మీరు మ్యూజిక్ లవర్సా..? అయితే ఈ సాంగ్ పీడియా మీకోసమే..!

మీరు మ్యూజిక్ లవర్సా..? అయితే ఈ సాంగ్ పీడియా మీకోసమే..!

Sunday March 13, 2016,

3 min Read


మార్నింగ్ రాగా! పొద్దుపొద్దున్నే తెలిమంచు కురుస్తున్న సమయాన టేప్ రికార్డర్ లో మంద్రంగా వినిస్తున్న బాలీవుడ్ క్లాసిక్! ఏక్ లడికీ భీగీ భాగీసే.. వరండాలో పడక్కుర్చీలో నడుం వాల్చి కిశోర్ కుమార్ గాత్రాన్ని ఆస్వాదిస్తున్న తాతయ్య! ముసలాయన మనోఫలకం మీద తెరతెరలుగా నోస్టాల్జిక్ మూమెంట్స్! ఆ రోజులే వేరు! ఆ పాటలే వేరు! కాలం మారింది. టేప్ రికార్డర్ ను సెల్ ఫోన్ రీప్లేస్ చేసింది. కావాల్సినన్ని పాటలు. అయినా కానీ ఏదో వెలితి. గోల్డెన్ ఓల్డ్ డేస్ ని మిస్సయిన ఫీలింగ్! ఆ లోటును భర్తీ చేస్తోంది సాంగ్ పీడియా!

మ్యూజిక్ అంటే ఎవరికి మాత్రం ఇష్టముండదు! అలసిన మనసులకు అదొక రిఫ్రెష్ మెంట్! రిలాక్సేష‌న్ కోసం సంగీతం వినే వాళ్లు కొంద‌ర‌యితే, పాటే ప్రాణంగా భావించే వాళ్లు మ‌రికొంద‌రు. అస‌లు ఆ పాట ఎలా పుట్టింది? ఆహా.. ఏమి లిరిక్స్ అవి? రెండో చ‌ర‌ణంలో ఆ భావం అదిరిపోయింది! ఇలా పాట లోతుల్లోకి వెళ్లి ఆలోచించే మ్యూజిక్ ల‌వ‌ర్స్ చాలా మందే ఉంటారు. మ్యూజిక్ లెజెండ్స్, వారి కుటుంబాల నేప‌థ్యం గురించి తెలుసుకోవాల‌ని ఆరాట‌పడే వాళ్లు కూడా లేకపోలేదు. సంగీతానికి సంబంధించిన స‌మాచార‌మంతా షేర్ చేసుకోవడానికి స‌రైన ప్లాట్ ఫామ్.. ది సాంగ్ పీడియా! ఇదొక ఆన్ లైన్ మ్యూజిక్ అడ్డా! ఇందులో దొరకనిదంటూ లేదు. ఆణిముత్యాల్లాంటి సాంగ్స్ కలెక్షన్ ఉంది. ప్రతీ పాట నేపథ్యం గురించి తెలుసుకోవచ్చు. బాలీవుడ్ క్లాసిక్స్ నుంచి అప్ కమింగ్ ఆర్టిస్టుల దాకా బోలెడంత సమాచారం ఆ సైట్ లో దొరుకుతుంది. మ్యూజిక్ మీద ఫోకస్ చేసిన స్టార్టప్స్ వివ‌రాలు కూడా సాంగ్ పీడియాలో ఉన్నాయి.

బాలకృష్ణ బిర్లా, దీప

బాలకృష్ణ బిర్లా, దీప


ఇంతకూ ఐడియా ఎలా వచ్చింది?

నాగ్ పూర్ అమ్మాయి దీప హార్డ్ కోర్ మ్యూజిక్ లవర్! పాటంటే ఆమెకు పంచ‌ప్రాణాలు! ఈ సాంగ్ పీడియా ఆలోచన ముందుగా ఆమెకే తట్టింది. ఒక మ్యూజిక్ ఈవెంట్ లో తన ఐడియాను బాలకృష్ణ బిర్లా అనే ఫ్రెండ్ తో షేర్‌ చేసుకుంది. బాలకృష్ణ ఆంట్రప్రెన్యూర్ కమ్ టెకీ! ఇద్దరూ అలా గంటల తరబడి సంగీతం గురించి చర్చించుకున్నారు. ఫైనల్ గా ఒక డెసిషన్ కు వచ్చారు. సంగీతానికి సంబంధించిన సమాచారాన్ని ప్రపంచంతో పంచుకోవాలని నిర్ణయించుకున్నారు.

దీప సంగీత నైపుణ్యానికి బాలకృష్ణ టెక్నాలజీ తోడైంది. అదే సాంగ్ పీడియాగా రూపుదాల్చింది. వెబ్ సైట్ లో మ్యూజిక్ గురించి ఆర్టిక‌ల్స్ రాయడానికి కంటెంట్ ఉన్న మ్యూజిక్ లవర్స్ కోసం దేశమంతా వెతికారు. ప్ర‌స్తుతం సాంగ్ పీడియాకు ఇద్దరు ఫుల్ టైమ్ రైటర్లు ఉన్నారు. కొందరు రీడర్లు కూడా ఫ్రీ లాన్సర్లుగా పనిచేస్తున్నారు. వ్యాపార ప్రకటన‌లే సాంగ్ పీడియాకు ఆదాయ మార్గం. ప్రస్తుతం సైట్ కు నెలకు రెండున్నర లక్షల వ్యూస్ వస్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ కల్లా 5 వేల ఆర్టికల్స్ తో నెలకు పది లక్షల మంది మ్యూజిక్ లవర్స్ కి చేరువ కావాలన్నదే నిర్వాహకుల లక్ష్యం.

image


ప్రస్తుతం మార్కెట్లో కొన్ని ఆఫ్ లైన్ మ్యాగజైన్లు ఉన్నాయి. నిజానికి ఆన్ లైన్ లో పెద్దగా పోటీ లేదు. ఇప్పటికే సాంగ్ పీడియా ఇంటర్నెట్ లో అతి పెద్ద మ్యూజిక్ మ్యాగజైన్ స్థాయికి ఎదిగింది. దేశవ్యాప్తంగా మాకు ఒక నెట్ వర్క్ ఏర్పడింది. ఈ నెట్ వర్క్ ను, టెక్నాలజీని ఉపయోగించుకొని అతిపెద్ద మీడియా ఆర్గనైజేషన్ గా ఎదగాలన్న‌దే మా టార్గెట్- దీప‌

అప్ క‌మింగ్ టాలెంట్ కు ప్రోత్సాహం

సాంగ్ పీడియాలో ఇంకో గొప్ప‌త‌నం ఏంటంటే.. అప్ క‌మింగ్ టాలెంట్ ను ఎంక‌రేజ్ చేయడం! ఇప్పుడిప్పుడే ఇండ‌స్ట్రీలోకి వ‌స్తున్న ఆర్టిస్టులు, మ్యుజీషియన్లకూ ఇదొక పర్ఫెక్ట్ ప్లాట్ ఫామ్. నేటి జమానాలో స్టార్లుగా ఎదగడం తేలికే. కానీ దాన్ని నిలబెట్టుకోవడమే కష్టం. అలాంటి వారికి సాంగ్ పీడియా బాసటగా నిలుస్తోంది. అప్ కమింగ్ మ్యుజీషియన్ల గురించి సైట్ లో ఆర్టికల్స్ రాస్తున్నారు. వాటిద్వారా సంగీత సంబంధిత స్టార్టప్స్, మ్యూజిక్ కంపెనీలకు వారిని ప‌రిచ‌యం చేస్తున్నారు.

సొంత టాలెంట్ తో క‌త్తి లాంటి ఆల్బమ్స్ చేసే అప్ క‌మింగ్ ఆర్టిస్టులు అవ‌కాశాల్లేక కాళ్లకు చక్రాలు కట్టుకుని తిరుగుతున్నారు. ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ వారు కార్పొరేట్ రంగానికి చేరువ కాలేకపోతున్నారు. అలాంటి వారంద‌రినీ ప్రమోట్ చేయడమే త‌మ‌ లక్ష్యమ‌ని వెబ్ సైట్ నిర్వాహ‌కులు చెప్తున్నారు. ఆల్బ‌మ్స్ చేసుకోవ‌డానికి ఒక స్టూడియో నిర్మించి అప్ కమింగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తామంట‌న్నారు.

image


భ‌విష్య‌త్ ల‌క్ష్యాలు

ఇప్ప‌టికే సాంగ్ పీడియా వెబ్ సైట్ ఆడియెన్స్ లోకి చొచ్చుకెళ్లింది. మ్యూజిక్ లవర్స్ కి అందులో కావాల్సినంత స్టఫ్ దొరుకుతోంది. మ్యూజిక్ ఇండస్ట్రీకి ఒక ఆన్ లైన్ మీడియాలా తమ వెబ్ సైట్ ను తీర్చిదిద్దుతామని దీప‌ చెప్తున్నారు. సంగీత ప్రపంచానికి ఒక యువర్ స్టోరీలా మారాలన్నదే తమ లక్ష్యమని విడ‌మ‌రిచి చెప్పారు.

నిజ‌మే! ఇవాళ వచ్చిన పాట రేప‌టికి గుర్తుండ‌టం లేదు. అప్పటికీ ఇప్పటికీ ఎప్ప‌టికీ అందరి ఓటూ ఆ పాత మధురాలకే! అందుకు కేరాఫ్ అడ్రస్ సాంగ్ పీడియా అనడంలో సందేహం లేదు!