సిక్స్ ప్యాక్ బ్యాండ్.. దేశంలోనే తొలి ట్రాన్స్‌జెండ‌ర్‌ వీడియో ఆల్బం !!

0

సమాజం ఎట్లా వుంటుందంటే.. భిన్న అస్తిత్వాలను, భిన్న వ్యక్తీకరణలను అంత ఈజీగా ఆమోదించదు. అక్కున చేర్చుకోదు. అలాంటి ఆలోచనా ధోరణి నైతిక ఓటమికింద లెక్కే అనే వాస్తవాన్ని కూడా ఒప్పుకోదు. ఇది టిపికల్ ఇండియన్ కల్చర్. కానీ ఇప్పుడిప్పుడే నిశ్శబ్దం బద్దలవుతోంది.

నిజంగా ఇదొక మంచి పరిణామం. హిజ్రాల పట్ల సమాజంలో అభిప్రాయం క్రమంగా మారుతోంది. అభినందించాల్సిన విషయం. జనంలో చిన్నపాటి చర్చ ఒకటి జరుగుతోంది. సంతోషించాల్సిన విషయం. వాళ్ల భావోద్వేగాలు మన మనసుకు అవగతమవుతున్నాయి. ఇన్నాళ్లూ వాళ్లను చులకనగా చూసినందుకు ఎక్కడో గుండె కలుక్కుమంటోంది. ఇంతకాలం వాళ్ల ఆహార్యాన్ని చూసి అవహేళన చేసినందుకు ఏదోమూల చిన్న పశ్చాత్తాపం ఫీలింగ్ కలుగుతోంది. మాటలకు అందని సెన్సిటివిటీ జనాలకు ఇప్పుడిప్పుడే అర్ధమవుతోంది.

సంతోషంలో చప్పట్లు మోగుతున్నాయి. దట్టంగా పూసుకున్న లిప్ స్టిక్ పెదాలపై నవ్వు తెరలు తెరలుగా వస్తొంది. మనసు హాపీ. మనం హాపీ. వీడియో చూస్తున్నా కొద్దీ మనలో కూడా ఏదో తెలియని సంతోషం. సిక్ప్ ప్యాక్ బ్యాండ్. దేశంలోనే తొలి ట్రాన్స్ జెండర్ మ్యూజిక్ ఆల్బం.

ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర కనిపిస్తే చాలామంది ఈసడించుకుంటారు. కొందరే టాలరేట్ చేస్తారు. అందరూ అపార్ధం చేసుకుంటారు. ఇండియాలో హిజ్రాలంటే ఇక్కడి వాళ్లు కాదనే అభిప్రాయం ఉంది. ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర వాళ్లొక అంటరాని వాళ్లు. ఆ అభిప్రాయం మారాలి. వాళ్ల కోసం ప్రత్యేకంగా చేయాల్సిందేమీ లేదు. కాసింత దయ, కరుణ చాలు. వాళ్ల పెదాల మీద చిన్న చిరునవ్వు ప్రత్యక్షమవుతుంది. అది వాళ్లను హాపీగా ఉంచుతుంది. నటి అనుష్క శర్మ వాయిస్ ఓవర్ తో వీడియో మొదలవుతుంది. యష్ రాజ్ ఫిలింస్ యూత్ వింగ్ వై ఫిలింస్ దీన్ని లాంఛ్ చేసింది. హిందీ ఇంగ్లీష్ మిక్స్ చేసిన లిరిక్స్ కు షమీర్ టండన్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. బాలీవుడ్ గాయకుడు సోను నిగమ్ కూడా గొంతుకలిపాడు.

సమాజంలో ఏదో ఒక చిన్న మార్పు కోసమే ఈ ప్రయత్నం చేశానంటాడు సోనూ నిగమ్. హిజ్రాల పట్ల సంఘంలో వున్న చిన్నచూపు ఇంకెంత కాలం..? ఈ ప్రశ్న పదేపదే వేధించేది అంటాడు సోను. వీడియో లాంఛింగ్ ప్రోగ్రాంలో ఒక దశలో భావోద్వేగాన్ని ఆపుకోలేపోయాడు.

ట్రాన్స్ జెండర్లు ఆశా జగతప్, భవికా పాటిల్, చాందినీ సువర్ణాకర్, ఫిదాఖాన్, రవీనా జగతప్, కోమల్ జగతప్ ఇందులో నటించారు. ప్రస్తుతం యూ ట్యూబ్ లో ఈ వీడియో యమ పాపులర్ అయింది. మొదటి రోజే 11 లక్షల హిట్స్ వచ్చాయి. దీని తర్వాత సాంగ్ జనవరి 26న సబ్ రబ్ దే బనాదే పేరుతో రాబోతోంది.

Related Stories

Stories by HIMA JWALA