స్టార్టప్ నుంచి కో-ఫౌండర్ వెళ్లిపోతే..?

స్నేహం వేరు... వ్యాపారం వేరు ..స్టార్టప్ నిర్వహణలో భావోద్వేగాల ప్రయాణం..ఔత్సాహికులు నేర్చుకోవాల్సిన పాఠాలు..

స్టార్టప్ నుంచి కో-ఫౌండర్ వెళ్లిపోతే..?

Thursday July 23, 2015,

4 min Read

స్నేహం వేరు... వ్యాపారం వేరు. స్నేహాన్ని, వ్యాపారాన్ని కలిపి ముందుకు నడవడమంటే రెండు పడవలపై కాళ్లు పెట్టి సముద్రంలో వెళ్లినట్టే. కొంత దూరం వెళ్లాక ఏదో ఒకటి వదులుకోక తప్పదు. అందుకే స్నేహాన్ని, వ్యాపారాన్ని వేర్వేరుగా చూడాలంటారు ప్రదీప్. స్టార్టప్‌ని సక్సెస్‌ఫుల్ గా నడిపిస్తున్న ప్రదీప్... తన జీవితంలా తాను ఎదుర్కొన్న పరిస్థితి ప్రతీ ఒక్కరికీ పాఠం కావాలని కోరుకుంటున్నారు. స్నేహాన్ని, వ్యాపారాన్ని వేర్వేరుగా చూడాల్సిన అవసరమేంటో వివరిస్తున్నాడు. అసలేం జరిగింది ? ప్రదీప్ నేర్చుకున్న పాఠం ఏంటి? ఆయన మాటల్లోనే విందాం...

కో-ఫౌండర్ మిడిల్ డ్రాప్

మా స్టార్టప్ ప్రారంభించిన మూడేళ్ల తర్వాత కో-ఫౌండర్ అయిన సంతోష్ తుప్పాడ్ నన్ను వదిలి వెళ్లిపోయాడు. స్టార్టప్‌తో జర్నీ మొదలుపెట్టినప్పుడు సంతోష్ వయస్సు 24 ఏళ్లు. అప్పుడు నా వయస్సు 30 ఏళ్లు. స్టార్టప్ వదిలి వెళ్లే సమయానికి సంతోష్ వయస్సు 28 ఏళ్లుంటుంది. ఆ వయస్సులో ఓ యువకుడి ఆలోచనలు ఎలా ఉంటాయో నాకు బాగా తెలుసు. ఎందుకంటే... 26 ఏళ్లప్పుడు నా తొలి స్టార్టప్ ప్రారంభించాను. అది అంత విజయవంతం కాలేదు. అప్పుడే నాకు కొత్తకొత్త ఆలోచనలు వచ్చేవి. మార్పు కోరుకునేవాడిని. పక్షులు సొంతగా తమకు నచ్చినట్టుగా ఎలా ఎగరాలనుకుంటాయో... ఆలోచనలు అలా ఉండేవి. సరిగ్గా సంతోష్ కూడా అలాగే మార్పు కోరుకుంటున్నాడని నాకు అర్థమైంది. ఫిబ్రవరి 2009లో అనుకుంటా. సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ క్లాస్ చెబుతున్నప్పుడు సంతోష్‌ని కలిశాను. ఆ తర్వాత ఇద్దరం మంచి స్నేహితులం అయ్యాం. మేమిద్దరం గంటలు గంటలు ఫోన్ లో మాట్లాడుకునేవాళ్లం. కాఫీ షాపుల్లో కలిసి గంటలు గంటలు చర్చించేవాళ్లం. రాత్రి వేళల్లో ఇధ్దరం కలిసి హ్యాకింగ్ టెస్టింగ్ చేసేవాళ్లం. అలా మేము చాలా క్లోజ్ అయ్యాం. 'మూల్య' సంస్థ ద్వారా మా ప్రయాణం మొదలైంది. నేను మా స్నేహితుల్ని, బంధువుల్ని కలిసినప్పుడు వాళ్లు సంతోష్ ఎలా ఉన్నాడు ఏం చేస్తున్నాడని అడిగేవాళ్లు. అలా అతను మా సర్కిల్‌లో అందరికీ తెలుసు. మా కుటుంబానికే కాదు... స్నేహితులకూ బాగా దగ్గరయ్యాడు. కానీ ఏమైందో ఏమో... చివరికి ఓ రోజు తను నన్ను వదిలి వెళ్లిపోయాడు.

ప్రదీప్, సంతోష్

ప్రదీప్, సంతోష్


మది నిండా భావోద్వేగాలు

స్టార్టప్ ప్రయాణం అంటే... రోలర్ కోస్టర్ రైడ్ లాంటింది. కాదు కాదు... రోలర్ కోస్టర్‌లో పైన ఉన్నా, కింద ఉన్నా మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం. కానీ స్టార్టప్ ప్రయాణంలో అలా కాదు. ఓ బిడ్డకు జన్మనివ్వడం లాంటిది. భరించలేనంత నొప్పి ఉంటుంది. కానీ ఆ నొప్పిని మనం ఓర్చుకుంటాం. ఎందుకంటే... పుట్టబోయే బిడ్డ నవ్వును ఆస్వాదించాలని, ఏడుపు వినాలని, ఎదుగుతుంటే చూడాలన్న కోరిక మనల్ని ఓర్చుకునేలా చేస్తుంది. ఇలాంటి ప్రయాణంలో కో-ఫౌండర్ అయినా, ఉద్యోగి అయినా ఈ బాధను, కష్టాన్ని, ఆశల్ని, ఆశయాల్ని పంచుకోవడం ఓ గొప్ప అనుభూతి అనే చెప్పాలి. సంతోష్ సడెన్ షాక్ ఇచ్చాక కొన్నాళ్లపాటు అంతా గందరగోళంగా అనిపించింది. చాలా భావోద్వేగానికి గురయ్యాను. సినిమా ఫ్లాష్ బ్యాక్ చూస్తుంటే మన మానసిక స్థితి ఎలా ఉంటుందో నా పరిస్థితీ అలానే ఉండేది. మా ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలు, ఎన్నో ఆటుపోట్లు చూశాం. మూల్య కోసం మేం కలిసి పనిచేశాం. చాలా కష్టపడ్డాం. కానీ తను వెళ్లిపోయాక నేను అదుపు తప్పినట్టు అనిపించింది. నన్ను నేను చాలా కంట్రోల్ చేసుకున్నాను. వ్యాపారం చేసేప్పుడు భావోద్వేగాలు తక్కువగా ఉండాలని కొందరంటారు. నిజమే అనిపిస్తుంది. నాణేనికి రెండు వైపుల్లా మంచి , చెడును ఎదుర్కొన్నాను. నేను కేవలం బిజినెస్ మాత్రమే చూసి ఉంటే... కో ఫౌండర్ వెళ్తానన్నప్పుడు జస్ట్ షేక్ హ్యాండ్ చేసి పంపించేవాడిని. ఆల్ ది బెస్ట్ చెప్పేసి వదిలేసేవాడిని. కానీ... మా స్నేహం అంతకంటే ఎక్కువ. మేము కలిసి ఓ కలను నిర్మించుకున్నాం. మూల్య అంత గొప్పగా ఎదగడానికి మా స్నేహమే కారణం, మేము కలిసికట్టుగా ఈ కంపెనీని నిర్మించాం. అది అభివృద్ధి చెందుతున్న సమయంలో సంతోష్ నన్ను వదిలి వెళ్లాడు.

స్నేహితుడు కో-ఫౌండర్ అయితే..?

నేను ఎప్పుడైనా మేము అని మాట్లాడితే... వారిలో సంతోష్ తో పాటు మిగతా స్నేహితులు ధనశేఖర్, సుబ్రమణ్యం, సునీల్ కుమార్, పరిమళ హరిప్రసాద్, మనోజ్ నాయర్, మోహన్ పంగులూరి లాంటి వాళ్లుంటారు. 2008 వరకు మేం ఒకరికొకరం తెలియదు. టెస్టింగ్ కారణంగా మేమంతా కలిశాం. ఒక్కటయ్యాం. టెస్టింగ్ విషయంలో మా ఇష్టాయిష్టాలు అలాంటివి. టెస్టింగ్ రాక్ స్టార్స్ అయిన మేము గొప్ప స్నేహితులమయ్యాం. మా ఆశయాల కోసం ఉద్యోగాలను కూడా వదిలేసి కలిసి నడిచాం. చాలా కాన్ఫరెన్సులు, సెమినార్లు నిర్వహించాం. మా గ్రూప్ సైజ్ 65కు చేరింది. వీరిలో 62 మంది టెస్టర్లు. ప్రపంచం నలుమూలల్నుంచి ప్రాజెక్టులు సంపాదించాం. మాకు 98 శాతం కస్టమర్ల ప్రశంసలు, సూచనలున్నాయి. వాటిలో 37 స్టార్టప్స్ ఉన్నాయి. ఇంత ఘన విజయం మా స్నేహితుల వల్లే సాధ్యమైంది. మేం బిజినెస్ లో పడి స్నేహం సంగతే మరిచిపోయాం. బిజినెస్ లో చాలా బిజీ అయిపోయాం. ఫ్రెండ్ షిప్ కి మా దగ్గర సమయం ఉండేది కాదు. అందరం కలిసి మాట్లాడేప్పుడు... ఎదుట మాట్లాడేది నా స్నేహితుడా లేక వ్యాపారినా అన్నంతగా మార్పు వచ్చింది మాలో. ఇది కొంత భయంకరమైన పరిస్థితి అనే చెప్పాలి. అందుకే అనిపిస్తుంది. ఓ స్నేహితుడు కో-ఫౌండర్ గా ఉండటం ప్రమాదకరం. ఎందుకంటే స్నేహం మర్చిపోయి వ్యాపారుల్లా మారిపోతాం. వ్యాపారుల్లా ఆలోచిస్తాం. అందుకే ఫ్రెండ్‌షిప్‌ని, బిజినెస్‌ను వేర్వేరుగా చూడాల్సిన ఆవశ్యకతను నేను గుర్తించాను. వ్యాపారంలో ఉన్నప్పుడు వ్యాపారిలా... బయట ఉన్నప్పుడు స్నేహితుల్లా ఉండటం అలవాటు చేసుకున్నాం. అలా ఉండకపోతే ఇక జీవితంలో స్నేహితులు అనేవాళ్లే ఉండరు అనిపించింది. స్నేహితులే తోడుగా లేకపోతే బిజినెస్ కూడా ఉండదనిపించింది.

image


ప్రశ్నలు... సందేహాలు... అనుమానాలు...

సంతోష్ వెళ్లిపోవడంతో ఏమైంది, ఎందుకు వెళ్లిపోయాడని చాలామంది నన్ను అడిగారు. నేనేం చెప్పినా నమ్మలేదు. ఏదో జరిగే ఉంటుందని ఆరా తీయడం మొదలుపెట్టారు.

తను వెళ్లిపోవాలనుకున్నాడు... వెళ్లిపోయాడు. తను ఇప్పుడు మరో స్టార్టప్ పై వర్కవుట్ చేస్తున్నాడు. సంతోషంగా ఉన్నాడు. నేనూ సెటిల్ అయ్యాను. ఒక్కటిగా మేమిద్దరం సంతోషంగా ఉన్నాం. కానీ జనమే ఇవేవీ వినట్లేదు. అర్థంచేసుకోవట్లేదు. నేను వాళ్ల నుంచి ఏదో దాచిపెడుతున్నానని అనుకుంటున్నారు. తను మరిన్ని ఉద్యోగాలను సృష్టిస్తున్నాడు దాని గురించి బాధపడటం ఎందుకు అనిపిస్తుంది నాకు. నా బిజినెస్ కూడా మామూలుగా సాగిపోతోంది. కొద్దిరోజుల తర్వాత ఓసారి సంతోష్‌కి కాల్ చేశాను. ఎలా ఉన్నావని అడిగాను. మనం ఓసారి కలుద్దాం అని సంతోష్ బదులిచ్చాడు. స్నేహితులం అందరం కలిసి ఓ చోట కలిసాం. కాసేపు గడిపాం. ఆ తర్వాత ఎవరి దారిలో వాళ్లు వెళ్లిపోయాం. ఇది జరిగిన కొన్ని గంటల తర్వాత సంతోష్‌కి ఓ ఎస్ఎంఎస్ పంపిద్దామనుకున్నాను: "ఈరోజు మనం కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మనం అప్పుడప్పుడూ ఇలాగే కలుసుకుందాం" అని. కానీ నేను మెస్సేజ్ టైప్ చేసేలోపే సరిగ్గా అలాంటి ఎస్ఎంఎస్ సంతోష్ దగ్గర్నుంచి వచ్చింది. "మనం తరచూ ఇలా కలుసుకుందాం. నాకు చాలా సంతోషంగా ఉంది" అని. అప్పట్నుంచి మేం తరచూ కలుసుకుంటున్నాం. చాలా విషయాలు మాట్లాడుకుంటున్నాం. కొత్త విషయాలు నేర్చుకుంటున్నాం.