మీకు పక్కా డైట్ ఫుడ్ కావాలా..? అయితే వీళ్లకి చెప్పండి..!!

మీకు పక్కా డైట్ ఫుడ్ కావాలా..? అయితే వీళ్లకి చెప్పండి..!!

Saturday July 08, 2017,

3 min Read

ఆరోగ్యం పట్ల అశ్రద్ధ చూపే రోజులు కావివి. ఎప్పటికప్పుడు ఫిట్ గా ఉండాలి. అందుకోసం రెండే రెండు మార్గాలు. ఒకటి ఎక్సర్ సైజ్. రెండోది హెల్దీ ఫుడ్. హెల్దీ ఫుడ్ అనగానే పచ్చికూరగాయలు, ఉప్పులేకుండా పప్పు, నూనె వాడకుండా పుల్కా, రుచీపచీ లేని తిండి.. అని అందరూ అనుకుంటారు. నిజానికి హెల్దీ అంటే అది కాదు. పక్కా డైట్ అంటే ఏంటో ఫిట్ మీల్స్ అనే స్టార్టప్ చెప్తోంది!

image


నగర జీవితం అంటేనే ఉరుకులు పరుగులు! ఏం తింటున్నామో, ఎలా తింటున్నామో, ఎప్పుడు తింటున్నామో తెలియదు! ఫలితంగా తలనుంచి పాదాల దాకా ఏదో సమస్య! చెప్పాపెట్టకుండా థైరాయిడ్ గొంతులో చేరిపోతుంది! ఏం తినకున్నా ఒబేసిటీ కొవ్వులో కూరుకుపోతుంది! వన్ ఫైన్ మార్నింగ్ డయాబెటీస్ పలకరిస్తుంది! ఏ రాత్రో హైపర్ టెన్షన్ బీపీని అమాంతం పెంచుతుంది! ఆకలేసి పిజ్జా తింటే బొజ్జ గోల్కొండ కోటై కూర్చుంటుంది! 

ఇక అప్పుడు వెయిట్ లాస్ మీద పడతారు! ఎక్సర్ సైజులంటూ జిమ్ముల వెంట తిరుగుతారు! ఫిట్ గా ఉండాలంటే వ్యాయామం అవసరమే! దాంతోపాటు డైట్ కూడా ఇంపార్టెంట్! మరి ఎలాంటి డైట్ తీసుకోవాలి? ఏ సమస్యకు ఏ ఆహారం తినాలి? థైరాయిడ్ ఉంటే ఎలాంటి డైట్ అవసరం. వెయిట్ లాస్ కావాలంటే ఏం తినాలి? వీటన్నిటిపై చాలామందికి అవేర్నెస్ లేదు! అలాంటి వారికి డైట్ ప్లాన్ చెప్పి, శుచిగా శుభ్రంగా వండి ఇంటి దగ్గరికి తెచ్చి అందిస్తుంది ఫిట్ మీల్స్ అనే స్టార్టప్.

న్యూట్రిషనిస్ట్ సలహా మేరకు డైట్ ప్లాన్ వీళ్లకు చెప్తే ఫరవాలేదు. లేదంటే ఫోన్ కాల్ ద్వారా న్యూట్రిషనిస్టుని వీళ్లే అరెంజ్ చేసి పెడతారు. కస్టమర్ హెల్త్ బయోగ్రఫీని బట్టి ఏ ఫుడ్ అయితే అతనికి బెస్టో అది తయారుచేసి ఇస్తారు. ప్రధానంగా వెయిట్ లాస్, వెయిట్ గెయిన్ డైట్ ‌ప్లాన్లు వీళ్ల దగ్గర ఉన్నాయి. రెగ్యులర్ గా జిమ్ చేసేవారికోసం మజిల్ గెయిన్ డైట్ ప్లాన్ అందిస్తారు. వెయిట్ మెయింటెనెన్స్ డైట్ ప్లాన్ ఉంది. కీటో డైట్ ప్లాన్, హైఫాట్- లోకార్బ్ డైట్ ప్లాన్, వీటితో పాటు థైరాయిడ్, డయాబెటిక్ పేషెంట్లకు సెపరేట్ డైట్ ప్లాన్స్ అందిస్తారు. ఇవేకాకుండా ఎలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా డైట్ కస్టమైజ్ చేసి ఇస్తారు. బయట రెస్టారెంట్లతో పోల్చుకుంటే ఫిట్ మీల్స్ కాస్ట్ పెద్దగా ఏం లేదంటారు కో ఫౌండర్ అపూర్వారావ్.

లండన్‌లో ఇంజినీరింగ్ చేసేటప్పుడు ఇద్దరు మిత్రులకు వచ్చిన ఆలోచన ఇది. అప్పుడు ఎగ్జామ్స్ హడావిడిలో జంక్ ఫుడ్ ఎక్కువగా తినాల్సి వచ్చింది. ఇలా అయితే ఆరోగ్యం ఏంకాను అని ఇద్దరికీ బెంగ పట్టుకుంది. అప్పుడే హెల్దీ ఫుడ్ ఆలోచన వచ్చింది. ఆ ఐడియాను హైదరాబాదులో ఉన్న మరో ఇద్దరితో పంచుకున్నారు. ఇక్కడ ఫుడ్ మార్కెట్ ఎలా వుంటుంది? బిజినెస్ ఎలా రన్నవుతుంది లాంటి విషయాలు చర్చించారు. హైదరాబాదులో ఫుడ్ బిజినెస్ అంటే బిందాస్. కాబట్టి తాము పెట్టబోయే స్టార్టప్ కంపెనీకి ఢోకాలేదని అనుకున్నారు. 

image


ఈ క్రమంలో ఎందరో కార్పొరేట్ వ్యక్తులను కలిశారు. డాక్టర్లను అప్రోచ్ అయ్యారు. న్యూట్రిషనిస్టులను సంప్రదించారు. తాము పెట్టబోయే స్టార్టప్ గురించి వివరించారు. వాళ్ల సలహాలతో డైట్ ప్లాన్స్ డిజైన్ చేశారు. అలా 2015 సెప్టెంబర్‌ లో ఫిట్ మీల్స్ లాంఛ్ చేశారు. మొత్తం ఎనిమిది మంది కలిసి స్టార్టప్ ప్రారంభించారు.

ఫిట్ మీల్స్ డెలివరీ చేసే ప్రతీ మీల్ బాక్స్ కస్టమర్ కోరుకున్న విధంగానే ఉంటుంది. చేయితిరిగిన వంటవాళ్లతో తయారు చేయించి డోర్ డెలివరీ ఇస్తారు. అన్ని రకాల మౌలిక సదుపాయాలున్న నగరం హైదరాబాద్ కాబట్టే ఇక్కడ స్టార్టప్ పెట్టాలని నిర్ణయించామని ఫౌండర్లు అంటున్నారు. స్టార్టప్‌ లకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం కూడా బాగుందని ప్రశంసిస్తున్నారు. అందునా టీ హబ్ నుంచి తమకు ఎంతో సపోర్ట్ లభించిందని అంటున్నారు. ఇన్వెస్టర్ల నుంచి కస్టమర్ల దాకా అన్నీ సమకూర్చిన హైదరాబాద్ కంటే బెస్ట్ ప్లేస్ దేశంలో మరొకటి లేదంటాడు కో ఫౌండర్ జిషాన్. అందుకే స్టార్టప్ పెట్టిన దగ్గర్నుంచి ఇప్పటిదాకా రెస్పాన్స్ ఊహించని విధంగా ఉందని చెప్తున్నారు.

ఫిట్ మీల్స్ ఫౌండర్లు. అమన్, భవ్యంత్, జిషాన్, అపూర్వ. టీంలో 40కిపైగా సభ్యులున్నారు. సిటీలో 5 కిచెన్స్ ఉన్నాయి. రాబోయే రెండు నెలలో మరో రెండు కిచెన్స్ ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. భవిష్యత్ లో ముంబై, బెంగళూరు, ఢిల్లీలో కూడా ఫిట్ మీల్స్ ఏర్పాటు చేయాలనేది వీరి ఆలోచన. దాంతోపాటు న్యూట్రిషన్ తో లైవ్‌ లో కన్సల్ట్ కావడానికి ఒక యాప్ ఇంట్రడ్యూస్ చేయాలని చూస్తున్నారు.

వెబ్ సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి