పాతికేళ్ల కింద‌ట త‌ప్పిపోయాడు..! టెక్నాల‌జీ సాయంతో మ‌ళ్లీ త‌ల్లి ఒడి చేరాడు..!

పాతికేళ్ల కింద‌ట త‌ప్పిపోయాడు..!
టెక్నాల‌జీ సాయంతో మ‌ళ్లీ త‌ల్లి ఒడి చేరాడు..!

Wednesday January 06, 2016,

3 min Read

టెక్నాలజీ లేని నేటి ప్రపంచాన్ని ఊహించలేం. ఉదయం లేచింది మొద‌లు మళ్లీ నిద్రలోకి జారుకునే దాకా మనల్నిగైడ్ చేస్తున్న‌ది టెక్నాలజీనే అంటే అతిశయోక్తి కాదేమో! అది సరే, కొత్త ఆవిష్కరణలకు బాటలు వేస్తున్న సాంకేతిక పరిజ్ఞానం మానవ సంబంధాలనూ నడిపిస్తుందా? 25 ఏళ్ల కిందట దూరమైన తల్లీకొడుకులను తిరిగి కలిపే శక్తి టెక్నాలజీకి ఉందా? అత‌డి కథ వింటే ఔననే అనిపిస్తుంది.

25 ఏళ్ల త‌ర్వాత త‌ల్లి చెంత‌కు చేరిన షేరు మున్షీ ఖాన్

25 ఏళ్ల త‌ర్వాత త‌ల్లి చెంత‌కు చేరిన షేరు మున్షీ ఖాన్


ఒక రోజు ఏం జరిగిందంటే..

మధ్యప్రదేశ్ ఖాండ్వా దగ్గర్లోని ఒక కుగ్రామంలో పుట్టాడు మున్షీ ఖాన్. పేద కుటుంబం. తండ్రి కుటుంబ బాధ్యతలు పట్టకుండా తిరిగేవాడు. ఒక రోజు అందరినీ నట్టేట వదిలేసి తన దారి తాను చూసుకున్నాడు. షేరు, అతని చెల్లి, ఇద్దరు అన్నయ్యల భారం తల్లి మీద పడింది. తల్లి పొద్దంతా కష్టపడితే గానీ ఇల్లు గడిచేది కాదు. పనిలేని రోజు కుటుంబమంతా పస్తులుండేది. పేదరికం కారణంగా పిల్లలు చదువుకూ దూరమయ్యారు. షేరు, అతడి ఇద్దరు అన్నలు రైల్వే స్టేషన్లో భిక్షాటన చేస్తుండేవారు. ఒక రోజు ఇద్దరు అన్నల్లో ఒకతను కనిపించకుండా పోయాడు. అతని కోసం రైల్వే స్టేషన్ అంతా వెతికాడు షేరు. చివరికి ఆగి ఉన్న ఒక రైలెక్కాడు. అందులో కూడా కనిపించకపోయే సరికి రైల్లోనే కూలబడిపోయాడు. అంతలో నిద్రలోకి జారుకున్నాడు. లాక్ చేసి ఉన్న కంపార్ట్ మెంట్ అది. దిగే మార్గం లేక అందులోనే ఉండిపోయాడు. కళ్లు తెరిచే సరికి రైలు 1,500 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. ఐదేళ్ల వయసులో లోకం తెలియని ఒక పసివాడు బిత్తరచూపులతో హౌరా స్టేషన్ లో ఒంట‌రిగా మిగిలిపోయాడు.

కోల్ క‌తా వీధుల్లో ఒంట‌రిగా..

రైలెక్కి ఇంటికి వెళ్దామని ఎన్నోసార్లు ప్రయత్నించాడు. కానీ లోకల్ రైళ్లు ఎక్కడంతో అవి తిరిగి తిరిగి మళ్లీ హౌరా స్టేషన్ కే చేరేవి. చేసేది లేక‌ అక్కడే ఉండిపోయాడు. స్టేషన్ పరిసరాల్లో మిగిలిపోయిన అన్నం ప్యాకెట్లు ఏరుకొచ్చి కడుపు నింపుకునేవాడు. స్టేషన్ లోని బెంచీల మీద నిద్రపోయేవాడు. కోల్ కతా మహానగర వీధుల్లో దిక్కుతోచక తిరిగేవాడు. ఒక రోజు రైల్వే కూలీ ఒకరు ఆశ్రయమిచ్చి అన్నం పెట్టాడు. కానీ అతడి ఉద్దేశం వేరు. రైల్వే కూలీ తనను అమ్మేస్తున్నాడని తెలుసుకుని షేరు పారిపోయాడు. చివరికి పోలీసుల దగ్గరికి చేరాడు. పోలీసులు ఆ పిల్లాడిని ప్రభుత్వ సంరక్షణ కేంద్రానికి అప్పగించారు. షేరు తల్లిదండ్రుల కోసం వారు కూడా వెతికి చూశారు. కానీ లాభం లేకపోయింది.

కోల్ కతా నుంచి ఆస్ట్రేలియాకు

కొన్నాళ్లకు ఆస్ట్రేలియాకు చెందిన దంపతులు షేరును దత్తత తీసుకున్నారు. తర్వాత అతడి ఊరు, పేరు మారిపోయాయి. సరూ బ్రియర్లీ గా ఆస్ట్రేలియాలో కొత్త జీవితం! అలా 25 ఏళ్లు గడిచాయి. కానీ గతం తాలూకు జ్ఞాపకాలు అతడిని వెంటాడుతూనే ఉన్నాయి. ఎలాగైనా తన వాళ్లను కలవాలనుకున్నాడు. గంటల తరబడి కంప్యూటర్ ముందు కూర్చొని, హౌరా స్టేషన్ నుంచి వెళ్లే రైల్వే లైన్లను గూగుల్ ఎర్త్ లో పరిశీలించేవాడు. చిన్నప్పుడు తను భిక్షాటన చేసిన బర్హన్ పూర్ రైల్వే స్టేషన్ పేరులో బి అనే ఒక్క అక్షరం మాత్రమే అతడికి గుర్తుంది. అలా ఏళ్ల తరబడి వెతుకుతూనే ఉన్నాడు. 

చివరికి బర్హన్ పూర్ పేరు గుర్తొచ్చింది. స్టేషన్ కు ఉత్తరంగా ఉన్న ప్రాంతాలను శాటిలైట్ ఇమేజెస్ లో వెతికాడు. అప్పుడే ఖాండ్వా కనిపించింది. తన బాల్యానికి, ఆ ప్రాంతానికి ఏదో అనుబంధమున్నట్టు అనిపించింది. ఖాండ్వా పేరుతో ఉన్న ఒక ఫేస్ బుక్ గ్రూప్ ను కాంటాక్ట్ చేశాడు. దాని ద్వారానే తానెవరో ఏమిటో తెలిసింది. తన వాళ్లను కలుసుకుంటానన్న నమ్మకం కలిగింది. 

వెంటనే ఇండియా వచ్చి ఖాండ్వా వెళ్లాడు. అతి క‌ష్ట‌మ్మీద‌ కుటుంబం జాడ తెలుసుకున్నాడు. ఖండాలు దాటొచ్చి తల్లి ఒడిలో వాలిపోయాడు. ఆ క్షణం షేరు కళ్లల్లో కనిపించిన ఆనందం మాటలకు అందనిది! కాకపోతే ఒకటే బాధ. 25 ఏళ్ల కిందట తప్పిపోయాడని భావించిన తన అన్న చనిపోయినట్టు తెలిసి షేరు కుమిలిపోయాడు. ప్రస్తుతం షేరు మరో అన్నయ్య ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. చెల్లి స్కూల్ టీచర్. ఇప్పుడు వాళ్లది హ్యాపీ ఫ్యామిలీ!

తప్పిపోయిన దగ్గర్నుంచి, తిరిగి తల్లి చెంతకు చేరే దాకా సాగిన తన జీవన ప్రయాణానికి షేరు అక్షర రూపమిచ్చాడు. ఏ లాంగ్ వే హోమ్ పేరుతో అతడు రాసిన పుస్తకం నిండా గుండెను మెలిపెట్టే సంఘటనలే!