మేడం టుస్సాడ్స్ లో బాహుబలి మైనపు బొమ్మ  

0

భారతీయ సినిమాకు అంతర్జాతీయ హంగులు అద్దిన సినిమా బాహుబలి. ఆ విజువల్ వండర్ మూవీలో ఇది అద్భుతం.. ఇది సాధారణం.. అని చెప్పలేం. ఫ్రేమ్ టు ఫ్రేమ్.. కాస్ట్యూమ్ దగ్గర్నుంచి క్లయిమాక్స్ దాకా ప్రతీ సీన్ న భూతో నభవిష్యత్. ఇక మూవీలో ప్రభాస్ నటన అయితే అనన్య సామాన్యం. ఆ పాత్రను ప్రభాస్ మాత్రమే చేయగలడు అన్నంతగా మెప్పించాడు. ఇకపై ప్రభాస్ పేరెత్తితే చాలు బాహుబలిలో అతని ఆహార్యమే అందరికీ గుర్తొస్తుంది. అంతగా ముద్రపడి పోయిందా గెటప్. అందుకే ఆ రూపం కలకాలం ఉండేలా బ్యాంకాక్ లోని మేడం టుస్సాడ్స్ ప్రభాస్ మైనపు బొమ్మకు ప్రాణం పోస్తోంది.

మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో మైనపు విగ్రహం ఉన్న మూడో భారతీయ వ్యక్తిగా ప్రభాస్ నిలిచిపోయాడు. మహాత్మాగాంధీ, నరేంద్రమోడీ తర్వాత ప్రభాస్ స్టాట్యూ టుస్సాడ్స్ లో ఉంది. విడుదల ముందు నుంచే మ్యూజియంలో ప్రభాస్ మైనపు విగ్రహం పెట్టాలని ఎన్నో వినతులు అందాయి. బాహుబలి విడుదల తర్వాత గూగుల్ ఎక్కువ శాతం వెతికింది ప్రభాస్ నే. ఇవన్నీ బేరీజు వేసుకున్న బ్యాంకాక్ మ్యూజియం మెజర్మెంట్స్ తీసుకుంది. ఈ లెక్కన చెప్పాలంటే మైనపు విగ్రహం ఉన్న తొలి దక్షిణాది నటుడు ప్రభాసే.

విగ్రహం కోసం ప్రభాస్ నుంచి సుమారు 350 ఫోటోలు తీసుకున్నారు. అమరేంద్ర బాహుబలిలో ప్రభాస్ ఎలా వున్నాడో అచ్చం అలాంటి విగ్రహాన్నే ఏర్పాటు చేస్తున్నామని మ్యూజియం నిర్వాహకులు తెలిపారు.

మైనపు విగ్రహమైనా, బాహుబలిలో నటిచండమైనా అంతా అభిమానులు, గురువు రాజమౌళి ఆశీర్వాదమే అంటాడు ప్రభాస్. బాహుబలి లాంటి అద్భుతమైన సినిమాలో నటించడం తన లక్కీ అని చెప్పుకొచ్చాడు.