ఆ ఊరి ప్రజలకు చిల్లర టెన్షన్ లేదు.. ఎందుకో తెలుసా..?  

పట్టణానికి ఏమాత్రం తీసిపోని ఈ-పల్లె  

1

500, వెయ్యి నోట్లు రద్దు కావడంతో దేశవ్యాప్తంగా చిల్లరో రామచంద్రా అని గగ్గోలు పెడుతున్నారు. మనీ డిపాజిట్ కోసం బ్యాంకుల దగ్గర బారులు తీరుతున్నారు. క్యాష్ విత్ డ్రాయల్ కోసం ఏటీఎంల పడిగాపులు కాస్తున్నారు. అన్ని పనులు మానేసి కేవలం చిల్లర కోసమే రోజంతా నరకయాతన పడుతున్నారు. అయినా చేతికి వందనోట్లు రావడం లేదు. పట్టణాలు, గ్రామాలు అని తేడాలేదు. ఇప్పుడందరి సమస్య ఒక్కటే.

కానీ ఆ ఊరి ప్రజలకు మాత్రం చిల్లర టెన్షన్ లేదు. నోట్లు మార్చాలన్న ఆందోళన అసలే లేదు. అసలు వందనోటు అవసరమే రావడం లేదు. ఎప్పటిలాగే కూరగాయలు కొనుక్కుంటున్నారు. ఎప్పటిలాగే పచారీ సరుకులు తెచ్చుకుంటున్నారు. ఎప్పటిలాగే బిజినెస్ నడుస్తోంది. ఎందుకో మీరే చదవండి.

అకోదర. గుజరాత్ రాష్ట్రం సబర్కంత జిల్లాలో ఉందీ గ్రామం. దీనికి మరో పేరుంది. అదే డిజిటల్ విలేజ్. క్యాష్ లెస్, కాంప్రహెన్సివ్, కనెక్టెడ్.. ఈ మూడు అంశాల ఆధారంగా డిజిటల్ విలేజ్ గా రూపాంతరం చెందింది. గ్రామానికీ-పట్టణానికి సరిహద్దు గోడల్ని చెరిపేసినట్టుగా ఉండే ఈ వూరిలో ప్రతీ వ్యక్తికీ బ్యాంక్ అకౌంట్ ఉంది. ఎలాంటి క్యాష్ డీల్ ఉన్నా ఆన్ లైన్ లోనే జరుపుతారు. ఒక్క ఎస్ఎంఎస్ ద్వారా మొబైల్ రిచార్జ్ నుంచి బ్యాలెన్స్ ఎంక్వయిరీ మీదుగా మినీ స్టేట్ మెంట్ దాకా అన్ని పనులూ చక్కబెడతారు. పాలు కొనాలన్నా, పచారీ సరుకులు తేవాలన్నా కరెంటు బిల్లు కట్టాలన్నా అంతా ఈ బ్యాంకింగే. చేతిలో ఫోన్ మాత్రమే ఉంటుంది. పర్సు, పైసలు అన్నమాటే లేదు.

1200 మంది ఉండే ఈ గ్రామాన్ని ఐసీఐసీఐ బ్యాంకు దత్తత తీసుకుంది. గ్రామస్తుల సహకారంతో అన్ని రకాల మాడ్రన్ బ్యాంకింగ్ సేవలు అందిస్తోంది. ఈ విలేజ్ పేరుమీద ఒక వెబ్ సైట్ కూడా రన్ చేస్తోంది. ఫేస్ బుక్ పేజీ కూడా ఉంది. గవర్నమెంట్ ఉచిత వై-ఫై రూటర్ పెట్టింది. దానిద్వారా ఇంటర్నెట్ సేవల్ని వాడుకుంటున్నారు.

డిజిటల్ గ్రామం కావడం వల్లనే ఇవాళ దేశవ్యాప్తంగా జనం పడుతున్న చిల్లర పాట్లు వీళ్లకు తప్పాయి. వందనోటు కోసం వెంపర్లాడటం లేదు. వెయ్యి నోటు డిపాజిట్ కోసం రోజంతా క్యూ లైన్లో పడిగాపులు పడటం లేదు. అసలు వీళ్లకు కరెన్సీ నోట్ల టెన్షనే లేదు. గ్రామస్తుల సహకారం, అధికారుల చిత్తశుద్ధి ఫలించి.. నేడు అకోదర గ్రామం చైతన్యానికి ప్రతీకగా నిలిచింది. పట్టణానికి ఏమాత్రం తీసిపోని ఈ పల్లె.. నిజంగా పాలవెల్లి. 

Related Stories