ఈ-పుస్తకాలకు అమ్మ లాంటి స్టార్టప్..!

21 ప్రాంతీయ భాషల్లో ఈ- బుక్స్ తెస్తున్న మాతృభారతి

ఈ-పుస్తకాలకు అమ్మ లాంటి స్టార్టప్..!

Saturday April 09, 2016,

3 min Read


పుస్తకాలు కొనడానికి బజారు దాకా వెళ్లాల్సిన అవసరం లేదు. నచ్చిన బుక్ కోసం షాపులన్నీ తిరగాల్సిన పని ఉండదు. జర్నీలో బుక్స్ అన్నీ మోసుకెళ్లాల్సిన శ్రమ అంతకన్నా అక్కర్లేదు. సింపుల్ గా ఒకే ఒక్క క్లిక్! కోరుకున్న పుస్తకం మొబైల్ తెరమీద ప్రత్యక్షమైపోతుంది. సేవ్ చేసుకొని టైం దొరికినప్పుడు చదువుకోవడమే! 

అవును! నేటి స్మార్ట్ జమానాలో పుస్తకం కూడా ఆధునికతను అద్దుకుంది. రూపం మార్చుకొని ఈ-బుక్ గా అవతారమెత్తింది! మార్కెట్లో ఇప్పుడు వీటికి మంచి డిమాండ్ ఉంది! మాతృభారతి సంస్థ కూడా సరిగ్గా అదే కాన్సెప్ట్ తో ఏర్పాటైంది.

మ‌హేంద్ర శ‌ర్మ‌ది గుజ‌రాత్. చిన్న‌త‌నం నుంచే భాష‌, సాహిత్యంపై మంచి ప‌ట్టుంది. క‌విత‌లు, క‌థ‌లు, వ్యాసాలు రాసేవాడు. ఇంకా మంచి మంచి క‌థ‌లు, క‌విత‌లు రాయాల‌ని ఉండేది. కానీ జీవితం అత‌డిని మ‌రో వైపు న‌డిపించింది. గాంధీ న‌గ‌ర్ గ‌వ‌ర్న‌మెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో కంప్యూట‌ర్ ఇంజ‌నీరింగ్ డిప్ల‌మా చేసిన మ‌హేంద్ర‌... 17 ఏళ్లు పలు ఐటీ కంపెనీల్లో పని చేశాడు. అయినా ఏదో అసంతృప్తి. త‌న లక్ష్యం వేరు. డ్రీమ్ వేరు. చేస్తున్న పని వేరు. ఇలా అయితే లాభం లేద‌నుకున్నాడు. వన్ ఫైన్ డే ఉద్యోగం మానేసి.. త‌న గోల్ మీద దృష్టి పెట్టాడు.

సాహిత్యం, భాష‌, టెక్నాల‌జీ! ఈ మూడింటిని మేళ‌వించి కొత్త ప్ర‌యోగం చేస్తే ఎలా ఉంటుంద‌ని ఆలోచించాడు మహేంద్ర‌. కొంత ప‌రిశోధ‌న త‌ర్వాత త‌న ఆలోచ‌న‌ను ఆచ‌ర‌ణ‌లో పెట్టాడు. అదే మాతృభార‌తి! ఇదొక సెల్ఫ్ ప‌బ్లిషింగ్ ప్లాట్ ఫామ్. ప్రాంతీయ భాష‌ల్లో రోజుకు 15 నుంచి 20 ఈ-బుక్స్ ప‌బ్లిష్ చేస్తుంటుంది. ఫిక్ష‌న్, నాన్ ఫిక్ష‌న్, బ‌యోగ్ర‌ఫీ, ఫిలాస‌ఫీ- ఇలా అన్ని ర‌కాల ఈ-బుక్స్ వీళ్ల ద‌గ్గ‌ర దొరుకుతాయి. ఈ మ‌ధ్య ఢిల్లీలో జ‌రిగిన తొలి భార‌తీయ భాషా డిజిట‌ల్ ఫెస్టివ‌ల్ లో మాతృభార‌తి సంస్థ‌ కూడా పాలుపంచుకుంది.

మాతృభార‌తి టీం

మాతృభార‌తి టీం


ఈ-బుక్స్ ఎలా ప‌బ్లిష్ చేస్తారు?

మాతృభార‌తికి క‌థ‌లు రాయాలంటే.. ముందుగా వెబ్ సైట్ లో సైన్ అప్ కావాలి. త‌ర్వాత మ‌న కంటెంట్ ను స‌బ్మిట్ చేయాలి. దాన్ని ఎడిటోరియ‌ల్ టీమ్ ప‌రిశీలించి అప్రూవ్ చేస్తుంది. త‌ర్వాత ఆ సమాచారమంతా ఈ-బుక్ ఫార్మాట్ లోకి మార్చి విక్ర‌యానికి ఉంచుతారు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ లో మాతృభార‌తి యాప్ కూడా ఉంది. చాలా భార‌తీయ భాష‌ల‌కు సంబంధించిన‌ బుక్స్ ఇందులో దొరుకుతాయి. కొన్నింటిని ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకొని చ‌దువుకోవ‌చ్చు. కొత్త బుక్స్ కు సంబంధించిన పుష్ నోటిఫికేష‌న్స్ కూడా రీడ‌ర్ల‌కు వ‌స్తుంటాయి.

ఒక్కో ఇటుక పేర్చుతూ..

2000 నుంచి 2007 వ‌ర‌కు మ‌హేంద్ర శ‌ర్మ ఐటీ ప్రొఫెష‌న‌ల్ గా ప‌నిచేశారు. 2007లో జాబ్ కు గుడ్ బై చెప్పి ఆంట్ర‌ప్రెన్యూర్ గా మారిపోయాడు. శ‌ర్మా ఇన్ఫోవే పేరిట సంస్థ నెల‌కొల్పి, మూడేళ్ల‌లో 30 మంది స్టాఫ్ ను నియమించుకున్నాడు. 2010లో త‌న మాజీ ఎంప్లాయ‌ర్ నీలేశ్ షాతో క‌లిసి నిచ్ టెక్ సంస్థను ఏర్పాటు చేశాడు. త‌ర్వాత శ‌ర్మా ఇన్ఫోవేను అందులో విలీనం చేశాడు. నిచ్ టెక్ లో ప్ర‌స్తుతం 50 మంది ఉద్యోగులు ఉన్నారు.

మ‌హేంద్ర‌, నీలేశ్ ఇద్ద‌రూ క‌లిసి కంపెనీలో 10 ల‌క్ష‌ల సీడ్ క్యాపిట‌ల్ పెట్టారు. మూడేళ్ల‌లో 40 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేసి మాతృభార‌తికి ఒక మార్కెట్ క‌ల్పించారు. మొద‌ట్లో ఒడిదుడుకులు ఎదుర‌య్యాయి. ప్రింట్ పుస్త‌కాల బిజినెస్ దెబ్బ‌తింటుంద‌న్న భ‌యంతో పబ్లిష‌ర్లు ఈ-బుక్స్ కాన్సెప్ట్ ను వ్య‌తిరేకించారు. మొద‌టి ఆరు నెల‌ల్లో అయితే ఒక్క ప‌బ్లిష‌ర్ నుంచి ఒక్క పుస్త‌కం కూడా రాలేదు. మెల్ల‌మెల్ల‌గా కొంద‌రు ర‌చ‌యిత‌లు ముందుకొచ్చారు. మాతృభార‌తికి క‌థ‌లు, న‌వ‌ల‌లు అందిస్తున్నారు.

మొద‌ట్లో ఒక ఈ-బుక్ త‌యారు చేయ‌డానికి వారం ప‌ట్టేది. ఆప‌రేట‌ర్ స్క్రిప్టు ను డిజిట‌ల్ వెర్ష‌న్ లోకి మార్చ‌డానికి చాలా స‌మ‌యం తీసుకునేది. అదే పెద్ద కంటెంట్ ఉన్న పుస్త‌కం ప‌దిహేను రోజుల‌కు గానీ పూర్త‌య్యేది కాదు. మెల్ల‌గా బాలారిష్టాల‌ను అధిగిమించాం. ప‌బ్లిషింగ్ లో వేగం పెంచాం. ఇప్పుడు మాతృభార‌తి నెల‌కు 300 ఈ-బుక్స్ ను ప‌బ్లిష్ చేస్తుంది. దాదాపు అన్ని ప్రాంతీయ భాష‌ల్లో బుక్స్ దొరుకుతాయి- మ‌హేంద్ర శ‌ర్మ‌

దిన‌దినాభివృద్ధి చెందుతూ..

అహ్మ‌దాబాద్ లో ఏడుగురు ఉద్యోగుల‌తో మొద‌లైన మాతృభార‌తికి.. ఇప్పుడు వెయ్యి మంది ఫ్రీ లాన్స్ రైట‌ర్లు ఉన్నారు. ఒక్కో డౌన్ లోడ్ కు రూ.500 నుంచి రూ.1000 దాకా రైట‌ర్ల‌కు చెల్లిస్తారు. రూ.50 వేల వ‌ర‌కు అందుకునే ర‌చ‌యిత‌లు కూడా ఉన్నారు. గూగుల్ యాడ్స్, స‌బ్ స్క్రిప్ష‌న్ ఫీ, లోకల్ యాడ్స్ ద్వారా మాతృభార‌తికి ఆదాయం ల‌భిస్తుంది. నెల నెలా సంస్థ 25 శాతం వృద్ధి రేటు న‌మోదు చేస్తోంది. యాప్ కి 32 వేల మంది యాక్టివ్ యూజ‌ర్లు ఉన్నారు. ఇప్ప‌టికే 36 వేల డౌన్ లోడ్లు న‌మోద‌య్యాయి. నెల‌కు 90 ల‌క్ష‌ల మంది యాప్ ను చూస్తున్నారు. మాతృభార‌తి యాప్ కు 42 దేశాల్లో యూజ‌ర్లు ఉండ‌టం విశేషం!

ఇండియాలో ఈ-బుక్స్ మార్కెట్..

ఇప్ప‌టికీ ఇండియాలో ఈ-పుస్త‌కాల‌కు పెద్ద‌గా మార్కెట్ లేదు. అయితే స్మార్ట్ ఫోన్ల వినియోగం పెర‌గ‌డం, యాప్ టెక్నాల‌జీ అభివృద్ధి చెంద‌డాన్ని బ‌ట్టి చూస్తే- దేశంలోని మొత్తం పుస్త‌క విక్ర‌యాల్లో ఈ-బుక్స్ వాటా 25 శాతం వ‌ర‌కూ ఉంటుంద‌ని ఇండ‌స్ట్రీ రిపోర్ట్! ప్ర‌స్తుతం రాక్ స్టాండ్, ఈ-శ‌బ్ద‌, లైబ్ర‌రీ ఇన్ పాకెట్, న్యూస్ హంట్ లాంటి కొన్ని యాప్స్ ప్రాంతీయ భాష‌ల్లో ఈ-బుక్స్ అందిస్తున్నాయి.

మేం ఇప్ప‌టివ‌ర‌కు ఆరు భార‌తీయ భాష‌ల్లో బుక్స్ ప‌బ్లిష్ చేశాం. ఈ ఏడాది చివ‌రిక‌ల్లా 10 భాష‌ల్లో పుస్త‌కాలు ప‌బ్లిష్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నాం. వ‌చ్చే మూడేళ్ల‌లో 21 భాష‌ల్లో ఈ-బుక్స్ తీసుకొస్తాం. 2016-17లో 50 ల‌క్ష‌ల ఆదాయం స‌మ‌కూర్చుకోవ‌డ‌మే మా ల‌క్ష్యం- మ‌హేంద్ర‌

మాతృభార‌తి