యోగాతో వికలాంగుల్లో ఆత్మస్థైర్యం నింపుతున్న ముస్లిం గురు సయ్యద్ పాషా

వైద్య విధానంగా యోగాను నేర్పిస్తున్న గురు సయ్యద్ పాషాఅంతర్లీనంగా ఉన్న శక్తులను యోగా బయటకు తెస్తుందంటున్న గురు పాషా చక్రాల కుర్చీ ద్వారా ఆసనాలను ప్రదర్శిస్తున్న వికలాంగులు'ఎబిలిటీ అన్‌లిమిటెడ్' ఫౌండేషన్‌ చారిటీ సంస్థను ప్రారంభించిన గురు పాషాయోగిక్ డ్యాన్స్‌తో ఏకాగ్రత పెరుగుతుందంటున్న గురుపాషామతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ యోగాను ప్రాక్టీస్ చేయాలంటున్న ముస్లిం గురువు పాషా సయ్యద్

యోగాతో వికలాంగుల్లో ఆత్మస్థైర్యం నింపుతున్న ముస్లిం గురు సయ్యద్ పాషా

Monday August 24, 2015,

4 min Read

ప్రపంచమంతా యోగా నగారా మార్మోగుతోంది. గుడిలో.. బడిలో.. పనిలో..కార్ఖానాలో ఎక్కడ చూసినా యోగా లయబద్ధంగా సాగుతోంది. కొందరు పవర్ యోగా పేరుతో మరికొందరు, ఆధ్యాత్మిక యోగా పేరుతో లక్షలాది మందికి శిక్షణ ఇస్తున్నారు. ఐతే బెంగళూరులో సామాజికవేత్త గురు సయ్యద్ సలావుద్దీన్ పాషా వినూత్నంగా వికలాంగులకు యోగా నేర్పిస్తున్నారు. యోగా ద్వారా వికలాంగుల్లో వారి మానసిక దౌర్భల్యాన్ని దూరం చేసి వైకల్యానికే కొత్త అర్థన్నిస్తున్నారు. చక్రాల కుర్చీ నృత్యాల ద్వారా విన్యాస ప్రదర్శనలు ఇప్పిస్తూ ప్రపంచాన్ని అబ్బురపరుస్తున్నారు.

image


యోగా అంటే వ్యాయామ సాధనల సమాహారాల ఆధ్యాత్మిక రూపం. హిందుత్వ ఆధ్యాత్మిక విధానాల్లో ఇదీ ఒకటి. అయితే ఢిల్లీకి చెందిన ఓ ముస్లిం గురువు యోగాను ఇప్పుడు ఓ థెరపీలా శిక్షణ ఇస్తున్నారు. వికలాంగుల్లో వైకల్యాన్ని దూరం చేస్తున్నారు.

బెంగళూరుకు సమీపంలోని అనేకల్ పట్టణంలో మైసూరు రాజుల వద్ద పనిచేసే ఓ ముస్లిం వైద్య కుటుంబంలో సయ్యద్ సలాహుద్దీన్ పాషా జన్మించారు. వైద్య కుటుంబం నుంచి వచ్చిన సయ్యద్ పాషా ఆ వారసత్వాన్ని కొనసాగిస్తారని అంతా భావించారు. ఆరేళ్ల వయసు ఉన్నప్పటి నుంచే సయ్యద్ యోగా ప్రాక్టీస్ నెమ్మదిగా, చురుకుగా మొదలైంది.

‘‘నేను ఓ వైపు సురాను మరోవైపు శ్లోకాలను నేర్చుకున్నాను. ఏ మతం కూడా ఇతరుల నుంచి మంచి నేర్చుకోకూడదని చెప్పదు. యోగాను నేర్పించడం నా బాధ్యతగా ఫీలవుతాను. అది సమానత్వం, ఈక్విటీ, సాధికారత గురించి చెప్తుంది’’ అని గురు పాషా చెప్తారు.
గురు పాషాతో వికలాంగుల చక్రాల కుర్చీ నృత్యం

గురు పాషాతో వికలాంగుల చక్రాల కుర్చీ నృత్యం


మనసు, మెదడు, శరీరం కలిసి ఉన్న సమాజం అత్యవసరం. అది వికలాంగులలోనే కనిపిస్తుంది. సమాజం వెలివేసిన వికలాంగుల్లో మనోధైర్యం నింపేందుకు 40 ఏళ్లుగా యోగా తత్వశాస్త్రాన్ని నేర్పిస్తున్నారు గురు పాషా.

అంగవైకల్యంతో బాధపడుతున్నవారిని ప్రపంచంలో నిలబెట్టేందుకు యోగా తత్వశాస్త్రాన్ని ఆయన రూపొందించారు. మిగతా అందరు భావించినట్టుగా యోగా అంటే గురు పాషాకు సంచలనం కాదు.. ఓ జీవిత తత్వం. వివేకానంద, రామకృష్ణ పరమహంస సిద్ధాంతాలను అనుసరించే పాషా పతంజలి యోగా సూత్రాలను వల్లిస్తారు. పంచభూతాలను సమన్వయం చేసుకునేలా వికలాంగులకు యోగా శిక్షణ ఇవ్వడమే గురు పాషా లక్ష్యం. సంగీతం, డ్యాన్స్, శ్లోకాలు, భంగిమలు, ఆధ్యాత్మకతలతో కూడిన యోగాను నేర్పించడం సింపుల్ కాదు.

వికలాంగుల అద్భుత చక్రాల కుర్చీ నృత్యం

వికలాంగుల అద్భుత చక్రాల కుర్చీ నృత్యం


అద్భుత విన్యాసాలు చేస్తున్న వికలాంగ కళాకారులు

అద్భుత విన్యాసాలు చేస్తున్న వికలాంగ కళాకారులు


‘‘నేను యోగా ఒక్కటే నేర్పించాలనుకోను. కర్మ యోగా, ధర్మ యోగా, ఆధ్యాత్మిక యోగాల ద్వారా వారంతట వారే నేర్చుకునేలా చేస్తాను’’ ఆయన వివరించారు.

ప్రకృతిలో భాగంగా ప్రజలు స్వీయ ఆవిష్కరణ, వైద్యాన్ని ప్రారంభించడం ముఖ్యం. తాను యోగా విద్యనభసించిన రోజుల్లో గురు తరుచుగా పద్మాసన, శవాసన, ప్రాణాయామలను నీటిపై ప్రదర్శిస్తుండేవారు.

‘‘విధివశాత్తూ, ప్రమాద వశాత్తూ వైకల్యం ఏర్పడుతుంది. యోగా వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అంతర్లీనంగా ఉన్న శక్తులను బయటకు రప్పిస్తుంది. మా పిల్లలను డిజేబుల్డ్ అనొద్దు. డిఫరెంట్లీ ఏబుల్డ్ అని పిలవండి’’ అని చెప్పారు.

దీనికి ఊదాహరణగా గురు పాషా విద్యార్థులు అత్యంత కష్టమైన ఆసనాలు శీర్షాసన, మయూరాసనాలను చక్రాల కుర్చీల ద్వారా ప్రదర్శిస్తారు. ‘‘చక్రాల కుర్చీ వారి జీవిన విధానంలో భాగమైపోయింది. కానీ యోగా శారీరక, మానసిక అడ్డుగోడలను తొలగించింది. లోపం ఉన్నట్టు భావించొద్దని బోధించింది. జీవితాన్ని పారదర్శకంగా చూసే శక్తినిచ్చింది. స్వతంత్రంగా మెలిగేలా చేసింది’’ అని గురు వివరించారు.

డిజేబుల్డ్ డ్యాన్సర్ల వినూత్న విన్యాసం

డిజేబుల్డ్ డ్యాన్సర్ల వినూత్న విన్యాసం


ఓ వికలాంగ చిన్నారికి  డ్యాన్స్ నేర్పిస్తున్న గురు పాషా

ఓ వికలాంగ చిన్నారికి డ్యాన్స్ నేర్పిస్తున్న గురు పాషా


చక్రాల కుర్చీ విన్యాసంలో ఓ అద్భుత సన్నివేశం

చక్రాల కుర్చీ విన్యాసంలో ఓ అద్భుత సన్నివేశం


గురుపాషా స్థాపించిన స్వచ్ఛంద సేవ సంస్థ ‘ఎబిలిటీ అన్‌లిమిటెడ్’ ఫౌండేషన్‌లో యోగాను ఓ డ్యాన్స్ థెరపీగా, మ్యూజిక్ థెరపీగా, సంప్రదాయ యోగా థెరపీగా, గ్రూప్ థెరపీగా, కలర్ థెరపీల మిశ్రమంగా ప్రాక్టీస్ చేస్తారు. పదుల సంఖ్యలో విద్యార్థులు మానసిక, శారీరక అడ్డంకులను అధిగమించి వేదికలపై యోగిక్ నృత్యాలు చేస్తారు. ‘‘డ్యాన్స్ కూడా యోగానే. జాటి వంటి కఠినమైనది ప్రాక్టీస్ చేస్తే ఒక్క తాళం కూడా మిస్సవ్వము. యోగిక్ నృత్యాల ద్వారా ఏకాగ్రత పెరుగుతుంది’’ అని గురు చెప్పారు.

సొంతంగా యోగాకు సంబంధించిన సంస్థను నడిపించాలంటే చాలా కష్టం. ముఖ్యంగా విద్యార్థులు వికలాంగులైతే అది ఇంకా కష్టం. ‘‘వైకల్యం కలిగిన ప్రతి ఒక్కరు భిన్నమైనవారే. వారి తల్లిదండ్రులు, వారు పెరిగిన విధానాన్ని తెలుసుకుని వారికి ప్రత్యేకంగా కౌన్సెలింగ్ ఇస్తుంటాను’’ అని గురు చెప్పారు.

శారీరక ఇబ్బందులతో బాధపడేవారిని బయటపడేసేందుకు గురు పాషాకు ఏళ్లు పట్టింది. సునామీ కారణంగా వికలాంగులుగా మారిన చిన్నారుల గురించి గురు ఇలా వివరించారు.

‘‘వారు సర్వం కోల్పోయారు. వారిని ప్రశాంతంగా ఉంచేందుకు, వారి మనసులో ఉన్న భయాన్ని పోగొట్టేందుకు మెడిటేషన్‌ను నేర్పించాను’’ అని చెప్పారు. యోగా నెమ్మది, క్రమంగా సాగే ఓ పద్ధతి. తాబేలులా బతకాలంటే జీవితాన్ని నెమ్మదిగానే సాగించాలి. కుక్కలా ఉండాలనుకుంటే జీవితం చాలా తక్కువగా ఉంటుంది. దాన్ని అంగీకరించాల్సిందేనంటారు గురు పాషా.


యోగాతో వైకల్యాన్ని దూరం చేయొచ్చంటున్న గురు పాషా

యోగాతో వైకల్యాన్ని దూరం చేయొచ్చంటున్న గురు పాషా


యోగా పాపులారిటీ పెరిగినప్పటికీ, గురు పాషా మాత్రం దాన్ని డబ్బు సంపాదించిపెట్టే వ్యాపారంలా ఎప్పుడూ భావించలేదు. యోగా ఎప్పుడు ఖర్చుతో కూడిన వ్యవహారం. మంచి వ్యాపారం, వేలాదిమంది ఒకే చోట కూర్చుని ఆసనాలు వేస్తుంటారు. అదో జిమ్మిక్కు. అయితే అదంతా చెత్తగా కొట్టిపారేస్తారు గురు పాషా.

‘‘గురుశిష్యుల పరంపరలో భాగంగానే యోగాను నేర్పాల్సి ఉంటుంది. అందరూ కలిసి యోగాను ఒకేసారి చేయాలని సూచించడం సరికాదు. ఇది ఆరోగ్యంగా ఉన్నవారికి కూడా వర్తిస్తుంది. ఒక్కో వ్యక్తికి ఒక్కో సమస్య ఉంటుంది. యోగా అనేది ఒక్కొక్కరికి ఒక్కోలా శిక్షణ ఇవ్వాలి. ఓ మిత్రునితో కలిసి నేను మెడికల్‌ యోగా చేశాను. ఇద్దరం కలిసి సీరియస్‌గా చేశాం. వెన్నులో నొప్పి ఉంటే చక్రాసనం ఎలా వేస్తారు ? వెన్నుముకకు ఇబ్బంది కలుగకుండానే ఆసనాలు వేయాల్సి ఉంటుంది''.
అహో అనిపించేలా విన్యాసాలు చేస్తున్న డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్

అహో అనిపించేలా విన్యాసాలు చేస్తున్న డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్


యోగానే నేర్చుకునే పురుషులు కాటన్ డ్రెస్సులు, కాళ్లకు ఏమీ లేకుండా చూసుకోవాలి. వేలాది రూపాయలు చెల్లించి, కార్పొరేట్ యోగా సెంటర్లలో బిగుతైన దుస్తులు ధరించి రావడంపై గురు అభ్యంతరం వ్యక్తంచేశారు.

ఇటీవలే అంతర్జాతీయ యోగా డే నిర్వహించారు. ప్రపంచమంతా ఒకేసారి లక్షలాదిమంది యోగాను చేశారు. ఇదే సమయంలో కొన్ని వివాదాలకు కూడా యోగా కారణమైంది. ప్రపంచ ప్రజలంతా యోగా చేయాలని పిలుపునివ్వడంపై కొందరు ముస్లింలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ముస్లింలు సూర్య నమస్కారాలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఇలాంటి ఉద్రేక పరిస్థితులు నెలకొన్న పరిస్థితుల్లో ఓ ముస్లీం గురువు.. యోగా గురించి సమున్నతంగా చెప్తున్నారు. ‘‘యోగాను జాతీయ సమగ్రత చిహ్నంగా గుర్తించాలన్నదే నా ఉద్దేశం’’ అని గురు పాషా తెలిపారు. ముస్లింల పవిత్ర స్థలం మక్కాలో ప్రదిక్షిణలు, శ్లోకాలను వల్లించడం, క్రైస్తవ ప్రార్థనలు, జపమాలికతో పదేపదే ఆధ్యాత్మిక పారాయణం.. అవన్ని దివ్య స్పందనలు మాత్రమే. అన్నింటి అర్థం ఒకటే. మెదడు, శరీరం, ఆత్మ కలయిక మాత్రమే అన్నది గురు పాషా ఉద్దేశం.

సమాజం చారిత్మాత్మకంగా నిర్లక్ష్యం చేసిన కమ్యునీటికి మళ్లీ గుర్తింపు తేవడం అత్యవసరమని గురు భావన. ‘‘ప్రతి ఒక్కరూ యోగాను ప్రాక్టీస్ చేయాలి అన్నది నా వ్యక్తిగత అభిప్రాయం’’ అలాగే ప్రార్థన, సూర్యనమస్కారాలు కూడా. మంచి ఉద్దేశంతో యోగాను ఓ థెరపీలా శిక్షణ ఇస్తున్న గురు పాషా సంకల్పం నెరవేరాలని ఆశిద్దాం..