ గా జాతీయస్థాయిలో ప్రశంసలు అందుకోవడం ఒక్క కరీంనగర్ జిల్లాకే కాదు, తెలంగాణకు, యావత్ భారతదేశానికే గర్వకారణం. 

Related Stories

Stories by HIMA JWALA