ఓటమికి భయపడితే ఇవన్నీ గొప్ప కంపెనీలు అయ్యేవే కావు !

నాటి స్టార్టప్సే నేటి ప్రపంచ ప్రసిద్ధ కంపెనీలు..యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న పారిశ్రామికవేత్తలు..కష్టాలను దాటి ప్రపంచాన్ని జయించిన ధీరులు..

ఓటమికి భయపడితే ఇవన్నీ గొప్ప కంపెనీలు అయ్యేవే కావు !

Monday July 20, 2015,

5 min Read

"అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది... ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది" అంటూ జీవన పోరాటం గురించి అద్భుతంగా వివరించారు ఓ సినీకవి. ప్రపంచమంతా తరిచిచూస్తే ఇలాంటి జీవన పోరాటయోధులు మనకు కనిపిస్తుంటారు. అద్భుతమైన విజయాలను సొంతం చేసుకొని ఈ తరం కుర్రాళ్లకు ఆదర్శంగా నిలుస్తున్నారు వాళ్లంతా. వారిలో చాలామంది పారిశ్రామికవేత్తలున్నారు. అసలు ఓ స్టార్టప్ ప్రారంభించాలంటే ఏం కావాలి ? ఓ అద్భుతమైన ఐడియానా ? అంతకంటే గొప్ప బృందమా ? లేక పెట్టుబడులా ? అవును. ఇవన్నీ కావాలి. కానీ వాటి కంటే ముఖ్యమైనది నమ్మకం. గెలుస్తామన్న నమ్మకం ఉండాలి. ఏ సమస్యనైనా ఎదుర్కోగలమన్న విశ్వాసం కావాలి. వినియోగదారుడు కోరుకునేది ఆ సమస్యకు పరిష్కారమే. ప్రపంచంలోని పెద్దపెద్ద కంపెనీలన్నీ ఇలాంటి నమ్మకంతోనే మొదలయ్యాయి. తమకున్న ఆలోచనలు, వాటిపై ఉన్న విశ్వాసమే ప్రపంచస్థాయి కంపెనీల స్థాయికి తీసుకెళ్లాయి. అలాంటి నాలుగు ప్రసిద్ధ కంపెనీల చరిత్రేంటీ..? అసలు అవి ఎలా ప్రారంభమయ్యాయో తెలుసుకుందాం.

1. ఫ్రెడ్ స్మిత్... ఫెడరల్ ఎక్స్ ప్రెస్

ఫ్రెడ్ స్మిత్, ఫెడరల్ ఎక్స్ ప్రెస్ సిఈఓ

ఫ్రెడ్ స్మిత్, ఫెడరల్ ఎక్స్ ప్రెస్ సిఈఓ


ఫ్రెడ్ స్మిత్... 1965లో యేల్ యూనివర్సిటీ అండర్ గ్రాడ్యుయేట్. కోర్సులో భాగంగా అమెరికాలో వస్తు రవాణా వ్యవస్థపై ఎకనమిక్స్ పేపర్ ప్రజెంట్ చేశాడు. అమెరికాలో ఎగుమతిదారులు భారీ ప్యాకేజీలను రవాణా చేసేందుకు ట్రక్కులు, ప్యాసింజర్ విమానాలపై ఆధారపడుతున్నారని స్మిత్ గుర్తించాడు. మరింత సమర్థవంతంగా రవాణా ఎలా చేయొచ్చని ఆలోచించాడు. ముఖ్యమైన వస్తువులను విమానం ద్వారా పంపిస్తే.. అంతకంటే మంచి బిజినెస్ అవుతుందని రాశాడు. అయితే కంపెనీని ఎలా నడిపించొచ్చు అన్న వివరాలు మాత్రం రాయలేదు. స్మిత్ రాసిన పేపర్‌కు C గ్రేడ్ వచ్చింది. అయినా స్మిత్ తన ఐడియాను విడిచిపెట్టలేదు. ఆ ఐడియాపై నమ్మకంతో 1971లో కంపెనీని ప్రారంభించాడు. ఫెడరల్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభించిన మూడేళ్లలో కంపెనీ దివాళా అంచుకు చేరింది. ఇంధనం ధరలు పెరిగిన కారణంగా నెలకు పది లక్షల డాలర్ల నష్టం చవిచూడాల్సి వచ్చింది. ఆ తర్వాత కంపెనీ దగ్గర ఐదువేల డాలర్లే మిగిలాయి. మరిన్ని నిధుల కోసం స్మిత్ ప్రయత్నించాడు. కానీ చేదు అనుభవమే మిగిలింది. కంపెనీ నుంచి చాలామంది ఉద్యోగం మానేసి వెళ్లిపోయారు. కంపెనీని ముసేశారు. కానీ ఫ్రెడ్ స్మిత్ కలలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. స్మిత్ లాస్‌వెగాస్ వెళ్లాడు. వీకెండ్‌లో బ్లాక్ జాక్ ఆట ఆడాడు. అక్కడ అదృష్టం కలిసొచ్చింది. సోమవారానికి ఫెడెక్స్ బ్యాంక్ అకౌంట్ లో 32 వేల డాలర్లు వచ్చి చేరాయి. ఆ నిధులు కొన్ని రోజుల పాటు విమానాలకు ఇంధనాన్ని కొనేందుకు ఉపయోగపడ్డాయి. కంపెనీ మళ్లీ తెరుచుకుంది. అక్కడి నుంచి ఫెడెక్స్ కంపెనీ దూసుకెళ్లింది. పెట్టుబడులు భారీగా వచ్చాయి. ఈ రోజు చూస్తే ఫెడెక్స్ ప్రపంచస్థాయి వ్యాపార దిగ్గజం. 220 దేశాల్లో కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఈ కంపెనీ సంవత్సర ఆదాయం 45 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.3 లక్షల కోట్లు)

2. ఫెర్రుక్కియో లంబోర్గిని

image


ఫెర్రుక్కియో ఓ రైతు. ట్రాక్టర్లను తయారుచేసేవాడు. ట్రాక్టర్ల తయారీ బిజినెస్ విజయవంతంగా నడిచింది. అంతేకాదు... ఇటలీలో అత్యంత ధనవంతుడు. ప్రపంచంలోని సూపర్ కార్లన్నీ ఫెర్రుక్కియో దగ్గర ఉండేవి. వాటిలో ఫెర్రారీ కూడా ఉంది. కానీ ఫెరార్రీ కారు తరచూ ఇబ్బంది పెట్టేది. స్వతహాగా మెకానిక్ కావడంతో ఎప్పటికప్పుడు రిపేర్లు చేసేవాడు. అయితే తన ట్రాక్టర్లకు ఉపయోగించే క్లచ్ ఫెర్రారీకి కూడా ఉందని గుర్తించాడు. "నా దగ్గరున్న ఫెరార్రీ కార్లకు క్లచ్ సమస్యలున్నాయి. మామూలుగా డ్రైవ్ చేసినప్పుడు అంతా మామూలుగానే ఉంటుంది. కానీ వేగంగా వెళ్లినప్పుడు క్లచ్ జారిపోతుంది" అని ఫెర్రుక్కియో తరచూ మెకానిక్‌లతో చెప్పే సమస్య ఇది. ప్రతీసారి క్లచ్ రిపేర్ చేసేందుకు షెడ్డుకు వెళ్లడం, అక్కడ గంటల తరబడి ఎదురుచూడటం ఫెర్రుక్కియోకి బాగా చికాకు తెప్పించింది. కనీసం క్లచ్ ఎలా రిపేర్ చేస్తున్నారో కూడా చూడనిచ్చేవారు కాదు. క్లచ్ సమస్య తీరనిదిగా మారిపోయింది. ఈ పరిణామాలతో తీవ్రంగా ఇబ్బందిపడ్డ ఫెర్రుక్కియో... ఫెర్రారీ వ్యవస్థాపకుడు ఎంజో ఫెర్రారీతో మాట్లాడాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసమూ చాలా సమయం వేచి చూడాల్సి వచ్చింది. చివరగా 'ఫెర్రారీ... మీ కార్లన్నీ చెత్తగా ఉన్నాయి' అని మొహం మీదే చెప్పేశాడు. లంబోర్గిని మాటలకు ఫెర్రారీకి కోపం నషాళానికెక్కింది. "లంబోర్గిని... మీకు ట్రాక్టర్ తోలటం వచ్చు కానీ... ఫెర్రారీ కారుని సరిగ్గా హ్యాండిల్ చేయడం రాదు" అని ఫెర్రారీ సమాధానమిచ్చాడు. ఫెర్రారీ ఇచ్చిన సమాధానంతో రగిలిపోయిన అంతకంటే పర్‌ఫెక్ట్ కార్ తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. అలా లంబోర్ఘిని ఆటోమొబైల్ కంపెనీ మొదలైంది. ఇప్పుడు లంబోర్గిని స్టాండర్ట్ ఏంటో ప్రపంచానికి మొత్తం తెలుసు.

3. కల్నల్ శాండర్స్... కెంటకీ ఫ్రైడ్ చికెన్ (KFC)

image


65 ఏళ్ల వయస్సులో ఎవరైనా ఏం చేస్తారు ? రిటైరైపోయి ఇంట్లో రెస్ట్ తీసుకుంటారని చాలామంది సమాధానం చెబుతారు. కానీ కల్నల్ శాండర్స్ కథ వేరు. ఆ వయస్సులో కల్నల్‌కి డబ్బులు అవసరం అయ్యాయి. ఏదైనా చెయ్యాలనుకున్నాడు. తనకో ఐడియా తట్టింది. తన స్నేహితుల కోసం ఎఫ్పుడూ చికెన్ వండిపెట్టేవాడు కల్నల్. వాళ్లు ఎంతో ఇష్టంగా తినేవాళ్లు. అదే రెసిపీని ప్రపంచానికి పరిచయం చేద్దామనుకున్నాడు. తన దగ్గరున్న అద్భుతమైన ఐడియా అదొక్కటే. వెంటనే రంగంలోకి దిగాడు. కెంటకీకి వెళ్లాడు. తన ఐడియాను అమ్మేందుకు అమెరికాలోని పలు ప్రాంతాలకు తిరిగాడు. తన దగ్గరున్న ఫార్ములాతో చికెన్ వండితే జనం బాగా ఇష్టంగా తింటారని రెస్టారెంట్ ఓనర్లకు వివరించాడు. ఈ ఐడియాను ఉచితంగా ఇచ్చేందుకు కూడా సిద్ధమయ్యాడు. అమ్మిన దాంట్లో కొంత శాతం లాభం ఇస్తే చాలని చెప్పాడు. కానీ ఎవరూ ఒప్పుకోలేదు. ఎక్కడికి వెళ్లినా తిరస్కరణలే. కానీ కల్నల్ పట్టు వదల్లేదు. 1009 మంది వద్దు అన్న తర్వాత ఒక్కరు సరేనన్నారు. ఆ ఒక్క ధైర్యంతో కల్నల్ శాండర్స్ ఓ అద్భుతమైన రెసిపీని ప్రపంచానికి అందించారు. కెంటకీ ఫ్రైడ్ చికెన్‌తో ప్రపంచవ్యాప్తంగా జనం ఆహారపు అలవాట్లనే మార్చేశారు. ఇప్పుడదే KFCగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన బ్రాండ్.

4. సొయ్చిరో హోండా... హోండా మోటార్ కంపెనీ

image


సొయ్చిరో హోండా గ్యారేజ్ లో ఓ మెకానిక్. కార్లను రేస్‌లకు సిద్ధం చేయడం అతని జాబ్. 1937లో టోకాయ్ సీకీ పేరుతో పిస్టన్ రింగ్స్ తయారీ కంపెనీని ప్రారంభించాడు. టోయోటా ఆటోమొబైల్ కంపెనీకి పిస్టన్ రింగ్స్ సరఫరా చేసే కాంట్రాక్ట్ ఈ కంపెనీకి దక్కింది. కానీ నాణ్యతాలోపం కారణంగా కొద్ది రోజులకే కాంట్రాక్ట్ రద్దైంది. టొయోటా... క్వాలిటీ కంట్రోల్ స్థాయికి తగ్గట్టుగా పిస్టన్స్ ఎలా తయారు చేయాలన్నదానిపై దృష్టిపెట్టిందీ సంస్థ. 1941లో పిస్టన్ రింగ్స్ సరఫరాకు టొయోటా కంపెనీ అంగీకరించింది. టోకాయ్ సీకీ కంపెనీలో టొయోటా 40 శాతం వాటాలు తీసుకుంది. అక్కడి నుంచీ సొయ్చిరోకి కష్టాలు మొదలయ్యాయి. సొయ్చిరో పదవిని ప్రెసిడెంట్ స్థాయి నుంచి సీనియర్ మేనేజర్ డైరెక్టర్ స్థాయికి తగ్గించారు. 1944లో అమెరికా బాంబు దాడుల్లో టోకాయ్ సీకీ ఫ్యాక్టరీలన్నీ ధ్వంసమయ్యాయి. మిగిలిపోయిన వస్తువులన్నింటినీ టోయోటాకి అమ్మేశాడు సొయ్చిరో. ఆ తర్వాత 1946లో హోండా సాంకేతిక పరిశోధనా సంస్థను స్థాపించాడు. 12 మంది ఉద్యోగులతో చిన్న గదిలో ఈ సంస్థను ప్రారంభించాడు. మోటార్లతో రూపొందించిన బైస్కిల్‌ని తయారు చేసి అమ్మడం మొదలు పెట్టారు. కస్టమర్లు తమ బైస్కిల్‌కు అమర్చుకునేలా ఇంజిన్లను తయారు చేశారు. 1964 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద మోటార్ సైకిల్ తయారీ సంస్థగా హోండా మోటార్ కంపెనీ ఎదిగింది. ఆ తర్వాత మినీ పికప్ ట్రక్కులు, కార్ల తయారీ రంగంలోకి హోండా కంపెనీ అడుగుపెట్టింది. ఇప్పుడు హోండా కంపెనీ టోయోటాకి ప్రత్యర్థిగా మారింది.

ఇలాంటి కంపెనీలను చూస్తుంటే "అమ్మో... ఇలాంటివి చేయడం మా వల్ల కాదు" అనిపిస్తుంది. నిజమే... ఈ కంపెనీలన్నీ ఇప్పుడున్న స్థాయికి చేరుకోవడానికి దశాబ్దాల కాలం పట్టింది. కానీ తమ ఆలోచనలపై, కలలపై ఉన్న నమ్మకం, విశ్వాసమే ఈ స్థాయికి తీసుకొచ్చింది. పరిపూర్ణవిశ్వాసంతో వాళ్లు వేసిన అడుగులే... ప్రపంచస్థాయి కంపెనీల సరసన నిలబెట్టాయి. ఇలాంటి ఆశ్చర్యకరమైన, అద్భుతమైన వివరాలను Funders and Founders వెబ్ సైట్ లో “How Many Times Should You Try?” లింక్ లో చూడొచ్చు.

image


అందుకే ఆ సినీ కవి ఇలా అన్నారు. "సాగర మథనం మొదలవగానే విషమే వచ్చింది. విసుగే చెందక కృషి చేస్తేనే అమృత మిచ్చింది. అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నది. కష్టాల వారధి దాటిన వారికి సొంతమౌతుంది." అందుకే ప్రయత్నించండి. కష్టపడి ఓడిపోవడంలో ఉన్న ఆనందాన్ని.. విజయానికి మెట్టు దూరంలో ఉన్న మీ ప్రయత్నాన్ని ఆస్వాదించండి.