ముంబైలో మోతమోగిస్తున్న ఫుడ్ స్టార్టప్ 'బాక్స్ 8'

ముంబైలో మోతమోగిస్తున్న ఫుడ్ స్టార్టప్ 'బాక్స్ 8'

Friday September 18, 2015,

4 min Read

బిజీబిజీ లైఫ్ స్టైల్... ఉరుకులు పరుగుల జీవితాలు. అసలు తినడమే మర్చిపోతున్నారు జనం. ఇంట్లో బయల్దేరామా... ఆఫీసుకి వెళ్లామా... వచ్చామా... అన్నట్టుగా సాగుతుంది జీవితం. మధ్యలో ఏమైనా తిన్నామా... తింటే ఎంత తిన్నాం అనే దానిపై పెద్ద పట్టింపే ఉండట్లేదు. ఏదో దొరికింది తినేసి ఆ పూటకు సంతృప్తిపడిపోవడం అలవాటు చేసుకుంటున్నారు బిజీ లైఫ్ ఉద్యోగులు. మంచి హోటల్‌కు వెళ్లి నచ్చిన ఆహారం తినడం చాలా అరుదు. అయితే మీకు నచ్చిన ఆహారం మీరు కోరుకున్న చోటికే ఎవరైనా తీసుకొచ్చిస్తే... అంతకు మించి ఇంకేం కావాలి. అలాంటి సేవలను అందిస్తోంది BOX8. అసలేంటీ ఈ బాక్స్8 ? దాని వెనక కథేంటీ ?

బాక్స్8 పుట్టిందిలా...

ఇద్దరు ఐఐటియన్స్ బుర్రలో పుట్టిన ఆలోచన బాక్స్8. ముంబైకి చెందిన ఫుడ్ టెక్ స్టార్టప్ ఇది. కావాల్సిన ఆహారాన్ని డోర్ డెలివరీ చేసే సంస్థ. ఐఐటీ చదివిన అమిత్ రాజ్, అన్షుల్ గుప్తాలు 2011లో పోంచో పేరుతో స్టార్టప్‌ని ప్రారంభించారు. మొదట్లో కేవలం మెక్సికన్ డిషెస్ సరఫరా చేసేవాళ్లు. ఆ తర్వాత మెనూ పెరిగింది. 2013లో కంపెనీ పేరును బాక్స్8గా మార్చారు. వీళ్లు అందించే ఆల్ ఇన్ వన్ మీల్ బాక్స్ ముంబైవాసులకు సుపరిచితం. ముడి సరుకులు తీసుకురావడం దగ్గర్నుంచీ ఫుడ్ తయారు చేసి, డెలివరీ చేసేంత వరకు అన్నీ జాగ్రత్తగా చూసుకుంటారు. అందుకేనేమో భోజనప్రియుల నోళ్లల్లో నానుతోంది ఈ పేరు. 80 శాతం మంది కస్టమర్లు పదేపదే ఆర్డర్ ఇస్తుంటారని ధీమాగా చెబుతారు వీరిద్దరు. ప్రస్తుతం బాక్స్8కి ముంబై ప్రాంతంలో రోజుకు 2500 ఆర్డర్లు వస్తున్నాయి. వేర్వేరు కిచెన్ల నుంచి ఆహార పదార్థాలను సేకరించి డెలివరీ చేయడమే కాదు... బాక్స్8కి సొంత కిచెన్లున్నాయి. వాటి ద్వారా రకరకాల వంటకాలను కస్టమర్లకు అందిస్తున్నాయి. ముడిపదార్థాల సేకరణ దగ్గర్నుంచీ వండి, డెలివరీ చేసేంత వరకు పలు దశలుంటాయి. అయితే ప్రతీ దశపైనా ఖచ్చితమైన పరిశీలన ఉంటుంది. ప్రతీ ఆర్డర్ డెలివరీ చేయడంలో జాగ్రత్తలు తీసుకుంటారు. ఆహార పదార్థాల క్వాలిటీని ఒకేలా మెయింటైన్ చేసేందుకు సరుకులను ఒకే చోటి నుంచి కొనడం, సేకరించడం వీరికి అలవాటు. వీరి వ్యాపార వృద్ధి ప్రతీ నెల 25-30 శాతం మధ్య ఉంటోంది.

"మా వ్యాపారవృద్ధికి సేంద్రీయ ఉత్పత్తులతో వంటలు చేయడం ఒక కారణమైతే, ఒకరి ద్వారా మరొకరికి మా సంస్థ గురించి ప్రచారం జరగడం మరో కారణం. ఇప్పటివరకు ఎలాంటి హోర్డింగులు పెట్టలేదు. ఎలాంటి మార్కెటింగ్ చేయలేదు" అంటారు అన్షుల్.
image


సవాళ్లతో ప్రయాణం

సాధారణంగా ఈ ఇండస్ట్రీలో అనేక సవాళ్లున్నాయి. ముఖ్యంగా శాశ్వత కస్టమర్లు రావడానికి సమయం పట్టడం, వచ్చిన కస్టమర్లు నిలకడగా ఉండలేకపోవడం, ఆలస్యంగా డెలివరీ కావడం, ఆర్డర్ తీసుకునే సమయంలో తలెత్తే సమస్యలు సర్వసాధారణం. అయితే మొత్తం వ్యాల్యూ చైన్‌ని బాక్స్8 సొంతం చేసుకోవడం ద్వారా ప్రతీ ఆర్డర్ పై నియంత్రణ ఉంటుంది. "ఆర్డర్ తీసుకోవడం దగ్గర్నుంచీ డెలివరీ చేసే వరకు మేం ప్రతీ విషయంలో టెక్నాలజీని విస్తృతంగా ఉపయోగించుకున్నాం. ప్రస్తుతం మేం ప్రతీ ఆర్డర్‌కు సంబంధించి దశలన్నీ మానిటర్ చేయగలుగుతున్నాం. మా యాప్ ద్వారా కస్టమరే తన ఆర్డర్‌ను ట్రాక్ చేసుకోవచ్చు" అని వివరిస్తారు అన్షుల్. సర్వీసులో లోపాలు తగ్గించడానికి డేటా అనలిటిక్స్ వీరికి ఎంతో ఉపయోగపడుతోంది. భవిష్యత్తులో తప్పులు పునరావృతం కాకుండా ఉండటానికి, మొత్తం ప్రాసెస్‌ను మరింత సులభతరం చేసేందుకు నిత్యం డాటా అనాలిసిస్ చేస్తోంది కంపెనీ. " సేవల విషయంలో 0.5 శాతంలోపే తప్పులు జరుగుతున్నాయి. భవిష్యత్తులో సున్నా శాతానికి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం" అంటారు మరో కో-ఫౌండర్ అమిత్.

image


టీమ్ బాక్స్ 8

బాక్స్8 టీమ్ లో రుచికరమైన ఆహారాన్ని వండి వడ్డించే అనుభవజ్ఞులైన షెఫ్‌లు ఉన్నారు. కస్టమర్ల టేస్టుకు తగ్గట్టుగా వంటకాలను చేసివ్వడంలో వీళ్లు స్పెషలిస్టులు. పేరుకు తగ్గట్టుగానే మీల్ బాక్సును ప్రత్యేకంగా డిజైన్ చేశారు. బాక్సులో ఉన్న ఆహారపదార్థాలను భద్రంగా ఉంచడం, కారిపోకుండా చూడటం ఈ బాక్సు ప్రత్యేకత. సగటున ప్రతీ కస్టమర్ నెలలో మూడు నాలుగు సార్లు వీరికి ఆర్డర్లు ఇస్తుంటారు. భవిష్యత్తులో ఎనిమిది నుంచి పది సార్లైనా ఆర్డర్లు ఇచ్చేలా తమ సేవలను తీర్చిదిద్దాలన్నది వీరి లక్ష్యం. ప్రస్తుతం ఈ కంపెనీలో 450 మంది పనిచేస్తున్నారు. వీరిలో 50 మంది బాక్స్8 కోర్ టీమ్. ఐఐటియన్స్‌తో పాటు ఐటీసీ, మారియట్‌కు చెందిన షెఫ్ లు వీరి దగ్గరున్నారు.

"రాబోయే రోజుల్లో మా కోర్ టీమ్ ని యాభై నుంచి వందకు పెంచాలని చూస్తున్నాం. మా ఫీల్డ్ స్టాఫ్ ని పది రెట్లు పెంచాలనుకుంటున్నాం. ఈ ఏడాది చివరి నాటికి 10 వేల ఆర్డర్లను సొంతం చేసుకోవాలనుకుంటున్నాం. రాబోయే 18 నెలల్లో రూ.500 కోట్ల జీఎంవీ (గ్రాస్ మర్కండైజ్ వేల్యూ) సాధించాలన్నది మా లక్ష్యం" అంటారు అన్షుల్.

ఈ ఏడాది మేలో బాక్స్8 స్టార్టప్‌కి... మేఫీల్డ్ పార్ట్‌నర్స్ నుంచి సిరీస్-ఏ ఫండింగ్ కింద 21 కోట్లు వచ్చాయి. త్వరలో బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ నగరాల్లో విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.

image


వేల కోట్ల మార్కెట్

భారతదేశంలో అతిపెద్ద అవకాశాలున్న రంగాల్లో ఆహార రంగం ఒకటి. ఓసారి మార్కెట్‌ని పరిశీలిస్తే ఈ రంగంలో వేల కోట్ల వ్యాపారం జరుగుతోంది. భారతదేశంలో ఉద్యోగులు, వ్యాపారుల బిజీ షెడ్యూల్ కారణంగా ఆహారాన్ని ఆర్డర్ ఇచ్చి తెప్పించుకోవడం అవసరంగా మారింది. భారత దేశంలో ఫుడ్ డెలివరీ మార్కెట్ ప్రస్తుతం లక్ష కోట్లకు పైగా వ్యాపారం చేస్తోంది. ఈ రంగంలో ఏటా 30 శాతం వృద్ధి కూడా ఉండటం విశేషం. బాక్స్8తో పాటు స్పూన్ జాయ్, బెంగళూరుకు చెందిన ఫ్రెష్ మెనూ, గుర్గావ్‌కు చెందిన FRSH లాంటి స్టార్టప్స్ ఇలాంటి సేవలందిస్తున్నాయి. ఇవన్నీ విజయవంతంగా నడుస్తున్నాయంటే మార్కెట్ అవసరాలేంటో అర్థం చేసుకోవచ్చు. అయితే Swiggy, Roadrunnr, Quickli లాంటి వాటితో పోలిస్తే బాక్స్8దే పైచేయి. ఎందుకంటే ఆహారం తయారు చెయ్యడం దగ్గర్నుంచీ డెలివరీ చేసేవరకు పర్యవేక్షించడమే ప్రధాన కారణమని చెప్పుకోవచ్చు. సొంతంగా ఆహారాన్ని తయారు చేయడం ఫుడ్-టెక్ స్టార్టప్స్‌కి ఎంతో ఉపయోగకరం. మంచి మార్జిన్ వస్తుంది. కేవలం డెలివరీ పై ఆధారపడే స్టార్టప్స్ కంటే ఆహారాన్ని తయారు చేసి డెలివరీ చేసే సంస్థలకే లాభాలెక్కువ.