దేశభవిష్యత్ ఉత్తర ప్రదేశ్ చేతుల్లోనే ఉంది

దేశభవిష్యత్ ఉత్తర ప్రదేశ్ చేతుల్లోనే ఉంది

Saturday February 11, 2017,

3 min Read

2019 తర్వాత మోడీ ప్రధానిగా ఉంటారా లేదా అన్నది యూపీ ఎన్నికలు చెప్పేస్తాయనే మాట వినడానికి విడ్డూరంగానే వుంది. ఒక రాష్ట్రం తీర్పు బట్టే దేశప్రధాని ఎవరన్నది తేలిపోతుందా? పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్ కూడా జతకలిస్తే, మేబీ తర్వాత ప్రధాని కూడా మోడీయే అనుకోవడం కొంత సమంజసంగా ఉంటుంది. అయితే, ఇక్కడొకటి మరిచిపోవద్దు. దేశంలోని లోక్ సభ సీట్లలో యూపీది సింహభాగం. మొన్నటి 2014 ఎన్నికల్లో ఆ రాష్ట్రం నుంచి బీజేపీ 80 సీట్లకుగానూ 71 స్థానాలు గెలుచుకుంది. ఆ నంబర్ మోడీని ప్రధాని పీఠం వరకు నడిపిచిందనడంలో అతిశయోక్తి లేదు.

కాబట్టి, దీన్నిబట్టి యూపీ అసెంబ్లీ ఫలితాలు వచ్చే ఎన్నికల్లో మోడీ భవితవ్యాన్ని చెప్తాయనడంలో సందేహం అవసరం లేదు. అయితే యూపీ ఆర్ధికంగా వెనుకబడి పోవచ్చు, కానీ రాజకీయంగా ఆ రాష్ట్రం చాలా చైతన్యవంతమైంది. ప్రధాని పీఠంపై ఎవరిని కూర్చోబెట్టాలో ఉత్తర్ ప్రదేశ్ నిర్ణయాత్మక మలుపునిస్తుంది. జాతీయ రాజకీయాల టోన్ సెట్ చేసే స్టామినా ఉన్న స్టేట్ అది. మోడీకి ఆ విషయం తెలుసు. అందుకే ఆయన వారణాసి నుంచి పోటీ చేసి ప్రభంజనం క్రియేట్ చేశారు. ఆ ఊపులోనే 71 సీట్లు గెలుచుకున్నారు. ఆ కారణంతోనే వడోదర నుంచి గెలిచినా, వారణాసి ఎంపీగా కొనసాగడానికే ఇష్టపడ్డారు. దీన్నిబట్టి అర్ధం చేసుకోవచ్చు యూపీ పవరేంటో. అందుకే యూపీలో అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ ఆరాటపడుతోంది. కానీ, అది జరిగే పనేనా?

image


చెప్పాలంటే, యూపీ ఎన్నికల ముందు బీజేపీ ఒక శుభారంభం లాంటిది చేసింది. అదే సర్జికల్ స్ట్రయిక్. జాతీయవాదాన్ని కెటిల్ లో పెట్టి మరిగించింది. సైద్ధాంతికంగా భావోద్వేగం అనే పాలను మెల్లిగా కెటిల్లో ఒంపింది. కానీ అదే సమయంలో డిమానిటైజేషన్ దెబ్బకొట్టింది. తీవ్రవాదాన్ని, బ్లాక్ మనీని అరికట్టేందుకు తీసుకున్న నిర్ణయం బెడిసికొట్టింది. సరైన నిర్వహణ, ముందుచూపు లేకపోవడంతో జనం చాలా ఇబ్బందులు పడ్డారు.

బ్యాంకులు, ఏటీఎంల ముందు క్యూలో నిల్చుని సుమారు వంద మందిదాకా చనిపోయారు. రైతులు, దినసరి కూలీలు, చిరు వ్యాపారులు, ఉద్యోగులు అందరూ సఫర్ అయ్యారు. ఆర్ధిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడింది. దాంతో జనాల్లో ఒకింత అసహనం పెరిగింది. అందుకు యూపీ మినహాయంపు కాదు. క్షేత్రస్థాయిలో జనం మోడీ పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

ఇక రాహుల్ గాంధీ, అఖిలేష్ జోడీ యూపీ రాజకీయంలో కొత్తకోణం. మొన్నటిదాకా ఆ పార్టీలో కలకలం చెలరేగింది. ఇప్పుడు కాంగ్రెస్ ని వెనుక సీట్లో పెట్టుకుని, ఎస్పీ డ్రైవర్ సీట్లో కూచొని పెనుభారాన్ని మోస్తోంది. అయితే అఖిలేష్ కు ఉన్న క్లీన్ ఇమేజ్ మళ్లీ అధికారం కట్టబెడుతుందని ఆ పార్టీ ధీమాగా ఉంది. తండ్రిలా కాకుండా ఆయన రాష్ట్రాభివృద్ధి పై ఫోకస్ చేయడం, కులాలు, మతాలకు అతీతంగా అందరినీ కలుపుకుని పోవడం లాంటి పరిణామాలు అఖిలేష్ యాదవ్ కు అనుకూలంగా ఉన్నాయి. ఈ విషయంలో మోడీకి భంగపాటు తప్పదేమో.

బీజేపీతో మరో సమస్య ఏంటంటే, యూపీ స్టేట్ లీడర్ అంత సమర్ధవంతమైన నాయకుడు కాదు. అతని పట్ల సీనియర్లు సంతోషంగా లేరు. ఇప్పటికీ యూపీలో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరన్నది తేల్చలేదు. కారణం.. అక్కడి కేడర్ తో అగ్రనాయకత్వం పెద్దగా కలుపుగోలుగా లేకపోవడం. ఫలితంగా జనానికి తెలిసిందల్లా ఒకటే.. అయితే ఎస్పీ, లేదంటే బీఎస్పీ. ఈ రెండు పార్టీల నుంచే సీఎం ఎవరన్నది డిసైడ్ చేయాలి. బీజీపీని పెద్దగా పట్టించుకోవడం లేదు. అయినా కూడా కమలనాథులు ఢిల్లీ, బీహార్ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్నట్టు కనిపించడం లేదు. అస్సాంలో ఆ పార్టీకి సీఎం ఫేస్ ఉంది కాబట్టి టెన్షన్ లేకుండా పీఠం చేతికొచ్చింది. ఈ నేపథ్యంలో యూపీలో బీజేపీ దారుణంగా దెబ్బతినే అవకాశం లేకపోలేదు.

2014లో మోడీ విజయానికి కారణం దళితులు, వెనుకబడిన వర్గాలు. అయితే, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్ధి రోహిత్ వేముల ఎపిసోడ్, గుజరాత్ తో దళితులపై దాడులు బీజేపీ/మోడీకి ప్రతికూలంగా మారాయి. వెనుకబడిన వర్గాలు కూడా మోడీ పట్ల సంతోషంగా లేరు. రిజర్వేషన్ విషయంలో జాట్స్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. హర్యానాలో వాళ్ల మద్దతుతో గద్దెనెక్కి, తీరా రిజర్వేషన్లు అడిగే సరికి సర్కారు ముఖం చాటేసింది. ఫైర్ బ్రాండ్ ముద్ర ఉన్న యోగీ ఆదిత్యనాథ్ లాంటి వాళ్లను కూడా బీజేపీ ఇగ్నోర్ చేస్తోంది.

మొత్తమ్మీద చూసుకుంటే యూపీలో బీజేపీ గెలుపు అంత సులువేం కాదు. మోడీ చరిష్మా మునుపటిలా లేదు. అనేక విషయాల్లో అతని వైఫల్యం కనిపిస్తోంది. అభివృద్ధి అట్టడుగున పడిపోయింది. గంభీరమైన పదాలు తప్ప, కాంక్రీట్ గా దేశానికి చేసిందంటూ ఏమీ లేదు. ఆర్ధిక వ్యవస్థ ఇంకా గందరగోళంలోనే ఉందనేది నిపుణుల మాట. ఈ పరిస్థితుల్లో యూపీ భవిష్యత్ దేశరాజకీయాలను మార్చే సిగ్నల్ పంపాలి. ఈ తీర్పు మోడీ సర్కారు తీరుని చాటిచెప్పాలి. ఒక్కమాటలో చెప్పాలంటే దేశభవిష్యత్ ఉత్తర ప్రదేశ్ చేతుల్లోనే ఉంది.

రచయిత: అశుతోష్, ఆమ్ ఆద్మీ సీనియర్ నేత