టైం లేకుంటే చెప్పండి.. ఇంటికే వచ్చి హెయిర్ కట్ చేసి పోతారు.. !!

మగళవాళ్లకు మాత్రమే సేవలు అందించే స్పెషల్ స్టార్టప్

టైం లేకుంటే చెప్పండి.. ఇంటికే వచ్చి హెయిర్ కట్ చేసి పోతారు.. !!

Saturday April 09, 2016,

4 min Read


బెంగళూరు, కోరమంగళ

బార్బర్ షాపు ముందు తలపట్టుకు కూర్చున్నాడు అన్ మోల్ గార్గ్. కార్పొరేట్ కంపెనీ ఉద్యోగుల వీకెండ్ ఈవెంట్స్ లో ర్యాప్, పాప్ పాటల వ్యవహారాలన్నీ అన్ మోల్ చక్కబెడుతూంటాడు. స్టేజ్ పై తను ఓ రకంగా సెంటరాఫ్ ఎట్రాక్షన్. హెయిల్ స్టైల్ సరిగ్గా లేకపోతే ఆడియన్స్ కు మొదటగా వచ్చే ఇంప్రెషనే పోతుంది. అందుకే మంచి పేరున్న హెయిర్ స్టైలిస్ట్ దగ్గరకు వచ్చాడు. తనకు ఎలా కావాలో చెప్పి తల అప్పగించాడు. అరగంట తర్వాత చూసుకుని నీరసం వచ్చి కూలబడిపోయాడు. ఈ అవతారంతో ఈవెంట్ కు ఎలా వెళ్లాలిరా భగవంతుడా అని జుట్టు పట్టుకున్నాడు.

మార్తళ్లిలో ఉంటున్న వినయ్ చవాన్ ది సేమ్ సిట్యుయేషన్. ఓ కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తున్న వినయ్ లుక్స్ కి హెయిర్ స్టైల్ ఎంతో ముఖ్యం. అందుకే ఓసారి బాగా చేశాడని... దాదాపు ముప్పావు గంట జర్నీ చేసి ఓ హెయిర్ స్టైలిస్ట్ దగ్గరకు వెళ్లి వస్తూంటాడు. అయితే పాత కస్టమరే కదా అన్నట్లు.. సెలూన్ షాప్ వాడు లైట్ తీసుకున్నాడు. ఇంకేముంది జుట్టు గబ్బుపట్టింది.

ఇక్కడ సిమిలారిటీ ఏంటంటే.. వీరిద్దరూ మిత్రులు. విభిన్న రంగాల్లో ఉన్న వీరిద్దరిది ఇతరులకు సాయంచేయాలనే దృక్పథమే. అలా ఓసారి కలిసి కష్టసుఖాలు పంచుకుంటున్నప్పుడు.. హెయిర్ స్టయిల్ టాపిక్ వచ్చింది. డోలు వెళ్లి మద్దెలతో చెప్పుకున్నట్టు.. ఇద్దరి బాధలు దాదాపు సేమ్. ఇంకా ఎంతకాలం ఇలా అని ఒకరికొకరు ప్రశ్నించుకున్నారు. ఆ ప్రశ్నలోంచే సమాధానం వచ్చింది. ఆ ఐడియానే సక్సెస్ స్టోరీ రాసేవరకూ డెవలప్ అయింది.

కటింగ్ కోసం కత్తిలాంటి ఐడియా

సీత బాధలు సీతవైతే పీత బాధలు పీతవన్నట్లు.. ప్రతి మగవాడికి హెయిర్ స్టైలింగ్ సమస్య. అలా ప్రతి మగవారి బాధను తీర్చాలనుకున్నారు. అదికూడా ఒక్క క్లిక్ తోనో... లేదంటే ఒక్క ఫోన్ కాల్ తోనో...! అలా అనుకున్న క్షణం నుంచే వారు పని ప్రారంభించారు. కొంత పరిశోధన చేశారు. నిజానికి వారికి అది బిజినెస్ గా చేయాలనే థాట్ అప్పటికీ లేదు. కానీ మెల్లగా అందులోనూ మెళకువలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. 

ముందుగా వినయ్ తన ఫ్లాట్ లోనే ఉచితంగా హెయిర్ కట్స్ చేసే ఏర్పాట్లు చేశాడు. టాలెంటెడ్ బార్బర్స్ ను ఐదుగుర్ని ఎంపిక చేసుకున్నాడు. వారికి కొంత శిక్షణ ఇప్పించారు. మంచి స్పందన రావడంతో మెన్స్ గ్రూమింగ్ ఫ్లాట్ ఫామ్ లాంఛ్ చేశారు. దాని పేరు ఫ్లయింగ్ బార్బర్స్. కాల్ చేస్తే ఇంటికి వచ్చి హెయిర్ కట్ చేసిపోతారు. హెయిర్ స్పా, హెడ్ మసాజ్, హెయిర్ కలరింగ్, ఫేషియల్స్, పెడిక్యూర్స్ తో పాటు స్టయిలింగ్ కన్సల్టెంట్స్ కూడా సేవలు అందిస్తారు

అన్ మోల్,వినయ్, ఫ్లయింగ్ బార్బర్స్ ఫౌండర్స్<br>

అన్ మోల్,వినయ్, ఫ్లయింగ్ బార్బర్స్ ఫౌండర్స్


అదిరిపోయే రెస్పాన్స్

అంచనా ఏ మాత్రం తప్పు కాదని ఫ్లయింగ్ బార్బర్స్ ప్రారంభించిన వారంలోనే వారికి అర్థమయింది. పెద్దగా ప్రచారం లేకపోయినా, మార్కెటింగ్ సౌకర్యం అసలు లేకపోయినా, స్లాట్స్ మాత్రం ఖాళీ లేకుండా పోవడమే దీనికి కారణం. వీకెండ్స్ తో ఐదుగురు బార్బర్స్ షెడ్యూల్స్ మధ్య గ్యాపే ఉండదు. వీక్ డేస్ లో ఉదయం, ఈవినింగ్ ఫుల్ బిజీ. అందుకే వారంలో అన్ని రోజులూ ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటలకు వరకు బార్బర్ సర్వీస్ అందిస్తారు. నాలుగు నెలల కాలంలో కేవలం ఐదుగురు బార్బర్స్ తో వీరు 1,450 ట్రాన్సాక్షన్స్ ను పూర్తి చేశారు. 820 మంది రెగ్యులర్ కస్టమర్లు. రిపీట్ కస్టమర్ రేటు 40 శాతం పైనే ఉంది.

"బ్రాండ్ పేరు మాత్రమే ఉపయోగిస్తాం. ప్రతి స్టైలిస్ట్ సేమ్ క్వాలిటీ సర్వీస్ ఇస్తాడు. నిజానికి మాది మార్కెట్ ప్లేస్ కాదు. అందుకే వినియోగదారుల క్వాలిటీ ఎక్స్ పీరియన్స్ మాకు ముఖ్యం" వినయ్

ఎక్కువగా 35 ఏళ్ల లోపు వారే బుక్ చేసుకుంటున్నారు. చిన్నారులు, వృద్ధులకు కూడా సర్వీసు అందిస్తున్నారు. ఇంట్లో ఉన్న ప్రతి వ్యక్తికి ఫ్లయింగ్ బార్బర్ హెయిల్ స్టైలిస్ట్ సేవలు అందిస్తామని చెబుతారు వీరిద్దరు. టెక్నాలజీని కూడా వీలైనంత ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు. ఓ ట్యాబ్ ఎప్పుడూ వీరి దగ్గర ఉంటుంది. కస్టమర్ కు ఎలాంటి హెయిర్ స్టైల్ కావాలో అందులో డిజైన్స్ చూపిస్తారు. ఏ ఫేస్ కు ఏ డిజైన్ నప్పుతుందో విశ్లేషిస్తారు. ఆ ట్యాబ్ ను మిర్రర్ పక్కనే పెట్టి మనీ కటింగ్ చేస్తారు. 

ఫ్లయింగ్ బార్బర్ పనితీరు<br>

ఫ్లయింగ్ బార్బర్ పనితీరు


పెద్ద పెద్ద లక్ష్యాలు

ఇంతా చేసి- వీరు సేవలు అందిస్తోంది బెంగళూరులోని నాలుగు ప్రాంతాలకే. ఇందిరానగర్, కోరమంగళ, సర్జాపూర్, మార్తళ్లిల్లో మాత్రమే ఫ్లయింగ్ బార్బర్స్ బుకింగ్స్ ను యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే కార్పొరేట్ బుకింగ్స్ ను అందుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాలేజీ ఫెస్టుల్లో పాల్గొనడం, స్టాల్స్ ఏర్పాటు చేయడం లాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. బెంగళూరు బేస్డ్ ర్యాప్ బ్యాండ్ అగ్ని టీంకి ప్లయింగ్ బార్బర్స్ అఫీషియల్ హెయిల్ స్టైలిస్టులు. 

ఫ్లయింగ్ బార్బర్స్ ఆపరేషన్స్ చూస్తున్న మహమూద్ <br>

ఫ్లయింగ్ బార్బర్స్ ఆపరేషన్స్ చూస్తున్న మహమూద్


ప్రారంభించి నాలుగైదు నెలలు కాకుండానే అందర్నీ ఆకట్టుకుంటున్న ఈ స్టార్టప్.. ఈ ఏడాది చివరికల్లా మొదటి ఫండింగ్ ను సాధించాలని చూస్తున్నారు. వచ్చే ఆరు నెలల్లో ఫ్లయింగ్ బార్బర్ సర్వీసులను బెంగళూరు మొత్తం విస్తరించాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. హెయిర్ స్టైలింగ్, మేకోవర్ లో ప్రీమియం కేటగరిలో ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇందుకోసం పన్నెండేళ్ల అనుభం ఉన్నవారిని ఎంపిక చేసుకుంటున్నారు. ఇప్పటికి నెలకు 400 వరకు ట్రాన్సాక్షన్ నమోదవుతున్నాయి. దీనికి వచ్చే ఆరు నెలల్లో 750 కి పెంచాలనుకుంటున్నారు. హంగులు మేళవించి ఓ ఆఫ్ లైన్ స్టోర్ నూ లాంఛ్ చేయాలని చూస్తున్నారు. ఆన్ డిమాండ్ బ్యూటీ సర్వీస్ అందించే స్టార్టప్స్ వ్యానిటి క్యూబ్, స్టేగ్లాడ్, బుల్ బుల్ లాంటివి ఉన్నా... ఫ్లయింగ్ బార్బర్స్ మాత్రం వీటన్నింటికన్నా ప్రత్యేకం.   

         

వీరి స్పీడు చూస్తూంటే అతి త్వరలోనే ఫ్లయింగ్ బార్బర్స్ మెట్రో నగరాల్లోకి ప్రతి ఇంట్లోనూ వాలే సూచనలు కనిపిస్తున్నాయి. మరి ఈ సేవలను ఆడవాళ్లకు వర్తించవా అంటే ఆ అవకాశమే లేదంటున్నారు ఫౌండర్స్. ఎందుకంటే మాకేమీ తెలియని వాటి మీద మేం ఏమీ ప్రయోగాలు చేయం అంటున్నారు. ఈ క్లారిటీ చాలు వారు సక్సెస్ బాటలో నడుస్తున్నారనుకోడానికి..!