కస్టమైజ్డ్ కిచెన్స్.. ఈ హైదరాబాద్ స్టార్టప్ స్పెషాలిటీ

0

ఈ రోజుల్లో ప్రతీదీ బ్రాండెడ్ ఉండాలని అంతా కోరుకుంటున్నారు. ఇంటి విషయంలో కూడా బ్రాండెడ్ వాడ్రోబ్స్, కిచెన్లు వచ్చేశాయి. కానీ వాటి ధరలు మాత్రం ఇంకా ఆకాశంలోనే ఉన్నాయి. మధ్యతరగతి, ఎగువ మధ్య తరగతి వర్గాల వరకూ ఇంకా బ్రాండెండ్ కిచెన్లు రీచ్ కాలేదనే చెప్పాలి. ఇదే వ్యాపార ఆలోచనగా ప్రారంభమైంది ‘ఫైన్ మేక్’(finemake.in) స్టార్టప్. హైదరాబాద్ కేంద్రంగా 2015 మార్చిలో మొదలైన ఈ కంపెనీ మూడు ప్రాజెక్టులు.. ఆరు ఆర్డర్లతో దూసుకుపోతోంది.

“మీ ఇంటికి అతికినట్లు సరిపోయే మాడ్యులార్ కిచెన్‌లను మేం డిజైన్ చేస్తాం. డిజైన్ కిచెన్ ఇండస్ట్రీని మేమే ప్రారంభించాం. మాతో ఓ సరికొత్త ఇండస్ట్రీ ప్రారంభమైనందుకు సంతోషంగా ఉంది ” అంటారు ఫైన్ మేక్ కో - ఫౌండర్ రాజశేఖర్.రాజశేఖర్, సాంబలు హెటిక్(Hettich)లో పనిచేస్తుండగానే ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారు. కిందటేడాది నుంచి మార్కెట్‌ను పూర్తి స్థాయిలో రీసెర్చి చేశారు. హెటిక్ అనేది ఓఅంతర్జాతీయ ఫర్నిచర్ బ్రాండ్. ఇలాంటి బ్రాండ్లు ఎన్నో ఉన్నప్పటికీ, కస్టమర్లు కోరుకునే కస్టమైజ్డ్ ఫర్నిచర్ అందించే కంపెనీలను వేళ్లపై లెక్కబెట్టుకోవాలనేది వీళ్ల లెక్క. స్టార్టప్ మొదలు పెట్టడానికి కారణం ఇదే అంటుంది ఈ ఫ్రెండ్స్ జోడీ. ఫర్నీచర్ విషయంలో బ్రాండెడ్ వస్తువుల హవా కొనసాగుతున్నప్పటికీ కస్టమైజ్డ్ తయారు చేయించుకోడానికి జనం మొగ్గు చూపుతున్నారన్న మాట వాస్తవం. తమ వ్యాపార విస్తరణకు అనుకూలాంశం కూడా ఇదే అంటున్నారాయన.

‘ఫైన్ మేక్’ అనుకూలాంశాలు

  1. ఫైన్ మేక్ ప్రధానంగా కిచెన్ల పైనే దృష్టి సారిస్తోంది. మాడ్యులార్ కిచెన్లపై జనం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కానీ అవి వాళ్ల ఇంట్లోని గదికి సరిగ్గా ఫిట్ కాకపోవడం లాంటి సమస్యలు ఉన్నాయి. ఉన్న డిజైన్‌ని రూంకి తీసుకొచ్చే కంటే రూంకి అతికినట్లు సరిపోయే డిజైన్‌ను తయారు చేయడం ఫైన్ మేక్ ప్రధాన ఉద్దేశం. ధర విషయంలో ఫైన్ మేక్‌కు పోటీ ఎవరూ రాలేదు. ఎక్కడో జర్మనీలోనో లేదా ఇటలీలోనో తయారయ్యే ఫర్నీచర్ ధరలు ఆకాశంలో ఉంటే ఫైన్ మేక్ ధరల అందరికీ అందుబాటులో ఉన్నాయంటారు ప్రమోటర్లు.
  2. ధర తక్కువ ఉండటం వల్ల క్వాలిటీలో కాంప్రమైజ్ అవుతారనే భయం వద్దని చెబ్తున్నారు. ఎందుకంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న ప్లైవుడ్, పైబర్ లాంటి వస్తువులతో కస్టమైజ్డ్ ఫర్నిచర్ ని తయారు చేసి ఇస్తామని హామీనిస్తున్నారు.

ఫైన్ మేక్ టీం

టీం విషయానికొస్తే రాజశేఖర్ నల్లు కో ఫౌండర్. ఫైన్ మేక్‌కి సంబంధించిన ఆపరేషన్స్ ఆయన చూస్తున్నారు. ఐఐఎం పూర్వ విద్యార్థి అయిన రాజశేఖర్ ఈ స్టార్టప్ మొదలు పెట్టడానికి ముందు బ్యాంక్ ఆఫ్ బరోడాలో, ఆ తర్వాత హెటిక్ పనిచేశారు. మరో కో ఫౌండర్ సాంబ. ఈయన కూడా ఐఐఎం కొజికోడ్ నుంచి ఎంబిఏ పూర్తి చేశారు. శాంసంగ్, ఎయిర్టెల్ లాంటి సంస్థల్లో సేల్స్ వ్యవహారాలు చూసుకున్నారు. అనంతరం హెటిక్‌లో కూడా పనిచేశారు. ఫైన్‌మేక్‌లో కూడా మార్కెటింగ్, బ్రాండింగ్ వ్యవహారాలు చూస్తున్నారు. వీరితోపాటు డిజైనింగ్ టీంలో ఫ్రీలాన్సర్లు ఉన్నారు. మొత్తం 25 మంది వరకూ ఇందులో సభ్యులుగా ఉన్నారు.

సవాళ్లు

ఫైన్ మేక్‌కి ఫర్నిచర్ స్పేస్‌లో ప్రధానంగా రెండు సంస్థలు కాంపిటీటర్స్. ఇందులో బెంగళూరు కేంద్రంగా పనిచేస్తోన్న హోం లేన్. మరో కంపెనీ కస్టమ్ ఫర్నిష్. అయితే ఈ రెండు కంపెనీలు ప్రధానంగా ఫర్నిచర్ పైనే ఎక్కువగా దృష్టినిలిపాయి. కానీ మాడ్యులార్ కిచెన్‌ను కస్టమైజ్ చేసి తయారు చేయడం.. ఫైన్ మేక్ యునిక్ ఫీచర్.

ఆదాయం, అభివృద్ధి

ఫైన్ మేక్ డాట్ ఇన్ 2015 మార్చిలో ప్రారంభమైంది. రోజుకి నాలుగు నుంచి ఐదుగురు యూజర్లు యాడ్ అవుతున్నారు. ఈ నెలాఖరికి దాదాపు 6కోట్ల టర్నోవర్ పూర్తవుతుంది. ఈ ఏడాది ముగిసే సమయానికి ఇది 11కోట్లు దాటుతుందని కంపెనీ అంచనా వేస్తోంది. ఆన్‌లైన్‌లో బి టు సి బిజినెస్ కూడా చేస్తోందీ స్టార్టప్. ఆఫ్ లైన్‌లో బిల్డర్స్, రియల్టర్లతో కలిసి పనిచేస్తోంది.

భవిష్యత్ ప్రణాళికలు

వచ్చే ఏడాది కల్లా యాప్ ప్లాట్‌ఫాంలోకి వస్తామంటున్నారు. దీంతో పాటు ఈ ఇండస్ట్రీలో టెక్నాలజీ అవసరం ఉందని, దాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని రాజశేఖర్ చెప్పారు. త్రీడీ విజువలైజ్డ్ చేసి మాడ్యులా కిచెన్ ఎలా ఉంటుందో చూపించే యునిక్ ఫీచర్ వీళ్ల దగ్గరుంది. ఇలాంటి మరికొన్ని ఫీచర్లను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకు వస్తామంటున్నారు. పూర్తి స్థాయి బూట్ స్ట్రాప్డ్ కంపెనీ అయిన ఫైన్ మేక్ ఫండింగ్ విషయంలో ఆచి తూచి అడుగేయాలని చూస్తోంది. ఫండింగ్ ఆఫర్ వచ్చినా వచ్చే ఏడాదే పరిశీలిస్తామని చెబ్తున్నారు.

website

ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంటుంది. దాన్ని వినే ,చెప్పే అర్హత ఉంది. నాకు చెప్పండి! ashok@yourstory.com

Related Stories

Stories by ashok patnaik