జార్జ్ ఆత్వ‌విశ్వాసం ముందు ఓడిన వైక్య‌లం..

ఆత్మ‌విశ్వాసంతో దృష్టిలోపాన్ని జ‌యించిన జార్జ్‌వ‌ర‌ల్డ్ బ్లైండ్ క్రికెట్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసిన జార్జ్‌

జార్జ్ ఆత్వ‌విశ్వాసం ముందు ఓడిన వైక్య‌లం..

Monday June 08, 2015,

8 min Read

అన్ని దేశాల సంగతేమో కానీ.. ఇండియాలో మాత్రం క్రికెట్‌ ఒక మ‌తం.. అందులో క్రికెట‌ర్లు దేవుళ్లు. ఇరుకు సందుల్లో మొదలుకొని స్టేడియం వరకు క్రికెట్ ఆడుతున్న దృశ్యాలు కనిపిస్తూనే ఉంటుంది. జాతీయ క్రీడ హాకీ అయినా దేశ‌వ్యాప్తంగా అభిమానులంద‌రినీ ద‌గ్గ‌ర‌చేస్తున్న‌ది క్రికెట్టే.. అంద‌రిలాగే జార్జ్ అబ్ర‌హంకూ క్రికెట్టే శ్వాస‌.. ఊపిరి.. ఈ క్రికెట్ మీద ప్రేమే.. అత‌డిని వైక్య‌లం మీద విజ‌యం సాధించేలా చేసింది..

ఇంగ్లిష్‌లో ఓ సామెత ఉంది.. "అన్ని క్రీడ‌లు పైపైనే శ‌రీరాన్ని తాకితే క్రికెట్ మాత్రం న‌రాల్లో ర‌క్తంలా క‌లిసిపోతుందీ" అని. డెహ్ర‌డూన్‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ విజువ‌ల్లీ హ్యాండీక్యాప్డ్‌ను సంద‌ర్శించిన‌ప్పుడు ఈ సామెత నిజ‌మేన‌ని జార్జ్ అబ్ర‌హంకు అనిపించింది. అక్క‌డి గెస్ట్ హౌజ్‌లో బ‌స‌చేసిన‌ప్పుడు విద్యార్థుల్లో క్రికెట్‌పై ఉన్న ఆస‌క్తిని గ‌మ‌నించారాయ‌న‌. ఉద‌య‌మే లేవ‌డం.. క్రికెట్ ఆడ‌టం.. బ్రేక్ ఫాస్ట్ చేయ‌డం.. క్రికెట్ ఆడ‌టం.. లంచ్ చేయ‌డం క్రికెట్ ఆడ‌టం.. విద్యార్థుల షెడ్యూల్ మొత్తం ఇదే. వెలుతురు బాగాలేక‌పోతే త‌ప్ప వారు బ్యాట్ బాల్‌ను వ‌ద‌ల‌డం లేదు. అదీ అంపైర్‌కు బాల్ క‌నిపించ‌క‌పోతేనే..

చిన్న‌వ‌య‌సులోనే దృష్టిలోపం..

జార్జ్ ప‌దినెల‌ల వ‌య‌సున్న‌ప్పుడు కంటికి ఇన్ఫెక్ష‌న్ సోకింది. ఈ కార‌ణంగా కంటిచూపు దెబ్బ‌తిన్న‌ది. దృష్టిలోపం ఏర్ప‌డినా అత‌డిని అంధుల పాఠ‌శాల‌కు కాకుండా సాధార‌ణ స్కూల్‌కే పంపారు అత‌ని త‌ల్లిదండ్రులు.ఇదే ఇత‌ర అంధ విద్యార్థుల నుంచి జార్జ్‌ను ప్ర‌త్యేకంగా నిల‌బెట్టింది. దృష్టిలోపం గురించి బాధ‌ప‌డుతున్న త‌న తోటి విద్యార్థుల గురించి జార్జ్ ఇలా అంటారు. "వారు దేవుడిచ్చిన వైకల్యంతో బాధ‌ప‌డరు. ఇత‌రులు చూపే సానుభూతి వారిని మ‌రింత‌గా బాధ‌పెడుతుంది. ఇలాంటి జాలి మంచి కంటే చెడే ఎక్కువ చేస్తుంది".

దృష్టిలోపం ఉన్న‌వారు సైతం సాధార‌ణ పౌరుల్లాగే ఏదైనా సాధించ‌గ‌ల‌ర‌ని జార్జ్ నిరూపించారు. అంధులకు సాయం చేసేందుకు అడ్వ‌ర్ట‌యిజింగ్ రంగంలో మంచి ఉద్యోగాన్ని వ‌దిలి బ్లైండ్ వ‌ర‌ల్డ్ క్రికెట్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేశారు. బ్లైండ్ క్రికెట్‌తో జార్జ్ సంచ‌ల‌నాలు సృష్టించిన‌ప్ప‌టికీ, ఆయ‌న సాధించిన ఘ‌న‌త‌ను గుర్తించేందుకు మాత్రం స‌మాజం ముందుకురాలేదు. ఈ విష‌యం గుర్తొచ్చి జార్జ్ అప్పుడ‌ప్పుడు బాధ‌ప‌డుతుంటారు.

క్రికెట్‌, మ్యూజిక్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌..

భార‌త్‌లో ఇత‌ర సాధార‌ణ చిన్నారుల‌లాగే జార్జ్‌కు కూడా క్రికెట్‌, మ్యూజిక్‌, ఎంట‌ర్‌టైన్‌మెంట్ అంటే ఎంతో ఇష్టం. ఆ మూడింటి కోసం ఎంతో ప‌రిత‌పిస్తారు. ఆ మూడింటితోనే జీవితం సాగించారు. క్రికెట్‌లో డెన్నిస్ లిల్లీ.. మ్యూజిక్‌లో కిషోర్ కుమార్‌, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌లో అమితాబ్ బ‌చ్చ‌న్ ఆయ‌న హీరోలు.


వ‌ర‌ల్డ్ బ్లైండ్ క్రికెట్ కౌన్సిల్‌ను వ్య‌వ‌స్థాప‌కుడు జార్జ్ అబ్ర‌హం

వ‌ర‌ల్డ్ బ్లైండ్ క్రికెట్ కౌన్సిల్‌ను వ్య‌వ‌స్థాప‌కుడు జార్జ్ అబ్ర‌హం


బాల్య‌మంతా క‌ష్టాల‌మ‌య‌మే..

చిన్నారుల‌కు వైక‌ల్య‌మ‌న్నా, వివ‌క్ష‌న్నా, వేధింపుల‌న్నా పెద్ద‌గా తెలియ‌వు. అంద‌రూ మంచి వాళ్లే అనుకుంటారు. అంతా మంచే జ‌రుగుతుంద‌నుకుంటారు. అంద‌రిలాగే చిన్నారి జార్జ్ కూడా ఫీల‌య్యాడు. బ్లైండ్ స్కూల్‌లో కాకుండా మ‌మూలు స్కూల్‌లో చేర‌డం ఒక‌ర‌కంగా జార్జ్‌కు మంచే చేసింది. ఆరంభంలో జార్జ్ వైక‌ల్యాన్ని చూసి తోటి విద్యార్థులు న‌వ్వేవారు. కానీ స‌మ‌యం గ‌డిచే కొద్దీ వైక‌ల్యాన్ని ప‌ట్టించుకోకుండా జార్జ్‌ను స్నేహితుడిగా చేసుకొన్నారు. త‌మ‌లో ఒక‌డిగా క‌లుపుకున్నారు. హోంవ‌ర్క్‌లో సాయం చేశారు. ఆడుకునేందుకు త‌మ బొమ్మ‌ల‌నిచ్చారు. ఇలాంటి స‌హ విద్యార్థుల ల‌భించ‌డం జార్జ్‌కు ఎంతో సంతోషాన్నిచ్చింది.

16 ఏళ్ల వ‌య‌సులో ఒంట‌రి ప్ర‌యాణం..

దృష్టిలోపం ఉన్నా 16 ఏళ్ల వ‌య‌సులోనే ఒంట‌రిగా కొచ్చి నుంచి ఢిల్లీ ప్ర‌యాణించి జార్జ్ తెగువ‌ను ప్ర‌ద‌ర్శించాడు. కంటిచూపు లేక‌పోవ‌డం ఇబ్బంది క‌లిగిస్తుందేమోన‌ని జార్జ్ తల్లి తెగ ఇబ్బందిప‌డ్డారు. కొడుకుకు ఎలాంటి ఇబ్బంది క‌లుగ‌కూడ‌ద‌ని రైల్లో ఢిల్లీ వెళ్తున్న ఇద్ద‌రు న‌న్స్‌కు త‌న కుమారుడి బాగోగులు చూసుకోమ‌ని చెప్పారు. ఇది జార్జ్‌కు ఒకింత బాధ క‌లిగించింది. అయితే జార్జ్ మొహంలో బాధ‌ను గ్ర‌హించిన ఆయ‌న తండ్రి, అడిగితేనే సాయం చేయాల‌ని చెప్పారు. దీంతో జార్జ్ ఆత్మ‌గౌర‌వం రెట్టింపైంది. ఆ ప్ర‌యాణం మొత్తం జార్జ్ ఒంట‌రిగానే సాగించారు. ఎవ‌రి సాయ‌మూ తీసుకోలేదు. ఎవ‌రూ సాయం చేయ‌లేదు. ఒంట‌రిగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్ర‌యాణం సాగించ‌డం జార్జ్‌లో ఆత్మ‌విశ్వాసాన్ని పెంచింది. ఆత్మ‌విశ్వాసం వ‌స్తే చాలు.. ఎలాంటి వైక‌ల్య‌మైనా దాని ముందు దిగుదుడుపే అని ఆ రోజు ప్ర‌యాణంతో జార్జ్‌కు తెలిసిపోయింది.

ఒగ్లీవ్‌లో చేరిక‌.. గుడ్‌బై..

వ‌రల్డ్ క్రికెట్ కౌన్సిల్ స్థాపించ‌క‌ముందు ప్ర‌ఖ్యాత అడ్వ‌ర్ట‌యిజింగ్ కంపెనీ ఓగ్లీవ్‌లో జార్జ్ ప‌నిచేశారు. 1982లో ఏఎస్పీ(ASP) అనే అడ్వ‌ర్ట‌యిజింగ్ కంపెనీలో జార్జ్ ప‌నిచేశారు. ఆ కంపెనీ జార్జ్‌ను ఢిల్లీ నుంచి ముంబైకి బ‌దిలీ చేసింది. ముంబైలో ఉన్న స‌మ‌యంలో ఓ పార్టీలో ఓగ్లీవ్‌లో ప‌నిచేసే ఉద్యోగులు జార్జ్‌కు ప‌రిచ‌య‌మ‌య్యారు. జాబ్ మారే ఉద్దేశ‌మేమైనా ఉందా అని క్యాజువ‌ల్‌గా అడిగారు. అంతే ఆ మ‌ర్నాడే ఓగ్లీవ్‌లో ఉద్యోగం కోసం అప్ల‌య్‌ చేశారాయ‌న‌. చాలా రౌండ్ల ఇంట‌ర్వ్యూ త‌ర్వాత ఆ కంపెనీ బాస్ ఎస్ఆర్ అయ్య‌ర్‌ను క‌లిసే అవ‌కాశం ల‌భించింది. ఓ పెద్ద కంపెనీ బాస్‌ను క‌లువాలంటే కంటిచూపు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న జార్జ్‌కు ఎంతో టెన్ష‌న్ క‌లిగించింది. త‌న దృష్టి స‌మ‌స్య జాబ్ సంపాదించేందుకు అడ్డ‌వుతుందేమోన‌ని భ‌య‌ప‌డిపోయారు. ఐతే అయ్య‌ర్‌తో స‌మావేశ‌మైన కొద్దిసేప‌ట్లోనే అదంత స‌మ‌స్య కాద‌ని తేలిపోయింది. అయ్య‌ర్ వేసిన తొలి ప్ర‌శ్నే జార్జ్‌లో ఆత్మ‌విశ్వాసాన్ని నింపింది. ఢిల్లీ నుంచి ముంబై వ‌చ్చి ఏం సాధించావ‌ని అయ్య‌ర్ ప్ర‌శ్నించారు. అందుకు జ‌వాబుగా ప‌దినెల‌ల్లో ప‌దికిలోల బ‌రువు పెరిగాన‌ని జార్జ్ స‌ర‌దాగా జ‌వాబిచ్చారంటే ఆయ‌న ఆత్మ‌విశ్వాసం ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. ఈ జ‌వాబు విని అయ్య‌ర్‌తోపాటు అక్క‌డున్న అంద‌రూ న‌వ్వేశారు. ఆ త‌ర్వాత మ‌రి కొన్ని అంశాల‌పై చ‌ర్చించిన త‌ర్వాత జాబ్‌లో ఎప్పుడు చేరుతున్నావ‌ని ఆయ‌న అడిగిన ప్ర‌శ్నతో జార్జ్ మ‌న‌సు ఆనందంతో ఉప్పొంగింది. ఓగ్లీవ్‌తో క‌లిసి మూడేండ్లు ప‌నిచేశారు జార్జ్‌. ఆ సంస్థ అకౌంట్స్ సూప‌ర్‌వైజ‌ర్‌గా ఎదిగారు. ఆ త‌ర్వాత పెళ్లి చేసుకుని ఢిల్లీకి మ‌కాం మార్చ‌డంతో ఓగ్లీవ్‌ను వ‌దిలిపెట్టి మ‌ళ్లీ పాత కంపెనీ ఎఎస్‌పీలో చేరాల్సి వ‌చ్చింది. అయితే అక్క‌డ కూడా ఎక్కువ కాలం కొన‌సాగ‌లేక‌పోయారు.

ఇష్ట‌మైన రంగంలో ప‌య‌నించాలంటే అలాంటి భావాలే ఉన్న వ్య‌క్తుల‌తో క‌లిసి న‌డ‌వాల్సి ఉంటుంది. అది సినిమాలు కావొచ్చు.. లేదంటే క్రీడ‌లు కావొచ్చు. ఇండియాలోనైతే ఇటు క్రికెట్‌, అటు బాలీవుడ్ రెండూ ప్ర‌జ‌ల‌ను ఏకం చేస్తుంది. ఈ రెండుంటే ప్ర‌జ‌లు మ‌రేమీ ప‌ట్టించుకోరంటే అతిశ‌యోక్తికాదేమో. అలాగే రెండు దేశాల మ‌ధ్య సంబంధాల‌ను కూడా ఈ రెండూ క‌లుపుతాయి. ప్ర‌ధానిగా ఉన్న స‌మ‌యంలో అట‌ల్ బిహారీ వాజ‌పేయి పాకిస్థాన్ వెళ్లిన స‌మ‌యంలో అధికారుల‌తోపాటు బాలీవుడ్ యాక్ట‌ర్ల‌ను, మాజీ క్రికెట‌ర్ల‌ను వెంట‌పెట్టుకుని వెళ్లారు.

బ్లైండ్ క్రికెట్‌కు బాట‌లు...

అడ్వ‌ర్ట‌యిజింగ్ రంగంలో ప‌నిచేస్తున్న‌ప్ప‌టికీ జార్జ్ మ‌న‌సంతా క్రికెట్‌పైనే ఉండేది. అంధుల కోసం క్రికెట్ టోర్నీల‌ను నిర్వ‌హించాల‌ని క‌ల‌లు క‌నేవారు. ఈ ఆలోచ‌న వ‌చ్చిన వెంట‌నే మొద‌ట ప్రముఖ క్రికెట‌ర్లు సునీల్ గ‌వాస్క‌ర్, క‌పిల్‌దేవ్‌ల‌ను క‌లిసి త‌న మ‌న‌సులో మాట‌ను బ‌య‌ట‌పెట్టారు. జార్జ్ ఆలోచ‌న‌ను వారు అభినందించిన‌ప్ప‌టికీ బిజీ షెడ్యూల్ కార‌ణంగా క‌లిసి ప‌నిచేయ‌లేమ‌ని చెప్పారు. అయితే బ్లైండ్ క్రికెట్ కోసం త‌మ పేర్లు వాడుకోవ‌చ్చ‌నని చెప్ప‌డంతో అబ్ర‌హం ఆనందం అంతా ఇంతా కాదు. ఎందుకంటే వారి పేర్ల‌కున్న విశ్వ‌స‌నీయ‌త అలాంటిది మరి. బ్లైండ్ క్రికెట్‌ను ప్ర‌మోట్ చేస్తున్న స‌మ‌యంలో జార్జ్‌కు ఎలాంటి గుర్తింపూ లేదు. అలాగే ఆయ‌న వెంట ఉన్న‌వారి ప‌రిస్థితి కూడా అంతే. దీంతో గ‌వాస్క‌ర్‌, క‌పిల్‌ల‌ను ప్యాట్ర‌న్లుగా పేర్కొన‌డం బ్లైండ్ క్రికెట్ ప్ర‌మోష‌న్‌లో ఎంతో ఉప‌యోగ‌ప‌డింది. వారి పేర్ల‌ను ఉప‌యోగించి మ్యాచ్‌ల‌ను, టోర్నీల‌ను నిర్వ‌హించారు. 1993లో సంస్కృతి అవార్డు ల‌భించ‌డం జార్జ్ కెరీర్‌లో ట‌ర్నింగ్‌పాయింట్‌. ఆ అవార్డు రావ‌డంతో జార్జ్‌కు ఎన్నో అవ‌కాశాలు వ‌చ్చిప‌డ్డాయి. ముఖ్యంగా మీడియాలో మంచి గుర్తింపు ల‌భించింది. ఆయ‌న గురించి రాసేందుకు మీడియా కూడా ముందుకొచ్చింది. దీంతో బ్లైండ్ క్రికెట్ ప్ర‌మోష‌న్‌లో సాయం చేసేందుకు చాలామంది ముందుకొచ్చారు.


బ్లైండ్ వ‌ర‌ల్డ్‌క‌ప్‌ను గెలుచుకున్న భార‌త జ‌ట్టు

బ్లైండ్ వ‌ర‌ల్డ్‌క‌ప్‌ను గెలుచుకున్న భార‌త జ‌ట్టు


బ్లైండ్ క్రికెట్ ప్ర‌మోష‌న్ కోసం తిరుగుతున్న స‌మ‌యంలో ఎవ‌రూ జార్జ్‌ను పట్టించుకోలేదు. అదో స‌మాజ సేవ‌గా ఎవ‌రూ గుర్తించ‌లేదు. బ్లైండ్ క్రికెట్ అంటే మామూలు క్రికెట్ కాదు.. అలాగే అంధుల‌కూ పూర్తిగా ఉప‌యోగ‌ప‌డ‌దు.. ఇలాంటి ప‌నులెందుకు అని చాలామంది జార్జ్‌ను నిరుత్సాప‌రిచే ప్ర‌య‌త్నం చేశారు. బ్లైండ్ క్రికెట్ ప్ర‌మోష‌న్ కాకుండా ఏదైనా అంధుల పాఠ‌శాల పెట్టుకుని ఉండి ఉంటే చాలామంది స‌హ‌క‌రించేవారు. ఆయ‌న‌ను ప్ర‌శంసించి ఉండేవారు కూడా. నిధులు, వ‌న‌రులు కూడా వ‌చ్చిప‌డేవి. కానీ బ్లైండ్ క్రికెట్‌ను ప్ర‌మోట్ చేసేందుకు జార్జ్ ప‌డిన క‌ష్టం అంతా ఇంతా కాదు..

వ‌రల్డ్ బ్లైండ్ క్రికెట్ కౌన్సిల్

1996లో ఎట్ట‌కేల‌కు వ‌ర‌ల్డ్ బ్లైండ్ క్రికెట్ అసోసియేష‌న్ ఏర్పాటైంది. క్రికెట్ ఆడే దేశాల్లో ఏడు దేశాలు ఈ కౌన్సిల్‌లో స‌భ్య‌త్వం తీసుకునేందుకు ముందుకొచ్చాయి. తొలి రోజే మూడు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. ఒక‌టి వ‌ర‌ల్డ్ క్రికెట్ కౌన్సిల్ ఏర్పాటు.. రెండు భార‌త్‌లో బ్లైండ్ క్రికెట్ వ‌ర‌ల్డ్ క‌ప్‌ను నిర్వ‌హించ‌డం.. మూడు నిబంధ‌న‌లు రూపొందించ‌డం.. ఈ బ్లైండ్ క్రికెట్‌కు సంబంధించి ఒక్కో దేశంలో ఒక్కో ర‌కంగా నిబంధ‌న‌లున్నాయి. అన్ని దేశాల అభిప్రాయాల‌ను తీసుకుని నిబంధ‌న‌లు రూపొందించేందుకు జార్జ్ బృందానికి రెండురోజులు ప‌ట్టింది.


వ‌ర‌ల్డ్ బ్లైండ్ క్రికెట్ కౌన్సిల్ లోగో..

వ‌ర‌ల్డ్ బ్లైండ్ క్రికెట్ కౌన్సిల్ లోగో..


చెయ్యిచ్చిన కేంద్రం..

వ‌ర‌ల్డ్ బ్లైండ్ క్రికెట్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయ‌గ‌లిగిన‌ప్ప‌టికీ భార‌త్‌లో క్రికెట్ టీమ్‌ను ఎంపిక‌చేయ‌డం చాలా క‌ష్ట‌మైంది జార్జ్‌కు. అలాగే టోర్నీ నిర్వ‌హ‌ణ‌కు ప‌డిన క‌ష్టం అంతా ఇంతా కాదు. అన్ని మ్యాచ్‌ల‌ను ఢిల్లీలోనే నిర్వ‌హించారు. ఫైన‌ల్లో పాకిస్థాన్‌ను ఓడించి సౌతాఫ్రికా క‌ప్ గెలుచుకుంది. తొలి వ‌ర‌ల్డ్‌క‌ప్‌ను దిగ్విజ‌యంగా నిర్వ‌హించిన‌ప్ప‌టికీ, అందుకు జార్జ్ ప‌డిన క‌ష్టం మామూలుది కాదు. స్పాన్స‌ర్షిప్ నుంచి చివ‌రి నిమిషంలో అప్ప‌టి భార‌త కేంద్ర ప్ర‌భుత్వం వైదొల‌గ‌డం జార్జ్‌కు క‌ష్టాలు తెచ్చిపెట్టింది. ఐతే జార్జ్ చొర‌వ‌తో చిన్నా చిత‌కా కంపెనీలు స్పాన్స‌ర్షిప్ చేసేందుకు ముందుకు రావ‌డంతో టోర్నీ నిర్వ‌హ‌ణ‌కు ఎలాంటి ఆటంకాలు ఎదురుకాలేదు. ఐతే టోర్నీ స్సాన్స‌ర్షిప్ నుంచి వైదొలుగుతూ అప్ప‌టి కేంద్ర ప్ర‌భుత్వ అధికారులు చేసిన వ్యాఖ్య‌లు జార్జ్ మ‌న‌సును నొప్పించాయి. అంధుల కోసం నిర్వ‌హిస్తున్న క్రికెట్ టోర్నీ అంత గుర్తించ‌ద‌గిన‌ది కాద‌ట‌. అంధులు క్రికెట్ ఆడాల్సిన అవ‌స‌ర‌మేమిటో అని వారు చేసిన కామెంట్స్ జార్జ్‌లో ఆవేశాన్ని ర‌గిలించాయి. క్రికెట్ టోర్నీకి బ‌దులుగా అంధుల పాఠ‌శాల పెడితే సాయం చేస్తామ‌న్న‌ ఆఫ‌ర్‌నూ ఆయ‌న తిర‌స్క‌రించారు. కేంద్రం కాదుపొమ్మ‌న్నా ఇత‌ర కంపెనీల‌ను ప‌ట్టుకుని టోర్నీని విజ‌య‌వంతం చేశారు.

మాధ‌వ‌రావు సింధియా చేయూత‌..

ప్రభుత్వం స్పాన్స‌ర్షిప్ నుంచి త‌ప్పుకున్నా, కాంగ్రెస్ నేత‌, క్రికెట్ అంటే ప‌డిచ‌చ్చే మాధ‌వ‌రావు సింధియా అందించిన సాయంతోనే జార్జ్ గ‌ట్టెక్కారు. 20 ల‌క్ష‌ల రూపాయ‌లు ఇవ్వడంతోపాటు టోర్నీ నిర్వ‌హించే వ‌ర‌కూ సింధియా బాస‌ట‌గా నిలిచారు. అదంతా ఇప్పుడు చ‌రిత్ర‌. టోర్నీ పెద స‌క్సెస్ అయింది. అభిమానులు కూడా బాగా ఎంజాయ్ చేశారు. 2002లో నిర్వ‌హించిన రెండో వ‌ర‌ల్డ్‌క‌ప్‌ను పాకిస్థాన్ గెలుచుకుంది.

ప‌ర్స‌నాలిటీ డెవ‌ల‌ప్‌మెంట్ వ‌ర్క్‌షాప్..

బ్లైండ్ క్రికెట్‌తోపాటు అంధుల కోసం మ‌రిన్ని కార్య‌క్ర‌మాలు చేయాల‌ని జార్జ్ నిర్ణ‌యించారు. దృష్టిలోపం ఉన్నా, తాను ఇత‌ర రంగాల్లో స‌క్సెస్ కావ‌డానికి క‌మ్యునికేష‌న్సే కార‌ణ‌మ‌ని గ్ర‌హించిన జార్జ్‌.. త‌న తోటివారికి కూడా క‌మ్యునికేష‌న్‌లో శిక్ష‌ణ ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు. అనుకున్న‌దే త‌డువుగా దేశ‌వ్యాప్తంగా ప‌ర్స‌నాలిటీ అండ్ క‌మ్యునికేష‌న్స్‌లో వ‌ర్క్‌షాప్స్‌ను నిర్వ‌హించారు. ఈ వ‌ర్క్‌షాప్స్ అంధుల‌కు సాధికారిత ఇస్తుంద‌ని జార్జ్ గ‌ట్టిగా న‌మ్మారు. అంధుల ప్ర‌ధాన స‌మ‌స్య దృష్టిలోపం కాద‌ని, ఇత‌రుల సానుభూతే అని జార్జ్ అంటూ ఉంటారు. వైక‌ల్యంతో బాధ‌ప‌డుతున్న‌వారికి ఎవ‌రి సానుభూతీ అక్క‌ర్లేదు. వారికి కావాల్సింద‌ల్లా అవ‌కాశాలు. అందుకే వైక‌ల్యంతో ఉన్న‌వారిని ఆదుకునేందుకు ఐవే అనే సంస్థ‌ను ప్రారంభించారు జార్జ్‌. దృష్టి స‌మ‌స్య‌ల‌తో బాధ‌పడుతున్న‌వారిలో టాలెంట్‌ను గుర్తించి అందుకు త‌గ్గ అవ‌కాశాల‌ను ఈ ఐవే క‌ల్పిస్తుంది. ఈ సంస్థ ఇటీవ‌లే "న‌జ‌ర్ ఏ న‌జారియా" పేరుతో ఓ టెలివిజ‌న్ సీరియ‌ల్‌ను కూడా నిర్మించింది. ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు న‌సీరుద్దీన్ షా ఈ సీరియ‌ల్ 13 ఎపిసోడ్ల‌కు ముందుమాట‌తోపాటు సైనాఫ్ కూడా చెప్పారు.

మ్యాజిక్ ట‌చ్ ఏర్పాటు..

అంధుల్లో దాగి ఉన్న క్రికెట్ నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు శ్ర‌మించిన జార్జ్ అబ్ర‌హం.. బ్లైండ్ సింగ‌ర్స్ కోసం మ్యాజిక్ ట‌చ్ అనే సంస్థ‌ను నెల‌కొల్పారు. 2002లో పాకిస్థాన్ టూర్‌కు వెళ్లిన‌ప్పుడు ఓ కాన్స‌ర్ట్‌లో ఓ అంధ బాలిక పాడిన పాట అంద‌రినీ ఆక‌ట్టుకుంది. అప్పుడే మ్యాజిక్ ట‌చ్‌కు జార్జ్ మ‌న‌సులో బీజం ప‌డింది. ఇస్లామాబాద్ నుంచి లాహోర్ వెళ్తున్న స‌మ‌యంలో న‌వ్రోజ్ థాండేతో జార్జ్ చ‌ర్చించారు. దృష్టి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న చిన్నారుల‌ను మ్యూజిక్ నేర్చుకోవాల్సిందిగా చాలామంది స‌ల‌హా ఇస్తుంటారు. చాలామంది నేర్చుకుంటుంటారు కూడా. మ‌రి ఇంత మంది మ్యూజిక్ నేర్చుకుంటుంటే.. వారిలో ఒక్క‌రు కూడా లైమ్‌లైట్‌లోకి రాక‌పోవ‌డం జార్జ్‌ను ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. దీంతో బ్లైండ్ సింగ‌ర్స్ టాలెంట్‌ను బ‌య‌టి ప్ర‌పంచానికి చాటి చెప్పేందుకు జార్జ్ మ్యాజిక్ ట‌చ్‌ను ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా ఆడిష‌న్స్‌, కాన్స‌ర్ట్స్ నిర్వ‌హించారు. కొంత‌కాలంపాటు మ్యాజిక్ ట‌చ్ బాగానే న‌డిపినప్ప‌టికీ.. జార్జ్‌కు స‌మ‌యం స‌రిపోక‌పోవ‌డంతో ఆ ప్ర‌య‌త్నం అంత‌గా విజ‌యం సాధించ‌లేదు. ప్ర‌స్తుతానికి ఆ సంస్థ క్రియాశీల‌కంగా ప‌నిచేయ‌పోయిన‌ప్ప‌టికీ మొత్తానికి మాత్రం మూసేయ‌లేదు. సంగీతానికి అంద‌రినీ ఏకం చేసే శ‌క్తి ఉంది. ఈ సంగీతం వివ‌క్ష‌ను రూపుమాపుతుంది. సంగీతం పోటీల్లో పాల్గొనేవారెవ‌రైనా, అంధులైనా, సాధార‌ణ ప్ర‌జ‌లైనా త‌మ టాలెంట్‌తోనే విజ‌యం సాధించాల్సి ఉంటుంది. ఎలాంటి రిజ‌ర్వేష‌న్లు ఉండ‌వు. కానీ ప్ర‌స్తుతం మ్యూజిక్ ఇండ‌స్ట్రీలో ఒక్క టాలెంట్ మాత్ర‌మే ఉంటే స‌రిపోదు. మార్కెట్ చేసుకునే నైపుణ్యం ఉండాలి. మ‌న టాలెంట్‌కు త‌గ్గ ప్యాకేజీని మాట్లాడుకోగ‌ల‌గాలి. బ్లైండ్ స్కూల్స్‌లో సుర‌క్షిత వాతావ‌ర‌ణంలో పెరిగే పిల్ల‌ల‌కు ఇవి సాధ్యం కావ‌డంలేద‌ని జార్జ్ అంటుంటారు. సాధార‌ణ పిల్ల‌ల‌తో పోటీప‌డ‌టంలో దృష్టిలోపం క‌లిగిన పిల్ల‌లు వెనుక‌ప‌డ‌టానికి ఇదే కార‌ణ‌మంటారు. రియాల్టీ షోల‌లో పాల్గొనే దృష్టిలోపం క‌ల చిన్నారుల‌కు ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న వ‌స్తుంది. కానీ అది ప్ర‌తిభ‌కు మెచ్చి వారు ప్ర‌శంసించ‌డంలేదు. వైక‌ల్యాన్ని చూసి సానుభూతితో ఓట్లేస్తున్నార‌ని జార్జ్ ఆవేద‌న వ్య‌క్తం చేస్తుంటారు. దృష్టి లోపం ఉన్న‌ప్ప‌టికీ జార్జ్ ఎన్నో సాధించారు. ఐతే ఈయ‌న సాధించిన ఘ‌న‌త‌ల‌ను ఎవ‌రూ గుర్తించ‌క‌పోవ‌డ‌మే ఆయ‌న‌ను తీవ్రంగా బాధిస్తున్న‌ది. తాను ఎన్నో అడ్డంకుల‌ను ఎదుర్కొన్న‌ప్ప‌టికీ, తాను ఎదుర్కొన్న అడ్డంకుల్లోకి అతి పెద్ద స‌మ‌స్య సానుభూతే న‌ని ఆయ‌న చెప్తుంటారు. దృష్టిలోపంతో బాధ‌ప‌డుతున్న చిన్నారుల‌ను అర్థం చేసుకోవాల్సింది పోయి, వారికి ర‌క్ష‌ణ క‌ల్పించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని, అదే వారిపాలిట శాపంగా మారుతుంద‌ని జార్జ్ అభిప్రాయ‌ప‌డుతున్నారు. "మాలాంటి దృష్టిలోపం క‌లిగిన వారికి మీరు ఇవ్వాల్సింది ర‌క్ష‌ణ కాదు.. మీ స్నేహం.. అది మ‌ర్చిపోకండి" అని జార్జ్ చెప్తుంటారు. జార్జ్ కోరిన‌ట్టుగానే దృష్టిలోపం క‌లిగిన చిన్నారుల‌ను స్నేహంతో ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.