కాబిల్ ఎందుకు ముద్దు..?! రయీస్ ఎందుకు వద్దు..?!

కైలాశ్ విజ‌య్ వ‌ర్గియా ట్వీట్లకు ఆప్ నేత అశుతోష్ కౌంటర్ ఎటాక్

కాబిల్ ఎందుకు ముద్దు..?! రయీస్ ఎందుకు వద్దు..?!

Sunday January 29, 2017,

4 min Read

అసలు ఏంటా మాటలు? మ‌తం ముసుగేసుకున్న ఒక నాయ‌కుడి అహంకారపు వ్యాఖ్యలా? లేక నిరాశ నిండిన‌ వ్య‌క్తి చేసిన అప‌హాస్య‌మా? లేదా కాలం చెల్లిన సిద్ధాంతాల తాలూకు యుద్ధ నినాద‌మా? ఏమ‌నాలి వాటిని? రెండు సినిమాలను పోల్చ‌డం కొత్తేమీ కాదు. తప్పు కూడా కాదు. నిజానికి సినిమా అనేది ఒక క్రియేటివ్ ఫీల్డ్. విమ‌ర్శ‌కుల అభిప్రాయాల‌ వ‌ల్లే సినిమా స‌త్తా ఏంటో ప్ర‌పంచానికి తెలుస్తుంది. ప్రేక్ష‌కుడికి ఒక క్రియేటివ్ విజన్ ఏర్పడుతుంది. ఆ తర్వాత సినిమా చూడాలా వద్దా అన్నది ప్రేక్షకుడి ఇష్టం. అంతవరకే. కానీ దుర‌దృష్ట‌వ‌శాత్తూ మ‌నం క్రియేటివిటీని దైవ‌దూష‌ణకు వాడుకుంటున్న మ‌నుషుల మ‌ధ్య బ‌తుకుతున్నాం. ఇది డొనాల్డ్ ట్రంప్ కాలం. నిజాల‌కు అవ‌త‌లి ప్ర‌పంచం లోకి, ఒక కొత్త కాలంలోకి ఎంట‌ర‌య్యాం. అందుకే కైలాశ్ విజ‌య్ వ‌ర్గియా చేసిన విద్వేషపూరిత వ్యాఖ్య‌లు నాకు పెద్ద‌గా ఆశ్చ‌ర్యం క‌లిగించ‌లేదు. అత‌ను షారుక్ ఖాన్ సినిమా రయీస్ చూడొద్ద‌ని ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టాడు. హృతిక్ రోషన్ మూవీ కాబిల్ ను ఆకాశానికెత్తి అంద‌ర్నీ చూడమని చెప్పాడు.

మొదట్లో కైలాశ్ మాట‌లు పెద్ద‌గా త‌ప్ప‌నిపించ‌లేదు. అది ఒక సినిమా గురించి ఆయ‌న‌ వ్య‌క్తిగ‌త అభిప్రాయం అనిపించింది. కానీ ఆయన చేసిన ట్వీట్ చూస్తే, అస‌లు విష‌యం బోధ‌ప‌డుతుంది. కైలాశ్ ఏమ‌న్నారంటే- మ‌న దేశం వాడు కాని ర‌యీస్ (ముస్లిం దేశాల్లో నాయ‌కుడు అని అర్థం) తో మనకు వీస‌మెత్తు ఉప‌యోగం లేదు. కానీ కాబిల్ మనవాడు. దేశ‌భ‌క్తుడు. కాబ‌ట్టి ప్ర‌తి ఒక్క‌రూ అత‌డిని స‌పోర్ట్ చేయాలి- ఇదీ ఆ ట్వీట్ సారాంశం. నిజానికి విజ‌య్ వ‌ర్గియా సామాన్యుడేమీ కాదు. అధికార బీజేపీకి సాక్షాత్తూ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి. వివాదాల‌తో వార్త‌ల్లోకి ఎక్క‌డం ఆయ‌న‌కు మామూలే. గ‌తంలో ఎన్నోసార్లు పార్టీ పెద్ద‌ల‌తో చీవాట్లు కూడా తిన్నాడు. అయినా ఎప్పుడూ ఏదో ఒక కొత్త కాంట్ర‌వ‌ర్సీ క్రియేట్ చేస్తూనే ఉంటాడు. ఆయ‌న వ్యాఖ్య‌ల నిండా మ‌తం, విద్వేషం, ఒక క‌మ్యూనిటీ మీద విషం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.


image


రయీస్ అనేది ఒక బయోపిక్. అందులో షారుఖ్ ది మాఫియా డాన్ పాత్ర‌. ఇటు కాబిల్ ఒక ప్రేమ కథ. ఒక అంధ జంట రివెంజ్ స్టోరీ. అందులో హృతిక్ ది మెయిన్ రోల్. యాదృశ్చికంగా రెండు సినిమాలు ఒకే రోజు విడుద‌లయ్యాయి. అయినా షారుఖ్ గానీ, హృతిక్ గానీ ఒక‌రుపై ఒక‌రు గానీ.. త‌మ సినిమాల మీద గానీ.. ఎలాంటి కామెంట్లు చేసుకోలేదు. ఒక‌వేళ అలాంటిదేమైనా జ‌రిగి ఉంటే కాంట్ర‌వ‌ర్సీ క్రియేట్ అయ్యి.. సినిమాల‌కు బోలెడంత ప్ర‌చారం జ‌రిగి ఉండేది. కానీ వాళ్లిద్దరూ అలాంటి మనుషులు కాదు. ఒకరంటే ఒకరికి ప్రేమ, గౌరవం ఉన్నాయి. ఇటు హృతిక్ ది కూడా సినిమా ప్ర‌చారం కోసం ట్విట్ట‌ర్ ను వాడుకునే స్వ‌భావం కాదు. కాబ‌ట్టి ముమ్మాటికీ అదంతా కైలాశ్ విజ‌య్ వ‌ర్గియా పైత్య‌మే.

కైలాశ్ విజ‌య్ వ‌ర్గియా పనిచేస్తున్న పార్టీయే అలాంటిది. వాళ్ల‌ది పచ్చి మ‌త‌త‌త్వ ఎజెండా. మైనారిటీలంటే ప‌డ‌దు. ఆర్ఎస్ఎస్, బీజేపీ బ‌హిరంగంగానే హిందుత్వ ఎజెండాను మోస్తున్నాయి. హిందుత్వ దేశం అంటున్నాయి. అందులో మైనారిటీల‌కు సెకండ్ గ్రేడ్ పౌర‌స‌త్వం ఇస్తారట. ఆ పార్టీ పాతతరం నాయ‌కులు కూడా.. అవకాశం దొరికినప్పుడల్లా మైనారిటీల‌కు అస‌లు పౌర‌స‌త్వ హ‌క్కులు ఇవ్వ‌కూడ‌ద‌న్న అర్థంలో మాట్లాడుతుంటారు. అంతేనా? భార‌త దేశ విభ‌జ‌న‌కు ముస్లింలే కార‌ణ‌మ‌ని కూడా ప్రచారం చేస్తున్నారు. వాళ్ల దృష్టిలో రాజ‌కీయాలంటే- నాగ‌రిక‌త‌ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ. ఇక్కడ శామ్యూల్ హంటిగ్ట‌న్ వ్యాఖ్య‌ల‌ను ఉటంకిస్తున్నా.

తొలి స‌హస్రాబ్ది ద్వితియార్థంలో ద‌క్షిణ ఆసియాలోకి ముస్లింలు ప్ర‌వేశించడం వల్లే భార‌త నాగ‌రిక‌త మ‌స‌క‌బారింద‌ని ఆర్ఎస్ఎస్ విష ప్రచారం చేస్తోంది. భార‌త చ‌రిత్ర అంటే ముమ్మాటికీ హిందూ చ‌రిత్ర మాత్ర‌మే అని వాళ్ల అభిప్రాయం. భార‌త దేశంలో పుట్టిన‌వాళ్లే నిజ‌మైన భార‌తీయుల‌న్న వీర్ సావ‌ర్క‌ర్ సిద్ధాంతం వాళ్లది. ఆ నాయకుల దృష్టిలో ముస్లింలు, క్రైస్త‌వులు విదేశీయులు. అందుకే మైనారిటీల మీద ఇంత‌ విద్వేషం.

ఆధునీక‌ర‌ణ‌, లౌకికీక‌ర‌ణ‌, ప‌ట్ట‌ణీక‌ర‌ణ పెరుగుతున్న ఈ కాలంలోనూ మైనారిటీలు ఇంకా చీక‌ట్లోనే మ‌గ్గుతున్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకులు మ‌తం పేరుతో హ‌ద్దులు గీస్తున్నారు. నిజానికి కైలాశ్ విజ‌య్ వ‌ర్గియా చేసిన దాంట్లో కొత్తేమీ లేదు. అదే పాత ధోర‌ణి. అదే జాతి విద్వేషం. ఆయ‌న కేవ‌లం ఒక్క సినిమాను మాత్ర‌మే టార్గెట్ చేయ‌లేదు.. దాని ద్వారా షారుక్, ఆయన మతం వాళ్ల దేశభక్తిని కూడా శంకించాడు. కేవ‌లం మ‌తం పేరుతో షారుఖ్ ను లక్ష్యం చేసుకున్నాడు. ర‌యీస్ లో గ్యాంగ్ స్ట‌ర్ పాత్ర‌, అందులో న‌టించిన న‌టుడు ఇద్ద‌రూ ఒకే మ‌తానికి చెందిన వారు కావ‌డం కైలాశ్ కు గానీ సిద్ధాంతాల‌ను ప‌ట్టుకొని వేలాడే ఆయ‌న స్నేహ‌తుల‌కు గానీ రుచించ‌డం లేదు.

ఇకపోతే హృతిక్ ది వేరే మ‌తం. అందుకే హృతిక్ ను ఇందులోకి లాగ‌లేదు. కాకపోతే ఇద్ద‌రు సినీ రంగ దిగ్గ‌జాల‌ను వారి మ‌తాల‌ను బ‌ట్టి చూసే స్థాయికి పరిస్థితిని దిగ‌జార్చడమే దుర‌దృష్ట‌క‌రం. అది చారిత్ర‌క త‌ప్పిదం. కైలాశ్ దృష్టిలో రయీస్, కాబిల్ రెండు సినిమాలు కాదు. ఉనికి కోసం పోరాడుతున్న రెండు నాగ‌రిక‌త‌లు. ఎంత అవివేకం?

నిజానికి ద‌క్షిణ ఆసియాలో భార‌త సినీ ప‌రిశ్ర‌మ స్వేచ్ఛ‌గా ప‌నిచేసుకు పోతోంది. ఎప్పుడూ ప‌రిశ్ర‌మలో కుల మ‌తాల వివ‌క్ష క‌నిపించ‌లేదు. ఇండ‌స్ట్రీ కేవ‌లం టాలెంట్ ను గుర్తించి ప్రోత్సహించింది. స‌క్సెస్ కు, ఫెయిల్యూర్ కు కులం, మ‌తం అడ్డురాలేదు. అంతెందుకు, 50, 60ల్లో రాజ్ క‌పూర్, దేవానంద్ ఇద్దరూ సూప‌ర్ స్టార్లు. ఆ టైంలో దిలీప్ కుమార్ (యూసుఫ్ ఖాన్) కూడా ఇండ‌స్ట్రీని ఏలాడు. 70, 80ల్లో అమితాబ్ తో సమానంగా న‌సీరుద్దిన్ షాను కూడా సినీ అభిమానులు ఆదరించలేదా? ఎటొచ్చీ 90ల్లోనే పరిస్థితి మారింది. మ‌త‌త‌త్వ రాజ‌కీయాలు పురుడు పోసుకుని.. ఆర్ఎస్ఎస్, బీజేపీ బ‌లంగా రామ‌మందిర అంశాన్ని భుజానికెత్తుకున్న రోజుల‌వి. అప్పుడే భార‌తీయ సినిమా లౌకికత్వంలో కొత్త అధ్యాయం మొద‌లైంది. ఆ స‌మ‌యంలో ఖాన్ లు బాలీవుడ్ ను ఏలుతున్నారు. ఆమిర్ ఖాన్, స‌ల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, సైఫ్ ఆలీ ఖాన్, ఇర్ఫాన్ ఖాన్, న‌వాజుద్దీన్ సిద్దికీ.. ఇలాంటి వాళ్లంతా ఇండ‌స్ట్రీలో రారాజులు. హృతిక్, అక్‌ఖయ్ కుమార్, అమితాబ్, అజ‌య్ దేవ్ గ‌న్ లాంటి న‌టుల‌కు కూడా సక్సెస్ ఉన్న‌ప్ప‌టికీ.. ఖాన్ ల‌తో పోలిస్తే త‌క్కువ‌. 50 ఏళ్ల వ‌య‌సులో కూడా ఆమిర్, స‌ల్మాన్, షారుక్ ను అభిమానులు ఆద‌రిస్తున్నారు. ఆ ముగ్గురితో ప‌నిచేయాల‌ని ప్ర‌తి డైరెక్ట‌ర్, ప్రతి ప్రొడ్యూస‌ర్, ప్రతి హీరోయిన్ డ్రీమ్.

ఖాన్ త్ర‌యానికి హృతిక్ రోష‌నే త‌గ్గ పోటీగా చూపెట్ట‌డానికి ఒక వ‌ర్గం మీడియా అప్ప‌ట్లో ప్ర‌య‌త్నించింది. కొన్ని మ్యాగ‌జైన్లు క‌వ‌ర్ పేజీ ఆర్టిక‌ల్స్ కూడా రాశాయి. కానీ వాటితో పెద్ద‌గా ఫ‌లితం లేక‌పోయింది. ఖాన్ లు అంద‌రూ హిందూ అమ్మాయిల‌ను పెళ్లి చేసుకున్న‌ప్పుడు కూడా ల‌వ్ జిహాద్ చిచ్చు రేగింది. వాళ్లు దేశ‌భ‌క్తులు కాద‌ని నిరూపించే ఏ అవ‌కాశాన్నీ వ‌దులుకోలేదు. షారుఖ్ మై నేమ్ ఈజ్ ఖాన్ సినిమా అప్పుడు గానీ, త‌న భార్య ఇండియా వ‌దిలి పోదామంటోంద‌ని ఆమిర్ అన్న‌ప్పుడు గానీ రేగిన వివాదం అంతా ఇంతా కాదు. మ‌తం అనే క‌ర్ర‌తో వాళ్ల‌ను దండించడ‌డానికి ప్ర‌య‌త్నాలు చేశారు. దేశం మీద వాళ్ల ప్రేమ‌ను శంకించ‌డానికి జ‌ర‌గ‌ని ప్ర‌య‌త్న‌మంటూ లేదు.

తాజాగా ర‌యీస్ సినిమాను కూడా అందుకు ఉపయోగించుకున్నారు. షారుఖ్ దేశభ‌క్తినే కాదు, దాని ద్వారా ఆ క‌మ్యూనిటీ దేశ‌భ‌క్తిని కూడా ప్ర‌శ్నించ‌డానికి ఒక ఆయుధంగా సినిమాను వాడుకున్నారు. మెజారిటీలు మాత్ర‌మే దేశ‌భ‌క్తుల‌ని, మైనారిటీలకు దేశం మీద ప్రేమ లేదని చెప్ప‌డానికి ప్ర‌య‌త్నించారు. ఇది చాలా ప్ర‌మాద‌క‌రం. గ‌త రెండున్న‌రేళ్లుగా ఈ ధోర‌ణి వికృతంగా మారుతోంది. దేశ అభివృద్ధికి ఇది ఎంత మాత్రం మంచిది కాదు. జాతి విద్వేషం ఇలాగే కొన‌సాగితే విప‌త్తుకు దారి తీస్తుంది.