విద్యాసామ్రాజ్యంలో రారాజు ఈ బాబర్

అతి చిన్న వయస్సులో హెడ్ మాస్టర్9 ఏళ్లకే విద్యాదాన ఉద్యమంచదువుకోలేని తన వయస్సు పిల్లలకు టీచర్ అయ్యాడు8 మందితో మొదలైన స్కూల్లో ఇప్పుడు 500 మంది విద్యార్థులుస్కూలు పుస్తకాల కోసం స్థానికుల నుంచి బియ్యం యూనిఫాంతోనే ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలుబుడతడికి సాయం చేసిన అధికారులుచంపుతామని బెదిరించిన వాళ్లూ ఉన్నారుబాబర్ కథను పాఠ్యాంశం చేసిన కర్నాటకఐఏఎస్ అయి మరింత మంది సేవ చేయాలని లక్ష్యంమొన్నే కాలేజ్ పరీక్షలు పూర్తివివేకానందుడి బోధనలే స్ఫూర్తి

విద్యాసామ్రాజ్యంలో రారాజు ఈ బాబర్

Thursday April 16, 2015,

5 min Read

‘’ఒక ఆలోచన రావాలి. అదే జీవితాశయంకావాలి . దాని గురించే కలలు కనాలి.జీవించాలి. మెదడు, శరీరం,కండరాలు,నరాలు..ఇలా శరీరంలోని ప్రతీ భాగం దానిపైనే కేంద్రీకరించాలి. ఇతర అంశాల జోలికి వెళ్లకూడదు. అదే విజయసోపానమవుతుంది. మంచి ఆధ్యాత్మిక వేత్తలుగా తయారయ్యేందుకు అదే మార్గమవుతుంది’’ - స్వామి వివేకానంద

పుట్టిన తొమ్మిదేళ్లకే నిత్య కృషీవలుడిగా మారిన కుర్రాడి కథ ఇది. ఎక్కిన మెట్టు దిగిన మెట్టు లెక్కబెట్టకుండా నడిచిన కార్యదక్షుడి కథ. తన స్వగ్రామంలో పాఠశాలను ప్రారంభించేందుకు అహరహం శ్రమిస్తున్న బుల్లిమహానుభావుడి కథ.

బాబర్ అలీ మొదటి ప్రస్థానం

బాబర్ అలీ మొదటి ప్రస్థానం


ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడైన హెడ్‌ మాస్టర్‌గా రికార్డులకెక్కాడు బాబర్ అలీ. గొప్ప కోసం చెప్పకునే మాట కాదండి. గ్లోబల్ మీడియా ఆయనకు ఇచ్చిన బిరుదు ఇది. చిన్న పిల్లల ఆటగా మొదలై… ఇప్పుడో విద్యాదాన ఉద్యమంగా రూపాంతరం చెందిందీ బాబర్ అలీ సంకల్పం. దేశంలో ప్రతీ చిన్నారి చదువుకోవాలన్నదే అతని ఉద్దేశం.

పుష్కర కాలం పాటు ఒంటి చేత్తో జరిపిన విద్యా ఉద్యమం ఇప్పుడు ఒక పాఠశాల భవన నిర్మాణానికి మార్గం సుగమం చేసింది. ఇంతవరకూ రేకుల షెడ్డులో ఉన్న బడికి ఇప్పుడు పక్కా భవనం రాబోతోంది. ఇది రాత్రికిరాత్రే చేతికి అందిన విజయం మాత్రం కాదు. ఎందరినో మెప్పించి… ఒప్పించి.. ఛీత్కారాలను తట్టుకుని బెదిరింపులకు భయపడకుండా సాధించిన విజయమిది.

పశ్చిమ బెంగాల్లోని ముషీదాబాద్ జిల్లాలోని చిన్న గ్రామంలో ఉండే బాబర్ అలీని తండ్రి అతి కష్టం మీద బడికి పంపారు. ప్రతీ రోజు పది కిలోమీటర్లు నడిచి వెళ్లి చదువుకున్న బాబర్ … బడికి వెళ్లే అవకాశం లేని వారి కష్టాలను అర్థం చేసుకున్నారు. తన ఇంటి నుంచి బెల్డాంగా హై స్కూల్ వరకూ నడిచే లోపు రోడ్డు పక్క చిన్న చిన్న పనులు చేసుకుంటూ… బడికి వెళ్లకుండా ఆడుకుంటూ గడుపుతున్న బాలలను చూసి బాబర్ చలించిపోయాడు. వారి బాల్యం వృధా కాకూడదనుకున్నాడు. అప్పుడే ఒక ఆలోచన వచ్చింది. తన పెరట్లో జామచెట్టు కింద ఒక చిన్న బడి ప్రారంభించాడు. 2002లో ఆ బడికి ఎనిమిది మంది పిల్లలు వచ్చారు.


తన పాఠశాల విద్యార్థులతో బాబర్

తన పాఠశాల విద్యార్థులతో బాబర్


బడి పెట్టాలంటే మాటలా. పుస్తకాలు లేవు, కాగితాలు, కలాలు అసలే లేవు.బంకమట్టి పలకలే బ్లాక్ బోర్డులైపోయాయి, దినపత్రికలు పాఠ్యపుస్తకాలయ్యాయి. తను చదువుకున్న బడిలో క్రింద పడిపోయిన చాక్ పీసుముక్కలను తీసుకెళ్లి బ్లాక్ బోర్డుమీద అక్షరాలు రాశాడు. బాబర్ సంకల్పం చూసిన అతని ఉపాధ్యాయులు ఆశ్యర్యపోయారు. అతనికి తమవంతు సాయం అందించారు.

క్రమంగా బాబర్ కల సాకారమయ్యింది. బాబర్ బడి నుంచి ఎప్పుడు వస్తాడా, తమ బడిలో ఎప్పుడు చదువు చెపుతాడా అని పిల్లలు ఎదురుచూసేవారు. అన్నం తినటానికి కూడా టైము వుండేదికాదని బాబర్ తన తొలినాళ్ల అనుభవాలను నెమరువేసుకుంటాడు. బట్టలు మార్చుకుని పాఠాలు ప్రారంభించేవాడు. నీ చదువు దెబ్బ తింటోందని బాబర్ తండ్రి ఎన్నోసార్లు మందలించినా … చేపట్టిన పనిని బాబర్ వదిలిపెట్టలేదు.

ప్రముఖుల ప్రశంసలు, అవార్డులతో నిండిన బాబర్ ఇంటి గోడ

ప్రముఖుల ప్రశంసలు, అవార్డులతో నిండిన బాబర్ ఇంటి గోడ


ఊరి బడే బాబర్‌కు వ్యసనమైంది. అలవాటైన పిల్లలు బడి మానెయ్యకుండా ఆపడమెలా … అసలే పేద పిల్లలు, ఇంట్లో వాళ్లు పనికి పంపిస్తారాయే. అందుకే పిల్లలకు తన తండ్రి తనకిచ్చిన డబ్బులతో చాక్లెట్లు, బిస్కెట్లు కొనిపెట్టాడు. ఆ చిన్న లంచమే పిల్లలమీద మంచి ప్రభావం చూపింది. పిల్లలకు సంగీత, నృత్యాలలో పోటీలు నిర్వహించి వారిలో మరింత ఆసక్తిని పెంచాడు. ఊళ్లోని బాలికలంతా బడికి రావాలనేదే బాబర్ ధ్యేయం. ఆయన చెల్లెలే ఆ స్కూలు మొదటి విద్యార్ధిని. ఆమె ఇప్పుడు ఆ స్కూలులోనే ఆమె పంతులమ్మ అయింది.


గ్రామంలోని ప్రతీ ఆడపిల్లా చదవాలనేదే బాబర్ లక్ష్యం.అందుకే మొదటి స్టూడెంట్ తన చెల్లేలే అయింది. పిక్ క్రెడిట్ - సంజుక్త బసు

గ్రామంలోని ప్రతీ ఆడపిల్లా చదవాలనేదే బాబర్ లక్ష్యం.అందుకే మొదటి స్టూడెంట్ తన చెల్లేలే అయింది. పిక్ క్రెడిట్ - సంజుక్త బసు


చదువుకోవాలన్నా, చదువు చెప్పాలన్నా పుస్తకాలు కావాలి. పుస్తకాలకు డబ్బులు లేవు.అప్పుడే బాబర్‌కు ఒక ఆలోచన వచ్చింది. ఇంటింటికి వెళ్లి ధాన్యం సేకరించాడు. అలా వచ్చిన దాన్ని మార్కెట్లో అమ్మి ఆల్ఫాబెట్స్ ఉన్న పుస్తకాలు కొనేవాడు. ఒకసారి ఆరో తరగతిలో ఉన్నప్పుడు స్థానిక అధికారిని కలిసి సాయం కావాలని కోరాడు బాబర్. చిన్నపిల్లవాడి పట్టుదల చూసి వాళ్లు కూడా ఇతగాడికి అవసరమైన పుస్తకాలను సరఫరా చేశారు.

బడి గంట. బాబర్ స్కూల్లో గంటమోగించే బాధ్యత ఈమెదే. ఈ స్థానిక మహిళ ఇంతవరకూ ఒక్క రోజు కూడా సెలవు పెట్టకుండా రోజూ స్కూలుకు వస్తోంది

బడి గంట. బాబర్ స్కూల్లో గంటమోగించే బాధ్యత ఈమెదే. ఈ స్థానిక మహిళ ఇంతవరకూ ఒక్క రోజు కూడా సెలవు పెట్టకుండా రోజూ స్కూలుకు వస్తోంది


నేను చేస్తున్న పనులను చూసి మా స్కూల్ టీచర్ల్ కూడా సంతోషపడేవారు. నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించేవారు. మా నాన్న ఒకసారి నా స్కూలుకు వచ్చిన రూ. 600 డొనేషన్ ఇచ్చారు. ఇక మా అమ్మ అయితే మొదటి రోజు నుంచి నన్ను ఉత్సాహపరిచేది.

స్కూలు ప్రారంభించే రోజు రానే వచ్చింది. రూ.30తో ఒక మైకును అద్దెకు తెచ్చుకున్నను. రిబ్బన్ కటింగ్ కార్యక్రమం తర్వాత ఒక పాట, ఒక డ్యాన్సును చేయాలని నిర్ణయించాం. స్టేజీ డెకొరేషన్‌కు మా అమ్మ చీరను అడిగి తెచ్చాను. పంచాయితీ పెద్దలను, గ్రామంలో ఉన్న వాళ్లందరినీ కార్యక్రమానికి ఆహ్వానించాను. మా ఊళ్లోనే ఉన్న ఒక పెద్ద స్కూల్ ప్రిన్సిపాల్ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి మా స్కూలుకు ఆనంద శిక్షా నికేతన్‌గా నామకరణం చేశారు.

ఈ కార్యక్రమాన్ని న్యూస్ పేపర్లు కవర్ చేయడంతో ఆ నోటా ఈ నోటాపడి అది నోబుల్ గ్రహీత అమర్త్య సేన్ వరకూ చేరింది. బాబర్ ఎనిమిదో తరగతిలో ఉండగా శాంతినికేతన్ రావాలని అమర్త్య సేన్ నుంచి ఆహ్వానం అందింది. పశ్చిమబెంగాల్‌ ఆర్థిక మంత్రి సహా ముఖ్యులైన ప్రొఫెసర్ల మధ్య గంటపాటు ప్రసగించేందుకు నాకు అవకాశం అక్కడ లభించడం ఎన్నటికీ మరిచిపోలేను అంటూ ఉద్విగ్నానికి గురవుతాడు బాబర్. ఈ స్ఫూర్తితో ధైర్యం మరింత పెరిగి కలకత్తాలోని వివిధ ఆఫీసులకు నేరుగా స్కూల్ యూనిఫాంతోనే వెళ్లాడు. తన స్కూలుకు అవసరమైన వాటిని సరఫరా చేయమని ప్రార్థించేవాడు.

వివేకానందుడి మాటలే నాకు నిత్యస్ఫూర్తి

వివేకానందుడి మాటలే నాకు నిత్యస్ఫూర్తి


“నేను ఈ స్థాయికి వచ్చానంటే అందులో కొంత మంది అధికారుల ప్రోత్సాహన్ని ఎన్నటికీ మరువకూడదు. చిన్నపిల్లవాడినని ఎవరూ నిరుత్సాహపరచలేదు.” ఆశ్చర్యం ఏంటంటే నా అభ్యర్థన మేరకు అప్పటి కలెక్టర్ (సబ్ డివిజిన్ మేజిస్ట్రేట్) సాబుజ్ బరున్ సర్కార్ ఆ స్కూలు గవర్నింగ్ బాడీకి అధ్యక్షుడిగా వ్యవహరించారు. అప్పడు బాబర్ వయస్సు పదమూడేళ్లు, చదువుతోంది ఎనిమిదో తరగతి మాత్రమే. మరో స్కూల్ హెడ్ మిసెస్ ఫెరోజా బేగం, స్కూల్ సెక్రటరీగా ఉన్నారు.

‘’నేను ఐపిఎస్ అధికారి రాహుల్ శ్రీవాస్తవ్‌ను కలిసినప్పుడు ఆయన నాకు సహాయం చేయడమే కాకుండా, ‘స్మార్టెస్ట్ బాయ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్’గా నన్ను ప్రకటించారు. వేసుకునే బట్టల వాళ్లు అందంగా కనపడదు. జీవితాల్లో జ్ఞాపం నింపేవాళ్లే అసలైన అందగాళ్లని నాలో ఉత్సాహాన్ని పెంచారు’’.

టెడ్ మిత్రులతో కలిసి కెనెడా పర్యటన సందర్భంగా

టెడ్ మిత్రులతో కలిసి కెనెడా పర్యటన సందర్భంగా


2008లో బాబర్ పదో తరగతి పరీక్షలను ఫస్ట్ క్లాసులో పాసయ్యాడు. ‘పరీక్షలకు కొద్ది రోజుల ముందు వరకూ నేను మా స్కూల్ విద్యార్థుల బ్యాంక్ ఖాతాలను తెరిచే పనిలో బిజీగా ఉన్నాను. నా పరీక్షల సమయంలో కేవలం పది రోజులు మాత్రమే వాళ్లకు సెలవులు ఇచ్చాను’.

ఇదే సమయంలో సిఎన్ఎన్ –ఐబిఎన్ ఛానల్ బాబర్‌ను రియల్ హీరో అవార్డుతో సత్కరించింది. హీరో అమిర్ ఖాన్‌ నుంచి అవార్డను అందుకున్నాడు. బిబిసి ఎక్కడి నుంచో ఇతడి వార్తను కవర్ చేయడానికి వాళ్ల గ్రామానికి వచ్చింది. TED ఫెల్లో అయ్యాడు, ఎన్డీటీవీ వంటి సంస్థలు కూడా ఇతడిని సత్కరించాయి.

మనకే ఎందుకు ఈ వెనక్కి లాగే మనస్తత్వం ?

తనకు వచ్చే చిన్నాచితకా డొనేషన్లతోనే స్కూలును బాబర్ నడుపుతున్నాడు. ఇక్కడి డబ్బులకంటే అతడి ధృడ సంకల్పమే ముందుకు నడిపించేది.

నాకు ఇంకా ఎంతో చేయాలనే ఆశ, ఆసక్తి ఉంది. నాకు ఒక స్కూల్ బిల్డింగ్ అవసరం కనిపిస్తోంది. కానీ దాన్ని నిర్మించేంత డబ్బు నా దగ్గర లేదు. రియల్ హీరో అవార్డుకు వచ్చిన ప్రైజ్ మొత్తంతో మా ఇంటి దగ్గరే కొంత భూమి కొన్నాను. ఇప్పుడు స్కూల్ బిల్డింగ్ నిర్మాణమే నా ముందున్న లక్ష్యం.

బాబర్ చేసే ఈ చిన్న ప్రయత్నాన్ని కూడా జనాలు చూసి ఓర్వలేకపోయారు. కొంత మంది వేధింపులకు దిగారు. ఇంకొందరు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించమని వెంటపడేవారు. లేనిపోని ఆరోపణలు చేయడంతోపాటు చంపేస్తామనే బెదిరింపులనూ బాబర్ వినాల్సి వచ్చింది. ఒక దశలో కాలేజ్ పరీక్షలను పోలీస్ రక్షణ మధ్య రాయాల్సి వచ్చింది.

“మలాలా తలపై బుల్లెట్ గాయమైంది. కానీ కొంత మంది కుంచిత స్వభావుల చేష్టలు బుల్లెట్‌లా సూటిగా నా గుండెలో గుచ్చుకున్నాయి. పిల్లలను నిత్యం ఉత్సాహపరచడం నాకు మరో పెద్ద సవాల్. ఎవరైనా విద్యార్థి స్కూలుకు రాకపోతే నేనే వాళ్ల ఇంటికి వెళ్లి మరీ తల్లిదండ్రులతో మాట్లాడేవాడిని. పిల్లలను స్కూలుకు పంపమని అభ్యర్థించేవాడిని”.

వివేకానంద పలుకులే నాకు స్ఫూర్తి – నాకు శక్తి, ధైర్యం ఆయన మాటల వల్లే వస్తుంది. ఇంకా ఎంతో చేయాలని కాంక్ష నాలో బలపడ్తోంది.

కొత్త స్కూల్ ఫౌండేషన్ సందర్భంగా అధికారులు, స్థానికులతో కలిసి.

కొత్త స్కూల్ ఫౌండేషన్ సందర్భంగా అధికారులు, స్థానికులతో కలిసి.


పాఠ్యపుస్తకాల్లో బాబర్ కథ -

కర్నాటక నా రెండో ఇల్లు లాంటిది. ప్రతీ ఒక్కరికీ చదువనేది నా లక్ష్యం. సాధ్యమైనంత ఎక్కువ మంది విద్యను పూర్తిచేయాలి. కర్నాటకలో మరో స్కూల్ ప్రారంభించాలని అనకుంటున్నాను. ఏదో ఒక రోజు ఐఎఎస్ ఆఫీపర్ కావాలని నా కోరిక. బాబర్ కృషిని గుర్తించిన కర్నాటక ప్రభుత్వం అతడి స్టోరీని మొదటి ఏడాది ఇంగ్లిష్ పియు కోర్సులో పాఠ్యాంశంగా ప్రచురించింది.

బాబర్ మొదటి ఎనిమిది మంది విద్యార్థులు మెల్లిగా చుదువుకుంటూ ఇప్పుడు కాలేజ్ స్థాయికి వచ్చారు. వాళ్లు కూడా ఇప్పుడు అతడి స్కూల్లో ఇతర పిల్లలకు పాఠాలు చెబ్తున్నారు.

‘’ఎరైజ్,ఎవేక్, స్టాప్ నాట్ టిల్ ది గోల్ ఈజ్ రీచ్డ్’’(లేవు,మేలుకో.. నీ లక్ష్యం చేరేంతవరకూ ఆగొద్దు) అనే వివేకానందుడి మాటలే బాబర్‌ను నిత్యం జ్వలింపజేస్తూ అతడి లక్ష్యంవైపు అడుగులు వేయిస్తున్నాయి.

ఒకప్పుడు 300 మంది ఉన్న విద్యార్థుల సంఖ్య కొత్త బిల్డింగులో ఐదు వందలకు పెరిగింది. జనవరి 2015న కొత్త స్కూలు బిల్డింగ్ కల సాకారమైంది.