20 ఏళ్లుగా వర్షపు నీటినే వాడుతున్న హైదరాబాదీ రిటైర్డ్ సైంటిస్ట్

20 ఏళ్లుగా వర్షపు నీటినే వాడుతున్న హైదరాబాదీ రిటైర్డ్ సైంటిస్ట్

Tuesday April 18, 2017,

3 min Read

ఎండాకాలం వచ్చిందంటే తాగునీటికి ఎంత కటకట ఉంటుందో హైదరాబాద్ సిటీ జనానికి గత కొన్నేళ్లుగా తెలుసు. బోర్ వాటర్ ఎండిపోవడం.. మున్సిపల్ నల్లా కూడా అంతంతమాత్రం.. వీధివీధికీ ట్యాంకర్లు తిరగడం.. షరా మామూలే. సిటీ నలుమూలలా ఇలా దృశ్యాలెన్నో కనిపిస్తాయి. సమ్మర్ లో వేల రూపాయలు ఖర్చుపెట్టినా ఇంటికి సరిపడా వాటర్ ఉండదు. ఇలాంటి విపత్కర పరిస్థితి ముందే గమనించిన ఓ రిటైర్డ్ సైంటిస్ట్ వాననీటిని ఒడిసిపట్టే మహత్తర యజ్ఞాన్ని 20 ఏళ్లుగా చేస్తున్నారు. ఒక్క చుక్క కూడా వృధా కాకుండా అవసరాలకు పోను మిగిలించి చూపిస్తున్నారు. చిన్న బోరుబావి కూడా తవ్వకుండా నీళ్లను ఎలా సంపాదించాలో ప్రాక్టికల్ గా చేసి చూపించారు.

image


హైదరాబాదుకి చెందిన మురళి శర్మ ఇక్రిశాట్ లో సైంటిస్టుగా పనిచేసి రిటైరయ్యారు. బేసిగ్గా వ్యవసాయ శాస్త్రవేత్త కావడంతో నీళ్ల అవసరమేంటి? వాటి విలువేంటో ఆయనకు వేరే చెప్పక్కర్లేదు. ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరంలో జనం ఏ నీటికోసమైతే అల్లాడిపోతారో ఆ నీటి కొరత తనకు రాకూడదని గట్టిగా నిర్ణయించుకున్నారు.

రాజస్థాన్ నుంచి ఉద్యోగరీత్యా వచ్చి హైదరాబాదులో సెటిలయ్యారు మురళి శర్మ. వచ్చిన కొత్తలో ఇక్కడి నీటి సరఫరా విధానం, దాని లభ్యత చూసి అవాక్కయ్యారు. వర్షపాతం అంతంతమాత్రమే ఉండే తన సొంతూరైన జోధ్ పూర్ లో కూడా హైదరాబాద్ అంత కరువును చూడలేదు. ముఖ్యంగా ఎండాకాలంలో వాటర్ షార్టేజీ చూసి ఒకింత భయపడ్డారు. 20 ఏళ్ల కిందట నగర జనాభా 30 లక్షలుండేది. కానీ నీటి లభ్యత 10 లక్షల మందికి కూడా సరిపోయేది కాదు.

ఒకసారి మురళి వాళ్లమ్మగారు హైదరాబాద్ వచ్చారు. ఫ్యూచర్ లో ఇక్కడే సెటిలైపోదామనుకుంటున్నా కానీ, ఈ నీళ్ల బాధేంటి అని కొడుకుని ప్రశ్నించారు. ఇక్కడి కంటే రాజస్థానే నయం కదా అన్నారు. ఆ మాట మురళిని ఆలోచనలో పడేసింది. నిజమే. ఎలాంటి వర్షపాతం లేని రాజస్థాన్ కంటే హైదరాబాదుని చూసి ఎందుకు భయపడాలి. ఒఖ వ్యవసాయ శాస్త్రవేత్తగా అమ్మకు నీటి మీద ఒక భరోసా కల్పించలేనా అనుకున్నారు. అలాంటి సంఘర్షణలోంచి పుట్టిందే వాటర్ హార్వెస్టింగ్ ఆలోచన.

image


హైదరాబాద్ లాంటి సిటీలో వానపడితే చెట్లకు తప్ప, మనిషికి పైసా ఉపయోగం లేదు. పడ్డనీళ్లు పడ్డట్లే మురికికాలువలో పడిపోతాయి. ఇలాంటి వృధాని అరికడితే తప్ప నీటి కరువు నుంచి దూరం కాలేమని భావించారు. దానికోసం టెక్నాలజీ, హంగామా అవసరం లేకుండానే సనాతన పద్దతికి శ్రీకారం చుట్టారు. 1995లో ఇల్లు కట్టుకున్నారు. కట్టేటప్పుడే వాటర్ హార్వెస్టింగ్ కి అనుగుణంగా డిజైన్ చేశారు. ఇంటి పైకప్పు నుంచి వాననీరు వెళ్లేలా ఒక పీవీసీ పైప్ అమర్చారు. వసారాలో వెడల్పాటి సంప్ లాంటిది తవ్వి ఆ పైపుని అందులోకి కనెక్ట్ చేశారు. ఒకరకంగా చెప్పాలంటే తవ్విన ట్యాంక్ ఇంటి కింద ఉంటుంది. దాని కెపాసిటీ లక్ష లీటర్లు. హైదరాబాదులో సాలీనా వర్షపాతం 80 మిల్లీమీటర్లు ఉంటుంది. ఆ లెక్కన మురళీ ఇంటి టాప్ నుంచి ఏడాదికి 1.25 లక్షల లీటర్ల నీళ్లు అండర్ గ్రౌండ్ ట్యాంకులో పడతాయి. అవి 25 మున్సిపల్ వాటర్ ట్యాంకర్ల నీటితో సమానం.

ఇంటి పైకప్పు నుంచి వస్తున్న నీళ్లు కదాని వాటి గురించి తక్కువ అంచనా వేస్తే పొరబడ్డట్టే. ఆ నీళ్లకు ఎలాంటి ట్రీట్ మెంట్ ఇవ్వరు. ఎలాంటి వడపోతలు చేయరు. కనీసం నీటిని వేడికూడా చేయరు. దీన్నిబట్టి అవెంత శుద్ధమైన నీళ్లో అర్ధం చేసుకోవచ్చు. కావాలంటే ఆ నీళ్లను లాబ్‌ లో టెస్ట్ చేయండి.. డెయిలీ వచ్చే మున్సిపల్ వాటర్ కంటే ఎంత బెటర్ గా ఉంటాయో మీరు చెప్తారని మురళి గర్వంగా చెప్తారు. ఒడిసిపట్టిన వాననీటినే మురళి ఇంటి అవసరాలకు వాడతారు. తాగునీటికి, వంటకు, బట్టలు ఉతకడానికి, గార్డెనింగ్ కి.. ఇలా అన్ని అవసరాలకు వాడుకుంటారు. ఆ నీళ్లను స్టాక్ పిట్ లోకి మళ్లిస్తారు. సిటీలో 50-60 శాతం ఇళ్లు ఇంకుడు గుంతలను ఫాలో అయితే గ్రౌండ్ వాటర్ ఇబ్బందే ఉండదని మురళి సలహా ఇస్తున్నారు.

గత ఇరవై ఏళ్లుగా మురళి బోర్ తవ్వలేదు. మున్సిపల్ నల్లా కనెక్షన్ కోసం అప్లయ్ చేసుకోలేదు. ఇంటి కింద ఉన్న ట్యాంక్ ద్వారానే ఏడాది పొడవునా నీళ్లను అవసరం మేర వాడుకుంటారు.

పౌరులుగా నీటి విలువేంటో మనం గుర్తెరగాలి. నీటి సమస్య అనేది కేవలం ప్రభుత్వాలకు చెందిదే కాదు. ప్రతీ మనిషి సొంత సమస్యగా ఫీలవ్వాలి. నీటి వృధాని అరికడితే తప్ప, ఈ సమస్యకు పరిష్కారం లేదంటారు మురళి. వాన నీటి సంరక్షించుకునే విధానంపై జనాల్లో అవగాహన తెస్తున్నారు. చుట్టుపక్కల వాళ్లకు వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తుంటారు. మురళి చలవతో సైనిక్ పురి, ఆర్కే పురం పరిసరాల్లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పద్ధతి మీద జనాలకు మంచి అవగాహన వచ్చింది.

నీళ్ల విషయంలోనే కాదు.. తన ఇంటినీ ఇకో ఫ్రెండ్లీగా నిర్మించుకున్నారు. సిమెంట్ ఎక్కువగా వాడలేదు. మాగ్జిమం మట్టి ఇటుకలతోనే కట్టుకున్నారు. ఎండాకాలంలో ఏసీల వాడకం తగ్గించడానికి మట్టి అయితేనే బెటర్ అనేది పెద్దాయన ఆలోచన.