నిజామాబాద్‌ డాక్టర్ దంపతుల పెద్దమనసుకు వందనం

నిజామాబాద్‌ డాక్టర్ దంపతుల పెద్దమనసుకు వందనం

Saturday June 17, 2017,

3 min Read

సాయం చేయాలని చాలా మంది అనుకుంటారు. కానీ దాన్ని అమలు చేయాలన్న దృఢ సంకల్పం కొంత మందికే ఉంటుంది. నిజామాబాద్ కు చెందిన డాక్టర్ దంపతులు అలాంటి సేవాగుణం ఉన్నవాళ్లే. వాల్ ఆఫ్ కైండ్ నెస్ పేరుతో వారు ప్రారంభించిన మంచి పని నలుగురికీ ఉపయోగపడుతోంది. పది మందీ ఆదర్శంగా తీసుకొని తోచింది దానం చేస్తున్నారు.

image


ఇంట్లో బీరువా నిండా బోలెడన్ని బట్టలుంటాయి. అందులో సైజు సరిపోనివి, అవసరం లేనివి చాలానే ఉంటాయి. అలాంటి బట్టలను స్టీలు సామాన్లకు వేస్తే ఏమొస్తుంది? కప్పుకోవడానికి జానెడు బట్ట లేని వారికి దానం చేస్తే చెప్పలేనంత ఆత్మసంతృప్తి మిగులుతుంది. ఇదే సూత్రంతో ఎంతో మందికి సాయం చేస్తుంది వాల్ ఆఫ్ కైండ్ నెస్. ఇప్పటికే చాలా మంది వాల్ ఆఫ్ కైండ్ నెస్ కాన్సెప్టుతో తోచిన సాయం చేస్తున్నారు. నిజామాబాద్ కు చెందిన డాక్టర్ శ్రావణీ శ్రీనివాస్ దంపతులు కూడా సేవా కార్యక్రమాన్ని ప్రారంభించారు. వాళ్లు మొదలుపెట్టిన వాల్ ఆఫ్ కైండ్ నెస్ ఇప్పుడు నలుగురికీ ఉపయోగపడుతుంది. మీకు ఉపయోగం లేనివి ఇక్కడ వదలండి, మీకు అవసరమైనవి కావాలంటే తీసుకెళ్లండి అని గోడ మీద రాసిన కొటేషన్స్ పది మందినీ కదిలిస్తున్నాయి.

డాక్టర్ దంపతులు శ్రావణి శ్రీనివాస్ పదిహేనేళ్లుగా నిజామాబాద్ లో ప్రాక్టీస్ చేస్తున్నారు. వెల్ సెటిల్డ్ కదాని ఇద్దరు ఎప్పుడూ సంతృప్తి పడలేదు. పేదవారి కోసం ఏదైనా చేయాలన్న తపన భార్యభర్తలిద్దరికీ ఉండేది. డాక్టర్ శ్రావణి వాల్ ఆఫ్ కైండ్ నెస్ గురించి తెలుసుకున్నారు. ఆ ఐడియాను భర్తతో షేర్ చేసుకున్నారు. ఇద్దిరికీ కాన్సెప్ట్ నచ్చింది. నిజామాబాద్ లో ఖలీల్ వాడీ సెంటర్ అయితే బాగుంటుందనుకున్నారు. వెంటనే మున్సిపల్ అధికారులను నుంచి పర్మిషన్ తీసుకొని, జూన్ 4 నాడు వాల్ ఆఫ్ కైండ్ నెస్ కు శ్రీకారం చుట్టారు. ముందుగా డాక్టర్ దంపతులే పాత బట్టలను గోడకు తగిలించడం మొదలు పెట్టారు. మెల్లగా స్థానికులు కూడా వారి సేవా గుణాన్ని చూసి ఇన్ స్పైర్ అయ్యారు.

ఇప్పుడా గోడ ఖాళీలేదు. హ్యాంగర్ల నిండా బట్టలున్నాయి. ఎవరికి కావాల్సింది వాళ్లు తీసుకెళ్తున్నారు. అవసరముంది తీసుకెళ్తారు తప్ప అనవసరంగా ఎవరూ ఏదీ ముట్టుకోరు. ముఖ్యంగా చిన్న పిల్లలు పాత పుస్తకాలను, స్కూల్ బ్యాగులను గోడ దగ్గర వదిలి వెళ్తున్నారు. ఒక్క బట్టలే కాదు చెప్పులు, ఆట బొమ్మలు, ఇతర వస్తువులను కూడా గోడకు తగిలించి వెళ్లొచ్చు. వాటిని కావాల్సిన వారు నిరభ్యంతరంగా తీసుకొని పోతారు. దీనివల్ల సాయం చేయాలనుకునే వారి కోరిక తీరుతోంది. అవసరం ఉన్నవారికి వస్తువులు దొరుకుతున్నాయి. ఇచ్చిన వారు, తీసుకున్న వారు ఇద్దరూ సంతోషంగా ఉంటారు. వానాకాలంలో కప్పుకోవడానికి జానెడు బట్ట లేని నిర్భాగ్యులకు ఈ గోడ మమకారాన్ని పంచుతుంది. ఒక వెచ్చని ఆత్మీయ స్పర్శ అందిస్తుంది. ఇంతకంటే ఆనందం ఇంకేముంటుందంటున్నారు డాక్టర్ దంపతులు.

వాల్ ఆఫ్ కైండ్ నెస్ పేరుతో డాక్టర్ శ్రావణి శ్రీనివాస్ దంపతులు చేస్తున్న సేవా ప్రయత్నానికి స్థానికుల నుంచి మంచి స్పందన వస్తోంది. వాళ్లను చూసి ఇంకా చాలా మంది తోచింది దానం చేసి వెళ్తున్నారు. సాయం చేయాలన్న ఆలోచన ఉన్న వారికి ఇదొక మంచి వేదికగా మారింది. ఈ ఆలోచనను నిజామాబాద్ జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో కూడా అమలు చేస్తే చాలా బాగుంటుందని స్థానికులు అంటున్నారు. అటు డాక్టర్ దంపతులపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

బోలెడంత డబ్బు ఖర్చు పెట్టి బ్రాండెడ్ వస్తువులు చాలానే కొంటుంటాం. అవసరం తీరిపోయాక వాటిని ఏ స్టోర్ రూమ్ లోనో పడేస్తుంటాం. విలువైన వాటిని వృథా చేయకుండా వాల్ ఆఫ్‌ కైండ్ నెస్ దగ్గర వదిలి వెళ్తే నలుగురికీ ఉపయోగపడతాయి. బట్టలు లేని వారికి బట్టలు దొరుకుతాయి. పేద పిల్లలకు పుస్తకాలు, చెప్పులు లేవన్న బాధ ఉండదు. హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన వాల్ ఆఫ్ కైండ్ నెస్ కు కూడా విశేష స్పందన లభిస్తోంది. వీలైతే మీరు కూడా మీ ఏరియాలో వాల్ ఆఫ్ కైండ్ నెస్ గోడలు ఏర్పాటు చేయండి. ఇవ్వడంలో ఎంత ఆనందం ఉంటుందో మీకే తెలుస్తుంది.