రమ్మన్న చోటకి వస్తారు.. నచ్చినట్టుగా బట్టలు కుట్టిస్తారు.. ముంబైకర్ల మనసు దోచిన స్టార్టప్

0

90వ దశకంలో రెడీమేడ్ గార్మెంట్స్ వెల్లువలా దూసుకొస్తే సందు చివర జెంట్స్ టైలర్ షాప్ వెలవెలబోయింది. ఒకప్పుడు హాంగర్ల నిండా బట్టలతో కళకళలాడిన దుకాణం ఇప్పుడు పాతబట్టలు కుట్టడం,ఆల్ట్రేషన్ చేయడం వరకే పరిమితమైంది. ఇప్పడెవరికీ క్లాత్ కొని,దర్జీ దగ్గరికి వెళ్లి,కొలతలిచ్చి,డిజైన్ పెట్టించుకుని బట్టలు కుట్టించుకునే ఓపికగానీ టైంగానీ లేవు. వీధిలో ఒకటీ అరా టైలర్ షాపులు ఉన్నప్పటికీ 90 శాతం కనుమరుగు కావడానికి కారణం రెడీమేడ్ వస్త్ర ప్రపంచమే.

దర్జీ అనేవాడు దర్జాగా బతాకాలి. టైలర్ షాప్ అంటే చిరుగుల బట్టలు కుట్టే పనికాదు. దానికో బ్రాండ్ ఉండాలి. నేమ్ వుండాలి. ఫేమ్ వుండాలి. ప్యాంటో షర్టూ కుడితే కస్టమర్ ఫిదా అయిపోవాలి. బ్రాండెడ్ బట్టల షోరూంని తలదన్నేలా డిజైన్లు క్రియేట్ చేయాలి. మహామహా కంపెనీలే వాళ్లముందు దిగదుడుపు కావాలి. ఈ ఆలోచనతోనే పుట్టుకొచ్చింది టైలర్ మేడ్ స్టార్టప్.

టైలర్ మేడ్ పూర్తగా యాప్ ద్వారానే పనిచేస్తుంది. అదొక సెంట్రలైజ్డ్ ప్లాట్ ఫాం. కస్టమర్లు కోరుకున్న డిజైన్లు కొన్ని క్లిక్కుల ద్వారా కస్టమైజ్ చేసుకుంటే చాలు.. వాళ్లొచ్చి సర్వీస్ అందిస్తారు.

టైలర్ మేడ్ ఫౌండర్ అసిఫ్ కమల్. 27 ఏళ్ల ఈ కుర్రాడు దుబాయ్‌లో కొంతకాలం మోడ్రన్, కాంటెంపరరీ ఆర్ట్ గ్యాలరీ నడిపించాడు. దాంతోపాటు తన తండ్రి టెక్స్ టైల్ వ్యాపారంలోనూ పాలుపంచుకున్నాడు. ఏడాది క్రితం టైలర్ మేడ్ స్టార్టప్ ప్రారంభించాడు. యాప్ ద్వారా రియల్ టైం టైలరింగ్ సర్వీస్ అందించాలన్న లక్ష్యంతో ఈ రంగంలోకి దిగాడు. అలా ముంబైకి షిఫ్టయి యాప్ టెస్ట్ చేశాడు. అక్కడే ఉండి టీం బిల్డప్ చేశాడు. ఇండియా ఒక్కటే కాదు దీన్నొక గ్లోబల్‌గా ప్లాట్ ఫాం చేయాలన్నది అసిఫ్ లక్ష్యం. అందుకు ఇండియా లాంఛ్ ప్యాడ్ కావాలని భావించాడు. ఆ తర్వాత ఇతర దేశాలకు విస్తరించాలన్నది ప్లాన్.

తండ్రికి సంబంధించిన టెక్స్ టైల్ బిజినెస్‌లో అనుభవం ఉంది కాబట్టి ఇందులో సాధక బాధకాలేంటో త్వరలోనే తెలుసుకోగలిగాడు. హైలీ ఆర్గనైజ్డ్ బిజినెస్‌లో టైలర్లు దొరకడం గగనమైంది. ఇటు ఎకానామికల్ గా, అటు నైపుణ్యపరంగా దర్జీలను నియమించుకోవడం ఒకరకంగా కష్టంగానే అనిపించింది. ఏదేమైనా అందరికీ ఒప్పించి ప్లాట్ ఫాంపైకి తీసుకురాగలిగాడు. ఇంకో విశేషం ఏంటంటే ఈ స్టార్టప్ తో కలిసి పనిచేస్తామని సుమారు 500 వరకు అప్లికేషన్లు వచ్చాయి. అందులో 85 మందిని భాగస్వామ్యం చేసుకున్నారు.

టైలర్ మేడ్ లో ఉన్న వాళ్లంతా ప్రొఫెషనల్ టైలర్స్. నడుస్తున్న ట్రెండుని ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతారు. మారుతున్న ఫ్యాషన్‌ కు అనుగుణంగా తమ నైపుణ్యానికి పదును పెట్టుకుంటారు. ట్రెండుని ఈజీగా అర్ధం చేసుకోగలిగేవాళ్లను నియమించుకున్నాడు.

మొదటగా ఎనిమిది మందితో ఆపరేషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఢిల్లీలో కూడా చిన్నపాటి టీం ఉంది. ఇప్పుడు ముంబైలో 12 మంది ఎగ్జిక్యూటివ్‌లున్నారు. సగటున ఆర్డర్ సైజ్ రూ. 900 ఉంటుంది. లీడ్స్ ఇస్తే 30 శాతం డిస్కౌంట్ ఇస్తారు. ఇప్పటిదాకా 700 మంది యాప్ డౌన్ లోడ్ చేసుకున్నారు. యాండ్రాయిడ్ రేటింగ్ 4.5 ఉండగా,ఐఓఎస్ లో 5స్టార్ రేటింగ్ ఉంది.

ఆన్ డిమాండ్ టెక్ టైలర్స్ రంగంలో పోటీకేం తక్కువ లేదు. అర్బన్ టైలర్స్, ఫ్యాబ్ స్టిచ్, డిజైనర్ ఆన్ కాల్, స్టిచ్ మై ఫ్యాబ్రిక్, బెస్పోక్ ఫ్యాషన్, బాంబే షర్ట్ కంపెనీ తదితర కంపెనీలు కస్టమైజ్డ్ క్లోథింగ్ మీద బిజినెస్ చేస్తున్నాయి.

బెస్పోక్ గార్మెంట్ కంపెనీ ప్రతినిధి లెక్కల ప్రకారం ఇండియాలో టైలరింగ్ ఇండస్ట్రీ 15 బిలియన్ డాలర్ల మార్కెట్ చేస్తోంది. దాంట్లో కస్టమ్ మేడ్ క్లాథింగ్ సెగ్మెంట్‌ వాటా 20 శాతం. 80 శాతం రెడీ వేర్ కేటగిరీది.

త్వరలో ఢిల్లీ, పుణె, బెంగళూరులో కూడా టైలర్ మేడ్ సర్వీస్ ఎక్స్ పాండ్ చేయాలని చూస్తున్నారు అసిఫ్. దాంతోపాటు గ్లోబల్ ప్లాట్ ఫాంలో కూడా తనదైన ముద్ర వేయాలని కృతనిశ్చయంతో ఉన్నాడు. త్వరలో లండన్, దుబాయ్, సింగపూర్‌లో టైలర్ మేడ్ లాంఛ్ చేయబోతున్నాడు.

Related Stories

Stories by team ys telugu