మీరు ఉద్యోగ విరమణ చేశారా..? అయితే మీలాంటి వాళ్లకోసమే ఈ జాబ్స్!!

మీరు ఉద్యోగ విరమణ చేశారా..? అయితే మీలాంటి వాళ్లకోసమే ఈ జాబ్స్!!

Monday May 15, 2017,

3 min Read

తరలిరాదా తనే వసంతం.. అంటూ జీవితానికి మ‌ళ్లీ వ‌సంతం వ‌స్తుంద‌ని, జీవితంపై మ‌ళ్లీ కొత్త ఆశ‌లు చిగురిస్తాయ‌ని చెబుతాడో సినీ ర‌చ‌యిత‌. నిజానికి విరమణ అనేది ఉద్యోగానికే గానీ, జీవితానికి కాదు. అందుకే.. ఆరు ప‌దుల వ‌య‌సు తరువాత రిటైర్మెంట్ తీసుకున్నా తిరిగి ఏదైనా పనిచేయడం పట్ల ఆసక్తి చూపుతుంటారు. ఒక్కోసారి ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేక, పిల్లలపై ఆధారపడడం ఇష్టం లేక కూడా రిటైర్మెంట్ తరువాత ఉద్యోగాల కోసం చూస్తుంటారు. అలాంటి వారికి విభిన్న రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది నాట్ రిటైర్డ్ డాట్ ఇన్.

image


సీనియ‌ర్ సిటిజ‌న్స్ కోసం జాబ్ పోర్ట‌ల్ ప్రారంభించి వినూత్న ప్ర‌యోగానికి తెర తీశారు ప్ర‌తాప్ కుంద. హైద‌రాబాద్ కేంద్రంగా మొద‌లైన ఈ స్టార్ట‌ప్ ఇప్పుడు సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు కొత్త జీవితం అందిస్తోంది. భార‌త్‌లో ఇప్పుడు దాదాపు ప‌ది కోట్లపైన ఆర‌వై ఏళ్ల వయసునిండిన వారున్నారు. వీరిలో ఐదు కోట్లపైన వయోవృద్ధులు ఇంకా పనిచేస్తున్నారు. అందుకు కారణాలు లేకపోలేదు. ప్రైవేట్ సెక్టార్ నుంచి రిటైర్డ్ అయినవారిలో కేవలం 8శాతం మాత్రమే పెన్షన్ పొందుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. అంటే 92శాతం మందికి రిటైర్మెంట్ తరువాత ఎలాంటి ఆదాయం ఉండడం లేదు. ఫలితంగా ఏ చిన్న అవసరానికైనా కుటుంబ సభ్యులపై ఆధారపడాల్సి ఉంటుంది. అలాంటి సందర్భంలో సాధ్యమైనంత కాలం ఏదో ఓ పని చేయాలనుకుంటుంటారు. కోట్లాదిమంది ఉద్యోగ విరమణ తరువాత కూడా పూర్తికాలం ఉద్యోగం చేస్తున్నవారున్నారు.

ఏటా 60ల‌క్ష‌ల మంది ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ రంగాల నుంచి రిటైర్డ్ అవుతున్నారు. ఇంకా ప‌ని చేసే ఓపిక‌, స‌మ‌ర్థ‌త ఉండి ఇంట్లో ఊరికే కూర్చేనేందుకు చాలా మంది ఇష్ట‌ప‌డ‌టం లేదు. ప‌ద‌వీ విర‌మ‌ణ పొందిన ఉద్యోగులు సెకండ‌రీ సిటిజ‌న్స్‌గా స‌మాజంలో చిన్న‌చూపు చూడ‌బ‌డుతున్నార‌ని బాధ నుంచి పుట్టిన ఆలోచ‌నే నాట్ రిటైర్డ్ డాట్ ఇన్. ఇటు ఉద్యోగార్థులను, అటు కంపెనీలను ఒకే వేదిక మీదకు తెచ్చే ఈ స్టార్టప్ దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లోనూ సేవలందిస్తోంది.

జాబ్ నుంచి రిటైర్డ్ అయిన వాళ్ల‌కి, త్వరలో రిటైర్ కాబోయే వారికి కూడా ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది నాట్ రిటైర్డ్డ్ డాట్ కామ్. విభిన్న‌ రంగాల్లో అధికారులుగా పనిచేసి సుదీర్ఘ అనుభవాన్ని సంపాదించిన వారు తమ సేవల్ని పదవీ విరమణ తరువాత కూడా అందించేందుకు ఈ స్టార్టప్ దోహదపడుతోంది. ప్రముఖ పారిశ్రామికవేత్త ప్రతీక్ వెంచర్స్ ప్రతాప్‌కుంద ఈ స్టార్టప్‌ని ప్రారంభించారు.

ప్ర‌స్తుతం ఉన్న‌ పోర్ట‌ల్స్‌లో దాదాపు అన్నీ యువ‌త‌ను, కార్పొరేట్ ఉద్యోగుల‌ను మాత్ర‌మే టార్గెట్ చేసుకుంటున్నాయి. అయితే రిటైర్డ్ అయిన వాళ్ల కోసం ప్ర‌త్యేకంగా పోర్ట‌ల్స్ లేవు. ఉద్యోగ‌ విర‌మ‌ణ త‌ర్వాత క‌నీసంగా ప‌దిప‌న్నెండేళ్లు యాక్టివ్‌గా ప‌ని చేసేందుకు ఇంట్ర‌స్టు చూపించే వాళ్లున్నారు. వారి అనుభ‌వం ఇత‌ర రంగాల్లో కూడా ఉప‌యోగించుకుంటే బాగుంటుంది. మా ప్ర‌య‌త్నానికి మంచి స్పంద‌న వ‌స్తోంది.

image


ప్రస్తుతం తమ పోర్టల్‌కు అనూహ్య స్పంద‌న వ‌స్తోంద‌ని ఆరువేల‌కు పైగా స‌భ్యులు న‌మోదు చేసుకున్నార‌ని నాట్ రిటైర్డ్ డాట్ ఇన్ కో ఫౌండ‌ర్ కమలేష్ నూతి తెలిపారు. తమ సంస్థ ద్వారా అధిక సంఖ్య‌లో ఉద్యోగాలు పొందినట్లు తెలిపారు. ఫైనాన్స్, బ్యాంకింగ్ సెక్ట‌ర్ నుంచి మంచి అవ‌కాశాలు వ‌స్తున్న‌ట్టు నాట్ రిటైర్డ్ డాట్ ఇన్ ఫౌండ‌ర్ ప్రతాప్ కుంద తెలిపారు.

ప్ర‌స్తుతం హైద‌రాబాద్ కేంద్రంగా కార్య‌క‌ల‌పాలు సాగిస్తున్న నాట్ రిటైర్డ్ డాట్ ఇన్ 300కు పైగా కంపెనీల‌తో ఒప్పందం కుదుర్చుకుంది. వ‌చ్చే ఐదేళ్ల‌లో అన్ని మెట్రో న‌గ‌రాల్లో నాట్ రిటైర్డ్ డాట్ ఇన్ విస్త‌రించాల‌ని ఈ కంపెనీ భావిస్తోంది.

ఉద్యోగం కావాలంటే ఇలా..

పదవీ విరమణ తరువాత కూడా ఉద్యోగం చేయాలనుకునేవారు నాట్ రిటైర్డ్ డాట్ కామ్‌లో అకౌంట్ క్రియేట్ చేసుకొని వివరాలు జోడిస్తే చాలు. వేరు వేరు కంపెనీలకు చెందిన ఉద్యోగావకాశాల వివరాలు ఎప్పటికప్పుడు పొందవచ్చు. కంపెనీలు సైతం నేరుగా తమకు ఎలాంటి ఎంప్లాయిస్ కావాలో వివరాలు నేరుగా పోస్ట్ చేయవచ్చు. ఇటు ఉద్యోగులకు, అటు కంపెనీలకు వేదికగా వ్యవవహరిస్తుంది ఈ స్టార్టప్. ఉద్యోగాలతో పాటు, పార్ట్ టైం, అడ్వైసరీ, కన్సల్టెంట్, వర్క్ ఫ్రం హోమ్, వాలెంటరీ ఎలాంటి ఉద్యోగం కావాలన్నా నాట్ రిటైర్డ్‌లో సెర్చ్ చేసుకోవ‌చ్చూ. మీరూ అలాంటి ఉద్యోగం కోసమే వెతుకుతున్నారా? అయితే ఇదుగో వెబ్‌సైట్ www.notretired.in . మరి ఎందుకాలస్యం.. వెంటనే లాగిన్ అవ్వండి.