క్యాష్ కావాలంటే చెప్పండి డోర్ డెలివరీ ఉంది.. స్నాప్ డీల్ బంపరాఫర్

మీ దగ్గరికే వచ్చి స్వైప్ చేసుకుంటారు.. డబ్బులిస్తారు..

క్యాష్ కావాలంటే చెప్పండి డోర్ డెలివరీ ఉంది.. స్నాప్ డీల్ బంపరాఫర్

Friday December 23, 2016,

2 min Read

ఏటీఎంల చట్టూ తిరిగి తిరిగీ విసిగిపోయారా? బ్యాంకుల దగ్గర పడిగాపులుగాసి వేసారిపోయారా? చేతిలో డబ్బులకు కటకటగా ఉందా? అయితే మీలాంటి వారికోసమే ఈ కబురు. మీకు ఎంత క్యాష్ కావాలో చెప్పండి. వాళ్లు అరెంజ్ చేసి తెచ్చిస్తారు. అదికూడా డోర్ డెలివరీ చేస్తారు. ఆర్డర్ ఇచ్చి బిందాస్ గా ఉండండి.. కరెన్సీ నోట్లు రయ్య్ మంటూ వచ్చి మీ ముందు వాలుతాయి.

గ్రోఫర్స్, ఓలా క్యాబ్స్ తర్వాత స్నాప్ డీల్ కూడా ఈ తరహా క్యాష్ డెలివరీ చేయడానికి ముందుకొచ్చింది. క్యాష్ ఎట్ హోమ్ సర్వీసుని లాంఛ్ చేసింది. రెండువేలు బుక్ చేసుకున్నారనుకోండి.. తెల్లారే సరికి మీ పర్సులో నోట్లు చేరిపోతాయి. ఈ సర్వీస్ ప్రస్తుతం బెంగళూరు, గూర్గావ్ లో మాత్రమే ఉంది.

క్యాష్ ఇచ్చినందుకు నామినల్ ఫీజుకింద ఒక రూపాయి మాత్రమే తీసుకుంటున్నారు. కస్టమర్ దగ్గరికి డబ్బు తీసుకెళ్లి పీఓఎస్ మిషన్ ద్వారా వాళ్లు ఆర్డర్ చేసిన అమౌంట్ స్వైప్ చేసుకుంటారు. ట్రాన్సాక్షన్ క్లెయిమ్ అవగానే డబ్బు అందజేస్తారు. ఏ బ్యాంక్ ఏటీఎం కార్డయినా ఓకే. ఫలానా వస్తువు కొంటేనే క్యాష్ ఇస్తామనే మెలికలేం లేవు.

రాబోయే రోజుల్లో సేవలను మరికొన్ని పెద్ద నగరాలకు విస్తరించాలని చూస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితి అర్ధం చేసుకుని.. ప్రజల రోజువారీ అవసరాలు తీర్చాలనే ఉద్దేశంతో క్యాష్ ఆన్ డిమాండ్ సర్వీస్ తీసుకొచ్చామని స్నాప్ డీల్ కో ఫౌండర్ రోహిత్ బన్సల్ అంటున్నారు.

image


2010లో ఏర్పాటు చేసిన స్నాప్ డీల్ నేడు నేషనల్, ఇంటర్నేషనల్ బ్రాండ్లు కలిపి సుమారు లక్షా 25వేల ఏరియాల్లో, సుమారు వెయ్యి కేటగిరీలకు పైగా 65 మిలియన్ల ప్రాడక్టులను సేల్ చేస్తోంది. ఇండియా విషయానికొస్తే పట్టణాలు, నగరాలకు కలిపి 6 వేలకు పైగా ప్రాంతాల్లో ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారు. రతన్ టాటా, అలీబాబా, ఫాక్స్ కాన్, టెమసెక్, సాఫ్ట్ బ్యాంక్ వంటి దిగ్గజ కంపెనీలు ఇందులో ఇన్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

ఆన్ డిమాండ్ డెలివరీ స్టార్టప్ గ్రోఫర్స్ ఇటీవలే ఎస్ బ్యాంకుతో టై అప్ అయి క్యాష్ డెలివరీ సదుపాయాన్ని కస్టమర్ల దగ్గరికి తీసుకెళ్లింది. ముంబై, బెంగళూరు, గూర్గావ్ లో మాత్రమే ఈ సేవలు ఉన్నాయి. ఏ అకౌంట్ హోల్డరైనా రెండువేల వరకు నగదు అందిస్తారు. కాకపోతే స్నాప్ డీల్ మాదిరి కాకుండా.. రెండువేల విలువైన వస్తువులు కొంటేనే క్యాష్ ఇస్తామనే కండిషన్ పెట్టింది.

ఇక టాక్సీ అగ్రిగేటర్ ఓలా కూడా గ్రోఫర్ మాదిరిగానే ఎస్ బ్యాంకుతో టై అప్ అయి మైక్రో ఏటీఎంల ద్వారా క్యాష్ డెలివరీ చేస్తోంది. ఈ రెండు కలిసి ఇటీవలే మొబైల్ ఏటీఎంని లాంఛ్ చేశాయి. ఏ బ్యాంకు ఖాతాదారుడైనా రెండు వేల వరకు డ్రా చేసుకునే సదుపాయాన్ని కల్పించారు. దాదాపు పది సిటీల్లో 30 లొకేషన్లలో ఎస్ బ్యాంక్ బ్రాంచీలు, ఏటీఎంలు ఉన్నచోట మొబైల్ ఏటీఎం సర్వీసులున్నాయి.