ఫైబర్ టు ఫ్యాషన్! ఇదే మా లక్ష్యం- టెక్స్ టైల్ ఇండియా సమ్మిట్ లో మంత్రి కేటీఆర్

ఫైబర్ టు ఫ్యాషన్! ఇదే మా లక్ష్యం- టెక్స్ టైల్ ఇండియా సమ్మిట్ లో మంత్రి కేటీఆర్

Friday June 30, 2017,

2 min Read

వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పించే టెక్స్ టైల్ రంగాన్ని ప్రోత్సహించడానికి జాతీయస్థాయిలో ఓ పాలసీని రూపొందిచాల్సిన అవసరం ఉందన్నారు తెలంగాణ చేనేత, జౌళి శాఖ మంత్రి కేటీఆర్. అత్యంత్య ప్రాధాన్యత రంగంగా వస్త్ర రంగాన్ని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం, వరంగల్ లో మెగా టెక్స్ టైల్ పార్క్ ను నిర్మిస్తుందన్నారు. గుజరాత్ గాంధీనగర్, మహాత్మానగర్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన టెక్స్ టైల్ ఇండియా సమ్మిట్ లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.

image


సదస్సులో భాగంగా నిర్వహించిన సీఈవో రౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ విధానాలు, పారిశ్రామిక పాలసీని మంత్రి కేటీఆర్ వివరించారు. ఇండస్ట్రియల్ పాలసీతో పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణ మారిందన్న కేటీఆర్, త్వరలోనే టెక్స్ టైల్ పాలసీని కూడా తెస్తామన్నారు. పారిశ్రామిక విధానంలానే ఈ పాలసీ కూడా విప్లవాత్మకంగా ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా టెక్స్ టైల్ రంగంలో పెట్టుబడులు పెట్టాలంటూ ఇన్వెస్టర్లను ఆహ్వానించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో త్వరలోనే వరంగల్ లో మెగా టెక్స్ టైల్ పార్కును నిర్మిస్తామన్నారు. ఫైబర్ టూ ఫ్యాషన్ పద్దతిలో ముడి సరుకు నుంచి తుది ఉత్పత్తి దాకా అన్నీ ఆ పార్క్ లోనే జరుగుతాయన్నారు.దేశీయ అవసరాల నుంచి మొదలుకుని అంతర్జాతీయ ఫ్యాషన్ వరకు కావాల్సిన అన్ని ఉత్పత్తులు ఈ పార్క్ నుంచి వచ్చేలా చూస్తామన్నారు.

ఈ టెక్స్ టైల్ పార్క్ లో పనిచేసే కార్మికులకు అక్కడే నివాసాలు ఏర్పాటు చేస్తున్నామని, వారి స్కిల్ డెవలప్ మెంట్ కోసం కొయంబత్తూర్ PSG సంస్థతో కలిసి ఒక ఇన్ స్టిట్యూట్ ఏర్పాటు చేస్తామని కేటీఆర్ చెప్పారు. టెక్స్ టైల్ రంగం అభివృద్ధికి తెలంగాణలో అపార అవకాశాలు ఉన్నాయన్న మంత్రి, ఇక్కడ పండించే పత్తి అత్యుత్తమ నాణ్యతతో ఉంటుందని గుర్తుచేశారు. నాణ్యతతో పాటు పెద్ద ఎత్తున జరిగే పత్తి ఉత్పత్తిని ఉపయోగించుకోవడాన్ని ఒక అవకాశంగా చూడాలని ఇన్వెస్టర్లను మంత్రి కోరారు.

అత్యుత్తుమ ప్రభుత్వ విధానాలు, పారదర్శకత, మౌలిక వసతులు, సరుకు రవాణా పరంగా దేశానికి సెంటర్ పాయింట్ తదితర అంశాలు పెట్టుబడులు పెట్టేందుకు సానుకూల అంశాలని కేటీఆర్ అన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామిక వేత్తలకు ప్రపంచంలో ఎవరైనా ఆఫర్ చేసే ప్యాకేజీ, ప్రోత్సాహకాలకు సరితూగేటట్టు లేదా అంతకుమించి ఇస్తామని మంత్రి మరోసారి స్పష్టం చేశారు. మీట్ అర్ బీట్ అనేది పెట్టుబడుల విషయంలో తమ ప్రభుత్వ ధృక్పథం అన్నారు.

మంత్రి కేటీఆర్ ఇచ్చిన మీట్ ఆర్ బీట్ స్లోగన్ కు టెక్స్ టైల్ గ్లోబల్ లీడర్స్ నుంచి ప్రశంసలు లభించాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి టెక్స్ టైల్ రంగంపై ఉన్న ఆసక్తి, అవగాహనను వారు మెచ్చుకున్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, టెక్స్ టైల్ రంగంపై మంత్రి కేటీఆర్ కు ఉన్న మక్కువ, ప్రభుత్వ విధానాలను వివరించిన తీరును ఆమె ప్రశంసించారు. తెలంగాణ గురించి అత్యుత్తమంగా ప్రజెంట్ చేశారన్న స్మృతి.. కేటీఆర్ ఇచ్చిన సూచనలు బాగున్నాయన్నారు. కచ్చితంగా కేంద్ర ప్రభుత్వం వాటిని పరిగణలోకి తీసుకుంటుందని చెప్పారు. ఈసీవో రౌండ్ టేబుల్ సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పాల్గొన్నారు.