పిల్లల సేవ ముందు ప్రపంచ బ్యాంక్ ఉద్యోగమూ గడ్డిపరకే !

కండరాల బలహీనలతో ఇబ్బందిపడుతున్న పిల్లల పెన్నిధి ఆమె. ఐఐటిలో చదువుకుని లక్షల డాలర్లు ఆర్జించే అవకాశం ఉన్నప్పటికీ అరుదైన వ్యాధిపై పరిశోధనలు జరిపి తన వంతు సేవలు అందిస్తున్నారామె. మస్క్యులర్ డిస్ట్రోపీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన ఆరోగ్య లక్ష్మి ఆ మహాతల్లి.

0

టెక్నాలజీ సాయంతో వైద్య రంగాన్ని మరింత వృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్న వారు చాలా మంది దేశంలో ఉన్నారు. అరుదైన, ప్రాణాంతక వ్యాధులపై పరిశోధనలు చేస్తున్న వారు మాత్రం కొందరే ఉన్నారు. ఈ కోవలోనే మాలిక్యులార్ డయాగ్నస్టిక్స్ , కౌన్సిలింగ్ కేర్ మరియు రీసెర్చ్ సెంటర్ ( ఎం.డీ.సీ.ఆర్.సీ ) వ్యవస్థాపక డైరెక్టర్ బీ.ఆర్. లక్ష్మి ఎందరికో స్పూర్తి నిచ్చే వ్యక్తిగా నిలిచారు. 


బి ఆర్ లక్ష్మి, ఎం.డీ.సీ.ఆర్.సీ వ్యవస్థాపక డైరెక్టర్
బి ఆర్ లక్ష్మి, ఎం.డీ.సీ.ఆర్.సీ వ్యవస్థాపక డైరెక్టర్

“నేను బయో కెమిస్ట్రీ, జన్యు శాస్త్రంలో హిహెచ్.డి. చేశాను. నాకు సామాజిక సేవ అంటే ఇష్టం. ఎందుకంటే సమాజానికి ఉపయోగపడని సైన్స్ నిరుపయోగమని నాకు చిన్నప్పుడే అర్థమైంది. సింగపూర్‌లో పనిచేసిన తర్వాత అమెరికాలో వరల్డ్ బ్యాంక్ ఉద్యోగం చేస్తున్నప్పుడు.. మస్క్యలర్ డిస్ట్రోపీ అనే కండరాల బలహీనతపై ప్రాజెక్టు చేసే ప్రతిపాదన వచ్చింది. ఈ ప్రయాణం అలా మొదలైంది. తొలుత డయాగ్నస్టిక్ స్థాయిలో పని ప్రారంభించాం. డచ్ నుంచి వచ్చిన గ్రాంట్ మాకు ఉపయోగపడింది. ఈ నిధులు అందుబాటుకు వచ్చిన ఇరవై సైట్లలో మాది కూడా ఒకటి. ఎంతమందికి కండరాల బలహీనత ఉన్నదో అప్పట్లో నాకు తెలీదు. దీనిపై అధ్యయనం చేసేందుకు నన్ను ఆహ్వానించిన ఒక అమెరికా వైద్యుడితో కలిసి పనిచేశాను. దేశంలో ఈ సమస్య తీవ్రత నాకు అప్పట్లో అర్థం కాలేదు. తెలుసుకోవాలనే ప్రయత్నంలోనే అనేక విషయాలు అర్థం చేసుకున్నాను. ”.. అని వివరించారు లక్ష్మి.

“ వైద్య రంగంలో పనిచేసే వారికి వ్యాధి గురించి తెలిసినప్పుడే పరిష్కారం త్వరగా లభిస్తుంది. మేము రెండు ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాం. వ్యాధి పరివర్తనా క్రమాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. రకరకాల మార్పులను తెలుసుకోవడం వల్ల వైవిధ్యమైన పరిష్కారాలు అందించే వీలుంది. ఏ పిల్లలకు ఎలాంటి థెరపీ ఉపయోగపడుతుందో ఒక క్లిక్ ద్వారా తెలుసుకునే వీలుంది. మగపిల్లలకు ఎక్కువగా ఈ అనారోగ్యం సోకే అవకాశం ఉందని తెలుసుకున్నాం. బాలల్లో వాటి లక్షణాలు అర్థం చేసుకుంటే… మాతృమూర్తిలో ఉన్న ఇబ్బందులను కూడా అంచనా వేసుకోవచ్చు” అని అంటారు లక్ష్మి. విడుదలైన నిధులు నిండుకునే సరికి అసాధారణ ఫలితాలు సాధించగలిగారు. అలాగని ప్రారంభించిన పని వదిలేసే ఉద్దేశం వారికి లేదు.

“నాలుగేళ్ల తర్వాత మేము 500 మందిలో వ్యాధి లక్షణాలను నిర్థారించగలిగాం. అప్పటికే గ్రాంట్ పూర్తి కావొచ్చింది. తర్వాత ఏమిటని మమ్మల్ని మేము ప్రశ్నించుకున్నాం. సుందరం మెడికల్ ఫౌండేషన్ కొందరు నిపుణులతో కలిసి చర్చించి సామాజిక సేవ చేసే దిశగా విశ్వవిద్యాలయంతో అనుసంధానించే ప్రతిపాదన చేశారు. ఒక గ్రామంలో ఇలాంటి కేంద్రం ఏర్పాటు చేసే దిశగా వసతులు కల్పించేందుకు అంగీకరించారు” అని అంటారు లక్ష్మి

“ మస్క్యులర్ డిస్ట్రోపీ ఎక్కువగా పిల్లలకే సోకుతుంది. మూడేళ్ల వయస్సు వరకూ పిల్లలు మామూలుగానే ఉంటారు. తర్వాత తరచూ పిల్లలు తలతిరిగి పడిపోవడంతో తొలి దశ లక్షణాలు కనిపిస్తాయి. అకలి తగ్గిపోతుంది. కండరాల వ్యాధులను నయం చేసే చిన్న పిల్లల వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లే సరికి పిల్లాడికి ఐదేళ్లు వచ్చేస్తాయి. డిస్ట్రోపీనో.. కాదో తెలుసుకునేందుకు మేము సూక్ష్మ విశ్లేషణ నిర్వహిస్తాం. ఈ దశలో కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ కూడా ఇస్తాం. మా డేటాబేస్ లో 3,500 మంది పిల్లల జాబితా ఉంది. ఒకే చోట సంపూర్ణ సంరక్షణ అందించే ఏర్పాటు చేశాం. 2011లో మేము జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ ప్రారంభించాం. అప్పుడే దేశంలో మేము ఊహించిన సంఖ్య కంటే ఎక్కువ మందికి ఈ సమస్య ఉందని గుర్తించాం. 

మాకు సాయపడేందుకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ముందుకు వచ్చింది. కండరాల బలహీనతను అధ్యయనం చేసేందుకు ఒక కేంద్రం ఏర్పాటు చేసుకునే దిశగా సాయం అందిస్తామన్నారు. మేము కూడా మా వంతుగా దేశం మొత్తానికి ఉపయోగపడే మోడల్ రిజిస్ట్రీని ఏర్పాటు చేయబోతున్నాం” అని తమ భవిష్యత్ కార్యకమాలను వివరించారు లక్ష్మి. 

హెల్త్ 2.0 లాంటి సదస్సులు చాలా అవసరమని ఆమె నమ్ముతున్నారు. “మాకు జేమ్స్ మాథ్యూ ద్వారా దీని గురించి తెలిసింది. ఆయన హెల్త్ 2.0 ఇండియాకు ఛైర్మన్‌గా ఉన్నారు. ఆయన మా పొరుగునే ఉంటారు. మా కార్యక్రమాలను వివరించిన తర్వాత చాలా మంది సాయం చేశారు. తాదాత్మ్యంగా పనిచేయడం ఆరోగ్య సేవా రంగంలో చాలా అవసరం. టెక్నాలజీ కూడా అంతే స్థాయిలో ఉపయోగపడుతుంది. ఇక్కడ మాకు రెండూ ఉన్నాయి. నాకు హెల్త్ కేర్ అఛీవ్ మెంట్ అవార్డు కూడా వచ్చింది. నాకు, నా కుటుంబ సభ్యుల్లా పనిచేసిన ఇతరులకు ఈ ప్రాత్సాహం చాలా అవసరం.. ,” అని అంటారు లక్ష్మి..ఒంటరిగా ఏ పనీ చేయలేమని లక్ష్మి విశ్లేషించారు. సంఘీభావమే బలమని ఆమె చెబుతున్నారు.