పిల్లల టీకాల తేదీలను గుర్తుచేేసే 'వి రిమైండ్'

పిల్లల టీకాల తేదీలను గుర్తుచేేసే 'వి రిమైండ్'

Saturday August 22, 2015,

4 min Read

టీకాల తేదీలను మర్చిపోతున్న తల్లిదండ్రులు.

వ్యాక్సిన్లు వేయని కారణంగా ఏటా వేలమంది చిన్నారుల మృతి.

ఎస్ఎంఎస్ రూపంలో వ్యాక్సిన్ల గడువును గుర్తుచేస్తున్న వీరిమైండ్.

ఇప్పటికే 31 వేలకు పైగా రిమైండర్లు.


చిన్నసమస్యలే కాని ప్రాణాంతకమవుతాయి. తల్లిదండ్రుల ఏమరపాటు పిల్లల ప్రాణం మీదకు తెస్తోంది. వ్యాక్సిన్లను వేయించడంలో తల్లిదండ్రులు ఇబ్బందులను పరిష్కరించుందుకు ఇద్దరు యువకులు కృషి చేస్తున్నారు. 'వి రిమైండ్' సంస్థను ఏర్పాటు చేసి ఇమ్యునైజేషన్ షెడ్యూల్‌ను పటిష్ఠంగా అమలయ్యేలా చూస్తున్నారు.

మన అనుభవంలోకి వస్తే కాని మనం దేన్నీ సీరియస్‌గా పట్టించుకోం. వి రిమైండ్ ఆవిర్భావం కూడా దీనికి భిన్నమైనదేమీ కాదు. తమ పిల్లాడికి వ్యాక్సిన్ ఇవ్వడం మర్చిపోయారు నగేశ్ చుక్కా. ఎంతో బాధనిపించిందతనికి. ఏ వ్యాక్సిన్ ఎప్పుడు వేయాలని కలీగ్స్‌ను అడిగారు. నగేశ్ ఫ్రెండ్ శ్రీనివాస్ సైతం ఇలాంటి అనుభవాన్నే ఎదుర్కొన్నారు. దీంతో వీరిద్దరు తమ కోసమే మొబైల్ యాప్‌ను తీసుకురావాలని నిర్ణయించారు. యాప్ తమ సమ్యను తీరుస్తుందని భావించారు.

image


యునిసెఫ్ లెక్కల ప్రకారం ఇమ్యునైజేషన్ చేయించని చిన్నారులు భారత్‌లో 69 లక్షల మంది ఉన్నారు. ఈ సంఖ్య పాకిస్థాన్, ఇతియోపియా కంటే ఎక్కువ. ఇది వీరిని మరింత కుంగదీసింది. యూనివర్సల్ ఇమ్యునైజేషన్ పేరుతో ప్రభుత్వం ప్రతి ఏటా వ్యాక్సిన్లను ఉచితంగా వేస్తున్నప్పటికీ ఐదేళ్లలోపు చిన్నారుల్లో 30 శాతం మంది తగ్గించగలిగే వ్యాధులతోనే మృతి చెందుతున్నారు. సమయానికి వ్యాక్సిన్ వేయకపోవడం వల్లే ఈ సమస్య ఉత్పన్నమవుతోంది. ఇమ్యునైజేషన్ షెడ్యూల్‌ను కచ్చితంగా అమలుచేస్తే డిఫ్తీరియా, టెటనస్, కోరింతదగ్గు, మీజిల్స్‌వంటి ప్రాణంతక వ్యాధుల నుంచి చిన్నారులను రక్షించొచ్చు. ఈ సమస్య గ్రామీణ ప్రాంతాల్లోనే కాదు పట్టణాల్లోనూ ఉంది. ప్రజలంతా బాధపడుతున్న ఈ సమస్యను పరిష్కరించుందుకు SMS ఆధారిత సొల్యూషన్ వి రిమైండ్‌ను కనుక్కున్నారు నగేశ్, శ్రీనివాస్. సమయానికి ఇమ్యునైజేషన్ ఇప్పించేందుకు చిన్నారుల తల్లిదండ్రులు, గార్డియన్లకు ఈ మొబైల్ అప్లికేషన్ ఎంతగానో సహకరిస్తుంది.

పరిష్కారం: సామాన్యమైనది.. ప్రభావవంతమైనది

రెండు పద్ధతుల్లో ఈ అప్లికేషన్ పనిచేస్తుంది. ఒకటి రిజిస్ట్రేషన్, రెండు రిమైండర్స్.

- ఈ అప్లికేషన్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే రిమైండ్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి డేటాఫ్ బర్త్, చిన్నారి పేరు టైప్ చేసి 56563 నంబర్‌కు ఎస్ఎంఎస్ చేయాలి.

- www.vRemind.org లోకి ప్రవేశించి రిజిస్టర్ చేసుకోవాలి.

- చిన్నారి పుట్టిన సమయంలోనే ఆస్పత్రి సిబ్బంది బేబీ వివరాలను ఈ వెబ్‌సైట్‌లో నమోదు చేయాలి.

వీరిమైండ్‌లో మొబైల్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు

వీరిమైండ్‌లో మొబైల్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు


రిమైండర్స్

వీరిమైండ్ రెండు సార్లు రిమైండ్ చేస్తుంది. తొలిసారి డ్యూ డేట్‌కు ఏడురోజుల ముందు, రెండోసారి వ్యాక్సిన్ ఇచ్చే ఒకరోజు ముందు గుర్తుచేస్తుంది.

రెవెన్యూ మోడల్..

సొంతంగానే ఈ సంస్థను ఏర్పాటు చేసినప్పటికీ పెద్ద సంఖ్యలో ప్రజలను చేరేందుకు వీరిమైండ్ దేశంలోని పలు హాస్పిటల్స్‌తో భాగస్వామ్యం ఏర్పర్చుకున్నది. హైదరాబాద్‌లో 12 బ్రాంచెస్ ఏర్పాటు చేసి పట్టణ ప్రాంతాల్లోని మహిళలకు తక్కువ ఖర్చుతో మెటర్నిటీ చికిత్స అందిస్తున్న లైఫ్‌స్ప్రింగ్ ఆస్పత్రితో టై అప్ అయింది. దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉన్నది. తల్లిదండ్రులు వ్యాక్సినేషన్‌ కోసం తమ చిన్నారులను అకస్మాత్తుగా ఆస్పత్రికి తీసుకురావడం లైఫ్‌స్ప్రింగ్ హాస్పిటల్ సిబ్బంది గమనించారు.

‘‘ ఆరంభంలో మమ్మల్ని లైఫ్‌స్ప్రింగ్ హాస్పిటల్ నమ్మలేదు. ఎన్నో సవాళ్లు ఉంటాయని, వాటిని నిర్మూలించడం కష్టమని భావించింది. చిన్న SMSతో సమస్య పరిష్కారమవుతుందని వారు నమ్మలేకపోయారు. కాని సంక్షిప్త సందేశమే పెనుమార్పులకు నాందిపలికింది’’ అని శ్రీనివాస్ తెలిపారు.

‘‘తల్లిదండ్రులకు సాయం చేయడమే కాదు.. ఇమ్యునైజేషన్ కవరేజ్ విషయంలో ఏది ఎంత ముఖ్యమో తెలుసుకునేందుకు హాస్పిటల్స్ ప్లాన్ చేసేందుకు కూడా సహకరిస్తున్నాం. టీకాల సరఫరా చైన్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలన్నదే మా లక్ష్యం’’ అని నగేశ్ వివరించారు. ఈ సమస్య గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఎక్కువగా ఉన్నది.

వి రిమైండ్‌కు పదివేలమందికిపైగా సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. ఇప్పటివరకు 31 వేలకుపైగా అలర్ట్స్ పంపారు. వి రిమైండ్‌లో రిజిస్టర్ చేసుకున్నవారిలో టీకాల గురించిన అవగాహన పెరిగిపోయింది. ఇప్పుడు వీరంతా ఇమ్యునైజేషన్ షెడ్యూల్‌ను క్రమం తప్పకుండా అమలుచేస్తున్నారు. వ్యాక్సిన్లపై మరింత అవగాహన కల్పించేందుకు పట్టణ ప్రాంతాల్లోని స్థానిక స్వచ్చంద సంస్థలతో కూడా కలిసి పనిచేస్తోంది వి రిమైండ్.

ఉచిత ఎస్ఎంఎస్

హాస్పిటల్స్‌కు వైట్ లేబెల్డ్ సొల్యూషన్ ద్వారా సేవలందిస్తూ సబ్‌స్క్రిప్షన్ మోడల్‌లో ఆదాయాన్ని సమకూర్చుకుంటోంది వి రిమైండ్. ఐతే తమ సంస్థతో నేరుగా రిజిస్టర్ చేసుకున్న తల్లిదండ్రులు, గార్డియన్లకు ఉచితంగానే వ్యాక్సినేషన్ రిమైండర్లను పంపుతుంది.

సవాళ్లు

ఈ రంగంలో ప్రస్తుతం నెలకొన్న సవాళ్లను శ్రీనివాస్ వివరించారు. ‘‘గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు తరచుగా మొబైల్ సిమ్ నంబర్లను మారుస్తుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ నెట్‌వర్క్స్ కవరేజీ సరిగా లేక, చాలామంది నాన్ రీచబుల్ ప్రాంతంలో ఉంటారు. ఇది చాలా ఇబ్బంది. భారత్ విభిన్న మతాలు, ప్రాంతాల సమాహారం. ఈ అవగాహన కలిగించాలంటే వివిధ రకాల భాషల్లో సందేశాలు పంపాల్సి ఉంటుంది’’ అని శ్రీనివాస్ వివరించారు.

మరో ఆసక్తికర అంశాన్ని నగేశ్ వివరించారు. ‘‘చాలామంది మమ్మల్ని అడుగుతుంటారు. మీరెందుకు ఉచితంగా సేవ చేస్తున్నారని. వి రిమైండ్‌ను ఎందుకు లాభాల కోసం ఉపయోగించుకోవడంలేదని. సమాజ సేవలో భాగంగానే దీన్నీ చేస్తున్నామంటే చాలామందికి నమ్మబుద్ధి కావడం లేదు. సమాజంలోని కీలక సమస్యల పరిష్కారానికి మా ప్రయత్నం స్ఫూర్తిగా నిలుస్తుంది’’ అని నగేశ్ వివరించారు.

తమ ప్రాజెక్ట్ ఎంత ప్రభావవంతంగా పనిచేస్తుందో తెలుసుకునేందుకు ఓ బిజినెస్ స్కూల్ ప్రొఫెసర్‌తో కలిసి వీరు పనిచేస్తున్నారు. టీకాల కవరేజ్‌ను మరింత మెరుగుపర్చేందుకు ఇతర మాధ్యమాలు అవసరం కావడంతో వాటి కోసం అన్వేషిస్తున్నారు.

‘‘ఇమ్యునైజేషన్ కవరేజ్‌ను పెంచేందుకు అవసరమైన ఇతర మార్గాలేమిటో మేం అన్వేషిస్తున్నాం. ఐవీఆర్, లేదా బహు భాషల మద్దతు, ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాల నిర్వహణ వంటివి చేపట్టనున్నాం’’ అని నగేశ్ చెప్పారు.

తర్వాతి లక్ష్యాలు

గర్భవతులు తీసుకోవాల్సిన పౌష్టికాహారం గురించి కూడా ప్రచారం చేయనున్నారు. వాళ్లకు అవసరమైన సలహాలు ఇవ్వనున్నారు.

‘‘ప్రజలకు మరింత చేరువయ్యేందుకు స్థానికంగా ఉన్న మెటర్నిటీ, చిల్డ్రన్ హాస్పిటల్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంటున్నాం. అలాగే ప్రభుత్వ సంస్థలు, ఎన్జీవోలతో కూడా కలిసి నడవాలనుకుంటున్నాం’’ అని శ్రీనివాస్ వివరించారు.

‘‘ఎస్ఎంఎస్‌లు చదవలేని వారి కోసం బహుభాషల్లో ఐవీఆర్ ద్వారా సమాచారాన్ని అందజేయాలని, తద్వారా ఇమ్యునైజేషన్‌ కవరేజ్‌ను మరింత వ్యాప్తి చేయాలనుకుంటున్నాం. ఈ ప్రక్రియ తక్కువగా ఉన్న రాష్ట్రాలపై మరింత దృష్టి సారించాలనుకుంటున్నాం’’ అని నగేశ్ తెలిపారు.

అన్ని సమస్యలకు టెక్నాలజీనే పూర్తి పరిష్కారం కాదు. అడ్డంకులను అధిగమించేందుకు మాత్రం అది కీలకం. సరైన సమయానికి రిమైండ్ చేసేలా కొత్త కొత్త ఫీచర్లను యాడ్ చేసి తల్లిదండ్రులకు ఎంతగానో ఉపయోగపడుతోంది. ఈ సంస్థ కారణంగానే ఇమ్యునైజేషన్‌పై ఎంతో అవగాహన పెరిగింది. దీని ఫలితంగా ఐదేళ్లలోపు చిన్నారులకు వచ్చే ఆరోగ్య సమస్యలను తల్లిదండ్రులు పరిష్కరించుకోగలుతున్నారు. శిశు మరణాలను అరికట్టగలుగుతున్నారు. వి-రిమైండ్ అవగాహన కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా చేసి ప్రభావవంతమైన మొబైల్ హెల్త్ ప్లాట్‌ఫామ్‌గా తయారు చేయాలని నగేశ్, శ్రీనివాస్ భావిస్తున్నారు. వీరి ప్రయత్నం విజయవంతం కావాలని ఆశిద్దాం..

వెబ్‌సైట్: www.vremind.org