టీ హబ్ సెకండ్ ఫేజ్ ద్వారా 2 వేల స్టార్టప్ లకు చేయూత-మంత్రి కేటీఆర్

0

2016-2017 ఐటీ వార్షిక నివేదికను విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. 2016-17 సంవత్సరంలో ఐటీ ఎగుమతులు 13.85 శాతం వృద్ధి తో రూ.85,470 కోట్లకు చేరిందని మంత్రి కేటీఆర్ అన్నారు. గత ఏడాది కొత్తగా 24 వేల 506 మందికి ఈ రంగంలో ఉపాధి పొందారని కేటీఆర్ తెలిపారు. దీంతో రాష్ట్రం లో ఐటి రంగంలో పనిచేసే వారి సంఖ్య 4,31,891 కి చేరిందన్నారు. హైదరాబాద్ తాజ్ డెక్కన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్, ఎంపీలు సుమన్, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

త్వరలో ఖమ్మం లో ఐటీ పార్క్ ను కొత్తగా ప్రారంభించబోతున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. 2020 వరకు ఐటీ ఎగుమతులు లక్షా 20 వేల కోట్లకు తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. 8 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలు, 20 లక్షల పరోక్ష ఉద్యోగాలు కల్పించాలని టార్గెట్ గా పెట్టుకున్నామని కేటీఆర్ తెలిపారు. టయర్ 2, టయర్ 3 సిటీల్లో ఐటీని విస్తరింపజేస్తామన్నారు. గత మూడేళ్లలో ఎన్నో అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్ కి వచ్చాయని అన్న కేటీఆర్.. కేవలం ఐటీ మాత్రమే కాకుండా ఎలక్ట్రానిక్, ఆటోమొబైల్, మొబైల్ మనుఫ్యాక్చరింగ్ రంగాల్లో కూడా తెలంగాణ ముందుందని గుర్తు చేశారు.

ప్రస్తుతానికి దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ సెంటర్ గా టీ హబ్ వచ్చే సంవత్సరంలో సెకండ్ ఫేజ్ ని ప్రారంభిస్తామన్నారు. అప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ సెంటర్ గా అవతరిస్తుందని మంత్రి అభిప్రాయపడ్డారు. టీ హబ్ ద్వారా సుమారు 2 వేల స్టార్టప్ కంపెనీలకు చేయూత అందిస్తామన్నారు.

ఆన్ లైన్ లావాదేవీల్లో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచిందని మంత్రి కేటీఆర్ అన్నారు. మరో 5 నెలల్లో టీ ఫైబర్ పూర్తి అవుతుందని, దాంతో ఇంటింటికీ ఇంటర్నెట్ కనెక్షన్ అందిస్తామని తెలిపారు. ఇండస్ట్రీస్ అండ్ మున్సిపల్ డిపార్ట్ మెంట్ వార్షిక నివేదికను ఈ నెలలోనే విడుదల చేస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. తాజ్ డెక్కన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ టీ-వ్యాలెట్ ను ఆవిష్కరించారు. అనంతరం పలు ఐటీ కంపెనీలకు అవార్డులు అందజేశారు.  

Related Stories

Stories by team ys telugu