పదకొండేళ్లకే ప్రపంచస్థాయి మేధావి..!

 పదకొండేళ్లకే ప్రపంచస్థాయి మేధావి..!

Sunday April 03, 2016,

2 min Read


పిట్ట కొంచెం కూత ఘ‌నం. ఈ సామెతకు సరిగ్గా సరిపోతుంది సాన్యాకు. వయసు 11 ఏళ్లు. అయితేనేం ఐన్ స్టీన్ కంటే గొప్ప మేథస్సు ఆమె సొంతం. అవును. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన ఐక్యూ టెస్ట్ మెన్సా పరీక్షలో సాన్యా టాప్ స్కోరర్. అదంత ఆషామాషీ విషయం కాదు. తలలు పండిన మేథావులే తలలు వాల్చేస్తారు. మహామహా మేథావులే ఆలోచనలో పడతారు. అలాంటి క్లిష్టమైన మెన్సా టెస్టులో పదకొండేళ్ల సాన్యా వ‌ర్మ ప్రపంచంలో మునుపెవరూ సాధించన్ని మార్కులు సాధించింది. కాటెల్ 3బీ స్కేల్ లో 162 పాయింట్లు సాధించ‌డమంటే ఆ వయసుకు మాటలు కాదు. క‌ల్చ‌ర్ ఫెయిర్ స్కేల్ లో 142 పాయింట్లు దక్కించుకోవడమంటే అంతకంటే గొప్పవిషయం మరోటి లేదు. చెప్పాలంటే ప్ర‌పంచ వ్యాప్తంగా రికార్డ‌యిన పాయింట్ల‌లో సాన్యాదే పెద్ద నంబర్.

మెన్సా టెస్ట్. 1964లో ఆక్స్ ఫ‌ర్డ్ లో రోలాండ్ బెరిల్, డాక్టర్ లాన్స్ వేర్ కలిసి దీన్ని నెల‌కొల్పారు. ఇదొక హై ఐక్యూ సొసైటీ. ఇందులో వ్య‌క్తుల మేథస్సుపై రకరకాల ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తారు. మెన్సా స్కోరును బ‌ట్టి ఆ వ్య‌క్తి తెలివితేటల్ని అంచనా వేస్తారు. ఈ టెస్ట్ ద్వారా మెద‌డు ఎంత చురుగ్గా ప‌నిచేస్తుందో చెప్పేస్తారు. అలాంటి టిపికల్ కండిషన్లో 162 పాయింట్లు సాధించ‌డమంటే సామాన్య విష‌యం కాదు. 

సాన్యా నేప‌థ్యం..

సాన్యా లండన్ లో చదువుతోంది. తల్లిదండ్రులు సునీల్ వర్మ పంజాబ్ రాష్ట్రానికి చెందినవారు. అతనో బ్యాంకు ఉద్యోగి. ఆమె తల్లి సునీత వర్మ. ఆమెది ఒడిషా. చిన్నప్పటి నుంచే అసాధ‌ర‌ణ‌మైన తెలివితేట‌లున్న సాన్యాను ఎలాగైనా గొప్ప మేధావిగా తీర్చిదిద్దాల‌నుకున్నారు. మెన్సా బుక్ గురించి తెలుసుకొని అందులో ఐక్యూ టెస్ట్ చేయించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. మెన్సా బుక్ లో చోటు సంపాదిస్తే బిడ్డ భ‌విష్య‌త్తుకు ఢోకా ఉండదని భావించారు. 

image



సాధించిన విజ‌యాలు సాన్యా మాటల్లో....!

"మెన్సా రిజ‌ల్ట్స్ ప్ర‌క‌టించిన రోజది. ఎంతో ఎగ్జ‌యిటింగ్ గా ఉంది. మా అమ్మ ఒక ఎన్వ‌ల‌ప్ అందుకుంది. అందులో ఐక్యూ రిజ‌ల్ట్స్ ఉన్నాయి. కవర్ ఓపెన్ చేశాక మా అమ్మ క‌ళ్లు ఉద్విగ్న‌ భరితంగా మారాయి. నా చేతికి రిజ‌ల్ట్స్ పేపర్ అందించింది. అది చూశాక న‌మ్మ‌లేకపోయా. క‌ళ్లు చెమ్మ‌గిల్లాయి. నేను ఒక హై ఐక్యూ సొసైటీలో మెంబ‌ర్ గా గుర్తింపు పొందాను అనే మాట నాలో అంతులేని ఆత్మ విశ్వాసాన్ని నింపింది. ఇదొక మరిచిపోలేని అనుభూతి"

మెన్సా రికార్డుల్లోకి ఎక్కిన త‌ర్వాత సాన్యా జీవితం ఒక్కసారిగా మారిపోయింది. ప్ర‌స్తుతం ఆమె ఫ్రెంచ్ నేర్చుకుంటోంది. దాంతో పాటు చెస్ ఆడ‌టం, రోబోటిక్స్ రీసెర్చిపై దృష్టిసారించింది. నాలెడ్జ్ గెయిన్ చేసుకునేందుకు ర‌క‌ర‌కాల పుస్త‌కాలు చ‌దువుతోంది. క్విజ్ పోటీల్లో పాల్గొంటోంది.  

భ‌విష్య‌త్తు కోసం బాటలు..!

మెన్సా అనే ఒక గొప్ప రికార్డును కొల్లగొట్టిన 11ఏళ్ల మేథావి సాన్యా. ఆమెను తీర్చిద్ద‌డ‌ంగా వెనుక త‌ల్లిదండ్రుల శ్రమ ఎంతైనా ఉంది. కూతురు ఏం చేసినా కాదనరు. ఏ నిర్ణయం తీసుకున్నా ఆమెకే వదిలేస్తారు. గౌరవిస్తారు కూడా. ప్ర‌స్తుతం ఆమె మ్యాథ్స్, ఇంగ్లీష్‌, బ‌యోజెనిటిక్స్‌, స్పేస్ లాంటి సబ్జెక్టుల‌పై దృష్టి సారించింది. అయితే ఫ‌లానా స‌బ్జెక్ట్ పైనే ఫోకస్ చేయమని త‌ల్లిదండ్రులు ఏనాడూ ఒత్తిడి చేయ‌డంలేదు.

మెన్సా టెస్ట్.. సాన్యాలోని మేథస్సును వెలికితీయ‌డం మాత్ర‌మే కాదు.. ఆ చిన్నారిలో అంతులేని ఆత్మ‌విశ్వాసాన్ని నింపింది. అందుకే అంటారు.. ఒక గొప్ప వ్య‌క్తులు కావడానికి వ‌య‌స్సుతో ప‌నిలేదు అని.