ఐఐటి నుంచి అక్షయ పాత్ర వైపు

ఐఐటి నుంచి అక్షయ పాత్ర వైపు

Tuesday April 14, 2015,

5 min Read

అచేత‌నం క‌న్నా కార్య‌సాధ‌న గొప్ప‌ది.. కార్య‌సాధ‌న క‌న్నా మ‌న‌స్సు గొప్ప‌ది.. మ‌న‌సు క‌న్నా జ్ఞాన‌ము మిన్న‌.. జ్ఞాన‌ముక‌న్నా ఆత్మ ఇంకా గొప్ప‌ది. అంటాడు భ‌గ‌వ‌ద్గీత‌లో శ్రీకృష్ణ ప‌ర‌మాత్మ‌. ఈ క్ర‌మం దాటుకుని ఆత్మ ప‌ర‌మాత్మ‌ను చేర‌డ‌మే ముక్తి సాధ‌న‌. ఈ సాధ‌న చేస్తూ పోతే మ‌నిషి మ‌హ‌నీయుడ‌వుతాడు. అదంత తేలికైన ప‌ని కాదు. అదే స‌మ‌యంలో ఫలితాన్ని ఆశించ‌క ప‌నిచేసుకుపోమంటాడు శ్రీకృష్ణుడు. ఇలాంటి స్ఫూర్తిదాయ‌క‌మైన వ‌చ‌నాలే ఆయ‌న్ను హ‌రేకృష్ణ మూమెంట్ వైపున‌కు న‌డిపించాయి. అచేత‌నాన్ని పార‌దోల‌డానికి ఆయ‌న కార్య‌సాధ‌న‌ మార్గంలో ప‌య‌నిస్తూనే ఉన్నారు. ఇంకా జ్ఞానం వ‌ర‌కూ చేరుకోలేదు. కానీ, ఈ కార్య‌సాధ‌నా ప‌టిమ‌తో ఇప్ప‌టికే ఎన్నో విజ‌యాలు సాధించ‌గ‌లిగారు. ఒక సాధార‌ణ కార్య‌క‌ర్త‌గా ఆర్గ‌నైజేష‌న్‌లో చేరిన ఆయ‌న ప్ర‌స్తుతం ఇస్కాన్ బెంగ‌ళూరు టెంపుల్ గ్రూపున‌కు గ‌వ‌ర్నింగ్ బాడీ క‌మిష‌న‌ర్. బెంగ‌ళూరు రాధాకృష్ణ మందిర్ ఆల‌య అధ్య‌క్షులు. పేద పిల్ల‌ల పాలిట కామ‌ధేనువు అయిన 'అక్ష‌య పాత్ర ఫౌండేష‌న్' చైర్మ‌న్. హ‌రే కృష్ణ మూమెంట్‌కే మేనేజింగ్ ట్ర‌స్టీ అయ్యారు. ఆయ‌నే మ‌ధు పండిట్ దాస‌. అలియాస్ మ‌ధుసూద‌న్ ఎస్.

image


మ‌ధుసూద‌న్ 1956 లో త‌మిళ‌నాడులోని నాగ‌ర్ కోయిల్లో జ‌న్మించారు. డిగ్రీ చ‌దువుతుండ‌గా మ‌ధుసూద‌న్ నేష‌న‌ల్ సైన్స్ టాలెంట్ సెర్చ్ ప్రొగ్రామ్‌కి ఎన్నిక‌య్యారు. అది 1980ల నాటి కాలం.. మ‌ధుసూద‌న్ ఐఐటీ ముంబైలో సివిల్ ఇంజ‌నీరింగ్ బీటెక్ చ‌దువుతున్న రోజులు. స్వ‌త‌హాగా భౌతిక శాస్త్రానికీ, ఆధ్యాత్మిక జ్ఞానానికీ పొంత‌న కుద‌ర‌దు. సైన్స్ టాలెంట్ ఉన్న వారికి న్యూట్రాన్లు, ప్రొటాన్లంటే త‌ల‌కెక్కుతాయేమోగానీ రామా..కృష్ణ.. అంటే మాత్రం చెవికెక్క‌దు. వాళ్ల‌వెరు? ఉంటే ఆధారాలేంటి? వ‌చ్చి క‌నిపించ‌మ‌నండీ! అని ప్ర‌శ్నిస్తారు. కానీ, శ్రీ ప్ర‌భుపాద పుస్త‌కాలు చ‌దివితే ఇలాంటి ప్ర‌శ్న‌ల‌కు తావే ఉండ‌దు. కృష్ణ త‌త్వంలోని హేతువాద దృక్ప‌థం క‌ళ్ల‌కు క‌డుతుంది. భ‌గ‌వ‌ద్గీతా సారానికి మించిన భౌతిక వాదం లేద‌ని తెలుస్తుంది. ఎలా జ‌రిగిందో తెలీదుగానీ ఈ పుస్త‌కాలు చ‌ద‌వ‌డం మొద‌లు పెట్టానంటారు మధుసూధన్.

ఏసీ భ‌క్తి వేదాంత ప్ర‌భుపాద సామాన్యులు కారు. శ్రీకృష్ణ త‌త్వంలో అపార‌మైన జ్ఞాన సంప‌ద దాగి ఉంద‌ని క‌నిపెట్టిన యోగి పుంగ‌వులు. మోక్ష‌సాధ‌నా మార్గం తెలుసుకున్న తత్త్వ జ్ఞాని. అంతే కాదు ఎంత దైవ‌త్వం మీద దృష్టి పెట్టినా నీ చుట్టు ప‌క్క‌ల ఉన్న ప్ర‌తి ఘ‌ట‌న‌లో నేనున్నాన‌ని గుర్తించ‌మ‌న్న ఆ ప‌ర‌మాత్మ వాక్కుల‌ను ఆచ‌రించిన అప‌ర వేదాంత స్వ‌రూపులు. ఒక సమ‌యంలో ప్ర‌భుపాదుల వారికి శ్రీకృష్షుడు ఒక వీధిలో ఆక‌లితో అల‌మ‌టిస్తున్న పిల్ల‌ల రూపంలో క‌నిపించాడు. వాళ్లు అంత అన్నం ముద్ద కోసం కుక్క‌ల‌తో పొట్లాడ్డం గ‌మ‌నించారు. మాన‌వ‌ సేవే మాధ‌వ సేవ అన్న మాట వెంట‌నే త‌ట్టింది. అదిగో నా శ్రీకృష్ణుడు అక్ష‌య‌పాత్ర కోసం ఎదురు చూస్తున్నాడ‌న్న త‌లంపున‌కు వ‌చ్చారు ప్ర‌భుపాద‌.. అనుకున్న‌దే త‌డ‌వుగా అక్ష‌య‌పాత్ర ఫౌండేష‌న్ స్థాపించారు. బాల‌ల్లోని బాల‌కృష్ణుల‌కు అంత బువ్వ పెట్ట‌డ‌మే ధ్యేయంగా ఆ ప‌థ‌కాన్ని ప్రారంభించారు. 

image


ప్ర‌భుపాద స్ఫూర్తి అనిర్వ‌చ‌నీయంగా అనిపించింది ఎంటెక్ పూర్తి చేసిన‌ మ‌ధుసూద‌న్ కి. సివిల్ ఇంజ‌నీరింగ్ క‌న్నా సోష‌ల్ ఇంజ‌నీరింగ్ అమూల్య‌మైన‌దిగా గుర్తించారు. స్కేలు, పెన్సిల్ ప‌క్క‌న పెట్టి.. జ‌ప‌మాల చేబ‌ట్టారు. ఇస్కాన్ మిష‌న‌రీలో ఫుల్ టైమ్ మెంబ‌ర్‌గా చేరిపోయారు. మ‌ధుపండిట్ దాస‌గా పేరు మారిపోయింది. సివిల్ ఇంజ‌నీరింగ్ అంటే పుస్త‌కాలు చ‌ద‌వితే స‌రిపోతుందేమోగానీ, సోష‌ల్ ఇంజ‌నీరింగ్ లో మాత్రం దేశ‌మంతా తిరిగితే గానీ త‌త్త్వం బోధ ప‌డ‌దు. ఇది గ్ర‌హించాడు కాబ‌ట్టే గాంధీ ఆనాడు భార‌త స్వ‌తంత్ర్య పోరాటం మొద‌లు పెట్టే ముందు దేశ‌మంతా ప‌ర్య‌టించారు. అలాగంటే ఆధ్యాత్మిక వేత్త‌లంద‌రూ సంచారంలోనే జ్ఞాన స‌ముపార్జ‌న చేశారు. వెతుక్కుంటూ వెళ్తేనే భ‌క్తి ముక్తీ దొరికేది. ఇస్కాన్ కార్య‌క్ర‌మ ప్ర‌చారంలో భాగంగా మ‌ధు పండిట్ దాస ద‌క్షిణ భార‌త‌దేశ‌మంతా ప‌ర్య‌టించారు. ఇస్కాన్ మిష‌న‌రీస్‌లోని పెద్ద వారిని మ‌ధు పండిట్‌లో భ‌క్తుడిక‌న్నా నాయ‌కుడు ఎక్కువ‌గా ఆక‌ర్షించాడు. మ‌ధు పండిట్ కార్య‌ద‌క్ష‌త వారికి బాగా న‌చ్చింది. ఇత‌నికి ఏ ప‌ని అప్ప‌గించినా చేయ‌గ‌ల‌డ‌న్న న‌మ్మ‌కం పెరిగింది. ఏ మారుమూల‌న దాక్కున్నా వ‌జ్ర‌పు వెలుగు న‌లుదిశ‌లా విర‌జిమ్ముతుంద‌న్న‌ట్టు.. మ‌ధు పండిట్ శ్ర‌మ‌శ‌క్తికి త‌గిన ప్ర‌తిఫ‌లం కొద్ది కాలంలోనే ఫ‌లితం ల‌భించింది. 1983నాటిక‌ల్లా మ‌ధు పండిట్ ట్రివేండ్రం ఇస్కాన్ ఆల‌య అధ్య‌క్షుల‌య్యారు. ఇస్కాన్ కార్య‌క‌లాపాల విస్తర‌ణ‌లో విడ‌దీయ‌రానంత‌గా ప‌నిచేశారు.

భగవద్గీత వినడం కాదు.. ఆచరిస్తేనే ప్రయోజనం

భగవద్గీత వినడం కాదు.. ఆచరిస్తేనే ప్రయోజనం


మ‌ధు పండిట్ త‌న ఇంజ‌నీరింగ్ ప్ర‌తిభ ఇస్కాన్ అభివృద్ధి నిర్మాణంలో వినియోగించారు. ట్రివేండ్రం ఆల‌యానికి ప‌నిచేస్తున్నా.. బెంగ‌ళూరు ఆల‌య అభివృద్ధిమీద కూడా దృష్టి నిలిపారు. పండిట్.. ప‌నిలో శ్రీకృష్ణ ప‌ర‌మాత్మ ద‌ర్శ‌నం చేసుకుంటుండ‌టంతో ఆయ‌న చేసే ప‌నులు ప‌ది మందీ మెచ్చుకునే వారు. కార్య‌క్ర‌మం బాగా జ‌రిగింద‌న్న పేరు ప్ర‌ఖ్యాతులు ఎక్కువ‌య్యాయి. ఈ కార్య‌క్ర‌మం మ‌ధు పండిట్ దాస చేస్తేనే బావుంటుంద‌న్న అభిప్రాయం స్థిర‌ప‌డిపోయింది. బెంగ‌ళూరు ఆల‌యం అచిర‌కాలంలోనే దేశంలోని ఇస్కాన్ టెంపుల్స్ లోకెల్లా విశేష‌మైన పేరు సాధించిందీ అంటే మ‌ధు పండిట్ దాస ప‌నిత‌న‌మే అందుకు కార‌ణం.

1988లో క‌ర్నాట‌క ప్ర‌భుత్వం ఇస్కాన్ వారికి ఆరున్న‌ర ఎక‌రాల స్థ‌లాన్ని ఇచ్చింది. ఇందులో క‌ల్చ‌ర‌ల్ కాంప్లెక్స్ నిర్మించాల‌న్న‌ది ఇస్కాన్ ల‌క్ష్యం. వైకుంఠాన్ని భూమ్మీద‌కు దించేయాలి. శ్రీకృష్ణ ప‌ర‌మాత్మ‌ స్థిర నివాసం ఇదే అనిపించాలి. ఈ ప్రాంతానికి వ‌చ్చినంత‌నే ఆ ప‌ర‌మాత్మ ద‌ర్శ‌నం జ‌రిగిపోవాలి. అలా జ‌ర‌గాలంటే డిజైన్ అద్భుత‌మ‌నిపించాలి. ఆర్కిటెక్ట్ లు వేసిన డిజైన్ అంత‌ బాగోలేదు. మ‌ధు పండిట్ దాస అస‌లే సివిల్ ఇంజ‌నీరింగ్‌లో ఎంటెక్ చేసిన వ్య‌క్తి. అంత తేలిగ్గా ఎలా న‌చ్చుతుంది? ఇప్ప‌టి వ‌ర‌కూ త‌న ఇంజ‌నీరింగ్ ప్ర‌తిభ వెలికి తీయ‌నేలేదు. త‌న ఆధ్యాత్మిక ఊహ‌ల‌కు.. ఇంజ‌నీరింగ్ విజ్ఞానాన్ని క‌లిపి ఈ క‌ల్చ‌ర‌ల్ కాంప్లెక్స్ నిర్మాణానికి ధార‌పోశారాయ‌న‌. 

ఇస్కాన్, బెంగళూరు

ఇస్కాన్, బెంగళూరు


భూమ్యాకాశాల మ‌ధ్య ఇలాంటి నిర్మాణం లేద‌నిపించాలంటే అందుకు త‌గిన నిధులు కూడా కావాలి. ఊహ‌లు వాస్త‌వ రూపం దాల్చాలంటే అందుకు త‌గిన ధ‌నం అత్య‌వ‌స‌రం. అది గ్ర‌హించి నిధుల సేక‌ర‌ణ ప్రారంభించారు మ‌ధు పండిట్ దాస‌. ప‌దేళ్లు తిరిగే స‌రిక‌ల్లా కృష్ణ ప‌ర‌మాత్మ శాశ్వత నివాసం ఆ కొండ‌ల‌పై వెలిసిన‌ట్టైంది. ప్ర‌స్తుతం ఆ ప‌ర్వ‌త ప్రాంతాన్ని హ‌రే కృష్ణ హిల్ గా పిలుస్తున్నారంటే అందుకు కార‌ణం మ‌ధు పండిట్ దాస అపారమైన కృషీ ప‌ట్టుద‌ల‌. 38 కోట్ల రూపాయ‌ల నిధులతో.. వంద‌మంది కార్య‌క‌ర్త‌ల స‌హాయ స‌హ‌కారాల‌తో ఈ నిర్మాణం ఇస్కాన్ కీర్తి కిరీటంలో క‌లికితురాయిగా నిలిచిపోయింది. 1997లో నాటి దేశాధ్యక్షుడు డా. శంక‌ర్ ద‌యాళ్ శ‌ర్మ చేతుల మీదుగా ఈ క‌ల్చ‌ర‌ల్ కాంప్లెక్స్ ప్రారంభ‌మైంది.

image


ఇస్కాన్ స్థాప‌కులైన ప్ర‌భుపాద వారి ఆలోచ‌న‌ల్లో ఆధ్యాత్మిక‌త ఎంత ఉంటుందో.. ఆచ‌రణాత్మ‌క సామాజిక సేవ అంతే దాగి ఉంటుంది. శ్రీకృష్ణుడ్ని విగ్ర‌హంలోనే కాదు ప్ర‌తి ప‌నిలో వెతుక్కోవాలి. చుట్టుప‌క్క‌ల సామాజిక ప‌రిస్థితుల్లో ప‌ర‌మాత్మ‌దాగి ఉంటాడు. త‌న‌కు సేవ చేయ‌మ‌ని ఆజ్ఞాపిస్తుంటాడు. ఆ శ‌బ్ధాల‌ను విన‌డ‌మే అస‌లు సిస‌లైన జ‌పం త‌పం. ఇది మ‌ధు పండిట్ దాస‌కు బాగా అవ‌గ‌త‌మైంది. అందుకే 1994లో మైసూర్, మాండ్య జిల్లాల‌.. గ్రామీణ‌ ప్రాంతాల్లో అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుట్టారు. ఎర్త్ ఫ్రెండ్లీ ఫార్మింగ్... అంటే భూ సారం దెబ్బ‌తిన‌కుండా చేసే వ్య‌వ‌సాయ ప‌ద్ధ‌తుల‌ను ప్ర‌వేశ పెట్టాల‌నుకున్నారు. కావేరీ న‌దీ తీరాన గ‌ల శ్రీరంగ ప‌ట్ట‌ణంలో 110 ఎక‌రాల్లో అంతర్జాతీయ ప్ర‌మాణాల‌తో కూడిన రైతు శిక్ష‌ణా కేంద్రాన్ని స్థాపించారు. స్వీయ‌నియంత్ర‌ణా సామ‌ర్ధ్యంతో అద్భుత‌మైన వ్య‌వసాయం చేయ‌డంలో త‌ర్ఫీదునివ్వ‌డ‌మే ఈ శిక్ష‌ణా కేంద్రం ముఖ్యోద్దేశం. ప‌ర్యావ‌ర‌ణ స‌మ‌తుల్య‌త దెబ్బ‌తిన‌కుండా వ్య‌వ‌సాయం చేయ‌డం మీద ఇక్క‌డ త‌గిన శిక్ష‌ణ ఇస్తుంటారు. వంద‌లాది రైతులు ఈ కేంద్రంలో ఇచ్చే శిక్ష‌ణ ద్వారా ఉత్త‌మ వ్య‌వ‌సాయం చేయ‌డ‌మెలాగో నేర్చుకున్నారు. ఈ ప్రాంత మ‌హిళ‌ల‌కు ఈ కేంద్రం ఇచ్చిన‌ శిక్ష‌ణ వ‌ల్ల‌ ఆధునిక వ్య‌వ‌సాయ ప‌ద్ధ‌తుల్లో త‌గిన నైపుణ్యం ల‌భించింది. వ్య‌వ‌సాయం చేస్తే ఇలాగే చేయాల‌ని ఈ చుట్టు ప‌క్క‌ల రైతులు ఒక నిర్ణ‌యానికి వ‌చ్చేశారు. అంత‌గా ఈ రైతు శిక్ష‌ణా కేంద్రం శిక్ష‌ణా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించింది.

మ‌ధు పండిట్ దాస కృషి వ‌ల్ల అక్ష‌య‌పాత్ర కార్య‌క‌లాపాలు సైతం మ‌రింత విస్తృత‌మ‌య్యాయి. 2000నాటి నుంచీ.. అక్ష‌య‌పాత్ర అధ్వ‌ర్యంలో బెంగ‌ళూరు రూర‌ల్ స్కూళ్ల‌లో మ‌ధ్యాహ్న భోజ‌న పథ‌కం ప్రారంభమైంది. హ‌రే రామ హ‌రే కృష్ణ అని మాత్ర‌మే అంటే స‌రిపోదు. ఆ ప్రేర‌ణ‌లోంచి వ‌చ్చే ఆలోచ‌న‌లు ఒడిసి ప‌ట్టుకోవాలి. ఉత్త‌మ మార్గం ఎంపిక చేసుకోవాలి. సాటి మ‌నుషులకు సేవ చేయ‌డంలోనే ప‌ర‌మాత్మ దాగి ఉన్నాడ‌ని గుర్తించాలి. శ్రీకృష్ణలీల‌ల్లో దాగిన త‌త్వాన్ని త‌ల‌కెక్కించుకోకుండా ఎన్ని సార్లు జపం చేసినా ప్ర‌యోజ‌నం ఉండ‌దు. ఎందుకంటే శ్రీకృష్ణుడు గోవ‌ర్ధ‌న ప‌ర్వ‌తాన్ని చిటికెన వేలితో ఎత్తినా.. కాళీయ‌మ‌ర్ధ‌నం చేసినా.. పూత‌న సంహారం గావించినా.. కంసుడిని అంత‌మొందించినా.. కుర‌క్షేత్రంలో పాండ‌వ ప‌క్షాన చేరి కౌర‌వులకు చ‌ర‌మ‌గీతం పాడినా.. అందులో సామాజిక శ్రేయ‌స్సు దాగి ఉంది. భ‌విష్య‌త్ త‌రాల‌ను ముందుకు న‌డిపించ‌డ‌మే అస‌లైన‌ శ్రీకృష్ణ త‌త్త్వం. ఆయ‌న లీల‌ల‌తో కూడిన భాగ‌వ‌తంకానీ, ఆయ‌న భ‌గ‌వ‌ద్గీత‌గానీ ఇదే చెబుతుంది. 

image


ప్ర‌పంచం ఎంత ప‌క్క‌దారి ప‌ట్టినా నీ దారిన నువ్వెళ్లు. ప‌రులెంత భ్ర‌ష్టు ప‌ట్టినా నువ్వు చెయ్యాల్సిన ప‌ని నువ్వు చెయ్ అంటుంది భగవద్గీత. మ‌న‌స్సును జ‌యించాలంటే కార్య‌సాధ‌న అత్యంత అవ‌స‌రం. ఆ సాధ‌న త‌ర్వాత‌గానీ జ్ఞానం ల‌భించ‌దు. జ్ఞానం ల‌భిస్తేగానీ ఆత్మ‌సాక్షాత్కారం కాదు. ఈ సూత్ర‌మే మ‌ధు పండిట్ దాస‌ను ముందుకు న‌డిపిస్తోంది. ఇదీ ఆయ‌న విజ‌యం వెనుక ర‌హ‌స్యం!!!