కూతురు ప్రసవాన్ని ప్రభుత్వాసుపత్రిలో చేయించిన ఆదర్శ కలెక్టర్

కూతురు ప్రసవాన్ని ప్రభుత్వాసుపత్రిలో చేయించిన ఆదర్శ కలెక్టర్

Saturday March 18, 2017,

2 min Read

సర్కారీ దవాఖానాల్లో వసతులుండవు అనే అభిప్రాయం జనంలో నాటుకుంది. అందుకే చిన్నపాటి జ్వరం వచ్చినా ప్రైవేటు ఆసుపత్రికి పరుగులు తీస్తుంటారు. ఇక మేజర్ సర్జరీలైతే గవర్నమెంట్ హాస్పిటళ్ల ప్రస్తావనే ఉండదు. సర్కారు ఎన్ని ప్రోత్సాహకాలు ప్రకటించినా, అధునాత వైద్య సౌకర్యాలు సమకూర్చినా, నేను రానుబిడ్డో అనే అంటారు. ఇలాంటి అభిప్రాయాన్ని తుడిచేసే ప్రయత్నం చేస్తున్నారు ప్రొ. జయశంకర్ జిల్లా కలెక్టర్ మురళి. తన కూతురి ప్రసవాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో చేయించి పదిమందికీ ఆదర్శంగా నిలిచారు.

image


ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రసవాల తీరు పూర్తిగా మారిపోయింది. నార్మల్ డెలివరీ అన్న మాటకు తావే లేదు. నెలలు నిండకముందే కడుపుని అడ్డంగా చీల్చేస్తున్నారు. చిన్నాచితకా ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీకి అంతేలేదు. లేనిపోని భయభ్రాంతులకు గురిచేసి, అవసరం లేకపోయినా సిజేరియన్లు చేసి కాసులు దండుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితి మారాలి. గవర్నమెంటు దవాఖానాలు కూడా ప్రైవేటు ఆసుపత్రులకు ధీటుగా పనిచేస్తున్నాయని జనానికి తెలియాలి. ఆ దిశగా ప్రొ. జయశంకర్ జిల్లా కలెక్టర్ మురళి నడుం కట్టారు. ప్రభుత్వాసుపత్రిలో ప్రసవించిన మహిళకు సర్కారు ఇచ్చే రాయితీలేంటో ప్రజలకు తెలియజేయాలన్న లక్ష్యంతో.. ప్రసవానికి రా తల్లీ అనే కార్యక్రమాన్ని జిల్లాలో చేపట్టారు. గవర్నమెంట్ హాస్పిటళ్లు.. ప్రైవేటు ఆసుపత్రులకు ఏమాత్రం తీసిపోలేదన్న విషయాన్ని చెప్పడానికి.. స్వయంగా తన కూతురి ప్రసవాన్ని ములుగు ఆసుపత్రిలో చేయించారు.

కలెక్టర్లంటే ఏసీ గదుల్లోనే ఉండి, కాలుమీద కాలేసుకుని, ఫైళ్లు తిరగేస్తూ, కారులో షికారు కొట్టే ఉద్యోగం కాదు అనేది మురళి నమ్మిన సిద్ధాంతం. క్షేత్రస్థాయిలో కాలినడక తిరిగి సమస్యలేంటో తెలుసుకునే తత్వం ఆయనది. చూడ్డానికి చాలా సాదాసీదాగా ఉంటారు. ఫ్రెండ్లీగా మాట్లాడతారు. బీదాబిక్కీ జన మధ్య తిరుగుతారు. వారి కష్టనష్టాలను తెలుసుకుంటారు. ఏ కోశానా ఉన్నతాధికారి పోకడ కనిపించదు. మీడియాకూ అంటీముట్టనట్టుగానే ఉంటారు. చేసింది గోరంత.. చెప్పేది కొండంత అన్నట్టుగా ఉండదు. తను చేపట్టిన ప్రసవానికి రా తల్లీ అనే కార్యక్రమ ఉద్దేశం ఏంటో జనానికి తెలియజేయడానికి మీడియాను వాడుకోలేదు. స్వయంగా ఊరూరూ తిరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో వసతుల తీరుని వివరించారు. ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలను వివరించారు. సర్కారీ దవాఖానాల పట్ల జనానికి భరోసా కల్పించాలనే ఉద్దేశంతోనే తన కూతురి ప్రసవాన్ని ములుగు ఆసుపత్రిలో చేయించారు. పదిమందికీ ఆదర్శంగా నిలిచారు.